అయ్య.. పేదోళ్ల స్మగ్లర్ | |
ఒకప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ కుటుంబం ఇప్పుడేం చేస్తోంది?తమిళనాడు- కర్నాటక ప్రభుత్వాలను గడగడలాడించిన ఆయన కుటుంబం ఇప్పుడెన్ని సమస్యలు ఎదుర్కొంటోంది? కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసినప్పుడు చేతులు మారిన రూ.100 కోట్లు వీరప్పన్‌కు చేరాయా? బయటి ప్రపంచానికి గజదొంగగా తెలిసిన వీరప్పన్‌ను గిరిపుత్రులు ఎందుకు దేవుడిగా కొలుస్తారు? ఒకప్పుడు వీరప్పన్‌కు నెలవుగా వున్న సత్యమంగళం అడవుల పరిస్థితేంటి? ఆంధ్రప్రదేశ్‌లోని ‘ఎర్రదొంగలు’ వీరప్పన్ అనుచరులేనా? ఎన్నో పార్టీల అండదండలు పొందిన వీరప్పన్ ఏ పార్టీ అభిమాని? నిత్యం వార్తల్లో నానుతూ సంచలనాలకు పెట్టింది పేరైన ఆ స్మగ్లర్ మృతి చెంది ఇప్పటికి పదేళ్లవుతోంది. ఈ సందర్భంగా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ఆంధ్రజ్యోతి చెన్నై ప్రతినిధి డాక్టర్ ఎస్‌కేఎండీ గౌస్‌బాషాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.. వీరప్పన్ గురించి ఇదివరకు ఎన్నడు వెలుగులోకి రాని ఆసక్తికర విషయాలను చెప్పారు..
బయటి ప్రపంచానికి వీరప్పన్ అంటే హడల్. మీతో, పిల్లలతో ఎలా వుండేవాడు? ఎవరైనా ఆయనతో 5 నిమిషాలు మాట్లాడితే ‘నిజంగా ఇతను వీరప్పనేనా, నిజంగా ఇవన్నీ చేస్తున్నాడా’ అని అనుకోకతప్పదు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. అబద్ధం చెప్పడం నచ్చదు. మాట ఇస్తే దానికి కట్టుబడి వుండాల్సిందే. తన కుమార్తెలంటే ఎంతో ప్రాణం. పెద్దమ్మాయికి వాళ్ల నాన్న కొంచెం గుర్తున్నాడేమో, చిన్న పాపకు అసలు తెలియదు. అమ్మాయికి 11 నెలలలు వచ్చేసరికే అడవిని వీడాను నేను. చిన్నదాన్ని నేరుగా చూడాలని తుదిశ్వాస వీడే వరకూ ఆయన ఎంత తపించారో గుర్తుకొస్తే కన్నీళ్లొస్తాయి. ఆఖరికి పాపను చూడకుండానే వెళ్లిపోయాడు మహానుభావుడు. అడవి నుంచి ఎర్రచందనం, జంతువుల దంతాలు ఎలా తరలించేవారు? నా పెళ్లి తరువాత స్మగ్లింగ్ చేయడం తగ్గింది. కాని వీరప్పన్ పేరు చెప్పుకొని చాలామంది ఆ పనులు చేసేవారు. ఎర్రచందనాన్ని కూలీలు, అటవీశాఖాధికారులు కూడా తీసుకెళ్లేవాళ్లు. వాళ్లకి సాధారణ మామూళ్లతో పాటు కమిషన్ కూడా వుండేది. అందువల్ల సాఫీగానే సాగిపోయేది. వీరప్పన్ లేని జీవితం ఎలా వుంది? ఆయన పోయాక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఆయన ఉన్నప్పుడు నాకు పెద్దగా సమస్యల్లేవు. ఏం జరిగినా, ఎలాంటి సమస్య వచ్చినా ఆయన చూసుకుంటారన్న ధైర్యం వుండేది. కానీ ఆయన చనిపోయాక నామీద ఐదు కేసులు బయటకు తీశారు పోలీసులు. ‘కసిపోక మసిపూసుకోవడం’ అంటారు కదా, అలా ఆయన్ని చంపినా కసి తీరక, ఆ కేసులన్నీ తోడారు. 