Sunday 10 August 2014

కేసీఆర్‌.. ఆత్మ పరిశీలన చేసుకో

కేసీఆర్‌.. ఆత్మ పరిశీలన చేసుకో

Published at: 11-08-2014 03:39 AM
‘విభజన’ బిల్లుపై ఏమి జరిగిందో గుర్తుచేసుకో
మోదీపై ‘ఫాసిస్టు’ వ్యాఖ్యలు  వెనక్కు తీసుకో!
‘ఫాసిస్టు’ పదం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.. బిల్లుతో మోదీకి సంబంధం లేదు
దాన్ని తయారుచేసింది యూపీఏ.. ఆమోదించింది పార్లమెంటు
ఆనందించింది టీఆర్‌ఎస్‌.. కేంద్రానికి తెలంగాణ, ఏపీ ఒక్కటే
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టీకరణ

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన ‘ఫాసిస్టు’ వ్యాఖ్యలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆగ్రహించారు. ఫాసిస్టు పదానికి కేసీఆర్‌ కొత్త అర్థం చెప్పారని విమర్శించారు. ఫాసిజం అంటే... ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, ప్రజాప్రతినిధులు రూపొందించే చట్టాలు, నియమాలకు ఆలవాలమైన ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమైన భావన అని అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ ఫాసిస్టు పదానికి  కేసీఆర్‌ చెప్పిన నిర్వచనం ఆశ్చర్యమేసింది. ఫాసిజం అంటే... అధికార స్వామ్య, నియంతృత్వ ప్రభుత్వాలని అర్థం. ప్రజాప్రతినిధులు రూపొందించే చట్టాలు, నియమాలు అమలులో ఉండే ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమైన భావన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేసీఆర్‌ ఫాసిస్టు అని సంబోధించడాన్ని ఖండిస్తున్నా. ఆ వ్యాఖ్యలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది చాలా దురదృష్టకరం, నిందనీయం‘’ అని వెంకయ్యనాయుడు అన్నారు. మోదీపై వ్యాఖ్యలను కేసీఆర్‌ వెంటనే ఉపంసహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు రూపొందించింది. ఇది దేశంలోనే చాలా అత్యున్నతమైన చట్టం. ఈ చట్టంతో నరేంద్ర మోదీకి ఎలాంటి సంబంధం లేదు. దీనిని నరేంద్రమోదీగాని, బీజేపీగాని, ఎన్డీఏగాని, మా మిత్ర  పక్షాలుగాని  రూపొందించలేదు. గత యూపీఏ ప్రభుత్వమే రూపొందించి, పార్లమెంటులో ఆమోదింపజేసింది. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే ముందు  ముసాయిదా కాపీని అన్ని పార్టీలకు అందజేయడం జరిగింది. బిల్లు చట్టరూపం దాల్చగానే...టీఆర్‌ఎస్‌తో సహా అన్ని పార్టీలూ స్వాగతించి, సంబరాలు చేసుకున్నాయి. బిల్లు పాస్‌ అయినప్పుడు ఏం జరిగిందో టీఆర్‌ఎస్‌ సహా అన్ని పార్టీలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి’’ అని హితవు పలికారు. ‘‘ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 8...గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు కల్పించింది. గవర్నర్‌ తన విధులను నిర్వర్తించే క్రమంలో మంత్రి మండలిని సంప్రదించి తుది తీర్పును చెప్పవచ్చని కూడా పేర్కొంది. తెలుగు మాట్లాడే ప్రజల విషయంలో కొన్ని స్వార్థపర శక్తులు సమస్యలు సృష్టించిన సందర్భాల్లో... గవర్నర్‌ తన ప్రత్యేక విచక్షణాధికారాల ద్వారా ఆ ప్రజల ఆస్తులు, ప్రాణాలు, స్వేచ్ఛ పరిరక్షణకు చర్యలు తీసుకోవచ్చని చెబుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు సెక్షన్‌ 8 గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పిస్తుంది. ఇందులో అభ్యంతరం ఏముందో అర్థం కావడం లేదు ’’ అని ఎత్తిపొడిచారు.
రాష్ట్రాలు ప్రతిసారీ కేంద్రంతో వివాదాలు పెట్టుకోవడం మంచిది కాదని, ఏ విషయాన్నీ రాజకీయ కోణంలో చూడవద్దని, అది ప్రగతికి దోహదపడదని హితవు పలికారు. ‘‘కేంద్రం ఒక రాష్ట్రాన్ని ఎక్కువ, మరో రాష్ట్రాన్ని తక్కువగా చూడదు. ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలు కూడా కేంద్రానికి సమానమే. సమాఖ్య భావన అనేది కేవలం కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకారాన్ని మాత్రమే వివరించదు. ఒక రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో సహకరించుకోవాలని కూడా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం... భారత దేశంలో తెలంగాణ అనే మరో భౌగోళిక, రాజకీయ అస్థ్తిత్వాన్ని సృష్టించింది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని తెలుగు మాట్లాడే ప్రజల సామాజిక, ఆర్థిక సంబంధాలు శతాబ్దాలుగా పెనవేసుకుని ఉన్నాయి. ఇలాంటి ప్రజల పురోగతికి రెండు రాష్ట్రాల