Wednesday 20 August 2014

Hyderabad Population 1.05 Cr.

1.05 కోట్లు

Published at: 21-08-2014 03:48 AM
ఇదీ తెలంగాణ కుటుంబాల లెక్క
పక్కాగా తేల్చిన సమగ్ర సర్వే.. ఐదు కోట్లకుపైగానే జనాభా
2011 గణాంకాలను మించి నమోదు
ఇంకా 2,30,655 కుటుంబాలకు పూర్తికాని సర్వే
హైదరాబాద్‌లో అంతుచిక్కని లెక్కలు
కేసీఆర్‌ వచ్చాక తదుపరి సర్వేపై నిర్ణయం
రేపటి నుంచి డేటా ఎంట్రీ, 15 రోజుల్లోగా పూర్తి
‘కోటి రతనాల వీణ నా తెలంగాణ’ అంటూ మహాకవి దాశరథి వేసిన లెక్క.. తెలంగాణ ఉద్యమ కాలానికి మూడున్నర కోట్లుగా తేలింది. ప్రత్యేక ఉద్యమం పూర్తయి తెలంగాణ రాష్ట్రం అవతరించిన వేళ, అది 5 కోట్ల అంకెను దాటుతోంది. మంగళవారం తెలంగాణ అంతటా పూర్తి అయిన సమగ్ర కుటుంబ సర్వే.. తెలంగాణలోని కుటుంబాల లెక్కని పక్కా చేసింది. మొత్తం 1,05,76,922 కుటుంబాలను నమోదు చేసింది. 2011 జనగణనను అధిగమించి... ఐదు కోట్లకు పైగా జనాభాను లెక్కలేసి చూపించింది.
హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2011 గణాంకాల ప్రకారం 86.85 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ మూడేళ్లలో 19 లక్షలకు పైగా కుటుంబాలు (18, 91,922 కుటుంబాలు) పెరిగినట్టు సమగ్ర సర్వేలో తేలింది. హైదరాబాద్‌ను కలుపుకొని తెలంగాణ జిల్లాలన్నింటా ఇంకా  2,30,655 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. వీటిలో ఖమ్మం జిల్లాలో 10 వేలు, వరంగల్‌లో మరో 10 వేలు, రంగారెడ్డి జిల్లాలో 10,655 కుటుంబాలు, జీహెచ్‌ఎంసీ పరిఽధిలో 2,00,000 కుటుంబాలు సర్వే చిట్టాలో చేరలేకపోయాయి. మంగళవారం సగంలో ఆగిపోయిన సర్వేను కొన్ని జిల్లాల్లో బుధవారం కూడా కొనసాగించారు. వీలైనన్ని ఎక్కువ కుటుంబాలను చేరుకునేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఆరు చోట్ల పూర్తి సంతృప్తికర స్థాయిలో సర్వే జరగ్గా, మరో నాలుగు చోట్ల కొంత నమోదు పని నిలిచిపోయింది. హైదరాబాద్‌లో అత్యధికంగా రెండు లక్షల కుటుంబాల సర్వే జరగాల్సి ఉన్న దరిమిలా, ఏదైనా మరో రోజును దీనికోసం ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌ విదేశీ పర్యటనకు వెళ్లిన దరిమిలా, ఆయన తిరిగి వచ్చిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, సర్వే పత్రాలు చేతికి అందడంతో వాటిని ఎంట్రీ చేయాలని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్‌ పీటర్‌ ఆదేశించారు. గురువారం డేటా ఎంట్రీకి ట్రయల్‌ రన్‌ చేపట్టాలని సూచించారు. ఎంట్రీ
పనులను సెప్టెంబర్‌ 6వ తేదీలోగా 15 రోజుల్లో పూర్తిచేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను నిర్దేశించారు. డేటా ఎంట్రీ కోసం జీహెచ్‌ఎంసీ మినహా తొమ్మిది జిల్లాల్లో 17,140 కంప్యూటర్‌లను వినియోగించుకోనున్నామని, 381 కేంద్రాల్లో డేటా ఎంట్రీ జరగనుందన్నారు. జిల్లా కలెక్టర్లు ఎక్కడికక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకోవాలని సూచించారు.
చిక్కని సిటీ లెక్క!
