Thursday, 14 August 2014

నేరం ఎక్కడ జరిగినా పోలీసులు స్పందించాలి శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు : సీఎం కేసీఆర్

నేరం ఎక్కడ జరిగినా పోలీసులు స్పందించాలి శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు : సీఎం కేసీఆర్

Published at: 14-08-2014 14:42 PM
హైదరాబాద్, ఆగష్టు 14 : నగరంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, ఈ విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం ట్యాంక్‌బండ్‌పై జరిగిన కార్యక్రమంలో పోలీసుశాఖకు సీఎం కేసీఆర్ కొత్త వాహనాలను కేటాయించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 'ఫ్రెండ్లీ పోలీస్ కల్చర్' రావాలని ఆకాంక్షించారు. పోలీసులు పీఎస్‌ల పరిధికి లోబడి పనిచేస్తామనడం సరికాదని, నేరం ఎక్కడ జరిగినా సరిహద్దుల గురించి ఆలోచించకుండా పోలీసులు వెంటనే స్పందించాలన్నారు.
హైదరాబాద్‌లో పేకాట క్లబ్బులు మూసివేయాలని ఆదేశించామని, నగరంలో పేకాట క్లబ్బు అనే మాట వినిపించకూడదని కేసీఆర్ తెలిపారు. ప్రయాణించే బస్సులు ఎక్కడాన్ని నిషేధిస్తామని, క్యూలో ఉండి బస్సు ఎక్కే పద్ధతి రావాలన్నారు. పౌరులు కూడా పోలీసులకు సహకరించాలన్న కేసీఆర్ క్రైం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 14 రోజుల్లో పోలీస్ కమిషనరేట్ భవనాన్ని ప్రాంభించనున్నట్లు ఆయన చెప్పారు.
సీసీ కెమెరాలు పెట్టాక న్యూయార్క్‌లో క్రైం రేటు తగ్గిందని, 3 నెలల్లో హైదరాబాద్‌ను సీసీ కెమెరాల నిఘాలోకి తెస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థకు అనుసంధానం చేయాలన్నారు. సీసీ కెమెరాలు అందించడానికి రిలయన్స్ ముందుకు వచ్చిందని, నేరాలు చేసేందుకు దొంగలు భయపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. న్యూయార్క్‌లోని మాన్‌హటన్‌లాగా పోలీసు వ్యవస్థ అత్యాధునికం కావాలని, నేరాలు జరగకూడదని, అప్పుడే ప్రశాంతత వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.

No comments:

Post a Comment