Thursday 6 November 2014

కాలుష్య గోదావరి

కాలుష్య గోదావరి
ప్రజల నిర్లక్ష్యంతో పెను ముప్పు!
పరిశ్రమల నుంచి రసాయన 


వ్యర్థాలతో నీరు విషతుల్యం
ఎరువులు, పురుగుమందులతోనూ
ముంచుకొస్తున్న ముప్పు
తగ్గుతున్న పంట దిగుబడులు
పెరుగుతున్న కేన్సర్‌, ఇతర వ్యాధులు
ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌
టెక్నాలజీ నివేదిక

ఒకచోట మంద్రంగా, గంభీరంగా.. ఒకచోట ఉరుకుల పరుగులతో.. పచ్చటి ప్రకృతి గుండా సాగిపోయే వేదమంటి గోదావరి.. క్రమంగా కాలుష్య కాసారంగా మారిపోతోంది(అంతరచిత్రం)! పారిశ్రామిక వ్యర్థాలు, ఎరువులు, పురుగుమందుల విషంతో ఘోష పెడుతోంది!!
గోదావరి పరీవాహక ప్రాంతం మొత్తం విస్తీర్ణం 1.86 కోట్ల హెక్టార్లు. దీనిలో సగానికి పైగా వ్యవసాయానికి యోగ్యమైనదే. గోదావరి కాలుష్యంలో 18 శాతం మాత్రమే పరిశ్రమల వల్ల వస్తోంది. మిగిలినదంతా ప్రజలు వదిలే వ్యర్థాలు, వ్యవసాయానికి ఉపయోగించే ఎరువుల వల్ల జరుగుతోంది. ప్రజల్లో ఈ విషయమై అవగాహన పెంచగలిగితే కాలుష్య ముప్పు కొంచెమైనా తగ్గినట్టే.
ఆధునిక టెక్నాలజీయే శరణ్యం
ఈ ముప్పు నుంచి ప్రజలను కాపాడాలంటే.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో మొత్తం గోదావరి పరీవాహక ప్రాంతాన్ని సర్వే చేయించాలి. మానవ రహిత విమానాలు, రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీలు, వెబ్‌ సెన్సర్‌ బేస్డ్‌ టెక్నాలజీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ‘‘విదేశాలలో ఈ టెక్నాలజీలను ఉపయోగించి కాలుష్య కారకాలను కనుగొంటున్నారు. ఉదాహరణకు ఽథాయ్‌లాండ్‌లో కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులను టెక్నాలజీ ద్వారా కనుగొని ముందే నివారించగలుగుతున్నారు. దీనిని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కూడా అమలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి’’ అని ప్రొఫెసర్‌ నితిన్‌ అభిప్రాయపడ్డారు.
పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలతో నీరు విషతుల్యం
ఎరువులు, పురుగు మందుల వినియోగమూ అధికం
తగ్గుతున్న పంట దిగుబడి.. పెరుగుతున్న ప్రాణాంతక వ్యాధులు
ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నివేదిక
ఆంధ్రజ్యోతి-బుద్ధవరపు ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న
‘స్వచ్ఛ గోదావరి’ పరిశీలనలో ఆందోళనకర అంశాలు

