Wednesday 12 November 2014

Upper Caste People Are Foreigners

Upper Caste People Are Foreigners, Says Bihar Chief Minister Jitan Ram Manjhi

Upper Caste People Are Foreigners, Says Bihar Chief Minister Jitan Ram Manjhi

గులాబీ కారు స్టీరింగ్‌ నా చేతిలోనే.. - అసద్

గులాబీ కారు స్టీరింగ్‌ నా చేతిలోనే..

బ్రేకులు కూడా నా వద్దే!
ఎంఐఎంను దే శవ్యాప్తంగా విస్తరిస్తాం
కర్ణాటక, బెంగాల్‌, యూపీల్లో పోటీ: అసద్‌
 బ్రేకులు కూడా నా వద్దే
 ఎంఐఎంను దే శవ్యాప్తంగా విస్తరిస్తాం
 కర్ణాటక, బెంగాల్‌, యూపీలోనూ పోటీ చేస్తాం
 పాతబస్తీలో మెట్రో రూట్‌ మళ్లించాలి: అసదుద్దీన్‌ 

బర్కత్‌పుర/హైదరాబాద్‌: ‘‘గులాబీ కారు డ్రైవింగ్‌ సీటులో నేనే కూర్చున్నాను. స్టీరింగ్‌ నా చేతిలోనే ఉంది. బ్రేకులు కూడా నా చేతిలోనే ఉన్నాయి. కారులో ఉన్నవారిని క్షేమంగా తీసుకెళ్లడమే ముఖ్యం’’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. మంగళవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ యూనియన్‌ వర్కింగ్‌ జర్నలిస్టు (టీయూడబ్ల్యుజే) నేతలు విరాహత్‌ అలీ, ఈశ్వర్‌రెడ్డి, మాజీద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ఎంఐఎం టీఆర్‌ఎస్‌తో దోస్తీ కడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. గులాబీ రంగు కారులో కూర్చుంటున్నారు.. సౌకర్యంగా ఉందా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. గులాబీ కారు స్టీరింగ్‌ తన చేతిలోనే ఉందని అసదుద్దీన్‌ చమత్కారంగా మాట్లాడారు. మహారాష్ట్రలో తాము రెండు అసెంబ్లీ స్థానాలు గెలవగానే ఆకాశం ఊడిపడ్డట్టు ఎంఐఎంకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని, ఇది పద్ధతి కాదన్నారు. మహారాష్ట్ర స్ఫూర్తితో ఎంఐఎంను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నామని, కర్ణాటక, బెంగాల్‌, యూపీలలో కూడా తాము పోటీ చేస్తామని చెప్పారు. త్వరలో జరగనున్న ఢిల్లీ, జార్ఖండ్‌ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ముస్లింలను వేర్పాటువాదులుగా అవమానపరుస్తున్నారని, ప్రతి ముస్లిం భారతీయుడేనని స్పష్టం చేశారు. సంఘ్‌ పరివార్‌ మత ఘర్షణల వల్ల దేశంలోని ముస్లిం యువత భయాందోళనలకు గరువుతోందనీ, జైభీమ్‌, జైమీమ్‌ అన్న నినాదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీల అండతో దాడులకు వ్యతిరేకంగా, ముస్లింల అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షం వెళ్లితే తామూ పాల్గొంటామని ప్రకటించారు. పాతబస్తీని ఇస్తాంబుల్‌ వలే అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. హైకోర్టును మాత్రం అదే ప్రాంతంలో ఉంచాలని కోరారు. మెట్రోరైల్‌కు తాము వ్యతిరేకం కాదని, అయితే దారుషిఫా రూట్‌లో వివిధ మతకట్టడాలు ఉన్నాయని, బహదూర్‌పురా, కాలపత్తార్‌ వైపు మెట్రో రూట్‌ను మళ్లించాలని సూచించారు. ప్రసారభారతి చైర్మన్‌ సూర్యప్రకాశ్‌ను నిబంధనలకు విరుద్ధంగా నియమించారని ఆయన ఆరోపించారు.

Sunday 9 November 2014

వీరప్పన్ - పేదోళ్ల స్మగ్లర్‌

అయ్య.. పేదోళ్ల స్మగ్లర్‌  

ఒకప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించిన ఎర్రచందనం స్మగ్లర్‌ వీరప్పన్‌ కుటుంబం ఇప్పుడేం చేస్తోంది?తమిళనాడు- కర్నాటక ప్రభుత్వాలను గడగడలాడించిన ఆయన కుటుంబం ఇప్పుడెన్ని సమస్యలు ఎదుర్కొంటోంది? కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్‌ చేసినప్పుడు చేతులు మారిన రూ.100 కోట్లు వీరప్పన్‌కు చేరాయా? బయటి ప్రపంచానికి గజదొంగగా తెలిసిన వీరప్పన్‌ను గిరిపుత్రులు ఎందుకు దేవుడిగా కొలుస్తారు? ఒకప్పుడు వీరప్పన్‌కు నెలవుగా వున్న సత్యమంగళం అడవుల పరిస్థితేంటి? ఆంధ్రప్రదేశ్‌లోని ‘ఎర్రదొంగలు’ వీరప్పన్‌ అనుచరులేనా? ఎన్నో పార్టీల అండదండలు పొందిన వీరప్పన్‌ ఏ పార్టీ అభిమాని? నిత్యం వార్తల్లో నానుతూ సంచలనాలకు పెట్టింది పేరైన ఆ స్మగ్లర్‌ మృతి చెంది ఇప్పటికి పదేళ్లవుతోంది. ఈ సందర్భంగా వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి ఆంధ్రజ్యోతి చెన్నై ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.. వీరప్పన్‌ గురించి ఇదివరకు ఎన్నడు వెలుగులోకి రాని ఆసక్తికర విషయాలను చెప్పారు.. 

బయటి ప్రపంచానికి వీరప్పన్‌ అంటే హడల్‌. మీతో, పిల్లలతో ఎలా వుండేవాడు?

ఎవరైనా ఆయనతో 5 నిమిషాలు మాట్లాడితే ‘నిజంగా ఇతను వీరప్పనేనా, నిజంగా ఇవన్నీ చేస్తున్నాడా’ అని అనుకోకతప్పదు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. అబద్ధం చెప్పడం నచ్చదు. మాట ఇస్తే దానికి కట్టుబడి వుండాల్సిందే. తన కుమార్తెలంటే ఎంతో ప్రాణం. పెద్దమ్మాయికి వాళ్ల నాన్న కొంచెం గుర్తున్నాడేమో, చిన్న పాపకు అసలు తెలియదు. అమ్మాయికి 11 నెలలలు వచ్చేసరికే అడవిని వీడాను నేను. చిన్నదాన్ని నేరుగా చూడాలని తుదిశ్వాస వీడే వరకూ ఆయన ఎంత తపించారో గుర్తుకొస్తే కన్నీళ్లొస్తాయి. ఆఖరికి పాపను చూడకుండానే వెళ్లిపోయాడు మహానుభావుడు.
అడవి నుంచి ఎర్రచందనం, జంతువుల దంతాలు ఎలా తరలించేవారు?
నా పెళ్లి తరువాత స్మగ్లింగ్‌ చేయడం తగ్గింది. కాని వీరప్పన్‌ పేరు చెప్పుకొని చాలామంది ఆ పనులు చేసేవారు. ఎర్రచందనాన్ని కూలీలు, అటవీశాఖాధికారులు కూడా తీసుకెళ్లేవాళ్లు. వాళ్లకి సాధారణ మామూళ్లతో పాటు కమిషన్‌ కూడా వుండేది. అందువల్ల సాఫీగానే సాగిపోయేది.

వీరప్పన్‌ లేని జీవితం ఎలా వుంది? ఆయన పోయాక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?

