ఖాన్ సాబ్ మరిలేరు!
బహదూర్‌పురా, చార్మినార్/హైదరాబాద్, ఆగస్టు 20 : ప్రముఖ పాత్రికేయుడు, విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక నాయకుడు ఎంటీ ఖాన్ (79) గుండెపోటుతో మరణించారు. ఖాన్ సాబ్‌గా మిత్రులు, ఉద్యమ అనుచరులు ఆప్యాయంగా పిలుచుకునే మహ్మద్ తాజుద్దీన్ ఖాన్.. ప్రముఖ ఉర్దూ కవి మఖ్దూం మొహియుద్దీన్‌కు అత్యంత సన్నిహితుడు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన, బుధవారం ఉదయం హైదరాబాద్ పాతబస్తీలోని పురానా ఫూల్ దర్వాజ ప్రాంతంలోగల స్వగృహంలో కుటుంబ సభ్యుల సమక్షాన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య కైసర్ బేగం, కుమారులు అశిష్‌ఖాన్, ఆసిమ్‌ఖాన్ ఉన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ మొదలు ఎంఎల్ రాజకీయాల దాకా సాగిన ఆయన ప్రస్థానం హైదరాబాద్‌తో గాఢంగా పెనవేసుకుంది. సాదాసీదాగా కనిపించే ఖాన్.. తెలుగు, ఇంగ్లిష్ పత్రికా రంగాల్లో విశేష కృషి చేశారు.
ఆయన మరణవార్త తెలియగానే పలు ప్రజాసంఘాలు, ఉద్యమ సంస్థలు, పార్టీల నాయకులు తరలివచ్చారు. ఆయన నివాసం నుంచి బయలుదేరిన అంతిమ యాత్రలో వందలాదిగా అభిమానులు పాల్గొన్నారు. కోకాకీ థట్టీ మసీదులో జనాజా నమాజు అనంతరం.. మూసా ఖాద్రి దర్గా ప్రాంతంలోని శ్మశానవాటికకు తీసుకొచ్చారు. ఆయన పార్ధివ దేహంపై విరసం నేత వరవరరావు ఎర్రజెండా కప్పి నివాళి అర్పించగా.. అంత్యక్రియలు పూర్తి చేశారు. ఖాన్ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. పాత్రికేయ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఖాన్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
హైదరాబాద్ ఉద్యమ చరిత్రకు సాక్షి
హైదరాబాద్ కేంద్రంగా చోటుచేసుకున్న ప్రతి పోరాట ఘట్టంలో ఎంటీ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిర్మాతలతో భుజం కలపడం మొదలు, నక్సలైట్ ఉద్యమ నిర్మాత కొండపల్లి సీతారామయ్యతో చెలిమి చేయడం దాకా.. ఆయన ఉద్యమ జీవితం విస్తరించింది. 1935లో పాతబస్తీలోని పురానా ఫూల్ దర్వాజలో జన్మించిన ఎంటీ ఖాన్‌కు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో మంచి పట్టుంది. ధర్మవంత్ కాలేజీలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం ప్రారంభించిన ఆయన.. ఉద్యమ అవసరాల కోసం పత్రికా రచన చేసేవారు. పాతబస్తీలో ఉంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సారథ్యం వహిస్తున్న మఖ్దూంతో ఏర్పడిన పరిచయం, ఆయనలోని సాహితీకారుడిని వెలికి తీసింది. మఖ్దూం ప్రేరణతో కవితలు, కథలు, అనువాదాలు చేశారు. వామపక్ష రాజకీయాల్లో ఎప్పుడూ అతివాద పక్షానే ఆయన నిలిచారు. 1964లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన చీలికలో సీపీఎం వెంట, 1969లో ఆ పార్టీలో పొడచూపిన విభేదాల్లో ఎంఎల్ రాజకీయాల వైపు ఖాన్ నిలిచారు. అప్పటికే కొండపల్లి సీతారామయ్య ప్రభావంలోకి వెళ్లిన ఖాన్, ఆ కాలంలో తెలంగాణలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఉద్యమానికి మద్దతుగా పాతబస్తీలో భారీ ర్యాలీ తీసి అరెస్టయ్యారు. 1970లో ఏర్పాటైన విప్లవ రచయితల సంఘంలో వ్యవస్థాపక సభ్యునిగా చేరారు. విప్లవ రాజకీయాల ప్రచారం కోసం 1972లో ‘పిలుపు’ పత్రికను ప్రచురించారు. ఆ వెంటనే విరుచుకుపడిన నిర్బంధంలో చాలాకాలం జైలు జీవితం గడిపారు. ఎమర్జెన్సీలో చెరబండరాజు, వరవరరావు, జ్వాలాముఖి, శ్రీపతి తదితరులతో కలిసి సికింద్రాబాద్ కుట్రకేసులో అరెస్టయ్యారు. ఎమర్జెన్సీ కాలంలో కొనసాగిన పౌర హక్కుల హననంపై జాతీయస్థాయిలో ఖాన్ ఉద్యమించారు. అప్పటినుంచీ దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆయన పౌర హక్కుల ఉద్యమానికి అంకితం అయ్యారు. ఏపీసీఎల్సీకి చాలాకాలం అధ్యక్షుడిగా కొనసాగారు. పాతబస్తీలో మత సామరస్యాన్ని కాపాడేందుకు ఆయన ప్రాణాలకు తెగించి ఉద్యమించారు. మత కలహాలు చోటుచేసుకున్న సమయంలో బాధిత ప్రజలకు అండగా నిలిచి వారి పునరావాసం కోసం ప్రభుత్వంపై పోరాడారు. కాగా, పలు సంస్థల, ఉద్యమ సంఘాల నేతలు గద్దర్, కేశవరావ్ జాదవ్, వసంత కన్నాభిరాన్, కోదండరామ్, బూర్గుల నర్సింగ్‌రావు, ఆర్.నారాయణ మూర్తి, జాహెద్ అలీఖాన్, జహీర్ అలీఖాన్, బి.వేదకుమార్, మహ్మద్ తురబ్, మజహర్ అలీఖాన్, శేషయ్య తదితరులు ఎంటీ ఖాన్ పార్ధివ దేహానికి నివాళి అర్పించారు.
No comments:
Post a Comment