Thursday 7 August 2014

సిగ్గు శరం లేని కేసీఆర్‌ మాటలు

సిగ్గు శరం లేని కేసీఆర్‌ మాటలు

Published at: 08-08-2014 08:28 AM
హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ చెప్పిన పలు అంశాలను ఉటంకిస్తూ, అహంకార ధోరణితో మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడేమో ఆర్బీఐ ఒప్పుకోవడం లేదని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ‘సిగ్గూ శరం లేకుండా మాట్లాడుతున్నావు. రైతుల సమస్యలు పట్టించుకోవద్దంటే అహంకార ధోరణి కాదా’ అని నిలదీశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కరెంటు లేక కడుపు మండి రైతులు రోడ్డుపైకి వస్తే ఇతర పార్టీలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నాయని అంటున్నారని, ఇది ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు.
‘‘ఉస్మానియా ఆస్పత్రిలో కరెంటు లేక శస్త్ర చికిత్సలు జరగడం లేదని పత్రికల్లో వార్తలు వచ్చాయి. నీవు చెప్పినట్లే రాయాలని వాళ్లను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నావు. నీ ధోరణి ఇలాగే ఉంటే మూడేళ్ల తర్వాత నీ ప్రభుత్వం ఉండడం కష్టమే’’ అని హెచ్చరించారు. ‘‘నీ మాటలు జిన్నా మాటల్లాగా ఉన్నాయి. తెలంగాణను పాకిస్థాన్‌లా చూస్తున్నావు. ప్రజలు నీపై తిరగబడతారు. ఇప్పటికైనా జాగ్రత్తపడు’’ అని ఆయన హెచ్చరించారు. 19న ఒక్క రోజే సర్వే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పైగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు రద్దు చేసుకోవాలనడం, బస్సులు నడపబోమని, ప్రైవేటు వాహనాలు తిరగనివ్వమని చెప్పడం అహంకారానికి నిదర్శనం కాదా? అని అన్నారు.
లాఠీచార్జి తెలంగాణనా?
మెదక్‌ జిల్లా నార్సింగి వద్ద కరెంటు సమస్యపై ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీచార్జి కాదని, అమాయక, పేదలపై దాడి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. అసలు ఇది బంగారు తెలంగాణనా.. లాఠీచార్జి తెలంగాణనా అని నిలదీశారు. లాఠీ దెబ్బలతో గాయాలపాలైన బాధిత రైతులను గురువారం బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మెదక్‌ జిల్లా పార్టీ నేత రఘునందన్‌రావు పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి మీడియా ముందు చూపించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ‘‘నన్ను కొత్త బిచ్చగాడు అని అంటున్నాడు. అవును... మేము బిచ్చగాళ్లమే అనుకోండి.. సమస్యల గురించి అడుగుతున్నాం.. పరిష్కరించండి’’ అని అన్నారు. అసలు కేసీఆర్‌ నియంత పోకడతో కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు. రఘునందన్‌రావు, చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ తీరుపై విరుచుకుపడ్డారు. బాధిత రైతులు తమపై జరిగిన లాఠీచార్జి, తమ కష్టాలను బీజేపీ నేతలకు వివరించారు.

No comments:

Post a Comment