ఆయన ఉన్నప్పుడు నాకు పెద్దగా సమస్యల్లేవు. ఏం జరిగినా, ఎలాంటి సమస్య వచ్చినా ఆయన చూసుకుంటారన్న ధైర్యం వుండేది. కానీ ఆయన చనిపోయాక నామీద ఐదు కేసులు బయటకు తీశారు పోలీసులు. ‘కసిపోక మసిపూసుకోవడం’ అంటారు కదా, అలా ఆయన్ని చంపినా కసి తీరక, ఆ కేసులన్నీ తోడారు. 1993 నుంచి 2004 వరకు నేను పోలీసుల కనుసన్నల్లోనే తిరిగా. అయినా పరారీలో వున్నానంటూ 22 వారెంట్‌లు జారీ చేశారు. 4 హత్య కేసులు పెట్టి అరెస్టు చేశారు. కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ కిడ్నాప్‌ సంఘటనలో డబ్బు తీసుకున్నట్లు కేసు పెట్టారు. 2008-2011 మధ్య కాలంలో మైసూర్‌, బెంగళూరు జైళ్లలో పెట్టారు. నెలకు 10 సార్లకు పైగా వాయిదాల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పారు. నానా రకాల చిత్రహింసలు పెట్టారు. ప్రస్తుతం వాటన్నిటి నుంచీ బయటపడి ఇప్పుడిప్పుడే సంఘంలో కలిసి బతుకుతున్నాను.
వీరప్పన్‌ కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడని ప్రచారం. కానీ మీరేమో సాధారణ ఇంట్లో వున్నారు..?
ఆ ప్రచారంలో 20 శాతమే నిజం. మిగిలినవన్నీ కట్టుకథలే. అయ్య (వీరప్పన్‌) అడవిలో వున్నప్పుడు అప్పట్లో లక్షా, రెండు లక్షలే సంపాదించేవాడు. ఆ డబ్బు కూడా తన సహచరులు, గిరిజనుల కుటుంబాలకే ఖర్చుపెట్టేవాడు. తన చేతికి డబ్బు రాగానే ఇంటికి వెయ్యి చొప్పున పంచేవాడు. అందుకే గిరిజనులంతా ఆయన కోసం ప్రాణమిస్తారు. ఆయనకంటూ పైసా మిగిల్చుకోలేదు. గిరిజనుల్లో హీరోయిజాన్ని మాత్రమే ఆశించారాయన. ఒకవేళ నిజంగా ఆయన సంపాదించివుంటే ఈ రోజు మాకీ కష్టాలెందుకు? ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాను.
అయ్య అసలెందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు?
ఆయనది తమిళనాడు-కర్నాటక సరిహద్దుల్లో వున్న గోపినాధం గ్రామం. ఆయన తండ్రి మునస్వామి అడవిలో చెట్లు నరికే కూలి. అయ్య పన్నెండేళ్ల వయసులో వుండగా వాళ్ల నాన్న తనతో పాటు అడవిలోకి తీసుకెళ్లాడట. అప్పటికే కర్నాటక అడవిలో సేవిక గౌండర్‌ అనే అడవిదొంగ వుండేవాడు. ఆయన క్రూరజంతువులను చంపి వాటి చర్మాలు, దంతాలు, గోళ్ల స్మగ్లింగ్‌ చేసేవాడు. అతన్ని పట్టుకోలేని పోలీసులు అడవిలోని కూలీలను తీసుకెళ్లి ఏవేవో కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టేవారట. అలాగే మా ఆయన్ని కూడా 12 ఏళ్ల ప్రాయంలోనే జైల్లో పెట్టారు. ఆ వయసులోనే ఆయన్ని నానా రకాలుగా హింసించారు. తన కొడుకు కనిపించడం లేదని మునస్వామి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. కొన్నాళ్లకు వారే వదిలేశారు. అప్పటి నుంచే ఆయనకు పోలీసులంటే మహా అసహ్యం, కోపం. వారిమీద పగ తీర్చుకోవడానికే అడవికి రాజయ్యాడు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడు. పెళ్లయిన కొత్తలో ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా చెప్పాడు. అడవుల్లోనే ముప్పయి అయిదేళ్లు రహస్యంగా ఉన్నాడాయన.
మీది లవ్‌ మ్యారేజ్‌ అని విన్నాను. నిజమేనా?
ఒక రకంగా లవ్‌ మ్యారేజ్‌ అని చెప్పొచ్చు. మరో రకంగా బలవంతపు మ్యారేజ్‌ అని కూడా చెప్పాలేమో! సింగాపూర్‌ ఊళ్లో ఆయన తొలిసారిగా నన్ను చూశాడట. అప్పటికి నా వయసు పదహారేళ్లు. ఆయనకు నలభై. మాది కూడా తమిళనాడు-కర్నాటక సరిహద్దు జిల్లా అయిన ధర్మపురి సమీపంలోని నెరప్పూర్‌ గ్రామం. నన్ను చేసుకుంటానని మా ఇంటికొచ్చాడాయన. అప్పటికి వీరప్పన్‌ సాధారణ అడవిదొంగ. మీడియాలో ఇంత ప్రచారం లేదు. మా అమ్మా నాన్న నన్ను ఇచ్చేందుకు అంగీకరించలేదు. దాంతో ఓ రోజు వచ్చిన ఆయన కోపంగా ‘‘మీ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్లి అయినా పెళ్లి చేసుకోగలను. కానీ మీకు చెప్పకుండా, మీ అనుమతి లేకుండా చేసుకోవడం ఇష్టం లేకనే ఇంతగా బతిమాలుతున్నాను. ఇక నా సహనం చచ్చిపోయింది. మర్యాదగా ఇస్తారా, లేక లేవదీసుకుపొమ్మంటారా?’’ అని బెదిరించాడు. అప్పటికే ఆయన నాతో చాలాసార్లు మాట్లాడాడు. లోపల కొన్ని సందేహాలున్నా, ఆ తరువాత నాకూ ఇష్టం ఏర్పడింది. మావాళ్లు చాలా తర్జనభర్జనల తరువాత 1990లో ఎట్టకేలకు ఆయన్నిచ్చి పెళ్లి చేశారు.
స్మగ్లింగ్‌ మానుకోవాలని మీరెప్పుడూ చెప్పలేదా?
ఎన్నోమార్లు చెప్పా. పెళ్లి కోసం నన్ను అడిగినప్పుడే మా నాన్నపెట్టిన మొదటి కండిషన్‌ అదే. ‘ముందు నువ్వు పోలీసులకు సరెండర్‌ అవ్వు. జైలు నుంచి వచ్చిన తరువాత నా కూతుర్నిచ్చి చేస్తా. ఇందుకోసం ఎన్నేళ్లయినా ఆగుతా’ అని ఆయన చెప్పారు. కానీ ‘కొన్నాళ్ల తరువాత మీరు చెప్పినట్లే సరెండర్‌ అవుతా’ అని ఆరోజు సర్ది చెప్పాడు. పెళ్లయిన తరువాత నేను కూడా ఆయనకు నచ్చచెప్పా. తమిళనాడు-కర్నాటకల్లో కాకుండా మరే రాషా్ట్రనికైనా వెళ్లి బతుకుదామని వేడుకున్నా. కానీ తనతో కలసి నడిచిన వారు అన్యాయమైపోతారని, తనను నమ్ముకున్న గిరిజనుల్ని పోలీసులు వదలరని, వారందరికీ ఓ మార్గం చూపిన రోజున ఆలోచిద్దామని సమాధానపరిచేవారు. మంచో చెడో ఒక మార్గంలో పడ్డాం కాబట్టి దానినే కొనసాగించాల్సిందే తప్ప, ఇప్పుడు ఆ రూటు మారితే పోలీసులు బతకనివ్వరని చాలాసార్లు మధనపడేవాడు.
పెళ్లి తరువాత మీరూ అడవికెళ్లిపోయారా?
1993 వరకూ ఆయనతో పాటే అడవిలో వున్నా. పెళ్లి అయ్యాక నన్ను పుట్టింట్లోనే వుంచాలని, ఆయన మాత్రం వచ్చి పోతుండాలని మొదట్లో అనుకున్నాం. కానీ ఆ తరువాత ఏమనుకున్నారో, ఏమో నన్ను కూడా సత్యమంగళం అడవులకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు మరో వందమంది అనుచరులు కూడా వుండేవారు. అడవి జీవితం అదో వింత అనుభూతి. కొండలు, గుహల్లో తలదాచుకునేవాళ్లం. అప్పుడప్పుడూ క్రూరజంతువులు కూడా కనిపించేవి. కానీ అవేవీ మా జోలికి వచ్చేవి కావు. తేనె, ఔషధ మొక్కలు, వేర్ల కోసం వచ్చేవారికి కనిపించకుండా తలదాచుకోవడం చాలా కష్టంగా అనిపించేది. ఎందుకంటే వాళ్లలో పోలీసు ఇన్ఫార్మర్లే ఎక్కువ. మమ్మల్ని గుర్తు పడితే చాలు, పోలీసులకు సమాచారం వెళ్లిపోయేది. కనీసం పొగకూడా రాకుండా వంట చేసుకునేవాళ్లం. అదెలాగన్నది రహస్యం, చెప్పకూడదు. ఓసారి నేను అయ్య పక్కనే వుండగానే పోలీసులు చుట్టుముట్టారు. చాలాసేపు ఇరువర్గాల మధ్య ఫైరింగ్‌ జరిగింది. మావాళ్లెవ్వరికీ ఏమీ కాలేదు గానీ కొంతమంది పోలీసులు మాత్రం చనిపోయారు.
అయ్య జంతువుల్లా అరిచేవాడంటారు. నిజమేనా?
అవును. ఎలా అబ్బిందో తెలియదుగానీ చాలా జంతువుల్లాగే ఆయన అరిచేవాడు. ఆయన అరుపుకి కొండముచ్చులు, జింకలు దగ్గరకొచ్చి ఆయనతో చాలా సన్నిహితంగా వుండటం నేను స్వయంగా గమనించాను. ఆ మిమిక్రీయే పోలీసుల చేతికి చిక్కకుండా ఆయన్ని చాలామార్లు కాపాడింది.
కొన్ని రాజకీయ పార్టీల అండ వున్న మాట నిజమేనా?
అదేం లేదు. డీఎంకే హయాంలో పోలీసులు ఓ మేరకే నడచుకునేవారు. కానీ జయలలిత ప్రభుత్వంలో పోలీసులకు సర్వాధికారులుంటాయి. నియంతృత్వ ధోరణితో వుంటారు. అయ్యను పట్టుకోవడం కోసం అడవికొచ్చిన పోలీసులు గిరిజన మహిళలపైనా, చిన్నపిల్లలపైనా అత్యాచారానికి పాల్పడేవారు. వారిని తీవ్రంగా హింసించేవారు. దీంతో ఆగ్రహించిన ఆయన.. ‘నువ్వూ ఆడదానివై వుండి, అమాయక ఆడవాళ్లపై ఎందుకు అత్యాచారాలు చేయిస్తున్నావు? నీకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా? ఈ పని చేయించడానికి సిగ్గుగా లేదా?’ అని మీడియాలో ప్రశ్నించాడు. బాధితుల విషయాన్ని వదిలేసిన జయ.. అయ్య ప్రకటన విషయాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. ఆయనపై కక్షగట్టారు. డీఎంకే వారే వీరప్పన్‌కు మద్దతుగా వున్నారని ప్రచారం చేయించారు. అప్పటి నుంచి ఆయనకు అండగా వుండే పార్టీ, వ్యతిరేక పార్టీ అని బయట ప్రచారం జరిగింది. నిజానికి వీరప్పన్‌ కాంగ్రెస్‌ అభిమాని. ఎందుకో ఆ పార్టీ అంటే ఆయనకు చాలాయిష్టం. అందుకే అప్పట్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌గౌడ్‌ కుమారుడు నరేంద్రకు మద్దతు ఇచ్చాడు. ‘‘నేను గెలిస్తే గిరిజన గ్రామాలన్నింటిలో రోడ్లు వేయిస్తా. వారి బాగు కోసం ఏమేం చేయాలో, అన్నీ చేస్తా’’ అని ఆయన అయ్య దగ్గర ఒట్టు వేశారు. దాంతో అయ్య అనుచరులు ఊరూరా తిరిగి ప్రచారం చేయాల్సొచ్చింది. బీజేపీ అభ్యర్థి గ్యారెంటీ విజయం అనుకున్న నియోజకవర్గంలో నరేంద్రను గెలిపించారు జనం. దాంతో అప్పటి సీఎం బంగారప్ప కూడా అయ్య వద్దకొచ్చి కృతజ్ఞతలు చెప్పారు. దీంతో బీజేపీ వారికి మా ఆయనపై కోపం ఏర్పడింది. అది కూడా ఆయన చావుకు కారణమై కూర్చొంది. అయితే గెలిచిన తరువాత నరేంద్ర ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. దాంతో ఆయన చాలా ఆగ్రహంతో వుండేవాడు. రాజకీయనేతల మాటలన్నీ ఇలానే వుంటాయని ఛీత్కరించుకునేవాడు.
పోలీసుల చేతిలో ఎంతమంది అత్యాచారానికి గురై వుంటారు?
వెయ్యిమందికి పైనే. వీరిలో అత్యాచారంతో పాటు తీవ్రంగా

