Thursday 7 August 2014

రాష్ట్రం మధ్యలో రాజధాని

రాష్ట్రం మధ్యలో రాజధాని

Published at: 08-08-2014 08:27 AM
అందరికీ అందుబాటులో ఉండాలి
విశాఖ, విజయవాడ-గుంటూరు, తిరుపతిల్లో మెగా సిటీలు
ఆర్బీఐ ఒప్పుకోకున్నా రుణమాఫీ అమలు
2029ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు
విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు
అధిగమించడం కష్టమేమీ కాదు
కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఉద్ఘాటన
జీఎస్‌డీపీ విషయంలో అనంతపురం జిల్లా రాయలసీమలో అన్నింటికంటే ముందుంది. రాజకీయ ఉద్ధండులు ఉన్నా.. కర్నూలు చివరి స్థానంలో ఉంది.
సేవల విభాగంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఈ రంగంలో పెట్టుబడులు పెరగాలి.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పేద కుటుంబాల నుంచి ఇంటికి ఒకరైనా స్వయం సహాయక గ్రూపుల్లో ఉండేలా చూడాలి.
2013-14లో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.85,714. దీనిని మూడేళ్లలో రెండున్నర లక్షలకు తీసుకెళతాం.
2029ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను రూపొందిస్తున్నాం. ఈ 15 సంవత్సరాల కాలంలో మూడు ఎన్నికలు, మూడు ఫైనాన్స్‌ కమిషన్‌లు     వస్తాయి.
గతంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసిన తర్వాతే ఐటీ రంగాన్ని తీసుకొచ్చాం. ఈ రోజు తెలంగాణ సర్కారు మిగులు బడ్జెట్‌లో ఉండటానికి    కారణం ఐటీ రంగమే.
విజయవాడ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రాభివృద్ధిలో కలెక్టర్లది కీలకపాత్ర. ఐఏఎస్‌ అధికారులు గత పదేళ్లలో తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. నిర్భయంగా పని చేయండి. రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి బాటలు వేయండి’’ అని జిల్లా కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలోని ఒక హోటల్‌లో 13 జిల్లాల కలెక్టర్లు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తామన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూస్తామని ప్రకటించారు.  విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులను వివరించారు. స్థానికత నుంచి సచివాలయం దాకా పలు అంశాలు ప్రస్తావిస్తూ కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. వివరాలు చంద్రబాబు మాటల్లోనే...
అందరికీ అందుబాటులో రాజధాని
విభజనకు ముందు... ఇరుప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాను. కనీసం రాజధాని ఎక్కడో కూడా చెప్పకుండా కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజించింది. ఇలా ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని... రాష్ట్రం మధ్యలోనే ఉంటుంది. రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలి. చిత్తూరులోనో, శ్రీకాకుళంలోనో రాజధాని ఉంటే కుదరదు కదా! రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతంలో నీరు, నేల, మౌలిక వసతులు అందుబాటులో ఉండాలి. గుజరాత్‌లో గాంధీనగర్‌ను అభివృద్ధి చేశారు. కానీ... సాయంత్రం కాగానే అందరూ అహ్మదాబాద్‌ వెళ్లిపోతారు. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉండొద్దు. విశాఖ, విజయవాడ-గుంటూరు, తిరుపతిల్లో మూడు మెగా సిటీలను నిర్మిస్తాం. 13 కార్పొరేషన్లలో 13 స్మార్ట్‌ సిటీలు నిర్మిస్తాం. ఇప్పటికీ ఏపీలో మౌలిక వసతులు సరిగా లేవు.
మీదే కీలక పాత్ర...
కొత్త రాష్ట్రం ఏర్పడి అప్పుడే రెండు నెలలు అయింది. పరిపాలన ఇంకా గాడిలో పడాలి. మేం ఎంత పనిచేసినా.. జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగానిదే క్షేత్రస్థాయిలో కీలక పాత్ర! నిర్దిష్టమైన ఆలోచన, కార్యాచరణ తయారు చేసుకోవాలి. మనకు ఐదేళ్ల సమయం ఉంది. ఈ ఐదేళ్లలో అభివృద్ధిని పరుగులు తీయించాలి. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయం. సంస్కరణలు చేపట్టి సంపద సృష్టించాలి. సృష్టించిన సంపద అన్ని వర్గాలకు చేరాలి. సరైన పాలన అందిస్తేనే ప్రభుత్వాలకు మనుగడ ఉంటుంది. 2029 నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ఆనందాన్ని కల్పించాలి. గత పదేళ్లలో అధికారులు ఒత్తిళ్లకు గురయ్యారు. మీరు చేసే మంచి పనులకు నా సహకారం ఉంటుంది. తప్పులు చేస్తే నేను కూడా ఏమీ చేయలేను. రాష్ట్రాభివృద్ధిలో కలెక్టర్లది కీలకపాత్ర. నిర్భయంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి బాటలు వేయండి.