పచ్చటి పంటలతో అలరారే గోదావరి పరీవాహక ప్రాంతానికి పెనుముప్పు ముంచుకొస్తోంది! స్వచ్ఛమైన జలాలతో ఉరుకుల పరుగులిడే గోదారి తల్లి కాలుష్యకాసారంగా మారిపోతోంది!! కాలకూట విషాల్లాంటి పారిశ్రామిక వ్యర్థాలు.. నిండు ప్రాణాలకు మరణశాసనం రాసే ఎరువులు, పురుగుమందుల అవశేషాలు.. ఆ జీవనదిని ప్రాణాలు తీసే విషమయ కాళింది మడుగులా మార్చేస్తున్నాయి. ఫలితం.. పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. కేన్సర్లు పెరిగిపోతున్నాయి. ఆంధ్రజ్యోతి- బుద్ధవరపు ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న స్వచ్ఛగోదావరి కార్యక్రమం కోసం.. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏఐటీ) గోదావరి పరీవాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను ప్రత్యేకంగా
విశ్లేషించి ఇచ్చిన నివేదికలో మోగిన హెచ్చరిక గంటలివి! ఈ ప్రమాదానికి కారణాలేవని అడిగితే... పరిశ్రమలు వదిలే రసాయనాలు.. రాజమండ్రి సమీపంలోని
పేపర్‌ మిల్లులు విడిచే విషాలు.. ప్రజల నిర్లక్ష్యం... ఇలా తిలాపాపం తలా పిడికెడు అని తేలుతోంది!!
స్వచ్ఛమైన గోదావరి కాలుష్య కాసారమయిపోతోంది. ఇప్పుడే మేల్కొని జాగ్రత్త పడకపోతే గోదావరి పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలకు అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఉపగ్రహాల ద్వారా కాలుష్యాన్ని పరిశీలించి, విశ్లేషించి- వివిధ దేశ ప్రభుత్వాలకు సలహాలను ఇచ్చే ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఏఐటీ) గోదావరి పరీవాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను... ఆంధ్రజ్యోతి- బుద్ధవరపు ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న స్వచ్ఛగోదావరి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పరిశీలించి ఇచ్చిన నివేదికలో అంశాలివి. ఈ కాలుష్యం వల్ల గోదావరి పరీవాహక ప్రాంతంలో వ్యవసాయ దిగుబడి తగ్గిపోతోందని.. ప్రజలలో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని శాటిలైట్‌ చిత్రాలను విశ్లేషించిన ఏఐటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నితిన్‌ కుమార్‌ త్రిపాఠి, డాక్టర్‌ సంతోష్‌ చౌదురిల బృందం తేల్చి చెప్పింది. గోదావరిలో కాలుష్యానికి హైదరాబాద్‌ నుంచి విడుదలయ్యే రసాయనాలే ప్రధాన కారణమని కూడా ఈ బృంద అధ్యయనంలో తేలింది.
కారణాలు రెండు...