శారీరక చిత్రహింసలకు గురైన వారు 200 నుంచి 300 మంది వున్నారు. జస్టిస్‌ సదాశివం కమిటీ కూడా ఈ విషయాన్ని నిగ్గుతేల్చి స్పష్టంగా ప్రకటించింది కదా!
ఆ బాధితుల కోసం మీరు పోరాటం జరుపుతున్నట్లున్నారు..?
ఆ బాధితులకు రూ.10 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని ఆనాడే నా భర్త అడిగాడు. నటుడు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్‌ చేసినప్పుడు ఆయన చేసిన డిమాండ్లలో ఇది కూడా ఒకటి. ఇందుకు తమిళనాడు-కర్నాటక ప్రభుత్వాలు ఆనాడు అంగీకరించాయి. తమిళనాడు ప్రభుత్వ కార్యదర్శి ఈ మేరకు సంతకం కూడా చేశారు. అయితే రెండు ప్రభుత్వాలు కలిపి ఇప్పటి వరకూ రూ.2 కోట్లా 25 లక్షలు మాత్రమే ఇచ్చాయి. మిగిలిన డబ్బు కూడా ఇస్తే ఈ విధి వంచితుల జీవితాలు బాగు పడతాయన్నది నా తాపత్రయం. అందుకోసమే ఈ నా పోరాటం.
ఆయన ఓ వందమందిని హతమార్చి వుంటాడా?
అయ్యయ్యో, అంతమంది వుండరు. 20 మంది ఉంటారేమో..!
ఒకసారి - మందుపాత్రలతో 22 మంది పోలీసుల్ని హతమార్చినట్లున్నాడు కదా?
దానిపై నేను మాట్లాడలేను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ పేలుడు వ్యవహారంలో బయటకు తెలిసిందంతా వాస్తవం కాదు. కొంతమంది ఇన్ఫార్మర్లను మాత్రం ఆయన చంపించాడు. ఎందుకంటే ఆయన్ని పట్టిస్తే అంత కోపం వుండేది కాదేమో. కానీ ‘ఫలానా వారికి వీరప్పన్‌ గురించి తెలుసు’’ అంటూ అమాయకుల్ని పోలీసులకు పట్టించారు. చిత్రహింసలు పాలైన తరువాత వారొచ్చి అయ్య కాళ్లమీద పడి ఏడ్చేవారు. అనుచరులకు, తనని నమ్ముకున్నవారికి ఏమైనా జరిగితే ఆయన తట్టుకోలేడు. అందుకే హత్యలకు పాల్పడ్డాడు. ఓసారి ఫారెస్ట్‌ అధికారులే జర్నలిస్టులమంటూ ఇంటర్వ్యూ కోసం అడవిలోకి మారువేషాల్లో వచ్చారు. ఆయనకు ఇచ్చిన బిస్కెట్లలో సెనేడ్‌ కలిపారు. అప్పుడాయన ఏం చేయాలి, మీరే చెప్పండి!
స్మగ్లింగ్‌తో వచ్చిన డబ్బంతా అడవిలోని గుంతల్లో దాచాడని చెబుతుంటారు. నిజమేనా?
అదంతా అబద్ధం. వచ్చిన డబ్బంతా అనుచరులకే ఖర్చు పెట్టేవాడు. అలా దాచిపెడితే మేమిలా ఎందుకుంటాం?
తన కుటుంబం భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోయాడంటారా?
ఆయనే కాదు. నేను కూడా ఆలోచించలేకపోయాను. అంతా సవ్యంగా సాగిపోతోందనుకున్నాం. ఓ రోజు నేను అడవిలో పోలీసులకు చిక్కాను. అప్పటి నుంచే నా జీవితం సర్వనాశనమైపోయింది. పోలీసులు నాపై టాడా కేసు పెట్టి, మూడేళ్లు జైల్లో పెట్టారు. చాలా అభ్యర్థనల తరువాత వదిలారు. ఆ తరువాత భర్త వున్నా లేనట్లే కూలీనాలీ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని బతికించుకోవాల్సి వచ్చింది.
అయ్య మీకు డబ్బు పంపేవాడు కాదా?
లేదు. అప్పట్లో ఆయనకు నామీద కోపం వుండేది. అయ్యను పట్టుకునేందుకు దేవారం బృందం అడవిని జల్లెడ పడుతుండేది. ఆ సమయంలో మహిళలపై పోలీసులు అత్యాచారం చేశారు. అప్పుడు కర్నాటక కోర్టులో పోలీసులకు వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. కానీ నేను భయపడి వారికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదు. దాంతో చాలామంది పోలీసులు బతికిపోయారు. అప్పటి నుంచి ఆయనకు నామీద చాలా కోపం. ఆ కోపంతోనే చాలాకాలం మా గురించి పట్టించుకోలేదు. తరువాత 2000 సంవత్సరంలో కలిశాను.
రాజ్‌కుమార్‌ కిడ్నాప్‌ వద్దని చెప్పలేదా?
నాకు ఆయనతో నేరుగా మాట్లాడటానికి అవకాశం లేకపోయింది. అందుకే రాజ్‌కుమార్‌ను వదలాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశా. రాజ్‌కుమార్‌ కిడ్నాప్‌ వ్యవహారం తమిళనాడు-కర్నాటక రాషా్ట్రల మధ్య చిచ్చుబెట్టింది. రెండు రాషా్ట్రల ప్రజలు దాడులు-ప్రతిదాడులకు దిగారు. దీంతో నేను విజ్ఞప్తి చేశా. తరువాత ఆయన్ని అడవిలో కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు కూడా బతిమాలను. రాజ్‌కుమార్‌ క్షేమంగా వున్నారో, లేదో చూపించాలని వేడుకున్నాను. రాజ్‌కుమార్‌ను దాచిన పొదకు దూరంగా నిలబెట్టి నాతో మాట్లాడారు. నిజానికి ఆయనకు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్‌ చేసేంత తెలివి లేదు. ‘తమిళ ఎళిర్చిపడై’ తీవ్రవాద సంస్థ నిర్వాహకుడు ముత్తుకుమారే ఇదంతా చేయించాడు. ఆ కిడ్నాప్‌ డబ్బు కోసమే చేసినట్లు ముందుగా నేను గ్రహించలేకపోయాను.
రాజ్‌కుమార్‌ను వదలడం కోసం వందకోట్లు చేతులు మారిందట కదా?
తమిళనాడు-కర్నాటక ప్రభుత్వాలు రూ.100 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఆ డబ్బు మధ్యలో చాలామంది చేతులు మారింది. వారంతా దొరికినకాడికి కాజేశారు. ఆయనకు చేరింది పదిశాతమే.
అందులో మీకూ కొంత చేరిందనీ...?
అందితే ఇలా ఎందుకుంటాం? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం!
అయ్యతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు?
2000 సంవత్సరంలో నేరుగా మాట్లాడాను. ఆ తరువాత క్యాసెట్ల ద్వారానే మాట్లాడుకునేవాళ్లం.
వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌ బూటకమని మీరు ఎలా చెప్పగలిగారు?
ఆయన నమ్మినబంటే మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. దాంతో స్పృహ కోల్పోయిన అయ్యను పట్టుకున్నారు పోలీసులు. చిత్రహింసలు పెట్టి అన్యాయంగా చంపేశారు. ఆ మజ్జిగ ఇచ్చిందెవరో నాకు తెలుసు. అయితే అయ్యను చంపుతారని అతను కూడా అనుకోలేదు. ‘పట్టిస్తే అరెస్టు చేసి జైల్లో పెడతాం, లేకుంటే టీం మొత్తాన్ని చంపేస్తాం’ అని అప్పటి ఐపీఎస్‌ అధికారి విజయకుమార్‌ బెదిరించారు. తన బాస్‌ చనిపోవడం కన్నా ప్రాణాలతో జైల్లో వుండటమే మంచిది కదా అన్న ఉద్దేశంతో ఆ అనుచరుడు మత్తుమాత్రలు ఇచ్చాడు.
ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసినట్లున్నారు కదా?
అవును. 2006లో పెన్నాగరం నియోజకవర్గంలో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశా. ఓట్లు బాగానే వచ్చినా ఓడిపోయాను. అప్పట్లో పీఎంకే-డీఎంకే కూటమి నేతలు నన్ను ప్రోత్సహించలేదు. ఇక రాజకీయాల్లోకి అయితే రాను.
వీరప్పన్‌ శిష్యులు ఇప్పటికీ టచ్‌లో వున్నారా?
లేదు. చాలామంది శిష్యులు చనిపోయారు. ఉన్న నలుగురైదుగురు సాధారణ జీవితం గడుపుతున్నారు.
వీరప్పన్‌ మీసం చాలా ప్రత్యేకం. దానికేమైనా కారణం వుందా?
(గర్వంగా) ఆ మీసం స్టయిల్‌ అంటే ఆయనకు చాలా యిష్టం. ఆ మీసంతో ఆయన చాలా గుంభనంగా కనిపించేవారు. కానీ పోలీసులు ఆయన్ని హత్య చేసినప్పుడు ఆ మీసాన్ని కూడా తొలగించి శవాన్ని మీడియాకు చూపించడం దుర్మార్గం.
‘వనయుద్ధం’ అనే సినిమాపై ఏదో కేసు వేసి, నష్టపరిహారం కూడా భారీగానే అందుకున్నట్లున్నారు?
అవును. ఆ సినిమాలో అంతా ఏకపక్షంగా చూపించారు. వీరప్పన్‌ని విలన్‌గా చిత్రీకరించారు. నాణేనికి రెండువైపులా చూపితే నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక వైపే చూపించారు. వీరప్పన్‌తో పాటు పోలీసులదీ తప్పుంది. అలాంటప్పుడు ఇద్దరి తప్పూ చూపించాలి కదా! దానిపై నేను సుప్రీంకోర్టు వరకూ వెళ్లా. కోర్టు కూడా నా వాదనే న్యాయమని చెప్పింది. రూ.25 లక్షలు నష్టపరిహారంగా ఇప్పించింది. అందులో లాయర్లకే చాలాపోయింది. మిగిలింది నేను కేసుల నుంచి బయటపడేందుకు ఖర్చు చేశా.
మీ ఇద్దరమ్మాయిలు ఏం చేస్తున్నారు?
పెద్దమ్మాయి విద్యారాణి ఐఏఎస్‌ కావాలనుకుంది. కానీ మధ్యలో ఎవరినో ప్రేమించి వెళ్లిపోయింది. తన తండ్రి వల్ల నేనెన్ని కష్టాల పాలయ్యానో ఆమెకు తెలుసు. నా ఇద్దరు బిడ్డల్ని బతికించుకునేందుకు నేనెంత నరకం అనుభవించానో కూడా తెలుసు. కానీ ఆమె అన్నీ మరచి, నన్ను వదిలేసి తనదారి తను చూసుకుంది. ఆమెకు మాతో సంబంధాలన్నీ తెగిపోయాయి. రెండో అమ్మాయి నా దగ్గరే వుంటోంది. ఇంగ్లీ్‌ష్‌ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది.
వీరప్పన్‌ అడవిదొంగగానే ప్రపంచానికి తెలుసు. కానీ మీరేమో ఆయన్ని ‘అడవి తల్లిని కాపాడిన ముద్దుబిడ్డ’గా ప్రచారం చేస్తున్నారు?
అయ్య కేవలం దొంగే అయితే ఆయన కోసం అన్ని వందలమంది ప్రాణాలిచ్చేవారా? పోలీసులు తమ శీలాన్ని దోచుకున్నా, హింసించినా అంతమంది మహిళలు నోరు విప్పలేదే! ఎందుకని? ఆయన మంచి చేయబట్టే కదా? అడవిలో ఎండిపోయిన, కాలం తీరిన వృక్షాలనే ఆయన నరికించి వ్యాపారం చేశారు. అది కూడా చాలా తక్కువ మోతాదులో. చనిపోయిన వన్య ప్రాణుల శరీర భాగాలనే అమ్ముకున్నారు. అంతమాత్రాన ఆయన మంచివాడని నేను చెప్పడం లేదు. ఆయన వున్నప్పుడు గిరిజనుల కుటుంబాలు పచ్చగా వున్నాయి, అటవీశాఖాధికారులు కూడా భారీగా మామూళ్లు తీసుకునేవారు. వీరప్పన్‌ ఉన్నాడన్న భయంతో ఎవ్వరూ సత్యమంగళం అడవుల వైపు కన్నెత్తి చూసేవారు కాదు. కానీ ఇప్పుడు చూడండి, గొడ్డలి పట్టినవాడల్లా ఎర్రచందనం చెట్లను ఎలా నరుకుతున్నాడో! అడవితల్లిని ఎలా ముక్కలుముక్కలు చేసేస్తున్నారో.. వెళ్లి చూడండి మీకే తెలుస్తుంది. ఆ అడవితల్లి అప్పుడెలా వుంది, ఇప్పుడెలా వుంది? ఆ ఒక్క తేడా గమనిస్తే చాలు.
తిరుమల అడవుల్లో కూడా వీరప్పన్‌ అనుచరులు పని కానిచ్చేస్తున్నారనీ..! మీకేమైనా తెలుసా?
తిరుమల అడవుల్లోకి వీరప్పన్‌ అనుచరులు జొరబడ్డారని, వారే ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారని ఏపీ మంత్రి ఒకరు చెప్పినట్లు నేను కూడా విన్నాను. అయ్యా మంత్రిగారూ! ఆంధ్రప్రదేశ్‌లోకి మా ఆయనే అడుగు పెట్టలేదు, ఇక ఆయన అనుచరులెలా వస్తారు? ఆయన అనుచరుల్లో 95 శాతం మంది ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. మిగిలిన 5 శాతంలో చాలామంది చేపలవేటతో ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇంకొంతమంది జైళ్లలో వున్నారు. తిరుమల వైపు వీరప్పన్‌ అనుచరులెవ్వరూ రాలేదు. మొదటి నుంచీ ఇదే జరుగుతోంది. తప్పుడు పనులకు పాల్పడే ప్రతివాడూ వీరప్పన్‌ పేరునే వాడుకుంటున్నాడు. ఇప్పుడూ అదే జరుగుతోంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. ఎక్కడే తప్పు జరిగినా వీరప్పన్‌పై వేయడం ఫ్యాషనైపోయింది. ఎక్కడైనా స్మగ్లింగ్‌, దొంగతనం జరిగినా ఆ వ్యక్తిని వీరప్పన్‌తో పోలుస్తున్నారు. అయ్యా! వీరప్పన్‌ తప్పులు చేశాడు. కానీ ఆ తప్పుల వెనుక ఎన్నో వందల కుటుంబాలకు ఆశ్రయం వుంది.
అయ్యకు గుడి కట్టాలనుకుంటున్నారా?
గుడి కాదు గానీ స్మారకమందిరం కట్టాలన్న ఆలోచన వుంది. ఆయన్ని పోలీసులు ఎప్పుడు హతమార్చారో తెలియదుగానీ, అక్టోబర్‌ 18వ తేదీన మీడియాకు చూపించారు. అందువల్ల దానినే ఆయన వర్ధంతిగా భావిస్తున్నాం. ఆరోజున మూలక్కాడులోని ఆయన సమాధివద్ద ప్రత్యేక పూజలు జరుపుతున్నాం. వందలమంది గిరిపుత్రులు ఆరోజున అయ్య సమాధివద్దకు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. స్మారకమందిరం కట్టాలన్నది వారి ఆలోచనే. అయితే ఆ సమాధి వున్న ప్రాంతం రెవెన్యూశాఖ ఆధీనంలో ఉన్న కారణంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదు.
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌
(తమిళనాడులోని కుళ్లమడనూరు నుంచి)

నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని ఇదే!

నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని ఇదే!
ప్రకాశం బ్యారేజీ నుంచి అనంతవరం..
బోరుపాలెం నుంచి ఆటోనగర్‌ వరకు గుంటూరు జిల్లాలోనే కేంద్రీకృతం
  

రాజధాని పరిధిలోకి కొత్తగా పది గ్రామాల చేరిక
మొత్తం గ్రామాల మధ్య దూరం 53 కిలోమీటర్లు
చుట్టూ 3 రింగురోడ్లు
సరిహద్దులు ఖరారు
హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపించా.. ఇక్కడా చేస్తాను
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన
హద్దులు ఖరారు చేసిన చంద్రబాబు.. అధికారికంగా ప్రకటన
భూమి ఇచ్చిన రైతుకే తొలి ప్రయోజనం.. 
ఏసీ గదుల్లో కూర్చునేలా చేస్తా.. హైదరాబాద్‌లాగే అభివృద్ధి చేస్తా.. నాకు రైతులపై, వారికి నాపై విశ్వాసం ఉంది
అందరితో మాట్లాడతా.. అవసరమైన మార్పులు చేస్తా.. ఇళ్లు లేని వారికి శాశ్వతంగా ఇళ్లు కట్టించి ఇస్తా.. నది ఒడ్డునే కమర్షియల్‌ స్థలాలిచ్చే యోచన
ఏడాదిలోపు ప్రత్యామ్నాయ భూమి సర్టిఫికెట్లు.. చిన్న రైతులకు ఒకే చోట షాపులు కట్టించే యత్నం.. భూములు అమ్ముకోకుండా ఉంటేనే లాభం

భూ సమీకరణ విధానంపై చంద్రబాబు.. వన్‌ టైం సెటిల్మెంట్‌గా రుణ మాఫీ.. పండ్ల తోటల రుణాలూ మాఫీ.. రాజధాని రైతులకు మాత్రమే వర్తింపు
విజయవాడ వెళ్లారా!? కనక దుర్గమ్మను దర్శించుకుని ప్రకాశం బ్యారేజీ చూశారా!? ఇప్పుడు ఆ కనక దుర్గమ్మ పాదాల చెంత.. కృష్ణా నది ఒడ్డు నుంచి నవ్యాంధ్ర రాజధాని ప్రారంభమవుతుంది! ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత ఉండవల్లి నుంచి మంగళగిరి ఆటోనగర్‌ వై జంక్షన్‌ (ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి) వరకూ తూర్పు సరిహద్దు! అక్కడి నుంచి పెదపరిమి వరకూ దక్షిణం సరిహద్దు! పెదపరిమి నుంచి వడ్డమాను వరకూ కొన్ని గ్రామాల పరిధిలో పశ్చిమ సరిహద్దు! తుళ్లూరు మండలం బోరుపాలెం నుంచి కరకట్ట మీదుగా ప్రకాశం బ్యారేజీ వరకూ ఉత్తరం సరిహద్దు! ఇదే.. నవ్యాంధ్ర రాజధాని! ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. రాజధాని మొత్తం గుంటూరు జిల్లాలోనే కేంద్రీకృతమైంది! రాజధాని చుట్టూ మూడు రింగురోడ్లు నిర్మించనున్నారు. మరోవైపు అపోహలు తొలగి రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తామంటూ రైతులు ముందుకు వస్తున్నారు! గ్రామాలకు గ్రామాలే హామీ పత్రాలు రాసి ఇస్తున్నాయి! కాబోయే రాజధాని తుళ్లూరులో కాంగ్రెస్‌ నేతల పర్యటనను నిరసిస్తూ.. రైతులు ‘గో బ్యాక్‌’ అంటూ ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్‌, నవంబర్‌ 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అధికారికంగా తేలిపోయింది! హద్దులు ఖరారయ్యాయి! గుంటూరు జిల్లాలోనే రాజధాని కేంద్రీకృతం కానుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ‘‘ఉత్తరదిశలో కృష్ణా నది ఒక హద్దుగా ఉంటుంది. బోరుపా లెంనుంచి ప్రకాశం బ్యారేజీవరకు 18 కిలోమీటర్ల హద్దుగాఖరారుచేశాం. బ్యారేజీ నుంచి ఆటోనగర్‌ వై జంక్షన్‌ వరకు 10 కిలోమీటర్లు తూర్పు సరిహద్దు. వై జంక్షన్‌ వద్ద బ్యారేజీ నుంచి వచ్చే రోడ్డు, కనక దుర్గమ్మ వారధి నుంచి వచ్చే రోడ్డు కలుస్తాయి. ఇది జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. బోరుపాలెం నుంచి అనంతవరం మీదుగా 8 కిలోమీటర్లు పశ్చిమ సరిహద్దు. ఇన్నర్‌ రింగు రోడ్డులో ఎనిమిదో కిలోమీటరు రాయివద్ద ఈ హద్దు ముగుస్తుంది. వై జంక్షన్‌ నుంచి 16 కిలోమీటర్ల పొడవునా దక్షిణ సరిహద్దు ఉంటుంది. ఈ హద్దుల పరిధిలో 30వేల ఎకరాలున్నాయి’’ అని సీఎం వివరించారు. శనివారం తన నివాసంలో రాజధాని నిర్మాణ కమిటీ సమావేశం సందర్భంగా రాజధాని సరిహద్దులను తేల్చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
రైతుకు నాదీ పూచీ!
‘‘రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు తొలి ప్రయోజనం. వారి తర్వాతే ఎవరైనా! ఇదే నా లక్ష్యం. దానికి నాది పూచీ’’ అని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో సైబరాబాద్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంవల్ల అన్ని ప్రాంతాల్లో భూముల రేట్లు పెరిగి అనేకమంది లాభపడ్డారు. ఎక్కడ ఏది చేసినా అందరికీ సమానంగా వర్తించే విధానాన్నే పెట్టుకొంటానని వివరించారు. ఇక్కడ కూడా వ్యవసాయంపై వచ్చేదానితో పోలిస్తే అదనంగా అధిక ఆదాయం వచ్చే అవకాశం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ‘‘మట్టి పిసుక్కొనే రైతులు ఏసీ గదుల్లో కూర్చునే రోజులు వస్తాయి. ఎవరూ, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. నాకు వారిపై నమ్మకం ఉంది. వారికి నాపై నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. అది చాలు’’ అన్నారు.
ప్రపంచస్థాయి నగరం కోసమే...
రాజధాని నిర్మాణానికి ఇంత భూమి ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారని, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉండాలో లేదో తేల్చుకోవాలన్నారు. ‘‘న్యూఢిల్లీ విశాలమైన రోడ్లతో చాలా అందంగా ఉంటుంది. దాన్నిమించిన రాజధాని నిర్మిస్తామని ప్రధాని మోదీ గతంలో ప్రకటించారు. స్మార్ట్‌ సిటీల నిర్మాణానికీ కేంద్రం యత్నిస్తోంది. తదనుగుణమైన ప్రణాళికతో మనం వెళ్లాలి. ప్రపంచ స్థాయి మౌలిక వసతులుంటే అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు తీస్తుంది. భూముల విలువ బాగా పెరుగుతుంది. దీనివల్ల లాభం పొందేది రైతులే’’ అని వివరించారు. తమ వాళ్లను పంపించి రైతులతో మాట్లాడి ఇంకా ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపారు. ‘భూ సమీకరణ ప్రాంతంలో ఇళ్లు లేనివారికి శాశ్వత ఇళ్లు నిర్మించి ఇస్తాం. రుణమాఫీలో భాగంగా, రాజధాని గ్రామాల్లో రైతులకు రూ.లక్షన్నర వరకూ వన్‌టైం సెటిల్మెంట్‌ కింద పరిష్కరిస్తాం. వీలైనంత త్వరగా మౌలిక వసతుల కల్పన మొదలు పెడతాం. దానివల్ల స్థలాల ధరలు త్వరగా పెరుగుతాయి. పంటలవారీ పరిహారం గురించి ఆలోచిస్తాం. న ది ఒడ్డున విలువైన భూములు న్నవారికి అక్కడే కమర్షియల్‌ స్థలాలివ్వడంపై పరిశీలిస్తాం. ఆదాయపు పన్నుపై కేంద్రంతో మాట్లాడాలి. ఏడాదిలోపు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు సర్టిఫికెట్లు ఇస్తాం. ఈలోపు రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, విద్యుత్‌ లైన్లు వంటివి వేసేస్తాం. మౌలిక వసతులతో కంపెనీలు వస్తాయి. అర ఎకరం, పావు ఎకరం భూమి ఉన్న కొందరు చిన్న రైతులకు ఒకేచోట భూమి ఇచ్చి షాపులు కట్టించడంపైనా ఆలోచిస్తున్నాం. వారికి కొంత డబ్బు కూడా ఇస్తాం’’ అని వివరించారు. ఖరారైన హద్దుల పరిధిలో 29 గ్రామాల భూములున్నాయన్నారు. కొన్ని గ్రామాల్లో 50-100 ఎకరాలు మాత్రమే రాజధాని పరిధిలోకి వస్తాయని తెలిపారు.
గ్రామాల్లోని ఇళ్ల జోలికి, చెరువుల జోలికి వెళ్లడంలేదన్నారు. ‘‘రాజధాని పరిధిలో భూమి లేనివారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి మంచి ఉపాధి దొరికేలా చేస్తాం. రైతులూ పనులు మొదలయ్యేవరకూ వ్యవసాయం చేసుకోవచ్చు. రాజధాని అథారిటీకి నేనే అధ్యక్షుడిని. రైతులకు ఏం కావాలో తెలుసు. నన్ను నమ్మండి. ప్రతివారికీ న్యాయం జరుగుతుంది’’ అని చంద్రబాబు వివరించారు. రాజధాని పరిధిలో ఎవరైనా భూములు అమ్ముకొంటామంటే అభ్యంతరపెట్టబోమని, కానీ, ఉంచుకొంటేనే లాభమన్నది తన సలహా అని ఆయన చెప్పారు. గుంటూరు - విజయవాడ మధ్య అసలు రాజధానినే పెట్టవద్దని వాదించి అడ్డుపడాలని చూసినవారు.. ఇప్పుడు రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, వారి ఆలోచనలను గుర్తించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
‘‘రాషా్ట్రనికి మధ్యలో ఉందని విజయవాడ-గుంటూరును రాజధాని కేంద్రంగా ఎంపిక చేశాను. రాజధాని రాకూడదని ప్రయత్నం చేసినవారు ఇప్పుడు భూములు పోతాయని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అడవుల్లో పెట్టాలని కొందరు.. వారి ఇళ్లవద్ద పెట్టాలని మరికొందరు నాకు చెప్పారు. దొనకొండ వద్ద పెట్టాలంటూ రాయబారాలూ నడిపారు. కానీ, 13జిల్లాల అభివృద్ధికి ప్రణాళికతో పనిచేస్తున్నాను’’ అని వివరించారు. ఇక రాజధాని ప్రాంతంలో పండ్ల తోటల రుణాలనూ మాఫీ చేయాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. కాగా, అధికారంలోకి వచ్చాక పండ్ల తోటలను రుణమాఫీ జాబితానుంచి తొలగిస్తూ ప్రత్యేక జీవో జారీచేశారు. దీంతో తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని పండ్లతోటల రైతులు సీఎంను ఎలా నమ్మాలని ప్రశ్నించసాగారు. దీనిపై నిఘావర్గాల సమాచారంతో 25 వేలమంది రైతులకు రూ.10కోట్లవరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
చుట్టూ 3 రింగ్‌ రోడ్లు
నవ్యాంధ్ర రాజధాని నగరం చుట్టూ మూడు రింగ్‌ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని చుట్టూ 75 కి.మీ. విస్తీర్ణంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, 120 కి.మీ. వ్యాసంతో మధ్య రింగ్‌ రోడ్డు, 200 కి.మీ. వ్యాసంతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తారు. రాజధానికి చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు విస్తరించి అభివృద్ధి విస్తరించే నిమిత్తం ఈ మూడు రింగ్‌ రోడ్లను నిర్మించాలని తలపెట్టారు.
తాడేపల్లిలోని గ్రామాల చేర్పు .. మొత్తం గ్రామాల మధ్య దూరం 53 కిలోమీటర్లు
(గుంటూరు - ఆంధ్రజ్యోతి)
నవ్యాంధ్ర రాజధాని మొత్తం గుంటూరు పరిధిలోనే ఉండడం ఖరారైంది! ఇప్పటికే రెండు మండలాల్లోని 19 గ్రామాలను ప్రకటించిన ప్రభుత్వం.. మరో పది గ్రామాలను కలిపి రాజధాని పరిధిని మరింత విస్తరించింది. దీంతో, గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలంలోని పలు గ్రామాలు రాజధాని పరిధిలోకి వచ్చి చేరాయి. 
హద్దులు ఇవే!