ఇదీ మన పరిస్థితి...
విభజన తర్వాత మనం ఎక్కడున్నామనేది ఈ సమావేశమే చెబుతోంది. ఒకప్పుడు ఇలాంటి సమావేశాలు హైదరాబాద్‌కే పరిమితమయ్యేవి. ఇప్పుడు విజయవాడలో ఒక హోటల్‌లో నిర్వహించుకోవాల్సిన పరిస్థితి. సెక్రటేరియట్‌లో ఇప్పటికీ పనిచేసుకునే వాతావరణం లేదు. ముఖ్యమంత్రికే సరైన కార్యాలయం లేదు. ప్రస్తుతం మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అయితే... వాటిని అధిగమించటం కష్టమేమీ కాదు.
ఐఏఎస్‌ల జాబితా ఖరారు చేస్తాం!
రెండు రాష్ట్రాల మధ్య ఐఏఎస్‌ల విభజన ఇంకా జరగలేదు.  మీలో అందరికీ బాగా పనిచేయాలనే ఉత్సాహం ఉన్నా.. పంపిణీ తర్వాత ఏ రాష్ట్రంలో ఉంటామోనన్న అనిశ్చితిలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగేతర రాష్ట్రాల ఐఏఎస్‌లు అయోమయంలో ఉన్నారు. స్థానిక ఐఏఎస్‌లు ఏ రాష్ట్రం వారు.. ఆ రాష్ట్రంలోనే ఉంటామనుకుంటున్నారు. ఇంకొందరేమో ఇప్పుడే కష్టపడటం ఎందుకు, తొందరేముందనుకుంటున్నారు. ప్రస్తుత గందరగోళ స్థితి నుంచి బయటపడి, వేగంగా పనిచేయటానికి ఒక దశ, ఒక దిశ కావాలి. దానిని సూచించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఐఏఎస్‌ క్యాడర్‌ అధికారుల పంపిణీపై  ప్రధాన మంత్రి నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. వాటిని పరిశీలించి ప్రాధాన్యత ప్రకారం.. జాబితా ఖరారు చేస్తాం.
రుణమాఫీ చేసి తీరుతాం
రైతులు, పేదలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసే రుణమాఫీ హామీ ఇచ్చాం. ప్రజలు ఆ నమ్మకంతోనే టీడీపీకి పట్టంకట్టారు. రుణమాఫీగానీ, రీషెడ్యూల్‌ చేసేంత క్లిష్టమైన పరిస్థితుల్లో రైతులు లేరని ఇటీవల ఆర్బీఐ గవర్నర్‌ చెబుతున్నారు. రైతులు ఎదుర్కొన్న సమస్యలను గత పాలకులు ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లిఉంటే ఇప్పుడు ఈ అడ్డంకులు ఎదురయ్యేవికావు. ఆర్బీఐ రీషెడ్యూల్‌కు, రుణమాఫీకి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా... మేం మాత్రం అమలు చేస్తాం. రీషెడ్యూల్‌ గానీ సంబంధించి ఏ అవకాశాన్నీ వదులుకోం. మరోసారి ఉత్తరం రాస్తాం. భారతదేశంలో తొలిసారి విజన్‌ తయారుచేసిన ప్రభుత్వం మాదే. విజన్‌-2020 పేరుతో ప్రజలకు మంచి పాలన అందించాం.  విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చాం. ఇప్పుడు... సబ్‌ స్టేషన్లలో కనీసం రికార్డులను కూడా సరిగా నిర్వహించడంలేదు. రెండు నెలల్లో విద్యుత్‌శాఖలో అనుకున్న మార్పు లు వస్తే.. మిగతా శాఖలకు కూడా ఆ విధానాన్ని వర్తింపచేస్తాం.
‘విత్తన రాజధాని’గా రాయలసీమ
రాయల సీమను భారతదేశ విత్తన రాజధాని (సీడ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా)గా అభివృద్ధి చేస్తాం. రాబోయే ఐదేళ్లలో రాయలసీమను 100 శాతం కరువురహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తాం. వరద నీటిని రాయలసీమకు మళ్లిస్తాం. కలెక్టర్లు బిందు సేద్యాన్ని ప్రోత్సహించాలి. అనంతపురం జిల్లాను వందశాతం ‘డ్రిప్‌’గా చెయ్యాలి.  శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులు ద్వారా వచ్చే నీటిని సక్రమంగా వినియోగించుకుంటే.. అద్భుత ఫలితాలు వస్తాయి. సింగపూర్‌, దుబాయ్‌లో ఒక పోర్టు, ఒకే ఎయిర్‌పోర్టు ఉన్నాయి. కానీ... మనకున్న తీరంవెంబడి పోర్టులు నిర్మించుకుంటే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి జరుగుతుంది.
వందశాతం ఆధార్‌...
అప్పట్లో ఇంటర్నెట్‌ రెవెల్యూషన్‌ వచ్చింది. ఇప్పుడు వైర్‌లెస్‌ చైతన్యం వచ్చింది. టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకోవాలి. రాష్ట్రంలో ఆధార్‌ నమోదు 100 శాతం జరగాలన్నారు.  తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే సంపన్న దేవుడు! ఇటువంటి ఆలయాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఈ దేవస్థానాలన్నీ సేవ చేయాలి. అర్బనైజేషన్‌కు ప్రాధాన్యం ఇస్తాం. సమర్థులైన అధికారులకు త్వరలోనే  ఐపాడ్‌లను అందిస్తాం.
