Thursday 28 August 2014

ఏపీ రాజధానిపై శివరామకృష్ణన్‌ కమిటీ కీలక సిఫారసులు

అక్కడ వద్దు.. మార్టూరు-వినుకొండ మేలు

ఏపీ రాజధానిపై శివరామకృష్ణన్‌ కమిటీ కీలక సిఫారసులు
గుంటూరు-బెజవాడ అంటే ‘హైదరాబాద్‌’ తప్పు పునరావృతమే!
పర్యావరణ, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం.. సాగు దెబ్బతింటుంది
ఏపీ సమగ్రాభివృద్ధికి బహుళ రాజధానులే సోపానాలు
మార్టూరు-వినుకొండ మధ్య ‘రాజధాని’ బెటర్‌
సచివాలయం, శాసనసభ త్వరగా తరలిస్తే మేలు
విశాఖలో హైకోర్టు.. సీమలో బెంచ్‌
ఏడాదికోసారి సీమలో అసెంబ్లీ
ఏది ఎక్కడో రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం
హోం శాఖకు కమిటీ నివేదిక సమర్పణ
అస్పష్టంగా ముగిసిన కసరత్తు
‘విజయవాడ-గుంటూరు మధ్యే రాష్ట్ర రాజధాని’... రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెబుతున్నాయి. కానీ... రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణన్‌ కమిటీ మాత్రం ‘విజయవాడ-గుంటూరు వద్దేవద్దు’ అని తేల్చి చెప్పింది. ‘అందరికీ అందుబాటులో, రాష్ట్రానికి నడిమధ్యలో’ అనే వాదనలను తోసిపుచ్చింది.
ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తే...
వ్యవసాయ, ఆర్థికరంగాలు, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఎవరూ ఊహించని విధంగా... మార్టూరు-వినుకొండ ప్రాంతాన్ని ‘రాజధాని’గా సూచించింది. అయితే, అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించవద్దన్న విస్తృత అభిప్రాయాన్నే కమిటీ కూడా తెలిపింది. ‘రాజధాని పేరిట ఒకేచోట అన్నీ ఏర్పాటు చేయొద్దు. విభాగాలు,
అవసరాల వారీగా బహుళ రాజధాని వ్యవస్థ ఏర్పాటు చేయాలి’ అని స్పష్టం చేసింది. ‘నవ్యాంధ్ర రాజధాని’పై శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ‘ఆంధ్రజ్యోతి’ చేతికి చిక్కింది. అందులోని వివరాలు ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకు ప్రత్యేకం...
 