తూర్పు హద్దుగా ప్రకాశం బ్యారేజీ నుంచి వై జంక్షన్‌ (ఎన్‌ఆర్‌ఐ హాస్పటల్‌) వరకు 10.5 కిలోమీటర్లు. అక్కడి నుంచి దక్షిణం హద్దుగా పెదపరిమి వరకు సుమారు 16.5 కిలోమీటర్లు. అక్కడి నుంచి పడమరగా బోరుపాలెం వరకు సుమారు 8 కిలోమీటర్లు. బోరుపాలెం నుంచి తిరిగి ప్రకాశం బ్యారేజ్‌ వరకు సుమారు 18 కిలోమీటర్ల మేర ఉత్తర హద్దుగా నిర్థారించారు. ఈ హద్దుల్లోని మొత్తం గ్రామాల మధ్య దూరం 53కిలోమీటర్లు.
తూర్పు హద్దు గ్రామాలు..
రాజధాని తూర్పు హద్దుగా నిర్ణయించిన ప్రాంతం 10.5 కిలోమీటర్ల పరిధిలో ప్రకాశం బ్యారేజ్‌ నుంచి వై జంక్షన్‌ ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి వరకు ఉండనుంది. దీని పరిధిలో ఉండవల్లి, పెనుమాక, పాత కృష్ణనగర్‌ పంచాయతీ, నవులూరు, యర్రబాలెం గ్రామాలున్నాయి. ఇవి మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఉన్నాయి.
దక్షిణం హద్దు గ్రామాలు..
దక్షిణం హద్దు వై జంక్షన్‌ నుంచి పెదపరిమి వరకు 16.5 కిలోమీటర్ల మేర నిర్ణయించారు. ఈ పరిధిలో నిడమర్రు, శాఖమూరు, కురగల్లు, నీరుకొండ, ఐనవోలు, నేలపాడు, తుళ్లూరు గ్రామాలున్నాయి. ఇవన్నీ మంగళగిరి, తుళ్లూరు మండలాల పరిధిలోనివే.
పడమర హద్దు గ్రామాలు..
రాజధానికి పడమర హద్దుగా పెదపరిమి నుంచి బోరుపాలెం వరకు దాదాపు 8 కిలోమీటర్లు హద్దు నిర్ణయించారు. బోరుపాలెం- పెదపరిమి గ్రామాల మధ్యలో అనంతవరం, నెక్కలు, వడ్డమాను, దొండపాడు గ్రామాలున్నాయి. ఇవి తుళ్లూరు మండల పరిధిలోవి.
ఉత్తరం హద్దు
రాజధానికి ఉత్తరం హద్దుగా బోరుపాలెం నుంచి ప్రకాశం బ్యారేజ్‌ వరకు కరకట్ట వెంబడి 18 కిలోమీటర్ల మేర పరిధిని నిర్ణయించారు. ఈ హద్దులో అబ్బరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, మందడం, మోదలింగాయపాలెం, కృష్ణాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, వెంకటపాలెం, ఉండవల్లి గ్రామాలున్నాయి. ఇవన్నీ తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని గ్రామాలు.
ఆ పది గ్రామాలు ఇవే !
తుళ్లూరు మండలంలో...
తుళ్లూరు మండలంలో కొత్తగా మూడు గ్రామాలు చేరాయి. అనంతవరం, పెదపరిమి, వడ్డమాను గ్రామాలు కొత్తగా చేరిన వాటిలో ఉన్నాయి. గతంలో ఈ మండలంలోని 16 రెవెన్యూ గ్రామాలు రాజధాని పరిధిలో ఉన్నాయి. కొత్తగా కలిపిన వాటితో కలిపి ఈ సంఖ్య 19 రెవెన్యూ గ్రామాలకు చేరింది.
మంగళగిరి మండలం పరిధిలో!
మంగళగిరి మండల పరిధిలోని నాలుగు గ్రామాలు కొత్తగా రాజధాని పరిధిలోకి చేరాయి. యర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, బేతపూడి ఇందులో ఉన్నాయి.
తాడేపల్లి మండలం పరిధిలో...
తాడేపల్లి మండల పరిధిలోని మూడు గ్రామాలు ఉండవల్లి, పెనుమాక, పాత కృష్ణనగర్‌ పంచాయతీ (నులకపేట, డోలాస్‌ నగర్‌) కొత్తగా రాజధాని పరిధిలోకి చేరాయి. గతంలో ఈ మండలంలో ఒక్క గ్రామం కూడా లేదు.

Thursday 6 November 2014

8 నుంచి నవ్యాంధ్ర రాజధాని భూ సమీకరణ

ఈనెల 8 నుంచి నవ్యాంధ్ర రాజధాని భూ సమీకరణ
ఒక వేళ రైతులు అంగీకరించకపోతే వేరేచోటుకి..
- ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మంత్రి పత్తిపాటి పుల్లారావు
  

విజయవాడ, నవంబర్‌ 6 : ఈ నెల 8వ తేదీ నుంచి నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని భూ సేకరణ ప్రక్రియ ప్రాంభం అవుతుందని భూ సమీకరణ సభ్యుడు, ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రైతులను ఒప్పించి భూ సమీకరణ చేస్తామని, భూమిని గ్రేడ్ల వారిగా విభజించి రైతులకు పరిహారం అందిస్తామని ఆయన అన్నారు. 8వ తేదీని భూ సేకరణ కమిటీ గ్రామాల వారీగా రైతులతో సమావేశం అవుతుందని మంత్రి చెప్పారు. రైతులతో తమ సమావేశాలు ముగిసిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా గ్రామాలకు వస్తారని మంత్రి తెలిపారు.
 
నవ్యాంధ్ర రాజధానిపై సందేహాలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలంలో ఉన్న మొత్తం 18 గ్రామాలను ఎంపిక చేసింది. అయితే ఈ గ్రామాల రైతులకు భూ సమీకరణ కింద భూమి ఇవ్వాల్సిన రైతులకు-ప్రభుత్వానికి మధ్య కొంత సమయం (గ్యాప్‌) రావడంతో గ్యాప్‌ ఎందుకు వచ్చిందని గత మూడు రోజుల నుంచి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి బృందం ఆ గ్రామాల్లో పర్యటిస్తే విసదమవుతుందని.. మరోవైపు మెట్ట భూమిని ఇస్తామన్న రైతుల న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం పరిష్కరించడంలేదని ఆందోళన వారిలో కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలు కూడా రైతుల్లో గందరగోళం నెలకొంది... తుళ్లూరులో 5 గ్రామాల్లో రైతులు తమ భూములకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని, దానికి సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వని పక్షంలో భూములు ఇచ్చేది లేదని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిపై ఏబీఎన్‌ కూడా కథనాలు ప్రసారం చేసింది.
 
ఈ సందర్భంగా గురువారం మంత్రి పత్తిపాటి పుల్లారావు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో ఎక్స్‌క్లూసివ్‌గా మాట్లాడుతూ... భూ సేకరణకు సంబంధించి ఇంతవరకు గ్రామాల్లో ఏ రైతులతోనూ మాట్లాడలేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం సబ్‌ కమిటీ వేసిందని, రైతుల డిమాండ్లు ఏమిటన్నదానిపై ఒకటికి రెండు సార్లు రైతులతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి రైతుల ఆలోచనలు తెలుసుకుంటామని, 8వ తేదీ సాయంత్రం కేబినెట్‌ సబ్‌ కమిటీ రైతులతో సమావేశం జరిగే విధంగా ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యుడు శ్రావణ్‌కుమార్‌ను కోరామని పత్తిపాటి తెలిపారు.
 
రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి అనేక ఒత్తిడులు ఉన్నా అన్ని విధాటా బాగుంటుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తుళ్లూరు వద్ద రాజధాని ఎంపిక చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.ప్రతిపక్షాలు కావాలని రాజధానిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ విషయం రైతులు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. రైతులను అన్ని విధాల సంతృప్తి పరుస్తామని ఆయన అన్నారు. దేశంలో నెంబర్‌ వన్‌ రాజధానిగా చేయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారని ఆ విధంగా ముందుకు వెళతామని మంత్రి తెలిపారు.
భూములు ఇస్తామన్న 10 గ్రామాల్లో తొలి దశలో 20 వేల ఎకరాల భూ సేకరణ జరుపుతామని, ఒక వేళ రైతులు అంగీకరించకపోతే రాజధాని వేరేచోటుకు వెళుతుందని, అందుకు ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భూ సేకరణ కమిటీలో తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్‌ ఉన్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు కూడా గురువారం తనతో మాట్లాడారని, రైతుల డిమాండ్లు పరిశీలించాలని ఆదేశించినట్లు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. భూ సేకరణను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

తుది దశకు రుణ మాఫీ!