1993 నుంచి 2004 వరకు నేను పోలీసుల కనుసన్నల్లోనే తిరిగా. అయినా పరారీలో వున్నానంటూ 22 వారెంట్‌లు జారీ చేశారు. 4 హత్య కేసులు పెట్టి అరెస్టు చేశారు. కన్నడ నటుడు రాజ్‌కుమార్ కిడ్నాప్ సంఘటనలో డబ్బు తీసుకున్నట్లు కేసు పెట్టారు. 2008-2011 మధ్య కాలంలో మైసూర్, బెంగళూరు జైళ్లలో పెట్టారు. నెలకు 10 సార్లకు పైగా వాయిదాల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పారు. నానా రకాల చిత్రహింసలు పెట్టారు. ప్రస్తుతం వాటన్నిటి నుంచీ బయటపడి ఇప్పుడిప్పుడే సంఘంలో కలిసి బతుకుతున్నాను. వీరప్పన్ కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడని ప్రచారం. కానీ మీరేమో సాధారణ ఇంట్లో వున్నారు..? ఆ ప్రచారంలో 20 శాతమే నిజం. మిగిలినవన్నీ కట్టుకథలే. అయ్య (వీరప్పన్) అడవిలో వున్నప్పుడు అప్పట్లో లక్షా, రెండు లక్షలే సంపాదించేవాడు. ఆ డబ్బు కూడా తన సహచరులు, గిరిజనుల కుటుంబాలకే ఖర్చుపెట్టేవాడు. తన చేతికి డబ్బు రాగానే ఇంటికి వెయ్యి చొప్పున పంచేవాడు. అందుకే గిరిజనులంతా ఆయన కోసం ప్రాణమిస్తారు. ఆయనకంటూ పైసా మిగిల్చుకోలేదు. గిరిజనుల్లో హీరోయిజాన్ని మాత్రమే ఆశించారాయన. ఒకవేళ నిజంగా ఆయన సంపాదించివుంటే ఈ రోజు మాకీ కష్టాలెందుకు? ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాను. అయ్య అసలెందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? ఆయనది తమిళనాడు-కర్నాటక సరిహద్దుల్లో వున్న గోపినాధం గ్రామం. ఆయన తండ్రి మునస్వామి అడవిలో చెట్లు నరికే కూలి. అయ్య పన్నెండేళ్ల వయసులో వుండగా వాళ్ల నాన్న తనతో పాటు అడవిలోకి తీసుకెళ్లాడట. అప్పటికే కర్నాటక అడవిలో సేవిక గౌండర్ అనే అడవిదొంగ వుండేవాడు. ఆయన క్రూరజంతువులను చంపి వాటి చర్మాలు, దంతాలు, గోళ్ల స్మగ్లింగ్ చేసేవాడు. అతన్ని పట్టుకోలేని పోలీసులు అడవిలోని కూలీలను తీసుకెళ్లి ఏవేవో కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టేవారట. అలాగే మా ఆయన్ని కూడా 12 ఏళ్ల ప్రాయంలోనే జైల్లో పెట్టారు. ఆ వయసులోనే ఆయన్ని నానా రకాలుగా హింసించారు. తన కొడుకు కనిపించడం లేదని మునస్వామి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. కొన్నాళ్లకు వారే వదిలేశారు. అప్పటి నుంచే ఆయనకు పోలీసులంటే మహా అసహ్యం, కోపం. వారిమీద పగ తీర్చుకోవడానికే అడవికి రాజయ్యాడు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడు. పెళ్లయిన కొత్తలో ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా చెప్పాడు. అడవుల్లోనే ముప్పయి అయిదేళ్లు రహస్యంగా ఉన్నాడాయన. మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. నిజమేనా? ఒక రకంగా లవ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. మరో రకంగా బలవంతపు మ్యారేజ్ అని కూడా చెప్పాలేమో! సింగాపూర్ ఊళ్లో ఆయన తొలిసారిగా నన్ను చూశాడట. అప్పటికి నా వయసు పదహారేళ్లు. ఆయనకు నలభై. మాది కూడా తమిళనాడు-కర్నాటక సరిహద్దు జిల్లా అయిన ధర్మపురి సమీపంలోని నెరప్పూర్ గ్రామం. నన్ను చేసుకుంటానని మా ఇంటికొచ్చాడాయన. అప్పటికి వీరప్పన్ సాధారణ అడవిదొంగ. మీడియాలో ఇంత ప్రచారం లేదు. మా అమ్మా నాన్న నన్ను ఇచ్చేందుకు అంగీకరించలేదు. దాంతో ఓ రోజు వచ్చిన ఆయన కోపంగా ‘‘మీ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్లి అయినా పెళ్లి చేసుకోగలను. కానీ మీకు చెప్పకుండా, మీ అనుమతి లేకుండా చేసుకోవడం ఇష్టం లేకనే ఇంతగా బతిమాలుతున్నాను. ఇక నా సహనం చచ్చిపోయింది. మర్యాదగా ఇస్తారా, లేక లేవదీసుకుపొమ్మంటారా?’’ అని బెదిరించాడు. అప్పటికే ఆయన నాతో చాలాసార్లు మాట్లాడాడు. లోపల కొన్ని సందేహాలున్నా, ఆ తరువాత నాకూ ఇష్టం ఏర్పడింది. మావాళ్లు చాలా తర్జనభర్జనల తరువాత 1990లో ఎట్టకేలకు ఆయన్నిచ్చి పెళ్లి చేశారు. స్మగ్లింగ్ మానుకోవాలని మీరెప్పుడూ చెప్పలేదా? ఎన్నోమార్లు చెప్పా. పెళ్లి కోసం నన్ను అడిగినప్పుడే మా నాన్నపెట్టిన మొదటి కండిషన్ అదే. ‘ముందు నువ్వు పోలీసులకు సరెండర్ అవ్వు. జైలు నుంచి వచ్చిన తరువాత నా కూతుర్నిచ్చి చేస్తా. ఇందుకోసం ఎన్నేళ్లయినా ఆగుతా’ అని ఆయన చెప్పారు. కానీ ‘కొన్నాళ్ల తరువాత మీరు చెప్పినట్లే సరెండర్ అవుతా’ అని ఆరోజు సర్ది చెప్పాడు. పెళ్లయిన తరువాత నేను కూడా ఆయనకు నచ్చచెప్పా. తమిళనాడు-కర్నాటకల్లో కాకుండా మరే రాషా్ట్రనికైనా వెళ్లి బతుకుదామని వేడుకున్నా. కానీ తనతో కలసి నడిచిన వారు అన్యాయమైపోతారని, తనను నమ్ముకున్న గిరిజనుల్ని పోలీసులు వదలరని, వారందరికీ ఓ మార్గం చూపిన రోజున ఆలోచిద్దామని సమాధానపరిచేవారు. మంచో చెడో ఒక మార్గంలో పడ్డాం కాబట్టి దానినే కొనసాగించాల్సిందే తప్ప, ఇప్పుడు ఆ రూటు మారితే పోలీసులు బతకనివ్వరని చాలాసార్లు మధనపడేవాడు. పెళ్లి తరువాత మీరూ అడవికెళ్లిపోయారా? 1993 వరకూ ఆయనతో పాటే అడవిలో వున్నా. పెళ్లి అయ్యాక నన్ను పుట్టింట్లోనే వుంచాలని, ఆయన మాత్రం వచ్చి పోతుండాలని మొదట్లో అనుకున్నాం. కానీ ఆ తరువాత ఏమనుకున్నారో, ఏమో నన్ను కూడా సత్యమంగళం అడవులకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు మరో వందమంది అనుచరులు కూడా వుండేవారు. అడవి జీవితం అదో వింత అనుభూతి. కొండలు, గుహల్లో తలదాచుకునేవాళ్లం. అప్పుడప్పుడూ క్రూరజంతువులు కూడా కనిపించేవి. కానీ అవేవీ మా జోలికి వచ్చేవి కావు. తేనె, ఔషధ మొక్కలు, వేర్ల కోసం వచ్చేవారికి కనిపించకుండా తలదాచుకోవడం చాలా కష్టంగా అనిపించేది. ఎందుకంటే వాళ్లలో పోలీసు ఇన్ఫార్మర్లే ఎక్కువ. మమ్మల్ని గుర్తు పడితే చాలు, పోలీసులకు