(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి) వివిధ ప్రాంతాల్లో పర్యటించి, అధికారులతో సమీక్షించి, స్థానికులతో చర్చించి... శివరామకృష్ణన్‌ కమిటీ ఐదు నెలలపాటు చేసిన కసరత్తు ముగిసింది. బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామికి కమిటీ తన నివేదికను సమర్పించింది. ‘రాజధాని నిర్దిష్టంగా ఫలానా చోటే ఉండాలని చెప్పం’ అని ముందే ప్రకటించినప్పటికీ... అంతిమ నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ... కమిటీలోని నిపుణులు, వారి నేపథ్యం దృష్ట్యా వారు ఏం చెబుతారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కమిటీ కూడా కొండంత కసరత్తు చేసి చివరికి తుస్సుమనిపించింది. 40 పేజీల ప్రతిపాదనలు, సుదీర్ఘ అనుబంధాలు, చిత్రపటాలతో కమిటీ చైర్మన్‌ శివరామకృష్ణన్‌ నివేదికను రూపొందించారు. వివిధ ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేయడం గురించి చర్చించడం, విశ్లేషించడం మినహా ఎలాంటి స్పష్టతనివ్వలేదు. రాజధానిని నిర్ణయించాల్సిన ప్రధాన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే అని భావిస్తున్న కేంద్రం ఈ కమిటీ నివేదికకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదని సమాచారం! అయినప్పటికీ... ఈ నివేదికలోని ముఖ్యమైన అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే...
ఏకం కాదు... బహుళం!
శివరామకృష్ణన్‌ కమిటీ విషయంలో తేల్చిన ప్రధానాంశం- ‘ఒకే రాజధాని వద్దు! బహుళ రాజధానులు ఉండాలి!’ అని. ఒకే ఒక సూపర్‌ సిటీని రాజధానిగా అభివృద్ధి చేయడంకంటే... వివిధ ప్రాంతాల్లో రాజధానికి సంబంధించిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌ మొత్తం సమగ్రంగా అభివృద్ధి చెందాలని కమిటీ బలంగా అభిప్రాయపడుతోంది. ఒకేఒక్క సూపర్‌సిటీ నిర్మాణం, లేదా రాజధాని ప్రాంతం వల్ల ఈ లక్ష్యం నెరవేరదు’’ అని తెలిపింది. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో శాసన, న్యాయ, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కమీషనరేట్లు, డైరెక్టరేట్లతో కూడిన పరిపాలనా యంత్రాగం మొత్తం హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులన్నీ హైదరాబాద్‌ చుట్టూనే వచ్చాయి. అందువల్లే... విభజన సమయంలో ఈ నగరం వివాదాస్పదమైంది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకే ప్రాంతంలో పెట్టాలనడంలో అర్థం లేదు. ప్రస్తుత ఏపీ దేశంలోనే ఎలకా్ట్రనిక్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ అగ్రగామిగా ఉంది. అధునాతన సమాచార వ్యవస్థ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో... భూగోళిక దూరాభారం లెక్కలోకి రాదు.
కొత్త రాజధానులు ఇలా..
స్వాతంత్ర్యానంతరం కొన్ని కొత్త రాజధానులు ఏర్పడ్డాయి. 115 చదరపు కిలోమీటర్ల పరిధిలో చండీగఢ్‌, 177 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గాంధీనగర్‌, 419 చదరపు కిలోమీటర్ల పరిధిలో భువనేశ్వర్‌లను రాజధానులుగా అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. రాష్ట్రంలోని వివిధ నగరాల మధ్య ఇప్పటికే ఉన్న రోడ్డు, రైలు రవాణా వ్యవస్థను మెరుగుపరిచి, విస్తరించి... పాలనా కేంద్రాలను వికేంద్రీకరించాలి. ‘ఒకేఒక్క సూపర్‌ సిటీ’ కోసం వెదుకులాట అనవసరం.
అన్నీ అక్కడ వద్దు
‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందనే కారణంతో... కృష్ణా-గుంటూరు మధ్య విజయవాడ కేంద్రంగా రాజధాని నగరం ఏర్పాటవుతుంది’ అనే వార్తలు వస్తున్నట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే... అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేస్తే దీర్ఘకాలంలో ఆర్థిక, పర్యావరణపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. మరీముఖ్యంగా... ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల అభివృద్ధిని దెబ్బతీస్తుందని తెలిపింది. ‘‘కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాజధాని ఏర్పాటు చేయడం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక, పర్యావరణ పర్యవసానాలుంటాయి. వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు మార్చేస్తారు. దీనివల్ల వ్యవసాయంపై ఆధారపడిన వారి ఉపాధి దెబ్బతింటుంది’’ అని తెలిపింది.
చిన్న, సన్నకారు రైతులు మాయమైపోతారని... రియల్టర్లు రెచ్చిపోతారని పేర్కొంది. ‘‘వీజీటీఎం పరిధిలో పెద్దసంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ఏమాత్రం వాంఛనీయం కాదు. అది ఆచరణ సాధ్యం కూడా కాదు. అలా చేయడమంటే... హైదరాబాద్‌ విషయంలో జరిగిన పొరపాటును పునరావృతం చేయడమే. కొన్ని కమిషనరేట్లు, డైరెక్టరేట్లను వాటి పనితీరు స్వభావాన్ని బట్టి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయవచ్చు’’ అని తెలిపింది.
రాయలసీమ చాపం...
