Thursday 6 November 2014

తుది దశకు రుణ మాఫీ!

తుది దశకు రుణ మాఫీ!  
  అర్హుల వివరాలు నేడు ఆన్‌లైన్‌లో.. మొత్తం రైతులు 81 లక్షలు
 అర్హులు 49.37 లక్షలు..సమగ్ర వివరాల్లేనివారు 31.63 లక్షలు
 స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అమలు చేస్తే 15 లక్షల మందికే లబ్ధి
 పది రోజుల్లో మరో ఏడు వేల కోట్లు

(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్‌లో రుణ మాఫీ పథకం అమలు తుది దశకు చేరింది. రుణ మాఫీ వర్తించే రైతుల వివరాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈనెల ఐదో తేదీ నే ఆ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని భావించింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు బెంగళూరు పర్యటనలో ఉండడంతో ఒక్కరోజు వాయిదా వేసింది. రుణ విముక్తి పథకానికి అర్హుల జాబితాను గురువారం ఆన్‌లైన్‌లో ఉంచ బోతోంది. రుణ మాఫీ పథకం కింద తాము అర్హులమో కాదో చూసుకోవడానికి www.ap.gov.nic.in అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. రుణ మాఫీ పథకంలో అర్హులను గుర్తించడానికి బ్యాంకులు సుదీర్ఘ కసరత్తు చేశాయి. బ్యాంకుల నుంచి లబ్దిదారుల సమాచారం రాబట్టడానికి నెలన్నర రోజులుగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వ వర్గాలు ఎట్టకేలకు వాటన్నింటినీ తెప్పించగలిగాయి. వాటిలో కొన్ని సమగ్రంగా.. మరికొన్ని అసమగ్రంగా ఉన్నా.. అన్నిటినీ కలిపి ఆన్‌లైన్‌లో పెట్టాలని నిర్ణయించారు. అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచిన తర్వాత వాటన్నింటినీ మళ్లీ బ్యాంకుల్లోనూ ఉంచుతారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యాలయాల వద్ద నోటీసు బోర్డుల్లో అంటిస్తారు. కాగా, బ్యాంకుల నుంచి లక్షన్నర రూపాయలలోపు రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 81 లక్షలు. కాగా.. వారిలో 49.37 లక్షల మంది అర్హులుగా తేలారు. మిగిలిన 31,63,000 మంది రైతుల వివరాలు సక్రమంగా లేవు. రుణమాఫీ అమల్లో భాగంగా ప్రభుత్వం ఆధార్‌, రేషన్‌ కార్డులు, భూ వివరాలు, పట్టాదారు పాసు పుస్తకం, కుటుంబం తదితర సమగ్ర వివరాలు పరిగణనలోకి తీసుకుంది. వాటి ఆధారంగా అర్హుల వివరాలను సేకరించి.. వాటిని క్రోడీకరించి జాబితాను రూపొందించింది. మొత్తంమీద ఎటువంటి వివరాలూ లేని రైతులు 5,82,703 మంది ఉన్నారు. ఆధార్‌, రేషన్‌ కార్డులు లేని రైతులు 15,13,272 మందిగా లెక్క తేలారు. ఆధార్‌ లేకుండా రేషన్‌ కార్డులు ఉన్నవారు 2,47,185గా గుర్తించారు. ఇక, ఆధార్‌ ఉండి రేషన్‌ కార్డులు లేని రైతులు 7,20,401 మంది తేలారు. సమగ్ర వివరాలను క్రోడీకరించి లెక్కతేల్చగా అన్ని వివరాలూ ఉన్న రైతు కుటుంబాల సంఖ్య 20 లక్షల నుంచి 25 లక్షలుగా అంచనా వేశారు. వీటిలో కూడా రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (రుణసూచి)ను వర్తింపజేస్తే 15 లక్షల కుటుంబాలే అర్హులుగా తేలనున్నాయి. ఈ వివరాలన్నిటినీ పంచాయతీ కార్యాలయాల వద్ద నోటీసుల రూపంలో అంటిస్తారు. రైతులకు సందేహాలు తలెత్తితే వారు జన్మభూమి కమిటీలను సం ప్రదించాల్సి ఉంటుంది. వారు బ్యాంకులకు వెళ్లి ఆరా తీస్తారు. అక్కడ కూడా తమకు సరైన స్పందన రాలేదనుకుంటే జిల్లా కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి అందులో ఇప్పటికే రూ.5000 కోట్లను జమ చేసిన ప్రభుత్వం ఈనెల 15 తేదీనాటికి మరో రూ.7000 కోట్లను జమ చేయనుంది. రైతు మాఫీ ప్రక్రియ దాదాపు కొలిక్కి రావడంతో డ్వాక్రా మహిళలను రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది

No comments:

Post a Comment