సమాచారం వెళ్లిపోయేది. కనీసం పొగకూడా రాకుండా వంట చేసుకునేవాళ్లం. అదెలాగన్నది రహస్యం, చెప్పకూడదు. ఓసారి నేను అయ్య పక్కనే వుండగానే పోలీసులు చుట్టుముట్టారు. చాలాసేపు ఇరువర్గాల మధ్య ఫైరింగ్ జరిగింది. మావాళ్లెవ్వరికీ ఏమీ కాలేదు గానీ కొంతమంది పోలీసులు మాత్రం చనిపోయారు. అయ్య జంతువుల్లా అరిచేవాడంటారు. నిజమేనా? అవును. ఎలా అబ్బిందో తెలియదుగానీ చాలా జంతువుల్లాగే ఆయన అరిచేవాడు. ఆయన అరుపుకి కొండముచ్చులు, జింకలు దగ్గరకొచ్చి ఆయనతో చాలా సన్నిహితంగా వుండటం నేను స్వయంగా గమనించాను. ఆ మిమిక్రీయే పోలీసుల చేతికి చిక్కకుండా ఆయన్ని చాలామార్లు కాపాడింది. కొన్ని రాజకీయ పార్టీల అండ వున్న మాట నిజమేనా? అదేం లేదు. డీఎంకే హయాంలో పోలీసులు ఓ మేరకే నడచుకునేవారు. కానీ జయలలిత ప్రభుత్వంలో పోలీసులకు సర్వాధికారులుంటాయి. నియంతృత్వ ధోరణితో వుంటారు. అయ్యను పట్టుకోవడం కోసం అడవికొచ్చిన పోలీసులు గిరిజన మహిళలపైనా, చిన్నపిల్లలపైనా అత్యాచారానికి పాల్పడేవారు. వారిని తీవ్రంగా హింసించేవారు. దీంతో ఆగ్రహించిన ఆయన.. ‘నువ్వూ ఆడదానివై వుండి, అమాయక ఆడవాళ్లపై ఎందుకు అత్యాచారాలు చేయిస్తున్నావు? నీకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా? ఈ పని చేయించడానికి సిగ్గుగా లేదా?’ అని మీడియాలో ప్రశ్నించాడు. బాధితుల విషయాన్ని వదిలేసిన జయ.. అయ్య ప్రకటన విషయాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. ఆయనపై కక్షగట్టారు. డీఎంకే వారే వీరప్పన్‌కు మద్దతుగా వున్నారని ప్రచారం చేయించారు. అప్పటి నుంచి ఆయనకు అండగా వుండే పార్టీ, వ్యతిరేక పార్టీ అని బయట ప్రచారం జరిగింది. నిజానికి వీరప్పన్ కాంగ్రెస్ అభిమాని. ఎందుకో ఆ పార్టీ అంటే ఆయనకు చాలాయిష్టం. అందుకే అప్పట్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌గౌడ్ కుమారుడు నరేంద్రకు మద్దతు ఇచ్చాడు. ‘‘నేను గెలిస్తే గిరిజన గ్రామాలన్నింటిలో రోడ్లు వేయిస్తా. వారి బాగు కోసం ఏమేం చేయాలో, అన్నీ చేస్తా’’ అని ఆయన అయ్య దగ్గర ఒట్టు వేశారు. దాంతో అయ్య అనుచరులు ఊరూరా తిరిగి ప్రచారం చేయాల్సొచ్చింది. బీజేపీ అభ్యర్థి గ్యారెంటీ విజయం అనుకున్న నియోజకవర్గంలో నరేంద్రను గెలిపించారు జనం. దాంతో అప్పటి సీఎం బంగారప్ప కూడా అయ్య వద్దకొచ్చి కృతజ్ఞతలు చెప్పారు. దీంతో బీజేపీ వారికి మా ఆయనపై కోపం ఏర్పడింది. అది కూడా ఆయన చావుకు కారణమై కూర్చొంది. అయితే గెలిచిన తరువాత నరేంద్ర ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. దాంతో ఆయన చాలా ఆగ్రహంతో వుండేవాడు. రాజకీయనేతల మాటలన్నీ ఇలానే వుంటాయని ఛీత్కరించుకునేవాడు. పోలీసుల చేతిలో ఎంతమంది అత్యాచారానికి గురై వుంటారు? వెయ్యిమందికి పైనే. వీరిలో