తుది దశకు రుణ మాఫీ!  
  అర్హుల వివరాలు నేడు ఆన్‌లైన్‌లో.. మొత్తం రైతులు 81 లక్షలు
 అర్హులు 49.37 లక్షలు..సమగ్ర వివరాల్లేనివారు 31.63 లక్షలు
 స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అమలు చేస్తే 15 లక్షల మందికే లబ్ధి
 పది రోజుల్లో మరో ఏడు వేల కోట్లు

(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్‌లో రుణ మాఫీ పథకం అమలు తుది దశకు చేరింది. రుణ మాఫీ వర్తించే రైతుల వివరాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈనెల ఐదో తేదీ నే ఆ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని భావించింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు బెంగళూరు పర్యటనలో ఉండడంతో ఒక్కరోజు వాయిదా వేసింది. రుణ విముక్తి పథకానికి అర్హుల జాబితాను గురువారం ఆన్‌లైన్‌లో ఉంచ బోతోంది. రుణ మాఫీ పథకం కింద తాము అర్హులమో కాదో చూసుకోవడానికి www.ap.gov.nic.in అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. రుణ మాఫీ పథకంలో అర్హులను గుర్తించడానికి బ్యాంకులు సుదీర్ఘ కసరత్తు చేశాయి. బ్యాంకుల నుంచి లబ్దిదారుల సమాచారం రాబట్టడానికి నెలన్నర రోజులుగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వ వర్గాలు ఎట్టకేలకు వాటన్నింటినీ తెప్పించగలిగాయి. వాటిలో కొన్ని సమగ్రంగా.. మరికొన్ని అసమగ్రంగా ఉన్నా.. అన్నిటినీ కలిపి ఆన్‌లైన్‌లో పెట్టాలని నిర్ణయించారు. అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచిన తర్వాత వాటన్నింటినీ మళ్లీ బ్యాంకుల్లోనూ ఉంచుతారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యాలయాల వద్ద నోటీసు బోర్డుల్లో అంటిస్తారు. కాగా, బ్యాంకుల నుంచి లక్షన్నర రూపాయలలోపు రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 81 లక్షలు. కాగా.. వారిలో 49.37 లక్షల మంది అర్హులుగా తేలారు. మిగిలిన 31,63,000 మంది రైతుల వివరాలు సక్రమంగా లేవు. రుణమాఫీ అమల్లో భాగంగా ప్రభుత్వం ఆధార్‌, రేషన్‌ కార్డులు, భూ వివరాలు, పట్టాదారు పాసు పుస్తకం, కుటుంబం తదితర సమగ్ర వివరాలు పరిగణనలోకి తీసుకుంది. వాటి ఆధారంగా అర్హుల వివరాలను సేకరించి.. వాటిని క్రోడీకరించి జాబితాను రూపొందించింది. మొత్తంమీద ఎటువంటి వివరాలూ లేని రైతులు 5,82,703 మంది ఉన్నారు. ఆధార్‌, రేషన్‌ కార్డులు లేని రైతులు 15,13,272 మందిగా లెక్క తేలారు. ఆధార్‌ లేకుండా రేషన్‌ కార్డులు ఉన్నవారు 2,47,185గా గుర్తించారు. ఇక, ఆధార్‌ ఉండి రేషన్‌ కార్డులు లేని రైతులు 7,20,401 మంది తేలారు. సమగ్ర వివరాలను క్రోడీకరించి లెక్కతేల్చగా అన్ని వివరాలూ ఉన్న రైతు కుటుంబాల సంఖ్య 20 లక్షల నుంచి 25 లక్షలుగా అంచనా వేశారు. వీటిలో కూడా రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (రుణసూచి)ను వర్తింపజేస్తే 15 లక్షల కుటుంబాలే అర్హులుగా తేలనున్నాయి. ఈ వివరాలన్నిటినీ పంచాయతీ కార్యాలయాల వద్ద నోటీసుల రూపంలో అంటిస్తారు. రైతులకు సందేహాలు తలెత్తితే వారు జన్మభూమి కమిటీలను సం ప్రదించాల్సి ఉంటుంది. వారు బ్యాంకులకు వెళ్లి ఆరా తీస్తారు. అక్కడ కూడా తమకు సరైన స్పందన రాలేదనుకుంటే జిల్లా కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి అందులో ఇప్పటికే రూ.5000 కోట్లను జమ చేసిన ప్రభుత్వం ఈనెల 15 తేదీనాటికి మరో రూ.7000 కోట్లను జమ చేయనుంది. రైతు మాఫీ ప్రక్రియ దాదాపు కొలిక్కి రావడంతో డ్వాక్రా మహిళలను రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది

కాలుష్య గోదావరి

కాలుష్య గోదావరి
ప్రజల నిర్లక్ష్యంతో పెను ముప్పు!
పరిశ్రమల నుంచి రసాయన 


వ్యర్థాలతో నీరు విషతుల్యం
ఎరువులు, పురుగుమందులతోనూ
ముంచుకొస్తున్న ముప్పు
తగ్గుతున్న పంట దిగుబడులు
పెరుగుతున్న కేన్సర్‌, ఇతర వ్యాధులు
ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌
టెక్నాలజీ నివేదిక

ఒకచోట మంద్రంగా, గంభీరంగా.. ఒకచోట ఉరుకుల పరుగులతో.. పచ్చటి ప్రకృతి గుండా సాగిపోయే వేదమంటి గోదావరి.. క్రమంగా కాలుష్య కాసారంగా మారిపోతోంది(అంతరచిత్రం)! పారిశ్రామిక వ్యర్థాలు, ఎరువులు, పురుగుమందుల విషంతో ఘోష పెడుతోంది!!
గోదావరి పరీవాహక ప్రాంతం మొత్తం విస్తీర్ణం 1.86 కోట్ల హెక్టార్లు. దీనిలో సగానికి పైగా వ్యవసాయానికి యోగ్యమైనదే. గోదావరి కాలుష్యంలో 18 శాతం మాత్రమే పరిశ్రమల వల్ల వస్తోంది. మిగిలినదంతా ప్రజలు వదిలే వ్యర్థాలు, వ్యవసాయానికి ఉపయోగించే ఎరువుల వల్ల జరుగుతోంది. ప్రజల్లో ఈ విషయమై అవగాహన పెంచగలిగితే కాలుష్య ముప్పు కొంచెమైనా తగ్గినట్టే.
ఆధునిక టెక్నాలజీయే శరణ్యం
ఈ ముప్పు నుంచి ప్రజలను కాపాడాలంటే.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో మొత్తం గోదావరి పరీవాహక ప్రాంతాన్ని సర్వే చేయించాలి. మానవ రహిత విమానాలు, రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీలు, వెబ్‌ సెన్సర్‌ బేస్డ్‌ టెక్నాలజీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ‘‘విదేశాలలో ఈ టెక్నాలజీలను ఉపయోగించి కాలుష్య కారకాలను కనుగొంటున్నారు. ఉదాహరణకు ఽథాయ్‌లాండ్‌లో కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులను టెక్నాలజీ ద్వారా కనుగొని ముందే నివారించగలుగుతున్నారు. దీనిని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కూడా అమలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి’’ అని ప్రొఫెసర్‌ నితిన్‌ అభిప్రాయపడ్డారు.
పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలతో నీరు విషతుల్యం
ఎరువులు, పురుగు మందుల వినియోగమూ అధికం
తగ్గుతున్న పంట దిగుబడి.. పెరుగుతున్న ప్రాణాంతక వ్యాధులు
ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నివేదిక
ఆంధ్రజ్యోతి-బుద్ధవరపు ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న
‘స్వచ్ఛ గోదావరి’ పరిశీలనలో ఆందోళనకర అంశాలు

పచ్చటి పంటలతో అలరారే గోదావరి పరీవాహక ప్రాంతానికి పెనుముప్పు ముంచుకొస్తోంది! స్వచ్ఛమైన జలాలతో ఉరుకుల పరుగులిడే గోదారి తల్లి కాలుష్యకాసారంగా మారిపోతోంది!! కాలకూట విషాల్లాంటి పారిశ్రామిక వ్యర్థాలు.. నిండు ప్రాణాలకు మరణశాసనం రాసే ఎరువులు, పురుగుమందుల అవశేషాలు.. ఆ జీవనదిని ప్రాణాలు తీసే విషమయ కాళింది మడుగులా మార్చేస్తున్నాయి. ఫలితం.. పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. కేన్సర్లు పెరిగిపోతున్నాయి. ఆంధ్రజ్యోతి- బుద్ధవరపు ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న స్వచ్ఛగోదావరి కార్యక్రమం కోసం.. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏఐటీ) గోదావరి పరీవాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను ప్రత్యేకంగా
విశ్లేషించి ఇచ్చిన నివేదికలో మోగిన హెచ్చరిక గంటలివి! ఈ ప్రమాదానికి కారణాలేవని అడిగితే... పరిశ్రమలు వదిలే రసాయనాలు.. రాజమండ్రి సమీపంలోని
పేపర్‌ మిల్లులు విడిచే విషాలు.. ప్రజల నిర్లక్ష్యం... ఇలా తిలాపాపం తలా పిడికెడు అని తేలుతోంది!!
స్వచ్ఛమైన గోదావరి కాలుష్య కాసారమయిపోతోంది. ఇప్పుడే మేల్కొని జాగ్రత్త పడకపోతే గోదావరి పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలకు అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఉపగ్రహాల ద్వారా కాలుష్యాన్ని పరిశీలించి, విశ్లేషించి- వివిధ దేశ ప్రభుత్వాలకు సలహాలను ఇచ్చే ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఏఐటీ) గోదావరి పరీవాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను... ఆంధ్రజ్యోతి- బుద్ధవరపు ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న స్వచ్ఛగోదావరి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పరిశీలించి ఇచ్చిన నివేదికలో అంశాలివి. ఈ కాలుష్యం వల్ల గోదావరి పరీవాహక ప్రాంతంలో వ్యవసాయ దిగుబడి తగ్గిపోతోందని.. ప్రజలలో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని శాటిలైట్‌ చిత్రాలను విశ్లేషించిన ఏఐటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నితిన్‌ కుమార్‌ త్రిపాఠి, డాక్టర్‌ సంతోష్‌ చౌదురిల బృందం తేల్చి చెప్పింది. గోదావరిలో కాలుష్యానికి హైదరాబాద్‌ నుంచి విడుదలయ్యే రసాయనాలే ప్రధాన కారణమని కూడా ఈ బృంద అధ్యయనంలో తేలింది.
కారణాలు రెండు...