‘ఎర్ర’మాఫియా కట్టడికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌
ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించి.. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసి, వారికి విచక్షణాధికారాలు ఇస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. గురువారం విజయవాడలో ఆయన రాష్ట్ర హోం మంత్రి, డీజీపీల ఆధ్వర్యంలో ఐపీఎస్‌ల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావే శంలో డీజీపీలతో పాటు ఆరుగురు అడిషనల్‌ డీజీలు, ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.   ఇసుక మాఫియా ఆగడాలపట్ల కూడా కఠినతరంగా వ్యవహరించాలని సూచించారు. నేరస్థులకు ప్రత్యేకంగా ఐరీస్‌ తీసుకోవాలని ఆదేశించారు.
పధ్నాలుగున్నర గంటలపాటు బాబు ఏకధాటి సమీక్ష
చంద్రబాబు గురువారం పధ్నాలుగున్నర గంటలపాటు అధికారులతో ఏకధాటిగా సమీక్ష నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ గేట్‌వే హోటల్‌లో సమీక్షా సమావేశానికి వచ్చిన ఆయన రాత్రి 11.30 గంటల వరకు అధికారులతో చర్చలు జరిపారు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు కలెక్టర్లతోను, రాత్రి 10 నుంచి 11.30 గంటల వరకు పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అసాంఘిక శక్తులను అణచివేయండి
విజయవాడ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): గుండాయిజం, రౌడీయిజం తదితర దౌర్జన్యాలకు పాల్పడే అసాంఘిక శక్తులను అణచివేయాలని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ జేవీ రాముడు పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లొంగరాదని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో నిర్వహిస్తున్న సమావేశానికి హాజరైన డీజీపీ... 13 జిల్లాల ఎస్పీలు, ఐజీలు, రేంజ్‌ డీఐజీలతో గురువారం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లోనేగాక రాష్ట్రవ్యాప్తంగానూ భూకబ్జాలు ఎక్కువైపోతున్నాయని, వాటిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. వైట్‌కాలర్‌ నేరాలకు సంబంధించిన సెటిల్‌మెంట్లు స్టేషన్లలో జరుగుతున్నట్లు  వినిపిస్తున్న ఆరోపణలపై కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీస్‌ అధికారులు ఆయా శాఖలపై నిత్యం మానిటరింగ్‌ చేయాలన్నారు. ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌లను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని సూచించారు.   ర్యాగింగ్‌ను నివారించేందుకు పోలీసులు.. విద్యార్థులతో సత్సంబంధాలు నెరపాలన్నారు. విజయవాడలో అమలవుతున్న కోర్టు మానిటరింగ్‌ సిస్టం(సీఎమ్‌ఎస్‌) పనితీరును డీజీపీ సమీక్షించారు. విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాల్లో కూడా సీఎమ్‌ఎస్‌ను అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు డీజీపీలు ఆర్‌.పి.ఠాకూర్‌(శాంతిభద్రతలు), ఎ.ఆర్‌.అనురాధ (ఇంటెలిజెన్స్‌), సి.హెచ్‌.ద్వారకా తిరుమలరావు(సీఐడీ), ఎన్‌.వి.సురేంద్రబాబు(గ్రేహౌండ్స్‌), వి.ఎస్‌.కె. కౌముధి(పి అండ్‌ ఎల్‌), డి.భూపతిబాబు(రైల్వేస్‌), తదితరులతోపాటు ఇతర ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేయాలి: సీఎస్‌
జిల్లా కలెక్టర్లు అంకిత భావంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు అన్నారు.  కలెక్టర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.   ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో మమేకమై పనిచేయడం లేదని కలక్టర్లపై ప్రజలకున్న అభిప్రాయాన్ని తుడిచి వేయాలని వారికి సూచించారు. ప్రభుత్వానికి కూడా కలెక్టర్ల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ అవసరమని పేర్కొన్నారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కలెక్టర్లు పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు

No comments:

Post a Comment