అత్యాచారంతో పాటు తీవ్రంగా శారీరక చిత్రహింసలకు గురైన వారు 200 నుంచి 300 మంది వున్నారు. జస్టిస్ సదాశివం కమిటీ కూడా ఈ విషయాన్ని నిగ్గుతేల్చి స్పష్టంగా ప్రకటించింది కదా! ఆ బాధితుల కోసం మీరు పోరాటం జరుపుతున్నట్లున్నారు..? ఆ బాధితులకు రూ.10 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని ఆనాడే నా భర్త అడిగాడు. నటుడు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసినప్పుడు ఆయన చేసిన డిమాండ్లలో ఇది కూడా ఒకటి. ఇందుకు తమిళనాడు-కర్నాటక ప్రభుత్వాలు ఆనాడు అంగీకరించాయి. తమిళనాడు ప్రభుత్వ కార్యదర్శి ఈ మేరకు సంతకం కూడా చేశారు. అయితే రెండు ప్రభుత్వాలు కలిపి ఇప్పటి వరకూ రూ.2 కోట్లా 25 లక్షలు మాత్రమే ఇచ్చాయి. మిగిలిన డబ్బు కూడా ఇస్తే ఈ విధి వంచితుల జీవితాలు బాగు పడతాయన్నది నా తాపత్రయం. అందుకోసమే ఈ నా పోరాటం. ఆయన ఓ వందమందిని హతమార్చి వుంటాడా? అయ్యయ్యో, అంతమంది వుండరు. 20 మంది ఉంటారేమో..! ఒకసారి - మందుపాత్రలతో 22 మంది పోలీసుల్ని హతమార్చినట్లున్నాడు కదా? దానిపై నేను మాట్లాడలేను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ పేలుడు వ్యవహారంలో బయటకు తెలిసిందంతా వాస్తవం కాదు. కొంతమంది ఇన్ఫార్మర్లను మాత్రం ఆయన చంపించాడు. ఎందుకంటే ఆయన్ని పట్టిస్తే అంత కోపం వుండేది కాదేమో. కానీ ‘ఫలానా వారికి వీరప్పన్ గురించి తెలుసు’’ అంటూ అమాయకుల్ని పోలీసులకు పట్టించారు. చిత్రహింసలు పాలైన తరువాత వారొచ్చి అయ్య కాళ్లమీద పడి ఏడ్చేవారు. అనుచరులకు, తనని నమ్ముకున్నవారికి ఏమైనా జరిగితే ఆయన తట్టుకోలేడు. అందుకే హత్యలకు పాల్పడ్డాడు. ఓసారి ఫారెస్ట్ అధికారులే జర్నలిస్టులమంటూ ఇంటర్వ్యూ కోసం అడవిలోకి మారువేషాల్లో వచ్చారు. ఆయనకు ఇచ్చిన బిస్కెట్లలో సెనేడ్ కలిపారు. అప్పుడాయన ఏం చేయాలి, మీరే చెప్పండి! స్మగ్లింగ్‌తో వచ్చిన డబ్బంతా అడవిలోని గుంతల్లో దాచాడని చెబుతుంటారు. నిజమేనా? అదంతా అబద్ధం. వచ్చిన డబ్బంతా అనుచరులకే ఖర్చు పెట్టేవాడు. అలా దాచిపెడితే మేమిలా ఎందుకుంటాం? తన కుటుంబం భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోయాడంటారా? ఆయనే కాదు. నేను కూడా ఆలోచించలేకపోయాను. అంతా సవ్యంగా సాగిపోతోందనుకున్నాం. ఓ రోజు నేను అడవిలో పోలీసులకు చిక్కాను. అప్పటి నుంచే నా జీవితం సర్వనాశనమైపోయింది. పోలీసులు నాపై టాడా కేసు పెట్టి, మూడేళ్లు జైల్లో పెట్టారు. చాలా అభ్యర్థనల తరువాత వదిలారు. ఆ తరువాత భర్త వున్నా లేనట్లే కూలీనాలీ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని బతికించుకోవాల్సి వచ్చింది. అయ్య మీకు డబ్బు పంపేవాడు కాదా? లేదు. అప్పట్లో ఆయనకు నామీద కోపం వుండేది. అయ్యను పట్టుకునేందుకు