కర్నూలు, అనంతపురం, ధర్మవారం, మదనపల్లె, హిందూపురం, తిరుపతి, చిత్తూరులను కమిటీ ‘రాయలసీమ చాపం’ (వీటిని మ్యాప్‌లో ఇవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి)గా పేర్కొంది. ఒకప్పుడు రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలును తిరిగి రాజధాని చేయాలనే డిమాండ్‌ ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ నగరానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని విస్మరించరాదని తెలిపింది. ‘‘హైదరాబాద్‌-కర్నూలు-అనంతపురం-బెంగళూరు’ జాతీయ రహదారి గురించి ప్రస్తావించింది. ‘రాయలసీమ ఆర్క్‌’ను దక్షిణాదిలో భారీ రవాణా కారిడార్‌గా మార్చవచ్చునని తెలిపింది. రాయలసీమ వర్షాభావ ప్రాంతమైనప్పటికీ... సాగునీటి ప్రాజెక్టులున్నాయని తెలిపింది. ప్రభుత్వం కర్నూలు-అనంతపురం ప్రాంత నీటి అవసరాలపై దృష్టి పెట్టాలని సూచించింది.
కాళహస్తి-నడికుడి రేఖ
కాళహస్తి నుంచి నడికుడి వరకు ఉన్న 300 కిలోమీటర్ల ‘రేఖ’ మరో అతిముఖ్యమైన ప్రాంతమని కమిటీ తెలిపింది. రైల్వేపరంగా ప్రాధాన్యం ఉందని పేర్కొంది. వైజాగ్‌-చెన్నై కారిడార్‌తో సమాంతరంగా అభివృద్ధి చేయవచ్చునని తెలిపింది. కృష్ణపట్నం, దుగరాజపట్నం రేవులనూ అనుసంధానించవచ్చునని పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ఈ ‘రేఖ’ దోహద పడుతుందని అభిప్రాయపడింది.
వినుకొండ-మార్టూరు ఓకే
ఈ ఏడాది జూలైలో ప్రణాళికా విభాగం రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాలను రాజధాని ఏర్పాటు కోసం సూచిస్తూ సమాచారాన్ని ఇచ్చింది. ఇవన్నీ... మధ్యాంధ్రలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలోని ప్రాంతాలను ఒకటిరెండింటినైనా ప్రభుత్వం ప్రతిపాదించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రతిపాదించిన ఆ 8 ప్రాంతాలు... ముసునూరు (ఏలూరు సమీపంలోని ముసునూరు ప్రాంతం వీజీటీఎం పరిధిలో ఉంది), మంగళగిరి, పులిచింతల, మాచర్ల, బొళ్లపల్లి, మార్టూరు, వినుకొండ, దొనకొండ. మాచర్ల, పులిచింతల రెండూ తెలంగాణ సరిహద్దులో ఉన్నందున రాజధానికి ఇవి ఉపయుక్తం కావని కమిటీ తెలిపింది. రాజధాని కోసం రాష్ట్రం సూచించిన ఈ 8 ప్రాంతాలు, ప్రతిపాదిత కారణాలను చూస్తే... మార్టూరు - వినుకొండలకు మాత్రమే తదుపరి పరిశీలనకు అర్హత ఉందని అభిప్రాయపడింది. అసెంబ్లీ, సచివాలయం ఏర్పాటుకు మార్టూరు-వినుకొండను పరిశీలించవచ్చునని తెలిపింది.
ఆ మూడూ ఎక్కడ?
‘‘అసెంబ్లీ, ముఖ్యమంత్రి కార్యాలయం, సెక్రటేరియేట్‌, హైకోర్టు ఎక్కడ ఉంటే దానిని రాజకీయ రాజధానిగా పరిగణిస్తుంటారు. భూమి అందుబాటులో ఉంటే వీటన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేయాలి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక పరిస్థితులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించాల్సిన నేపథ్యంలో కొన్ని ప్రత్యామ్నాయాలను చూడటం తప్పనిసరి’’ అని కమిటీ తెలిపింది. రాష్ట్ర శాసనసభ, శాసన మండలిని మార్టూరు-వినుకొండలో ఏర్పాటు చేస్తే... ఏడాదికి ఒకసారైనా అసెంబ్లీ సమావేశాలను రాయలసీమ జోన్‌లోనూ నిర్వహించాలని తెలిపింది. కర్ణాటకలో బెల్గాం, మహారాష్ట్రలో నాగపూర్‌లో ఇలాంటి ఏర్పాటు ఉందని గుర్తు చేసింది.
కమిటీ చెప్పిందిలా...
విభజన తర్వాత కూడా ఒకటి రెండు ప్రాంతాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలను, పెట్టుబడులను పెడతారేమోనన్న ఆందోళన విస్తృతంగా ఉంది.
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు... కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యవసాయానికి ఉపయోగపడని భూములు కానీ, డీగ్రేడెడ్‌ అటవీ భూములు కానీ లేవు. అయితే... అక్కడక్కడ మాత్రం భూములు అందుబాటులో ఉన్నాయి.
వీజీటీఎం జనాభా 17.22 లక్షలు. వీరిలో 82 శాతం వ్యవసాయంపై ఆధారపడినవారే.
రవాణా అవసరాల దృష్ట్యా విజయవాడ చుట్టూ రింగ్‌ రోడ్‌ నిర్మించాలి.
కాళహస్తి-నడికుడి లైన్‌ నిర్మాణానికి ఇంకా రూ.291 కోట్లు ఖర్చవుతుంది. కానీ, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.5 కోట్లు కేటాయించారు.
డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ కార్యాలయం ముందు నుంచీ అనంతపురంలోనే ఉంది. దానిని అక్కడే కొనసాగించాలి.
పోర్టులు, పరిశ్రమలు, ఎగుమతులు, మత్స విభాగాలకు చెందిన కమిషనరేట్లు, డైరెక్టరేట్లను వైజాగ్‌ జోన్‌లో ఏర్పాటు చేయొచ్చు.
సచివాలయం ఉన్న ప్రాంతంలోనే కమిషనరేట్లు, డైరెక్టరేట్లు ఉండాలని, తద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు సులువు అవుతాయని కొందరు వాదించొచ్చు. అయితే... ఆధునిక సమాచార వ్యవస్థలు అందుబాటులో ఉన్నందున ఈ భౌతిక దూరం లెక్కలోకి రాదు.
పునరుత్పాదక ఇంధన కార్యకలాపాలకు సంబంధించి రాయలసీమ ప్రాంతంలో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.