సాధారణంగా నదులు రెండు రకాలుగా కలుషితమవుతాయి. ప్రజల అవసరాల కోసం, వ్యవసాయం కోసం ఉపయోగించే పదార్థాల వల్ల కలిగే కాలుష్యం ఒక రకమైతే.. పరిశ్రమలు విషపూరిత వ్యర్థాలను నీటిలోకి వదలటం వల్ల ఏర్పడే కాలుష్యం మరొకటి. గోదావరిలో 82 శాతం కాలుష్యానికి కారణం మొదటిదే. పరిశ్రమల కాలుష్యం 18 శాతమే అయినప్పటికీ.. ఆ వ్యర్థాల వల్ల నది నీరు కలుషితం కావటం మాత్రమే కాక ప్రజలకు ప్రమాదకరమైన జబ్బులు కూడా వస్తాయి. వ్యవసాయ దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ఏఐటీ చేసిన విశ్లేషణలో ఈ రెండు విషయాలూ రుజువయ్యాయి. ‘‘గోదావరిలో కాలుష్యం పెరగటం వల్ల ఈ నది పరీవాహక ప్రాంతంలోని నేలల్లో ఐరన్‌, జింక్‌, కాపర్‌, కోబాల్ట్‌, కేడ్మియం వంటి హెవీ మెటల్స్‌ చేరి, నేలలు కూడా కలుషితమవుతున్నాయి. ఈ కాలుష్యం లేని సమయంలో.. ఇక్కడ వరి దిగుబడి ఎకరాకు 40 బస్తాల దాకా ఉండేది. ఇప్పుడది 10 బస్తాలకు పడిపోయింది. దీని ప్రభావం కేవలం వ్యవసాయోత్పత్తిపైనే కాదు. ఈ నేలల్లో పండే ఆహారాన్ని తినడం వల్ల పశువులకు మనుషులకు కూడా రకరకాల జబ్బులు వస్తున్నాయి. యువకుల్లో రక్త కేన్సర్‌, పొగ త్రాగని వారిలో సైతం లంగ్‌ కేన్సర్‌, లివర్‌ కేన్సర్‌ కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వాలు ఈ కేసులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించుకోకపోతే భవిషత్తు తరాల వారికి చాలా హాని కలుగుతుంది..’’ అని ప్రొఫెసర్‌ నితిన్‌ స్పష్టం చేశారు. ఇక.. ‘‘సాధారణంగా పారిశ్రామిక వ్యర్థాలు ఒక చోట పేరుకుపోవు. నీటి ప్రవాహ వేగంతో నెమ్మదిగా ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్తాయి. అవి ఎంత దూరం ప్రవహిస్తే అంత దూరం నీరు కలుషితమవుతూ ఉంటుంది’’ అని పర్యావరణ ఉద్యమకారుడు సందీప్‌ వెల్లడించారు.
ప్లాంట్ల వల్ల ప్రయోజనం లేదు..
రాజమండ్రిలోని నల్లా చానల్‌లో లీకేజీ ఉందని ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. సాధారణంగా.. రాజమండ్రి నగరంలో నుంచి విడుదలయ్యే వ్యర్థాలు ఈ నల్లా చానెల్‌లో పొంగిపొర్లుతూ ఉంటాయి. రాజమండ్రి నుంచి పైకి వెళ్లే గోదావరి అప్‌సీ్ట్రమ్‌లో పీబీ అండ్‌ సీయూ (సీసం, రాగి) రసాయనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయం కోసం ఉపయోగించే ఎరువులే దీనికి ప్రధానమైన కారణమని ఈ అధ్యయనంలో తేలింది. దేశంలో సగటున ఒక హెక్టారుకు 25 కిలోల మేర ఎరువులు వినియోగిస్తుంటే.. ఇక్కడ 50 కిలోల దాకా వాడుతున్నారు. పురుగు మందుల వాడకం కూడా చదరపు కిలోమీటరుకు 146.47 కిలోల చొప్పున ఉంది. వీటిలో 79 శాతం ఆర్గానోక్లోరిన్సే.. వీటన్నింటి వల్లా నీరు విషతుల్యంగా మారిపోయి తాగడానికి ప్రమాదకరంగా మారుతోంది. ఈ సమస్యకు తోడు... గోదావరి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో పేపరు మిల్లుల వల్ల కూడా నదికి తీవ్రమైన హాని కలుగుతోంది. ఈ మిల్లుల వ్యర్థాల వల్ల నీటిలో ఆక్సిజన్‌ శాతం చాలా తగ్గిపోతుంది. హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ శాతం బాగా పెరుగుతుంది. నీటి రంగు కూడా నల్లగా తయారవుతుంది. చెడు వాసన వస్తూ ఉంటుంది. పేపర్‌ మిల్లులు వ్యర్థాలు వదిలే ప్రాంతంలోని నీటిలో మైలతుత్తం బాగా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అల్యూమినియం హైడ్రాక్సైడ్‌ శాతం బాగా పెరుగుతుంది. ఉపగ్రహ చిత్రాలలో కూడా కలుషితమయిన నీటికి- కలుషితం కాని నీటికి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది. ‘‘కలుషితం కాని నీటిలో చేపలు పెరగడానికి అనువైన వాతావరణం ఉంటుం ది. ఒక ప్రాంతంలో నీరు స్వచ్ఛంగా ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఇదే నిదర్శనం. సాధారణంగా ఒక లీటరు వ్యర్థ రసాయనానికి 500 లీటర్ల నీటిని కలిపితే దాని సాంద్రత తగ్గి, ప్రభావం కూడా తగ్గుతుంది. అందువల్ల ఫ్యాక్టరీలు వ్యర్థాలను శుద్ధి చేసి మాత్రమే నదిలోకి వదలాలి. కానీ ఏ పేపర్‌ ఫ్యాక్టరీ ఆ పని చేయట్లేదు. ఒకవేళ అది కుదరకపోతే.. బాగా వరద వచ్చినప్పుడు వదిలితే ఆ వేగానికి కాలుష్య సాంద్రత గణనీయంగా తగ్గిపోతుంది’’ అని ప్రొఫెసర్‌ నితిన్‌ వెల్లడించారు. పరిశ్రమల కాలుష్యం, ఎరువులు-పురుగుమందుల అవశేషాల సంగతి పక్కన పెడితే.. నది ఒడ్డున మానవ వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఆస్పత్రి వ్యర్థాలను పెద్ద ఎత్తున పడేస్తున్నారు. వీటిని తొలగించడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా వాటి వల్ల ఫలితమేమీ లేదు. నీటి శుద్ధి నిమిత్తం రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌.. పుష్కర ఘాట్‌ సమీపంలో ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో మూడు రోజుకు పది లక్షల లీటర్ల నీరు శుద్ధి చేయటానికి, మరో రెండు సగటున 9 లక్షల లీటర్ల నీరు శుద్ధి చేయటానికి ఉపయోగపడతాయి. అయితే చాలా సమయాల్లో విద్యుత్‌ లేకపోవడం వల్ల ఈ ప్లాంట్లు పనిచేయకపోవడంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. 

- స్పెషల్‌ డెస్క్‌

గోదావరిని కబళిస్తున్న కాలుష్యం

  • 05/11/2014
రాజమండ్రి, నవంబర్ 4: గోదావరి నదిని కాలుష్యం కబళిస్తోంది. కోట్లాది మందికి తాగునీరు, సాగునీరు అందిస్తున్న అత్యంత పవిత్రమైన గోదావరి నది కలుషితమవుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో కనీసం తాగునీరు, సాగునీరు కూడా లభించదేమోన్న ఆందోళన కలుగుతోంది. తెలుగు ప్రజలకు గోదావరి నది జీవనాధారం. అలాంటి జీవనాధారమైన గోదావరి నదిలో పరీవాహక ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, పల్లెల నుండి వచ్చే వ్యర్ధాలు, పరిశ్రమలు విడుదలచేసే కాలుష్యం కారణంగా ప్రమాదకర స్థాయిలో గోదావరి నది కలుషితమవుతోంది. పారిశ్రామిక వ్యర్ధాలు కూడా ఒక సమస్యే అయినప్పటికీ, గోదావరి నదికి ఇళ్ల నుండి విడుదలయ్యే వ్యర్ధాలే అతి పెద్ద ప్రమాదంగా తయారయ్యాయి. గోదావరి కాలుష్యంలో 82శాతం వాటా ఇళ్ల నుండి విడుదలయ్యే వ్యర్ధాలదే. మిగిలింది పరిశ్రమల వాటా. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సాగవుతున్న భూముల్లో వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులు కూడా గోదావరి కాలుష్యానికి కారణమవుతున్నాయి. హెక్టారుకు 49.34కేజీల ఎరువులు, చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 146.47కేజిల పురుగు మందులు వినియోగిస్తున్నట్టు అంచనా. ఇలా కలుషితమైన గోదావరి నీటినే తిరిగి వ్యవసాయ రంగానికి వినియోగిస్తుండటం వల్ల ఇప్పటికే గతం కన్నా దిగుబడి బాగా తగ్గింది. గోదావరి కాలుష్యం కారణంగా భూగర్భజలాలు కూడా కలుషితమై దీని ప్రభావం వ్యవసాయోత్పత్తులు, పశువులు తినే గడ్డిపై కూడా పడి స్వచ్ఛమైన పాలు కూడా లభించని ప్రమాదం ఏర్పడుతోంది. నది ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు, గ్రామాల నుండి విడుదలవుతున్న వ్యర్ధాలతో ఇప్పటికే గోదావరి గట్లు చాలా చోట్ల నిండి ఉన్నాయి. ఈ పాపంలో రాజమండ్రి నగరానిదే ఎక్కువ భాగంగా కనిపిస్తోంది. గోదావరి ఎగువ నుండి తీరం వెంబడి ఉన్న వ్యర్ధాలు ఒక ఎత్తయితే, రాజమండ్రి నగరం పరిధి ప్రారంభం నుండి తీరం వెంబడి ఉన్న వ్యర్ధాలు మరో ఎత్తు. నగరంలోని చిన్న, పెద్ద పరిశ్రమల నుండి విడుదలవుతున్న కాలుష్యం గోదావరి నది స్వచ్ఛతను దెబ్బతీస్తున్నాయి.నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్నంత దూరం నది ఒడ్డున ప్లాస్టిక్, ఇతర చెత్తా చెదారం తెట్టులా తేలియాడుతూ కనపిస్తుంటాయి. ఇంత కన్నా దారుణం ఏమిటంటే రాజమండ్రి నగరంలోని పుష్కర్‌ఘాట్‌కు ఎగువన, నగరంలోని ఇళ్ల నుండి విడుదలయ్యే మురుగు నీరు కలుస్తుంటే, పుష్కర్‌ఘాట్‌కు దిగువన నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం నగరపాలకసంస్థ నీటిని తోడుతోంది. అంటే ఎగువన అత్యంత దారుణమైన మురికి నీటిని నదిలో కలిపి, దిగువన తాగునీటిని తీసుకుంటున్నామన్న మాట. పేరుకు నిర్మించిన మురికినీటి శుద్ధి ప్లాంటు సమర్ధవంతంగా పనిచేయటం లేదు. ఇక పేపరు మిల్లు కాలుష్యంపై చాలా ఏళ్లుగా జనం ఆందోళన సాగిస్తున్నా, తాము మాత్రం శుద్ధిచేసిన నీటినే విడుదలచేస్తున్నామంటూ మిల్లు యాజమాన్యం చెబుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గోదావరి నదిని ఇలాగే వదిలేస్తే గంగకు పట్టిన గతే గోదావరి నదికి పట్టడానికి ఎంతో కాలం పట్టదు. ఈ పరిస్థితుల్లో గంగా నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో, అలాంటి చర్యలనే గోదావరి ప్రక్షాళనకు ఇప్పటి నుండే తీసుకోవాలని జనం కోరుతున్నారు.