దేవారం బృందం అడవిని జల్లెడ పడుతుండేది. ఆ సమయంలో మహిళలపై పోలీసులు అత్యాచారం చేశారు. అప్పుడు కర్నాటక కోర్టులో పోలీసులకు వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. కానీ నేను భయపడి వారికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదు. దాంతో చాలామంది పోలీసులు బతికిపోయారు. అప్పటి నుంచి ఆయనకు నామీద చాలా కోపం. ఆ కోపంతోనే చాలాకాలం మా గురించి పట్టించుకోలేదు. తరువాత 2000 సంవత్సరంలో కలిశాను. రాజ్‌కుమార్ కిడ్నాప్ వద్దని చెప్పలేదా? నాకు ఆయనతో నేరుగా మాట్లాడటానికి అవకాశం లేకపోయింది. అందుకే రాజ్‌కుమార్‌ను వదలాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశా. రాజ్‌కుమార్ కిడ్నాప్ వ్యవహారం తమిళనాడు-కర్నాటక రాషా్ట్రల మధ్య చిచ్చుబెట్టింది. రెండు రాషా్ట్రల ప్రజలు దాడులు-ప్రతిదాడులకు దిగారు. దీంతో నేను విజ్ఞప్తి చేశా. తరువాత ఆయన్ని అడవిలో కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు కూడా బతిమాలను. రాజ్‌కుమార్ క్షేమంగా వున్నారో, లేదో చూపించాలని వేడుకున్నాను. రాజ్‌కుమార్‌ను దాచిన పొదకు దూరంగా నిలబెట్టి నాతో మాట్లాడారు. నిజానికి ఆయనకు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసేంత తెలివి లేదు. ‘తమిళ ఎళిర్చిపడై’ తీవ్రవాద సంస్థ నిర్వాహకుడు ముత్తుకుమారే ఇదంతా చేయించాడు. ఆ కిడ్నాప్ డబ్బు కోసమే చేసినట్లు ముందుగా నేను గ్రహించలేకపోయాను. రాజ్‌కుమార్‌ను వదలడం కోసం వందకోట్లు చేతులు మారిందట కదా? తమిళనాడు-కర్నాటక ప్రభుత్వాలు రూ.100 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఆ డబ్బు మధ్యలో చాలామంది చేతులు మారింది. వారంతా దొరికినకాడికి కాజేశారు. ఆయనకు చేరింది పదిశాతమే. అందులో మీకూ కొంత చేరిందనీ...? అందితే ఇలా ఎందుకుంటాం? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం! అయ్యతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? 2000 సంవత్సరంలో నేరుగా మాట్లాడాను. ఆ తరువాత క్యాసెట్ల ద్వారానే మాట్లాడుకునేవాళ్లం. వీరప్పన్ ఎన్‌కౌంటర్ బూటకమని మీరు ఎలా చెప్పగలిగారు? ఆయన నమ్మినబంటే మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. దాంతో స్పృహ కోల్పోయిన అయ్యను పట్టుకున్నారు పోలీసులు. చిత్రహింసలు పెట్టి అన్యాయంగా చంపేశారు. ఆ మజ్జిగ ఇచ్చిందెవరో నాకు తెలుసు. అయితే అయ్యను చంపుతారని అతను కూడా అనుకోలేదు. ‘పట్టిస్తే అరెస్టు చేసి జైల్లో పెడతాం, లేకుంటే టీం మొత్తాన్ని చంపేస్తాం’ అని అప్పటి ఐపీఎస్ అధికారి విజయకుమార్ బెదిరించారు. తన బాస్ చనిపోవడం కన్నా ప్రాణాలతో జైల్లో వుండటమే మంచిది కదా అన్న ఉద్దేశంతో ఆ అనుచరుడు మత్తుమాత్రలు ఇచ్చాడు. