Friday 8 July 2016

పవిత్ర సంగమ ప్రాంతంలో..దుర్గమ్మ నమూనా ఆలయం

పవిత్ర సంగమ ప్రాంతంలో..దుర్గమ్మ నమూనా ఆలయం
08-07-2016 07:06:50

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాలకు విచ్చేసే భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఒక నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని, ఈ ఆలయాన్ని కృష్ణవేణికి నిత్య నవహారతులిచ్చే పవిత్ర సంగమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులను ఆదేశించారు. దుర్గగుడిలో జరిగే పూజా కార్యక్రమాలు, హారతలు నమూనా ఆలయంలో కూడా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.

భక్తులకు సౌకర్యంగా..
పుష్కరాలకు విచ్చేసే పుష్కర యాత్రికులు రోజుకు పది లక్షలకు పైగా ఉంటారని, సెలవు దినాలయితే ఈ సంఖ్య 25 లక్షలు దాటుతుందని ప్రభుత్వ అధికారుల అంచనా. అన్ని లక్షల మంది భక్తులకు దుర్గమ్మ దర్శనం దుర్లభమని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అటువంటి సమస్య తలెత్తకుండా సంగమ ప్రాంతంలో కనకదుర్గమ్మ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులను సీఎం ఆదేశించారు. నమూనా ఆలయంలో కూడా పూజాదికాలు దుర్గగుడి అర్చకుల ఆధ్వర్యంలో జరగుతాయి. భక్తులకు ఉచిత ప్రసాద పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు ఇంటికి ప్రసాదాన్ని తీసుకువెళ్లేందుకు వీలుగా పంచ పదార్థాల మిశ్రమం భవానీ ప్రసాదం, లడ్డు ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతారు. వీటితో పాటు అమ్మవారి ఉచిత కుంకుమ ప్రసాదాన్ని కూడా భక్తులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నమూనా ఆలయం చుట్టూ గ్రీనరీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను ప్రతి రోజూ లక్ష మంది దర్శించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని దుర్గగుడి అధికారులను సీఎం ఆదేశించారు.

పీఠాధిపతులకు ప్రత్యేక ఆహ్వానం
పవిత్ర పుష్కరాలను వైదిక సంప్రదాయాల ప్రకారం నిర్వహించాలని, నిర్వహణపై పీఠాధిపతులతోనూ, స్వామిజీలతోనూ సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయాలని కొంత కాలంగా పలువురు పీఠాధిపతులు డిమాండు చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పుష్కరాల సందర్భంగా పవిత్ర సంగమ ప్రాంతంలో కృష్ణవేణికి ప్రతి రోజూ నిర్వహించే నిత్య నవ హారతలకు అన్ని పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులను, స్వామిజీలను ఆహ్వానించాలని సీఎం సంకల్పించారు.

సంగమ ప్రాంతంలో
సాంస్కృతిక కార్యక్రమాలు
పుష్కరాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఆధ్మాత్మికతతో పాటు తెలుగు సంస్కృతి, కళా వైభవాలను చాటి చెప్పేందుకు సంగమ ప్రాంతంలో తెలుగు సాంస్కృతిక వైభవ కళావేదికను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేదికపై ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు జానపద, చారిత్రక, పౌరాణిక నాటకాలతో పాటు తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖలపై చిత్ర మాలికను ప్రదర్శించనున్నారు. ఈ కళావేదిక నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ భాషా- సాంస్కృతిక శాఖకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు అందరినీ ఆకట్టుకునేలా సప్తవర్ణాల లేజర్‌ షోను ప్రతి రోజూ రాత్రి వేళల్లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

దేవినేని కంటే హరీష్ ప్రజంటేషన్‌కే మార్కులంట..

ప్రాజెక్టుల వివాదంలో దేవినేని కంటే హరీష్ ప్రజంటేషన్‌కే మార్కులంట..
08-07-2016 08:42:10



