హిందూ అంటే భయమెందుకు?: వెంకయ్య
న్యూఢిల్లీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): హిందూ అన్నది సంకుచిత, మతపరమైన పదం కాదని.. అదొక విశాల సాంస్కృతిక జీవన విధానమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దీనికి భిన్నంగా భావించేవారు హిందూ, హిందుస్థాన్ వంటి పత్రికలు హిందువుల కోసమే ఉన్నాయేమో ఆలోచించాలన్నారు. పేరునుబట్టి అవి మతతత్వ పత్రికలవుతాయా? మతతత్వాన్ని రెచ్చగొడుతున్నాయా? అని ప్రశ్నించారు. శతాబ్దాలుగా సమాజంలో వాడుకలో ఉన్న పదాన్ని ఇప్పుడు వివాదం చేయజూడటం సరికాదన్నారు. జనసంఘ్ లేదా బీజేపీ లేనినాడు, తాను పాఠశాలలో చదువుకున్న రోజుల్లోనూ ‘ఇండియన్ హిస్టరీ’ అనే ఆంగ్ల పదబంధానికి ‘హిందూ దేశ చరిత్ర’గా తెలుగులో అనువదించి చెప్పేవారని గుర్తుచేశారు. హిందుస్థాన్ పేరుతో ఏయిరోనాటిక్స్, షిప్‌యార్డ్, మెషీన్ టూల్స్, ఫొటో ఫిలిమ్స్, సమాచార్.. ఇలా చాలా సంస్థలున్నాయని గుర్తుచేశారు. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండు నెలల్లోనే దేశంలో మత ఘర్షణలు ఎక్కువయ్యాయన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. నిరుడు యూపీఏ హయాంలో ఇదే రెండు నెలల్లో ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో మత ఘర్షణలు జరిగాయన్నారు. కాగా, రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనప్పుడే రాషా్ట్రల శాంతిభద్రతలపై కేంద్రం జోక్యం చేసుకుంటుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా మత ఘర్షణలు జరుగుతుండగా, ఆ రాష్ట్ర అధికార పార్టీ ఓ కమిటీ వేసి బీజేపీ ఎంపీలను బాధ్యుల్ని చేయటం వింతగా ఉందన్నారు. పాకిస్థాన్‌తో సహా అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను ప్రధాని మోదీ కోరుకుంటుంటే ఆ దేశ దౌత్యవేత్త భారత గడ్డపై కశ్మీర్ వేర్పాటు వాదులతో చర్చలు జరపటం, సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు.
No comments:
Post a Comment