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసినట్లున్నారు కదా? అవును. 2006లో పెన్నాగరం నియోజకవర్గంలో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశా. ఓట్లు బాగానే వచ్చినా ఓడిపోయాను. అప్పట్లో పీఎంకే-డీఎంకే కూటమి నేతలు నన్ను ప్రోత్సహించలేదు. ఇక రాజకీయాల్లోకి అయితే రాను. వీరప్పన్ శిష్యులు ఇప్పటికీ టచ్‌లో వున్నారా? లేదు. చాలామంది శిష్యులు చనిపోయారు. ఉన్న నలుగురైదుగురు సాధారణ జీవితం గడుపుతున్నారు. వీరప్పన్ మీసం చాలా ప్రత్యేకం. దానికేమైనా కారణం వుందా? (గర్వంగా) ఆ మీసం స్టయిల్ అంటే ఆయనకు చాలా యిష్టం. ఆ మీసంతో ఆయన చాలా గుంభనంగా కనిపించేవారు. కానీ పోలీసులు ఆయన్ని హత్య చేసినప్పుడు ఆ మీసాన్ని కూడా తొలగించి శవాన్ని మీడియాకు చూపించడం దుర్మార్గం. ‘వనయుద్ధం’ అనే సినిమాపై ఏదో కేసు వేసి, నష్టపరిహారం కూడా భారీగానే అందుకున్నట్లున్నారు? అవును. ఆ సినిమాలో అంతా ఏకపక్షంగా చూపించారు. వీరప్పన్‌ని విలన్‌గా చిత్రీకరించారు. నాణేనికి రెండువైపులా చూపితే నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక వైపే చూపించారు. వీరప్పన్‌తో పాటు పోలీసులదీ తప్పుంది. అలాంటప్పుడు ఇద్దరి తప్పూ చూపించాలి కదా! దానిపై నేను సుప్రీంకోర్టు వరకూ వెళ్లా. కోర్టు కూడా నా వాదనే న్యాయమని చెప్పింది. రూ.25 లక్షలు నష్టపరిహారంగా ఇప్పించింది. అందులో లాయర్లకే చాలాపోయింది. మిగిలింది నేను కేసుల నుంచి బయటపడేందుకు ఖర్చు చేశా. మీ ఇద్దరమ్మాయిలు ఏం చేస్తున్నారు? పెద్దమ్మాయి విద్యారాణి ఐఏఎస్ కావాలనుకుంది. కానీ మధ్యలో ఎవరినో ప్రేమించి వెళ్లిపోయింది. తన తండ్రి వల్ల నేనెన్ని కష్టాల పాలయ్యానో ఆమెకు తెలుసు. నా ఇద్దరు బిడ్డల్ని బతికించుకునేందుకు నేనెంత నరకం అనుభవించానో కూడా తెలుసు. కానీ ఆమె అన్నీ మరచి, నన్ను వదిలేసి తనదారి తను చూసుకుంది. ఆమెకు మాతో సంబంధాలన్నీ తెగిపోయాయి. రెండో అమ్మాయి నా దగ్గరే వుంటోంది. ఇంగ్లీ్‌ష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వీరప్పన్ అడవిదొంగగానే ప్రపంచానికి తెలుసు. కానీ మీరేమో ఆయన్ని ‘అడవి తల్లిని కాపాడిన ముద్దుబిడ్డ’గా ప్రచారం చేస్తున్నారు? అయ్య కేవలం దొంగే అయితే ఆయన కోసం అన్ని వందలమంది ప్రాణాలిచ్చేవారా? పోలీసులు తమ శీలాన్ని దోచుకున్నా, హింసించినా అంతమంది మహిళలు నోరు విప్పలేదే! ఎందుకని? ఆయన మంచి చేయబట్టే కదా? అడవిలో ఎండిపోయిన, కాలం తీరిన వృక్షాలనే ఆయన నరికించి వ్యాపారం చేశారు. అది కూడా చాలా తక్కువ మోతాదులో. చనిపోయిన వన్య ప్రాణుల శరీర భాగాలనే అమ్ముకున్నారు. అంతమాత్రాన ఆయన మంచివాడని నేను చెప్పడం లేదు. ఆయన వున్నప్పుడు గిరిజనుల కుటుంబాలు పచ్చగా వున్నాయి, అటవీశాఖాధికారులు