కాలుష్య నివారణే గోదావరికి హారతి - తల్లావఝ్ఝల పతంజలి శాస్రి  

సృష్టిలో మనిషికి కేంద్ర స్థానం గానీ, ఆధిపత్యం గానీ లేదని చెబుతూ, ప్రాచీన భారతీయులు, మనిషి కూడా ఇతర ప్రాణికోటిలో భాగమని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ సంస్కృతీ భారతీయ సంస్కృతి వలె ప్రకృతితో మమేకం కాలేదు. మన పూర్వజుల ప్రాపంచిక దృక్పథం, ఆధ్యాత్మిక భావన, సృజనాత్మక వ్యవహారం, కళ, జీవన సర్వస్వం జీవావరణ వ్యవస్థలలో వేరూనాయి. మన భౌతిక ఆధ్యాత్మిక జీవనం పశుపక్ష్యాదులతో ముడిపడి ఉంటుంది. దైవీకరణం, దైవత్వ భావన పశుపక్ష్యాదులనే కాక నీటి వనరుల్ని కూడా ఆరాధనీయం చేశాయి. ఇంతటి నమ్రభావం మరే ప్రాచీన సంస్కృతిలోనూ ఇంత గాఢంగా కనిపించదు. ఈ విలక్షణతలోని ఆశ్చర్యకరమైన జీవలక్షణం వైవిధ్యం. ఇంతటి వైవిధ్యం ఉన్న ఏకత్వం కూడా మరెక్కడా కనిపించదు. మన పూర్వజులకి ఈ సృష్టి, దీని నియతి అవగాహన అయినట్టుగా, మనిషికి మౌలికంగా ఏర్పడే అస్తిత్వ భావన అర్థం అయినట్టుగా మనకి అటువంటి వారసత్వాన్ని భుజానికెత్తుకోవడం తెలిసింది గానీ ఆకళింపు అయినట్టు తోచదు. అందువల్లనే మనం కర్మకాండనే మతం అనుకుంటున్నాం. వస్తువునీ ప్రతీకనీ విడదీసి చూడ్డం అలవాటు కావడం లేదు. ఆఖరికి వారు వాడిన శబ్దజాలం, నిగూఢమైన అర్థం మనకి అందకుండా పోయాయి. ఒక శబ్దానికి స్ఫురించే అర్థం ఒకటి కాకుండా గౌణమైన మరొక భావనకి చెందిన వ్యవహారమని అర్థం కావడం లేదు.
అయిదారు శతాబ్దాల నుంచీ గడ్డకట్టిన భావజాలంలో మొలకెత్తినదే మన ద్వంద్వ ప్రమాణం, ప్రతి భారతీయుడి అంతః శ్చేతనలో నది అంతర్వాహిని. మనకి ఎప్పుడూ నది కేవలం నీరు కాదు. భూమి ఎప్పుడూ మట్టికాదు. నదీ నదాలు ప్రాణం తో తొణికిసలాడే ప్రాణధారలు. వాటి ప్రాణ చైతన్యం వలె జలజీవరాశి చలిస్తూంటుంది. ప్రాణధారలో వినయంగా నిలబడి సమస్త ప్రాణకోటికీ ప్రాణప్రసాదం చేసిన సూర్యుడికి ఉద యమే కృతజ్ఞతలు చెప్పుకుంటాం. చదువులో, పాండిత్యంలో ఏ మాత్రం సంబంధం లేని ప్రతిప్రాచీన భారతీయుడూ మంత్రోచ్ఛాటన చేస్తూ కాదు, నిశ్శబ్దంగా నమస్కరించాడు. గంగకీ, గోదావరికీ హారతినివ్వడం ఒక కోలాహలమైన ఆచారం ఇప్పుడు, ఇది కార్తీక మాసం, నదుల్లో తెలవారకుండా అరటి దోనెల్లో ప్రాణంలా కదులుతూ దీపాలు చీకటి వైపు సాగుతూంటాయి. వీళ్లెవరికీ దీపాల కింద నదులెంత దుస్థితిలో ఉన్నాయో అవసరం లేదు. ఒక వ్యర్థ నమస్కారం, అర్థం కాని ఒక మంత్రం చాలు. నదులు మనకి పవిత్రం. ఇప్పటికీ వాటి శుభ్రతతో మనకి సంబంధం లేదు. ప్రపంచంలో ఏ దేశంలోనూ బహుశా గంగవంటి పవిత్రమైన నదీ, మురికీ నదీ ఉండదు. నదీ నదాలు, చెరువులు, బీట భూములు అన్నీ క్రమంగా ప్రమాదకరమైన మురికి పాలబడ్డాయి. గ్రామాల్లో ఎవరూ ఊరి చెరువుని నిర్మలంగా అందంగా ఉంచుకోవాలని ప్రయత్నించరు. ప్రభుత్వమే ఆ పని చెయ్యాలని వారి ఉద్దేశం, చెరువు అంటే చేపలు పెంచుకుని అమ్ముకోవడానికి ఉపయోగించే నీళ్ళనే నమ్మకం బలంగా ఉంది. చేపల చెరువులకీ సహజమైన సరస్సులకీ తేడా చూడలేని దుస్థితి మనది. నదులు, సరస్సులు, విస్తారమైన పంట భూములు, అడవులు, జీవవైవిధ్యం ఏ దేశానికైనా నిజమైన సిరి సంపదలు; అమూల్యమైన మూలధనం. మన పాలకులకి ఈ ఇంగిత జ్ఞానం లేదు.
దక్షిణ దేశంలో నదులు పూర్తిగా మురుగు కాలువలుగా ఇంకా మారలేదు. గోదావరి ఆ దుస్థితికి ఇంకా రాకపోవడానికి ఒక కారణం పెద్ద పారిశ్రామికవాడలు, ఎక్కువ ఆనకట్టలు లేకపోవడం. మహానగరాలు వ్యర్థజలాల్ని నదిలోకే విడుస్తాయి. గోదావరి తీరంలో మహానగరాలు లేకపోవడం వల్ల కాలుష్యం నియంత్రణ స్థితిలోనే ఉంది. కానీ పెద్ద పరిశ్రమలు లేకపోయినా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నగరాల వ్యర్థ జలాలు గోదావరిని కలుషితం చేస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అంచనాప్రకారం గోదావరి నీళ్ళు శుభ్రంగానే వున్నాయి. మన దేశంలో అమలులో ఉన్న కాలుష్య నియంత్రణ చట్టాల పరిమితుల్ని పునస్సమీక్ష చెయ్యడం అవసరం. రాజమండ్రి వంటి నగరాలలో ప్రతి నెలా నదీ కాలుష్య వివరాలను పత్రికల ద్వారా ప్రజలకి తెలియచెయ్యాలి. నగర మురుగునీటిని శుద్ధి చేసే వ్యవస్థ ఇంత వరకూ ఏర్పడలేదు. ఇళ్ళలో శుభ్రత కోసం వాడే అనేక రకాల డిటర్జంటులు, ఏసిడ్లు, అన్నీ నదిలోకి చేరతాయి. ప్రస్తుతం ఉపయోగించే నీటిని శుద్ధి చేసే వ్యవస్థ ఇంత కాలుష్యాన్ని భరించలేదు. దేశంలోనే అగ్రగణ్యమైన పేపరుమిల్లు రాజమండ్రి గోదావరి లంకల్లోకి వ్యర్థ జలాల్ని విడుదల చేస్తున్నది. వ్యర్థ జలాల్ని శుద్ధిచేసిన తరువాతనే లంకలోకి విడుదల చేస్తున్నామని మిల్లు యాజమాన్యం వాదన. అంతులేని ఈ వివాదానికి తెరదించి, శుద్ధి చేసిన నీటిని ఎగువ ప్రాంత రైతులకు, ఇతర అవసరాలకు ఉపయోగించమని నేను పదిహేను సంవత్సరాల క్రితం సూచించాను. ఇప్పటికీ అదే మంచిదని నా నమ్మకం. వ్యయ ప్రయాసలతో కూడుకున్న పరిష్కారం అయినప్పటికీ ఈ ప్రత్యామ్నాయం గురించి అలోచించాలి.
రాజమండ్రి గోదావరిలో పున్న పిచ్చుకలంక పెద్దది. చాలా ఎకరాలు ఎవరో వ్యవసాయానికి అనువుగా చేసుకున్నారు. మిగిలిన కొద్ది ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. అదేమీ జరగలేదు. ఒక ముఖ్య విషయం గమనించాలి. పిచ్చుకలంక అయినా, కాకినాడ హోప్‌ ఐలాండ్‌ అయినా, కృష్ణలో భవానీలంక అయినా కేవలం పర్యాటక కేంద్రాలుగా చెయ్యడం కంటే నిపుణుల సూచనలు తీసుకుని వాటిని గొప్ప జీవ వైవిధ్య ప్రాంతాలుగా తయారు చెయ్యడం అవసరం. దీని వల్ల నీటికీ. చేపలకీ, రైతులకీ అనూ హ్యమైన ఉపయోగం ఉంటుంది. అనేక జాతుల పక్షులు క్రమం గా ఆవాసం ఏర్పరచుకుంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడ్డం అట్లా ఉంచి వాటి వల్ల వందలాది టన్నుల విలువైన ఎరువు రైతులకీ దక్కుతుంది. చేపలు అభివృద్ధి అవుతాయి. దీనికి అయ్యే ఖర్చు స్వల్పం.
పుష్కరాలకి లక్షలాది యాత్రికులు గోదావరి స్నానానికీ, పితృకర్మలు చెయ్యడానికీ వస్తారు. కర్మకాండ జరిగిన తరువాత ఆ ద్రవ్యాలన్నీ ప్లాస్టిక్‌ సంచీలో పెట్టి నదిలో విడుస్తారు. దీనికి బదులుగా కాగితంతో మహిళా మండళ్ల చేత పుష్కరాలలోపు సంచీలు చేయించి ఒక పద్ధతి ప్రకారం పురోహితులకి అంద చేయడం మంచిది. అపరకర్మలకు గోదావరి లంకల్లో కూడా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. మామూలు సమయాల్లో కూడా రాజమండ్రి గోదావరిలో అపరకర్మలకు సంబంధించిన ద్రవ్యాలన్నీ ప్లాస్టిక్‌ సంచీలలో ఒడ్డునే తేలుతూంటాయి.
కాలుష్యంతో ప్రత్యేకంగా సంబంధం లేకపోయినా ప్రభుత్వం గోదావరి లంకలను మరో రకంగా ఉపయోగించుకోవచ్చు. చైనా లో చిన్న, పెద్ద నదులలో సౌర ఫలకాలను ఏర్పాటు చేసి చాలా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. అటువంటి అవకాశం గోదావరి లంకలలో సాధ్యపడుతుందేమో పరిశీలించాలి. ఇంత సాంకేతిక ప్రగతి సాధించిన తరువాత ఇటువంటిది అసాధ్యం కాదనుకుంటాను.
ప్రతి నదీ జలాలకు సహజసిద్ధమైన లక్షణం నీటిని శుద్ధి చేసుకోవడం. నదిలోకి విడుదల చేసే విష పదార్థాలు ఎక్కువ కావడంతో ఈ సహజ వ్యవస్థ కుంటుపడుతోంది. నిజానికి తీవ్రంగా కలుషితమైన నదిని పునరుద్ధరించడం అయ్యేపని కాదు. గోదావరి పరిస్థితి చెయ్యి దాటిపోలేదు కనుక గంగ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు కొన్ని తీసుకోవడం అవసరం. అందులో ముఖ్యమైంది నది ఎగువ జలాల్లో వందలాది తాబేళ్ళని వదలడం. ఇది వెంటనే జరగాలి. అటవీ వన్యప్రాణి విభాగం వారికి ఈ బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది. తాబేళ్ళు నీటిని శుభ్రపరుస్తాయి. గొరకులనే చేప జాతి కూడా నదిని శుభ్రం చేస్తుంది. దురదృష్టవశాత్తూ పుష్కరాలకు గోదావరిలో నీరు ఎక్కువగా ఉండదు. లక్షలాది భక్తులు పాప ప్రక్షాళన కోసం పుణ్య స్నానాలు చేస్తుండగా నది పరిస్థితి ఊహించడం కష్టం కాదు. ఎట్టి పరిస్థితిలోను స్నానానికి గోదావరిలో సబ్బు వాడకాన్ని నిషేధించడం మంచిది. విడిదిలో స్నానాలు కానిచ్చి గోదావరి నీటితో అభ్యంగ స్నానం వంటిది చేస్తే మంచిది.
- తల్లావఝ్ఝల పతంజలి శాస్రి 
(ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, బుద్ధవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో నేడు రాజమండ్రిలో ‘గోదావరి హారతి’)