సాధారణంగా నదులు రెండు రకాలుగా కలుషితమవుతాయి. ప్రజల అవసరాల కోసం, వ్యవసాయం కోసం ఉపయోగించే పదార్థాల వల్ల కలిగే కాలుష్యం ఒక రకమైతే.. పరిశ్రమలు విషపూరిత వ్యర్థాలను నీటిలోకి వదలటం వల్ల ఏర్పడే కాలుష్యం మరొకటి. గోదావరిలో 82 శాతం కాలుష్యానికి కారణం మొదటిదే. పరిశ్రమల కాలుష్యం 18 శాతమే అయినప్పటికీ.. ఆ వ్యర్థాల వల్ల నది నీరు కలుషితం కావటం మాత్రమే కాక ప్రజలకు ప్రమాదకరమైన జబ్బులు కూడా వస్తాయి. వ్యవసాయ దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ఏఐటీ చేసిన విశ్లేషణలో ఈ రెండు విషయాలూ రుజువయ్యాయి. ‘‘గోదావరిలో కాలుష్యం పెరగటం వల్ల ఈ నది పరీవాహక ప్రాంతంలోని నేలల్లో ఐరన్‌, జింక్‌, కాపర్‌, కోబాల్ట్‌, కేడ్మియం వంటి హెవీ మెటల్స్‌ చేరి, నేలలు కూడా కలుషితమవుతున్నాయి. ఈ కాలుష్యం లేని సమయంలో.. ఇక్కడ వరి దిగుబడి ఎకరాకు 40 బస్తాల దాకా ఉండేది. ఇప్పుడది 10 బస్తాలకు పడిపోయింది. దీని ప్రభావం కేవలం వ్యవసాయోత్పత్తిపైనే కాదు. ఈ నేలల్లో పండే ఆహారాన్ని తినడం వల్ల పశువులకు మనుషులకు కూడా రకరకాల జబ్బులు వస్తున్నాయి. యువకుల్లో రక్త కేన్సర్‌, పొగ త్రాగని వారిలో సైతం లంగ్‌ కేన్సర్‌, లివర్‌ కేన్సర్‌ కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వాలు ఈ కేసులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించుకోకపోతే భవిషత్తు తరాల వారికి చాలా హాని కలుగుతుంది..’’ అని ప్రొఫెసర్‌ నితిన్‌ స్పష్టం చేశారు. ఇక.. ‘‘సాధారణంగా పారిశ్రామిక వ్యర్థాలు ఒక చోట పేరుకుపోవు. నీటి ప్రవాహ వేగంతో నెమ్మదిగా ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్తాయి. అవి ఎంత దూరం ప్రవహిస్తే అంత దూరం నీరు కలుషితమవుతూ ఉంటుంది’’ అని పర్యావరణ ఉద్యమకారుడు సందీప్‌ వెల్లడించారు.
ప్లాంట్ల వల్ల ప్రయోజనం లేదు..
రాజమండ్రిలోని నల్లా చానల్‌లో లీకేజీ ఉందని ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. సాధారణంగా.. రాజమండ్రి నగరంలో నుంచి విడుదలయ్యే వ్యర్థాలు ఈ నల్లా చానెల్‌లో పొంగిపొర్లుతూ ఉంటాయి. రాజమండ్రి నుంచి పైకి వెళ్లే గోదావరి అప్‌సీ్ట్రమ్‌లో పీబీ అండ్‌ సీయూ (సీసం, రాగి) రసాయనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయం కోసం ఉపయోగించే ఎరువులే దీనికి ప్రధానమైన కారణమని ఈ అధ్యయనంలో తేలింది. దేశంలో సగటున ఒక హెక్టారుకు 25 కిలోల మేర ఎరువులు వినియోగిస్తుంటే.. ఇక్కడ 50 కిలోల దాకా వాడుతున్నారు. పురుగు మందుల వాడకం కూడా చదరపు కిలోమీటరుకు 146.47 కిలోల చొప్పున ఉంది. వీటిలో 79 శాతం ఆర్గానోక్లోరిన్సే.. వీటన్నింటి వల్లా నీరు విషతుల్యంగా మారిపోయి తాగడానికి ప్రమాదకరంగా మారుతోంది. ఈ సమస్యకు తోడు... గోదావరి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో పేపరు మిల్లుల వల్ల కూడా నదికి తీవ్రమైన హాని కలుగుతోంది. ఈ మిల్లుల వ్యర్థాల వల్ల నీటిలో ఆక్సిజన్‌ శాతం చాలా తగ్గిపోతుంది. హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ శాతం బాగా పెరుగుతుంది. నీటి రంగు కూడా నల్లగా తయారవుతుంది. చెడు వాసన వస్తూ ఉంటుంది. పేపర్‌ మిల్లులు వ్యర్థాలు వదిలే ప్రాంతంలోని నీటిలో మైలతుత్తం బాగా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అల్యూమినియం హైడ్రాక్సైడ్‌ శాతం బాగా పెరుగుతుంది. ఉపగ్రహ చిత్రాలలో కూడా కలుషితమయిన నీటికి- కలుషితం కాని నీటికి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది. ‘‘కలుషితం కాని నీటిలో చేపలు పెరగడానికి అనువైన వాతావరణం ఉంటుం ది. ఒక ప్రాంతంలో నీరు స్వచ్ఛంగా ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఇదే నిదర్శనం. సాధారణంగా ఒక లీటరు వ్యర్థ రసాయనానికి 500 లీటర్ల నీటిని కలిపితే దాని సాంద్రత తగ్గి, ప్రభావం కూడా తగ్గుతుంది. అందువల్ల ఫ్యాక్టరీలు వ్యర్థాలను శుద్ధి చేసి మాత్రమే నదిలోకి వదలాలి. కానీ ఏ పేపర్‌ ఫ్యాక్టరీ ఆ పని చేయట్లేదు. ఒకవేళ అది కుదరకపోతే.. బాగా వరద వచ్చినప్పుడు వదిలితే ఆ వేగానికి కాలుష్య సాంద్రత గణనీయంగా తగ్గిపోతుంది’’ అని ప్రొఫెసర్‌ నితిన్‌ వెల్లడించారు. పరిశ్రమల కాలుష్యం, ఎరువులు-పురుగుమందుల అవశేషాల సంగతి పక్కన పెడితే.. నది ఒడ్డున మానవ వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఆస్పత్రి వ్యర్థాలను పెద్ద ఎత్తున పడేస్తున్నారు. వీటిని తొలగించడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా వాటి వల్ల ఫలితమేమీ లేదు. నీటి శుద్ధి నిమిత్తం రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌.. పుష్కర ఘాట్‌ సమీపంలో ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో మూడు రోజుకు పది లక్షల లీటర్ల నీరు శుద్ధి చేయటానికి, మరో రెండు సగటున 9 లక్షల లీటర్ల నీరు శుద్ధి చేయటానికి ఉపయోగపడతాయి. అయితే చాలా సమయాల్లో విద్యుత్‌ లేకపోవడం వల్ల ఈ ప్లాంట్లు పనిచేయకపోవడంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. 