వైజాగ్‌లో హైకోర్టు పెట్టొచ్చు
అన్ని సౌకర్యాలతో కూడిన హైకోర్టును ఏర్పాటు చేసేందుకు 3 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుందని కమిటీ అభిప్రాయపడింది. ‘‘వీలైతే అసెంబ్లీ, సచివాలయాలు ఏర్పాటు చేసే ప్రాంతంలోనే హైకోర్టును కూడా పెట్టొచ్చు. లేదా... జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల తరహాలో సంజీవయ్య జాతీయ న్యాయ విద్యాలయం ఉన్న వైజాగ్‌లో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు’’ అని అభిప్రాయపడింది. హైకోర్టు ఒక్కదానినే ప్రత్యేకంగా చూడరాదని... మరో పది ట్రిబ్యునళ్లు, కమిషన్లు కూడా రాష్ట్ర న్యాయ పాలనా వ్యవస్థ పరిధిలో ఉంటాయని తెలిపింది.
‘‘న్యాయవాదులు హైకోర్టుతోపాటు ఈ సంస్థలకు కూడా హాజరవుతుంటారు. కాబట్టి, ఈ సంస్థలన్నింటినీ ఒకేచోట ఉంచడం మంచిది’’ తెలిపింది. ఇక... హైకోర్టు, ఇతర న్యాయ సంస్థలు ఎక్కడ ఏర్పాటు చేసినప్పటికీ హైకోర్టు బెంచ్‌ను రాయలసీమలో ఒక చోట ఏర్పాటు చేయాలని సూచించింది. అసెంబ్లీ, సచివాలయం ఉన్నచోటే హైకోర్టును ఏర్పాటు చేయటం తప్పనిసరి కాదంటూ... కేరళ, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలను ఉదహరించింది.
మూడు రాజధాని జోన్లు..
రాజధానితో ముడిపడిన పరిపాలనా విభాగాలను, ఇతర సంస్థలను ఒకేచోట కాకుండా... మూడుచోట్ల వికేంద్రీకరించాలని కమిటీ సూచించింది. వీటికి... వైజాగ్‌ కేంద్రంగా ఉత్తరాంధ్ర సబ్‌రీజన్‌, రాయలసీమ ఆర్క్‌ (చాపం), శ్రీకాళహస్తి-నడికుడి రేఖగా నామకరణం చేసింది.
‘‘శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఉండే వైజాగ్‌ జోన్‌లో... పరిశ్రమలు, ఉత్పత్తి, రేవులు, నౌకాయానం, పెట్రోకెమికల్‌, సాంకేతిక విద్యకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఈ రంగాలకు సంబంధించి హైదరాబాద్‌లో ఉన్న 109 ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడికి తరలించాలి’’ అని తెలిపింది. వైజాగ్‌ ప్రాంతం హైటెక్‌ జోన్‌గా అభివృద్ధి చెందే అవకాశముందని తెలిపింది.
త్వరగా తరలించాలి
‘‘ఉమ్మడి రాజధానికి సంబంధించి... ముఖ్యమంత్రుల కార్యాల యాలు, సచివాలయాల విషయంలో మాత్రం రోజూ అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అందువల్ల ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం కార్యాలయం, సచివాల యంపై వీలైనంత త్వరగా ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయాలి. అయితే... వీటిని ఎక్కడో ఒకచోట తాత్కాలికంగా పెట్టి, ఆ తర్వాత తరలిస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వీలైనంత త్వరగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను నిర్ణయించుకోవాలి!’’

No comments:

Post a Comment