Wednesday 20 August 2014

పునాదుల నుంచి స్వర్ణాంధ్ర నిర్మాణం

పునాదుల నుంచి స్వర్ణాంధ్ర నిర్మాణం

Published at: 21-08-2014 03:44 AM
తొలి బడ్జెట్‌లో బాబు సర్కారు సంకల్పం
1.11 లక్షల కోట్లతో భారీ పద్దు సమర్పణ
సంక్షేమం, అభివృద్ధి 2 చక్రాలుగా ప్రణాళిక
వ్యవసాయానికి విరివిగా సహాయం
19వేల కోట్లకు చేరిన ద్రవ్యలోటు
ప్రత్యేక హోదా, కేంద్ర సహాయంపై ఆశలు
రాజధాని, పోలవరం బాధ్యత కేంద్రానికే
‘మిషన్‌-7’ ప్రత్యేక ప్రస్తావన
 2022 నాటికి దేశంలో టాప్‌ 3లోకి
విజన్‌-2020 స్థానంలో విజన్‌-2029
చంద్రబాబు సర్కారు కలల బడ్జెట్‌
రుణమాఫీకి రూ.5 వేల కోట్లు?
ఒకవైపు శిథిల పునాదుల మాట... మరోవైపు స్వర్ణాంధ్ర బాట! ఒకవైపు సమస్యలు, సవాళ్ల ఏకరువు.. మరోవైపు సంక్షేమం, అభివృద్ధిపై పరుగు! 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత 13జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్‌గా మారినా... అంకెల్లో మాత్రం ఉమ్మడి రాష్ట్రంతో ఢీ అంటే ఢీ! ఎక్కడా తగ్గకుండా లక్షకోట్లతో సై! ఏకంగా 1,11,824 కోట్ల రూపాయలతో విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌ ‘తొలి పద్దు’ రూపుదిద్దుకుంది. లోటుపోటు, రాజధాని నిర్మాణం, కొత్త అప్పులు, ఇంకా అనేక అవసరాలు! రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు, గ్రాంట్లపైనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆశలు! 2014-15లో నాలుగున్నర నెలలు ముగిశాక... ‘ప్రత్యేక’పరిస్థితుల్లో... ఆర్థిక మంత్రి యనమల బుధవారం శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కష్టాలు, సమస్యలు, సవాళ్లతో తన ప్రసంగం ప్రారంభించారు. విభజన తర్వాత ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారిందన్నారు. అయినప్పటికీ... కొత్తగా పన్నుల పెంపులు ప్రతిపాదించకుండానే, అంకెలతో విన్యాసం చేశారు. రూ.19వేల కోట్లకు చేరిన ద్రవ్యలోటు ప్రమాద ఘంటికలు మోగించింది. విభజన చట్టం ప్రకారం ఈ లోటును కేంద్రమే భరిస్తుందని ఆశిస్తున్నామని యనమల పేర్కొన్నారు. అయినప్పటికీ, రాష్ట్ర అవసరాల కోసం భారీగా అప్పులు తెచ్చుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో... ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం చట్రం నుంచి సడలింపులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించుకుంది. ‘తాత్కాలిక’ కష్టాలను అధిగమిస్తామని ఆశాభావ ప్రకటన చేస్తూనే... సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2029 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌ను సాధిస్తామని యనమల ప్రకటించారు. గతంలో  తాము ఉద్ఘాటించిన ‘విజన్‌-2020’ని పునర్‌లిఖిస్తామన్నారు.
అభివృద్ధిని ఉద్యమస్థాయిలో ముందుకు తీసుకెళతామన్నారు. కష్టాలున్నప్పటికీ... అభివృద్ధికి అవసరమైన వనరులున్నాయని ఆశావహ దృక్పథం ప్రదర్శించారు. బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమాలతోపాటు.... ఈసారి కాపు సంక్షేమం, బ్రాహ్మణ సంక్షేమం కూడా చోటు చేసుకోవడం విశేషం. సంక్షేమ పథకాలను అర్హులకే అందిస్తామని... ఇందుకు ‘ఆధార్‌’ను ఉపయోగించుకుంటామని బడ్జెట్‌ ప్రసంగంలో స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రకటించిన ‘మిషన్‌-7’  లో పొందుపరిచిన అన్ని రంగాలను పరిపుష్టం చేస్తామని తెలిపారు.  వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు రూ.వంద కోట్లు కేటాయించారు.  కొత్తగా నిర్మించుకోవాల్సిన రాజధాని నిర్మాణానికి ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం గమనార్హం! రాజధానితోపాటు పోలవరం ప్రాజెక్టుకూ కేంద్రమే నిధులు ఇస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీగా ఉన్న విద్యుత్‌ సబ్సిడీ భారం... ఏపీలో భారీగా తగ్గడం గమనార్హం. ఉచిత విద్యుత్తును వాడుకునే వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువ భాగం తెలంగాణలో ఉండటమే దీనికి కారణం కావొచ్చు. వచ్చే సంవత్సరం నుంచి  ‘జీరో బేస్డ్‌’ బడ్జెట్‌ను  ప్రవేశపెడతామని యనమల తెలిపారు. రహదారులు, విమానాశ్రయాలు, రేవులపై  తమ ప్రణాళికలను వివరించారు. రేవుల అభివృద్ధి ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటామన్నారు. విజయవాడ - కాకినాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ప్రతిపాదిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పది నుంచి 12 స్మార్ట్‌ సిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో మొదటి రెండునెలలకు సంబంధించిన లెక్కలు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినవే. బడ్జెట్‌ బాగుందని ప్రశంసిస్తూనే... కొత్త రాష్ట్రంలో ఏడాది దాటితేగానీ ఆదాయంపై స్పష్టత రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బడ్జెట్‌పై విపక్ష నేత జగన్‌ పెదవి విరిచారు.  మరోవైపు. ..రుణమాఫీకి రూ.5వేల కోట్లు కేటాయించనునట్లు తెలిసింది. శుక్రవారం ప్రవేశపెట్టే వ్యవసాయ బడ్జెట్‌లో దీనిని ప్రకటించే అవకాశముంది.

No comments:

Post a Comment