కూడా భారీగా మామూళ్లు తీసుకునేవారు. వీరప్పన్ ఉన్నాడన్న భయంతో ఎవ్వరూ సత్యమంగళం అడవుల వైపు కన్నెత్తి చూసేవారు కాదు. కానీ ఇప్పుడు చూడండి, గొడ్డలి పట్టినవాడల్లా ఎర్రచందనం చెట్లను ఎలా నరుకుతున్నాడో! అడవితల్లిని ఎలా ముక్కలుముక్కలు చేసేస్తున్నారో.. వెళ్లి చూడండి మీకే తెలుస్తుంది. ఆ అడవితల్లి అప్పుడెలా వుంది, ఇప్పుడెలా వుంది? ఆ ఒక్క తేడా గమనిస్తే చాలు. తిరుమల అడవుల్లో కూడా వీరప్పన్ అనుచరులు పని కానిచ్చేస్తున్నారనీ..! మీకేమైనా తెలుసా? తిరుమల అడవుల్లోకి వీరప్పన్ అనుచరులు జొరబడ్డారని, వారే ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారని ఏపీ మంత్రి ఒకరు చెప్పినట్లు నేను కూడా విన్నాను. అయ్యా మంత్రిగారూ! ఆంధ్రప్రదేశ్‌లోకి మా ఆయనే అడుగు పెట్టలేదు, ఇక ఆయన అనుచరులెలా వస్తారు? ఆయన అనుచరుల్లో 95 శాతం మంది ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. మిగిలిన 5 శాతంలో చాలామంది చేపలవేటతో ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇంకొంతమంది జైళ్లలో వున్నారు. తిరుమల వైపు వీరప్పన్ అనుచరులెవ్వరూ రాలేదు. మొదటి నుంచీ ఇదే జరుగుతోంది. తప్పుడు పనులకు పాల్పడే ప్రతివాడూ వీరప్పన్ పేరునే వాడుకుంటున్నాడు. ఇప్పుడూ అదే జరుగుతోంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. ఎక్కడే తప్పు జరిగినా వీరప్పన్‌పై వేయడం ఫ్యాషనైపోయింది. ఎక్కడైనా స్మగ్లింగ్, దొంగతనం జరిగినా ఆ వ్యక్తిని వీరప్పన్‌తో పోలుస్తున్నారు. అయ్యా! వీరప్పన్ తప్పులు చేశాడు. కానీ ఆ తప్పుల వెనుక ఎన్నో వందల కుటుంబాలకు ఆశ్రయం వుంది. అయ్యకు గుడి కట్టాలనుకుంటున్నారా? గుడి కాదు గానీ స్మారకమందిరం కట్టాలన్న ఆలోచన వుంది. ఆయన్ని పోలీసులు ఎప్పుడు హతమార్చారో తెలియదుగానీ, అక్టోబర్ 18వ తేదీన మీడియాకు చూపించారు. అందువల్ల దానినే ఆయన వర్ధంతిగా భావిస్తున్నాం. ఆరోజున మూలక్కాడులోని ఆయన సమాధివద్ద ప్రత్యేక పూజలు జరుపుతున్నాం. వందలమంది గిరిపుత్రులు ఆరోజున అయ్య సమాధివద్దకు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. స్మారకమందిరం కట్టాలన్నది వారి ఆలోచనే. అయితే ఆ సమాధి వున్న ప్రాంతం రెవెన్యూశాఖ ఆధీనంలో ఉన్న కారణంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదు. ఫోటోలు: కర్రి శ్రీనివాస్ (తమిళనాడులోని కుళ్లమడనూరు నుంచి) |
Disclaimer : None of the Posts in this blog are mine. They were collected only for the reference purpose from various websites. Viewers may visit source websites for further study.
Sunday, 9 November 2014
వీరప్పన్ - పేదోళ్ల స్మగ్లర్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment