Tuesday 19 August 2014

దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా? - TDP on Jagan

దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా?

Published at: 19-08-2014 05:38 AM
-    వైసీపీ తీరుపై మంత్రుల ధ్వజం
హైదరాబాద్‌, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై మాట్లాడే హక్కు జగన్మోహన్‌రెడ్డికి లేదని రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రజా సమస్యలు వైసీపీకి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియా పాయింట్‌ వద్ద వారు మాట్లాడుతూ సభకు ఓ సంప్రదాయం ఉంటుందని, అలాకాకుండా స్పీకర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 19 మంది చనిపోయారని సభను అడ్డుకొంటున్న వైసీపీ నేతలు వాళ్ల వివరాలు అందజేయగలరా? అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలతో పైకొచ్చిన పులివెందుల వారసుల ఆటలు ఇకపై సాగనివ్వబోమని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభివృద్ధి తప్ప మరోటి పట్టదని, అలాంటి వ్యక్తిపై అభాండాలు వేస్తే ఆకాశంపై ఉమ్మివేసినట్లేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులనూ, అధికారులనూ రెండు నెలలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నిరకాలుగా ఇబ్బందులు పెడుతుంటే నోరుమెదపని వైసీపీ నేత జగన్మోహనరెడ్డి.. వారిమధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని మంత్రి రావెల కిశోర్‌బాబు డిమాండ్‌ చేశారు.
సభలో అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చ జరగాల్సి ఉండగా, జగన్మోహనరెడ్డి సూచనలతో వారి ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హత్యలు జరిగిపోతున్నాయని తన సొంత పత్రిక సాక్షిలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మంత్రి విమర్శించారు. ఎన్నికల్లో హత్యలు చేసింది, దొంగనోట్లు పంచింది, నకిలీ మద్యం పంపిణీ చేయించింది వైసీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. ‘హత్యలు, అడ్డదిడ్డమైన పాలనతో రాషా్ట్రన్ని నాశనం చేసింది నీ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాదా? బండారం బయటపడుతుందని ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డిని విదేశాలకు పంపించింది నువ్వు కాదా?’ అని జగన్‌ని నిలదీశారు. ఈ వ్యవహారాలపై తాము విచారణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వందలమంది టీడీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్న వైఎస్‌ఆర్‌ వారసులు దొంగే దొంగ అన్నట్లుందని ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు. ఎర్రచందనం, ఏటీఎం దొంగలతోపాటు ఎన్నికల్లో దొంగనోట్ల పంచిన వారు చట్టసభల్లో విలువల గురించి మాట్లాడటం శోచనీయమని ప్రభుత్వ విప్‌లు కూన రవికుమార్‌, యామినీ బాల వ్యాఖ్యానించారు. మీ(జగన్‌) చరిత్ర, మిమ్మల్ని కన్నవాళ్ల(వైఎస్‌) చరిత్ర వారిని కన్నవారి(రాజారెడ్డి) చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. అసెంబ్లీలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, దీనివల్ల ప్రజాసమస్యలు ప్రస్తావనకు రావడం లేదని నందమూరి బాలకృష్ణ విమర్శించారు. స్పీకర్‌ ఆదేశిస్తే హత్యా రాజకీయాలపై చర్చించడానికి తాము సిద్ధమేనని ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. సోమవారం అసెంబ్లీలో తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే వైసీపీ ఇలా రాద్ధాంతం చేయడం తగదన్నారు. అసెంబ్లీలో వైసీపీ కార్యకర్తల దాడులపై చర్చ జరగటానికి ముందు తాను ఎందుకు జైలుకు వెళ్లాడో జగన్‌ ప్రజలకు చె ప్పాలని గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

No comments:

Post a Comment