ఢిల్లీలో ఏపీ కంటే తెలంగాణ నేతలు అడ్వాన్స్ గా ఉన్నారా? రాష్ట్రానికి సంబంధించిన రాయబారాలను తెలంగాణ నేతలు నడిపినంత వేగంగా ఏపీ నేతలు చక్కబెట్టలేకపోతున్నారా? హస్తినలో తెలంగాణ నేతలకు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటి? ఏ విషయంలో తెలంగాణ నేతలతో తాము పోటీ పడలేకపోతున్నామని ఏపీ నేతలు మధనపడుతున్నారు? వీటి కధనమేమిటో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్‌ నేతలకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టడంలో తమ కంటే తెలంగాణ నేతలు ఫాస్ట్ గా ఉన్నారని వారు భావిస్తున్నారు. ఒక పని కోసం తాము పది సార్లు తిరిగినా కానిది, తెలంగాణ నేతలు రెండు సార్లు తిరిగితే అయిపోతున్నదట..! అలా కావడం పట్ల వారేమీ ఈర్ష్య చెందడం లేదట! కాకపోతే తమ పని కావడం లేదన్న బాధ మాత్రం ఉందట...! ఇంతకీ ఈ సమస్యకు మూలం ఏమిటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం... భాష! ఆశ్చర్య పోకండి. అవును...ఆంధ్రప్రదేశ్‌ నేతలు ఢిల్లీలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారట. ఈ విషయాన్ని ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలే చెబుతున్నారు. ఢిల్లీలో తమకు మహా చిక్కొచ్చి పడిందంటున్నారు వారు. చంద్రబాబు కేబినెట్ మంత్రులు, టీడీపీ ఎంపీలలో చాలా మందికి హిందీ రాదు. వచ్చిన వారికి అరకొరనే. ఢిల్లీలో తమ రాష్ట్రానికి రావాల్సిన అంశాల పై అక్కడ అధికారులకు సరైన ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారట వారు. వచ్చీ రాని భాషలో చేసే కమ్యూనికేషన్ ఢిల్లీ అధికారులను ఆకట్టుకోలేకపోతోందని ఓ సీనియర్ నేత వాపోయారు. ఈ విషయంలో తెలంగాణ నేతలు అడ్వాన్స్ గా ఉన్నారని సదరు నేత చెప్పుకొచ్చారు.

           దీనికి కొన్ని ఉదాహరణలు సైతం వివరించారు. ఏపీకి చట్ట ప్రకారం రావాల్సిన చాలా ప్రాజెక్టులు, నిధుల విషయంలో ఒకటికి పది సార్లు తిరుగుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదట. ఉదాహరణకు... రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా ఇంత వరకు లోటు తీర్చ లేదని చెబుతున్నారు. చంద్రబాబు ఇరవై సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా తిప్పి కొడితే మూడు వేల కోట్లకు మించి రాలేదని గుర్తు చేస్తున్నారు. పోలవరం విషయంలో సేమ్ టు సేమ్ అంటున్నారు. రాజధాని నిధుల విషయంలోను సంతృప్తికర స్థాయిలో అందలేదనే చెబుతున్నారు. రైల్వే జోన్ గురించి చెప్పనక్కర లేదు. ఇవన్నీ చట్టంలో ఉన్న అంశాలే. అయినా, పెద్దగా ఫలితం లేని పరిస్థితి అంటున్నారు వారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే... ఆ మధ్య నీతి అయోగ్ సభ్యులు తెలంగాణలో పర్యటించారు. మిషన్ కాకతీయ పథకాన్ని పరిశీలించారు. దీని కోసం మూడు వేల కోట్లు ఇవ్వాల్సిందిగా నీతి అయోగ్ ను తెలంగాణ సర్కారు కోరిందట. అడిగిందే తడవుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా కేంద్రానికి నీతి అయోగ్ రికమండ్ చేసిందట. వెనకబడిన జిల్లాల కోసం మరో నాలుగు వందల కోట్లు ఇచ్చారట. మరో నాలుగు వందల కోట్లు ఇవ్వాల్సిందిగా తెలంగాణ సర్కారు కోరిందట. దానికి సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు.
 
                ఇక సాగునీటి ప్రాజెక్టుల వివాదం విషయంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఉమ్మడి సమావేశాలు జరిగాయి. అందులో హరీష్ రావు ఇచ్చినంత చక్కటి ప్రజెంటేషన్, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఇవ్వలేక పోయారట! అదే మంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అంటున్నారు. ఢిల్లీలో పెద్ద స్థాయి అధికారుల్లో మెజారిటీ హిందీ వారే కావడం తమకు ఇబ్బందిగా ఉందని ఏపీ నేతలు వాపోతున్నారు. మెజారిటీ తెలంగాణ నేతలకు హిందీ భాష పై పట్టుంది. వారు ఏ అధికారి వద్దకు వెళ్లినా తాము చెప్పదలచుకుంది సూటిగా, స్పష్టంగా చెబుతున్నారట. ఏపీ నేతల పరిస్థితి దీనికి రివర్స్. దీంతో తెలంగాణ నేతలతో ఢిల్లీ అధికారులు కనెక్ట్ అవుతున్నారు. ఏపీ వాళ్లను కొంత మేర పరాయి వారిగా చూస్తున్నారట. దీనిపై ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ సమస్య లేదని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు చెప్పి, తమ ముఖ్య నేతలకు హిందీ క్లాసులు పెట్టిస్తే బాగుంటుందని సదరు నేత అభిప్రాయపడ్డారు. మరి ఈ ప్రతిపాదనకు చంద్రబాబు ఏమంటారో!