- స్పెషల్‌ డెస్క్‌

గోదావరిని కబళిస్తున్న కాలుష్యం

  • 05/11/2014
రాజమండ్రి, నవంబర్ 4: గోదావరి నదిని కాలుష్యం కబళిస్తోంది. కోట్లాది మందికి తాగునీరు, సాగునీరు అందిస్తున్న అత్యంత పవిత్రమైన గోదావరి నది కలుషితమవుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో కనీసం తాగునీరు, సాగునీరు కూడా లభించదేమోన్న ఆందోళన కలుగుతోంది. తెలుగు ప్రజలకు గోదావరి నది జీవనాధారం. అలాంటి జీవనాధారమైన గోదావరి నదిలో పరీవాహక ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, పల్లెల నుండి వచ్చే వ్యర్ధాలు, పరిశ్రమలు విడుదలచేసే కాలుష్యం కారణంగా ప్రమాదకర స్థాయిలో గోదావరి నది కలుషితమవుతోంది. పారిశ్రామిక వ్యర్ధాలు కూడా ఒక సమస్యే అయినప్పటికీ, గోదావరి నదికి ఇళ్ల నుండి విడుదలయ్యే వ్యర్ధాలే అతి పెద్ద ప్రమాదంగా తయారయ్యాయి. గోదావరి కాలుష్యంలో 82శాతం వాటా ఇళ్ల నుండి విడుదలయ్యే వ్యర్ధాలదే. మిగిలింది పరిశ్రమల వాటా. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సాగవుతున్న భూముల్లో వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులు కూడా గోదావరి కాలుష్యానికి కారణమవుతున్నాయి. హెక్టారుకు 49.34కేజీల ఎరువులు, చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 146.47కేజిల పురుగు మందులు వినియోగిస్తున్నట్టు అంచనా. ఇలా కలుషితమైన గోదావరి నీటినే తిరిగి వ్యవసాయ రంగానికి వినియోగిస్తుండటం వల్ల ఇప్పటికే గతం కన్నా దిగుబడి బాగా తగ్గింది. గోదావరి కాలుష్యం కారణంగా భూగర్భజలాలు కూడా కలుషితమై దీని ప్రభావం వ్యవసాయోత్పత్తులు, పశువులు తినే గడ్డిపై కూడా పడి స్వచ్ఛమైన పాలు కూడా లభించని ప్రమాదం ఏర్పడుతోంది. నది ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు, గ్రామాల నుండి విడుదలవుతున్న వ్యర్ధాలతో ఇప్పటికే గోదావరి గట్లు చాలా చోట్ల నిండి ఉన్నాయి. ఈ పాపంలో రాజమండ్రి నగరానిదే ఎక్కువ భాగంగా కనిపిస్తోంది. గోదావరి ఎగువ నుండి తీరం వెంబడి ఉన్న వ్యర్ధాలు ఒక ఎత్తయితే, రాజమండ్రి నగరం పరిధి ప్రారంభం నుండి తీరం వెంబడి ఉన్న వ్యర్ధాలు మరో ఎత్తు. నగరంలోని చిన్న, పెద్ద పరిశ్రమల నుండి విడుదలవుతున్న కాలుష్యం గోదావరి నది స్వచ్ఛతను దెబ్బతీస్తున్నాయి.నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్నంత దూరం నది ఒడ్డున ప్లాస్టిక్, ఇతర చెత్తా చెదారం తెట్టులా తేలియాడుతూ కనపిస్తుంటాయి. ఇంత కన్నా దారుణం ఏమిటంటే రాజమండ్రి నగరంలోని పుష్కర్‌ఘాట్‌కు ఎగువన, నగరంలోని ఇళ్ల నుండి విడుదలయ్యే మురుగు నీరు కలుస్తుంటే, పుష్కర్‌ఘాట్‌కు దిగువన నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం నగరపాలకసంస్థ నీటిని తోడుతోంది. అంటే ఎగువన అత్యంత దారుణమైన మురికి నీటిని నదిలో కలిపి, దిగువన తాగునీటిని తీసుకుంటున్నామన్న మాట. పేరుకు నిర్మించిన మురికినీటి శుద్ధి ప్లాంటు సమర్ధవంతంగా పనిచేయటం లేదు. ఇక పేపరు మిల్లు కాలుష్యంపై చాలా ఏళ్లుగా జనం ఆందోళన సాగిస్తున్నా, తాము మాత్రం శుద్ధిచేసిన నీటినే విడుదలచేస్తున్నామంటూ మిల్లు యాజమాన్యం చెబుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గోదావరి నదిని ఇలాగే వదిలేస్తే గంగకు పట్టిన గతే గోదావరి నదికి పట్టడానికి ఎంతో కాలం పట్టదు. ఈ పరిస్థితుల్లో గంగా నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో, అలాంటి చర్యలనే గోదావరి ప్రక్షాళనకు ఇప్పటి నుండే తీసుకోవాలని జనం కోరుతున్నారు.

