Saturday 9 August 2014

గోల్కొండలో పంద్రాగస్టు వేడుకలా?

Published at: 07-08-2014 07:36 AM
హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించడం దేనికి ప్రతీక అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ నేతలు ఎస్‌.మల్లారెడ్డి, జి.ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌, కాసం వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. గోల్కొండ కోట నుంచే నిజాం నియంతృత్వ, నిరంకుశత్వ, అరాచక, అణచివేత, కుటుంబపాలన సాగించారన్నారు. అలాంటి కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎలా ఎగురవేస్తారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి కడతం కొడుకో’ అని నిజాంను తెలంగాణ ప్రజలు హెచ్చరించిన విషయం సీఎం కేసీఆర్‌కు గుర్తు లేదా అని నిలదీశారు. అక్కడ ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రాతిపదిక ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘ఎవరినీ సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది కేసీఆర్‌ కుటుంబ వ్యవహారం కాదు.’’ అని అన్నారు. గోల్కొండకోటపై ఏవైనా ఉత్సవాలను నిర్వహించాలనుకుంటే ముందుగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17న విమోచనోత్సవాలను నిర్వహించాలని అన్నారు.   ముఖ్యమంత్రి కేసీఆర్‌... గోల్కొండకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఉత్సవాలకు నాంది పలకాలని సూచించారు.   కాగా, రైతులు, విద్యార్థులపై కేసీఆర్‌ కుటుంబం లాఠీ ఎత్తడం ఎంతవరకు న్యాయసమ్మతమని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కరీంనగర్‌ను లండన్‌, న్యూయార్క్‌లాగా మార్చడం, సానియామీర్జాకు కోటి రూపాయలు ఇవ్వడం వంటి అంశాలపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ, రైతులు, విద్యార్థులు, ప్రజల ఇబ్బందులపై లేదని ఆయన విమర్శించారు.  కాగా, బీజేపీ చీఫ్‌ అమిత్‌షా మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే పర్యటిస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఆయన హైదరాబాద్‌ రానున్నారని, 21న తెలంగాణ పదాధికారులతో సమావేశం నిర్వహించనున్నామన్నారు.

No comments:

Post a Comment