Tuesday, 26 August 2014

మధుమేహులకు మూడు నియమాలు


మధుమేహులకు మూడు నియమాలు

మధుమేహంతో ఇబ్బంది పడే వాళ్లు ముఖ్యంగా మూడు విషయాలపై దృష్టి పెట్టాలి. అవి... వ్యాయామం, ఆహారం, ఔషధం. మందులు వాడుతున్నాం కదాని మిగతా రెండింటిలో ఏ ఒక్క దాన్ని నిర్లక్ష్యం చేసినా తిప్పలు తప్పవు. అలాగే ఆహారం, వ్యాయామాల గురించి శ్రద్ధవహిస్తున్నామని మందులు వేసుకోవడం మానేయకూడదు. ఈ మూడింటినీ క్రమం తప్పకుండా పాటిస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అందులో భాగంగా మధుమేహులు చేయాల్సిన వ్యాయామాలు, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి...

మకరం
వజ్రాసనంలో కూర్చొని కుడికాలు వెనక్కి చాపి, ఎడమ కాలిని ముందుకు ఉంచాలి (ఫోటోలో చూపించిన విధంగా). శ్వాస లోపలికి పీలుస్తూ చేతులు నెమ్మదిగా పైకి ఎత్తాలి. తరువాత శ్వాస బయటకు వదులుతూ తలని కిందకి వంచి నుదుటిని నేలకి ఆన్చాలి. తరువాత మళ్లీ నెమ్మదిగా పైకి లేవాలి.
పావురం
మకరాసనంలో ఉండి కుడి కాలుని పైకెత్తాలి. తలని వెనక్కి వంచి ఎత్తిన కాలిపాదానికి ఆన్చాలి. తరువాత నెమ్మదిగా మకరాసనంలోకి రావాలి.
వాయసం (కాకి )
మొదట వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు అరచేతుల్ని కింద ఆన్చాలి. చేతి వేళ్లు వెడల్పుగా ఉంచాలి. తరువాత ముని వేళ్ల మీద కూర్చొని నెమ్మదిగా కాళ్లు పైకి ఎత్తాలి.
నిల్చొని ముందుకు వంగడం
నిటారుగా నిల్చొని నెమ్మదిగా శ్వాసను లోపలికి పీలుస్తూ నెమ్మదిగా వంగాలి. పాదాల కింద చేతులు ఉంచి ముఖాన్ని మోకాళ్ల మధ్యకి రానివ్వాలి. శ్వాస బయటికి వదులుతూ నుదుటిని మోకాళ్లకు ఆన్చాలి.
అలోమ-విలోమ ప్రాణాయామం
వజ్రాసనంలో కూర్చొని ఒక నాసికా రంధ్రాన్ని చేతి వేళ్లతో సున్నితంగా మూసి మరో నాసికారంధ్రం నుంచి లోపలికి గాలి పీల్చాలి. ఆ తరువాత చేతి వేళ్లతో నాసికా రంధ్రాలను మూసి ఎనిమిది సెకన్లు ఉండాలి. ఇలా 20 రౌండ్లు అంటే 60 సార్లు చేయాలి. ఒకేసారి కాకుండా ఒక్కో రౌండుకి 20 చొప్పున చేయాలి.
కపాల భాతి
వజ్రాసనంలో కూర్చొని శ్వాసని లోపలికి, బయటికి పీలుస్తుండాలి. ఇలా 90 సార్లు చేయాలి. 90 ఒకేసారి కాకుండా ముఫ్పై సార్లు చేసి విరామం ఇచ్చి మరో ముఫ్పై చొప్పున మూడుసార్లు చేయాలి. శ్వాస లోపలికి పీల్చినప్పుడు పొట్ట బయటికి రావాలి. శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపలికి పోవాలి.
ఈ ఆసనాలన్నీ కూడా ఒక్కో ఆసనం 30 సెకన్లు కచ్చితంగా చేయాలి. ఇతర ఆరోగ్య సమస్యలున్న వాళ్లు డాక్టర్‌ సలహా తీసుకున్నాక యోగ నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
ఆహారం గురించి...
నీళ్లు, ఆహారం ఈ రెండూ మోతాదు మించకుండా తీసుకోవాలి.
డయాబెటిక్‌ వ్యాధి ఉన్న వాళ్లు కొబ్బరి నీళ్లు తాగకూడదనుకుంటారు. కొబ్బరి కాయ నీళ్లు తాగకూడదు గాని కాని కొబ్బరి బోండాం నీళ్ల తాగొచ్చు.
కాకరకాయ, టొమాటోల్ని కలిపి జ్యూస్‌ తీసి వారానికి ఒకసారి తాగాలి.
గోధుమగడ్డి జ్యూస్‌ వారానికి ఒకసారి తాగాలి.
క్లోమగ్రంధిని చురుకుగా ఉంచే ర్యాడిష్‌, క్యారెట్‌, బ్రకోలి, కాలీఫ్లవర్‌, గోధుమ వంటి పీచు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.
బ్రౌన్‌రైస్‌ మాత్రమే తినాలి. తెల్ల అన్నం తినకుండా ఉంటే మంచిది.
భూమిలోపల నుండి పండేవి తినొద్దు. అంటే అల్లం, వెల్లుల్లి, దుంపలు వంటివి తినొద్దు.
సోడియం తక్కువగా తినాలి.
ఆహారంపైన ఉప్పు చల్లుకుని తినే అలవాటు ఉంటే వెంటనే మానేయండి.
స్నాక్స్‌ వంక అస్సలు చూడొద్దు.
కాఫీ అస్సలంటే అస్సలు తాగకూడదు. దీనిలో ఉండే కెఫైన్‌ విటమిన్‌డిని తగ్గించేస్తుంది.
అలాగే టీ కూడా తక్కువగా తాగాలి. రోజుకి ఒకసారి తాగడం శ్రేయస్కరం.

మాన్సి గులాటి,
యోగ నిపుణురాలు,
హైదరాబాద్‌

No comments:

Post a Comment