నాయకత్వం ఒక విజన్‌తో, రాజనీతిజ్ఞతతో పని చేయాల్సి ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని వివాదాస్పదం చేసుకుంటూ పోవడం మంచిది కాదు’’ అని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత సందర్భంలో రెండు రాష్ట్రాలు ఆర్థిక పరిపుష్టిని సాధించాల్సి ఉందని గుర్తు చేశారు. ‘‘ఇరు రాష్ట్రాల నాయకత్వం ఈ దిశగా తమ సామర్థ్యాలను వినియోగించాలి. కేంద్రంతోగాని లేదా ఇరు రాష్ట్రాల మధ్యగాని ఏమైనా  సమస్యలు తలెత్తితే అనవసర కోపతాపాలను పెంచుకునే బదులు... పరస్పరం చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలి ’’ అని సూచించారు. కాగా చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు... ఇద్దరు  నాయుళ్లు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ కొంత మంది చేసిన విమర్శలను వెంకయ్యనాయుడి దృష్టికి తీసుకురాగా... ‘‘ అలాంటి చౌకబారు మాటలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు ’’ అని కొట్టిపారేశారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఆదరించిన ప్రజలు... త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ వెన్నుదన్నుగా నిలవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ‘‘ఓటమి నుంచి కాంగ్రెస్‌ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలనుకుంటుంటే... కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. వివిధ రంగాల్లో విదేశీ నిధులను రాబట్టడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుంటే తత్సంబంధిత చట్టాలు పా స్‌ కాకుండా లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్‌ అడ్డుకుంటుంది. ఎన్డీఏకు రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో, కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు ఆటంకాలు సృష్టిస్తుంది’’ అని ఆరోపించారు. ఈ స్థితిలో రాజ్యసభలోనూ ఎన్డీఏకు పూర్తి మెజారిటీ కావాలన్నారు. దానికోసం జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానా, కశ్మీర్‌ రాష్ర్టాల ప్రజలు ఎన్డీఏకు అత్యధిక మెజారిటీ ఇచ్చి మోదీకి వెన్నుదన్నుగా నిలవాలన్నారు. అంతకుముందు, మహిళా మోర్చా నాయకురాళ్లు వెంకయ్యకు రాఖీలు కట్టారు.
 కేసీఆర్‌తో ఇక ఢీ : కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఫాసిస్టు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం పనితీరును కనీసం బడ్జెట్‌ వరకైనా ఓపిగ్గా చూద్దామని అనుకున్నామని, కానీ కేసీఆర్‌ వైఖరి చూసిన తరువాత ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ‘‘ఢీ అంటే ఢీ‘‘ అన్నట్టు తలపడతామని తేల్చి చెప్పారు. నిజానికి పాకిస్థానీయులూ మోదీని ఫాసిస్టు అనలేదని చెప్పారు. అసలు కేసీఆర్‌ను మించిన ఫాసిస్టు దేశంలో ఇంకొకరు లేరని ఎత్తిపొడిచారు. ఇప్పటివరకు మోదీ తెలంగాణకు అనుకూలంగా ఉంటూ వచ్చారని, కానీ కేసీఆర్‌ ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తూ... కేంద్రాన్ని దూరం చేసుకుంటున్నారని ఆరోపించారు. ‘‘బడ్జెట్‌ సమావేశాల వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టకుండా ఓపిక వహించాలనుకున్నాం. కానీ కేసీఆర్‌ రెచ్చగొట్టే వైఖరి  కారణంగా మేం రంగంలోకి దిగబోతున్నాం. ఇక మీదట ఆయన వైఖరిని, విధానాలను ప్రతిఘటిస్తాం.  ఢీ అంటే ఢీ’’ అని హెచ్చరించారు. కాగా ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్తు సరఫరా చేయడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ అంగీకరించినా... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బృందాన్ని పంపడం లేదని ఆరోపించారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఈ నెల 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు నగరంలో ఉంటారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 21న సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో సమావేశమవుతారని, అదే రోజు అమీర్‌పేటలోని ‘సెస్‌’ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులతో భేటీ అవుతారని వివరించారు. ఈ నెల 22న సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో గ్రామ కమిటీ అధ్యక్షులతో జరిగే సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

No comments:

Post a Comment