తెలంగాణ అంతటా దాదాపు సెంచరీ కొట్టిన సమగ్ర కుటుంబ సర్వే, రాజధానిలో మాత్రం సగమే పూర్తి అయింది. మంగళవారం చేపట్టిన ఒకరోజు సర్వేలో నమోదు తక్కువగా, ఫిర్యాదులు వెల్లువలా వచ్చిపడ్డాయి. ‘‘ప్రతిదీ తరలి తరచి చూశాం. ఫారంల అందుబాటు నుంచి నమోదు వరకూ ఎక్కడా లోటు లేకుండా ఏర్పాట్లు చేశాం. చాలావరకు ఎన్యూమరేటర్ల కొరతనీ అధిగమించాం. కానీ, అనుకున్నస్థాయిలో నమోదు ఎందుకు లేదు’’ అంటూ జీహెచ్‌ఎంసీ మథనపడింది. 2011 జనగణన గీటురాయిగా ఏర్పాట్లు పూర్తిచేసినా.. కుటుంబాలను పూర్తి స్థాయిలో చేరుకోకపోవడంపై ఆలోచనలో పడిపోయింది. లెక్క ఎక్కడ తప్పిందో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జనగణన ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  2011లో చివరిసారి తీసిన జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 15,24,392 కుటుంబాలు నివసిస్తున్నాయి. జనాభాపరంగా 68,09,970 మంది ఉన్నట్టు జనగణన తేల్చింది.
దాంతో హైదరాబాద్‌ జనాభాను 70 లక్షలుగా ప్రభుత్వం పరిగణిస్తూ వచ్చింది. ఈ లెక్కను పట్టుకొనే రాజధానిలో జీహెచ్‌ఎంసీ.. సర్వేకు సన్నాహాలు చేసింది. ప్రత్యేక శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లను ఆ స్థాయిలోనే సర్వే కోసం రంగంలోకి  దించింది. కానీ, ఫారంల నుంచి, ఎన్యూమరేటర్ల వరకూ.. సరిపడా లేక అవస్థలు పడాల్సి వచ్చింది. అంతేకాదు.. నగర జనాభా కోటి దాటుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఎందుకిలా అని ఆలోచిస్తే రెండు కారణాలు కనిపిస్తున్నాయని సామాజిక పరిశీలకులు చెబుతున్నారు. 2011 జనగణనలోనే లోపం ఉన్నదనేది ఒక పరిశీలన. సాధారణంగా ఏటా 10 శాతం జనాభా పెరుగుతుందనేది అంచనా. కానీ, 2011 నుంచి ఇప్పటిదాకా, అంటే మూడేళ్లలో 45 శాతం మేర జనాభా పెరిగింది.  హైదరాబాద్‌లో మిగతా సర్వే కూడా పూర్తి అయితే కుటుంబాల సంఖ్య 22,28,818కు చేరుకునే అవకాశం ఉంది. శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా  ఉప్పల్‌, ఎల్బీనగర్‌, కాప్రాలో అంచనాలకు మించి కుటుంబాల సంఖ్య పెరిగినట్టు సర్వేలో తేలింది. ఇక రెండో కారణం.. కుటుంబాల నిర్ధారణకు పాటించిన ప్రమాణం. పొయ్యిలను బట్టి కుటుంబాలను లెక్కించాలనేది సమగ్ర కుటుంబ సర్వేలో ముఖ్యమైన అంశం. నగరంలో చాలా ఇళ్లలో ఒకటికి మించిన పొయ్యిలు ఉన్నట్టు ఎన్యూమరేటర్లు గుర్తించారు. దాని వల్ల కూడా కుటుంబ సంఖ్య పెరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. జనగణన అంచనాలను జనాభా మించిపోయినట్టు జీహెచ్‌సీఎం కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌ కూడా ధ్రువీకరించారు. ‘‘ 2011తో పోల్చితే ఐదున్నర లక్షల కుటుంబాలు పెరిగాయి. హైదరాబాద్‌లో ఇంకా 1,49,309 కుటుంబాల సర్వే జరగాల్సి ఉంది. తమకు సర్వే జరగలేదని వచ్చిన ఫిర్యాదుల మేరకు.. గురువారం ఆయా కుటుంబాలకు సర్వే నిర్వహిస్తాం’’ అని ఆయన తెలిపారు. సర్వేకు సహకరించిన ప్రతతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

No comments:

Post a Comment