కాలుష్య నివారణే గోదావరికి హారతి - తల్లావఝ్ఝల పతంజలి శాస్రి  

సృష్టిలో మనిషికి కేంద్ర స్థానం గానీ, ఆధిపత్యం గానీ లేదని చెబుతూ, ప్రాచీన భారతీయులు, మనిషి కూడా ఇతర ప్రాణికోటిలో భాగమని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ సంస్కృతీ భారతీయ సంస్కృతి వలె ప్రకృతితో మమేకం కాలేదు. మన పూర్వజుల ప్రాపంచిక దృక్పథం, ఆధ్యాత్మిక భావన, సృజనాత్మక వ్యవహారం, కళ, జీవన సర్వస్వం జీవావరణ వ్యవస్థలలో వేరూనాయి. మన భౌతిక ఆధ్యాత్మిక జీవనం పశుపక్ష్యాదులతో ముడిపడి ఉంటుంది. దైవీకరణం, దైవత్వ భావన పశుపక్ష్యాదులనే కాక నీటి వనరుల్ని కూడా ఆరాధనీయం చేశాయి. ఇంతటి నమ్రభావం మరే ప్రాచీన సంస్కృతిలోనూ ఇంత గాఢంగా కనిపించదు. ఈ విలక్షణతలోని ఆశ్చర్యకరమైన జీవలక్షణం వైవిధ్యం. ఇంతటి వైవిధ్యం ఉన్న ఏకత్వం కూడా మరెక్కడా కనిపించదు. మన పూర్వజులకి ఈ సృష్టి, దీని నియతి అవగాహన అయినట్టుగా, మనిషికి మౌలికంగా ఏర్పడే అస్తిత్వ భావన అర్థం అయినట్టుగా మనకి అటువంటి వారసత్వాన్ని భుజానికెత్తుకోవడం తెలిసింది గానీ ఆకళింపు అయినట్టు తోచదు. అందువల్లనే మనం కర్మకాండనే మతం అనుకుంటున్నాం. వస్తువునీ ప్రతీకనీ విడదీసి చూడ్డం అలవాటు కావడం లేదు. ఆఖరికి వారు వాడిన శబ్దజాలం, నిగూఢమైన అర్థం మనకి అందకుండా పోయాయి. ఒక శబ్దానికి స్ఫురించే అర్థం ఒకటి కాకుండా గౌణమైన మరొక భావనకి చెందిన వ్యవహారమని అర్థం కావడం లేదు.
అయిదారు శతాబ్దాల నుంచీ గడ్డకట్టిన భావజాలంలో మొలకెత్తినదే మన ద్వంద్వ ప్రమాణం, ప్రతి భారతీయుడి అంతః శ్చేతనలో నది అంతర్వాహిని. మనకి ఎప్పుడూ నది కేవలం నీరు కాదు. భూమి ఎప్పుడూ మట్టికాదు. నదీ నదాలు ప్రాణం తో తొణికిసలాడే ప్రాణధారలు. వాటి ప్రాణ చైతన్యం వలె జలజీవరాశి చలిస్తూంటుంది. ప్రాణధారలో వినయంగా నిలబడి సమస్త ప్రాణకోటికీ ప్రాణప్రసాదం చేసిన సూర్యుడికి ఉద యమే కృతజ్ఞతలు చెప్పుకుంటాం. చదువులో, పాండిత్యంలో ఏ మాత్రం సంబంధం లేని ప్రతిప్రాచీన భారతీయుడూ మంత్రోచ్ఛాటన చేస్తూ కాదు, నిశ్శబ్దంగా నమస్కరించాడు. గంగకీ, గోదావరికీ హారతినివ్వడం ఒక కోలాహలమైన ఆచారం ఇప్పుడు, ఇది కార్తీక మాసం, నదుల్లో తెలవారకుండా అరటి దోనెల్లో ప్రాణంలా కదులుతూ దీపాలు చీకటి వైపు సాగుతూంటాయి. వీళ్లెవరికీ దీపాల కింద నదులెంత దుస్థితిలో ఉన్నాయో అవసరం లేదు. ఒక వ్యర్థ నమస్కారం, అర్థం కాని ఒక మంత్రం చాలు. నదులు మనకి పవిత్రం. ఇప్పటికీ వాటి శుభ్రతతో మనకి సంబంధం లేదు. ప్రపంచంలో ఏ దేశంలోనూ బహుశా గంగవంటి పవిత్రమైన నదీ, మురికీ నదీ ఉండదు. నదీ నదాలు, చెరువులు, బీట భూములు అన్నీ క్రమంగా ప్రమాదకరమైన మురికి పాలబడ్డాయి. గ్రామాల్లో ఎవరూ ఊరి చెరువుని నిర్మలంగా అందంగా ఉంచుకోవాలని ప్రయత్నించరు. ప్రభుత్వమే ఆ పని చెయ్యాలని వారి ఉద్దేశం, చెరువు అంటే చేపలు పెంచుకుని అమ్ముకోవడానికి ఉపయోగించే నీళ్ళనే నమ్మకం బలంగా ఉంది. చేపల చెరువులకీ సహజమైన సరస్సులకీ తేడా చూడలేని దుస్థితి మనది. నదులు, సరస్సులు, విస్తారమైన పంట భూములు, అడవులు, జీవవైవిధ్యం ఏ దేశానికైనా నిజమైన సిరి సంపదలు; అమూల్యమైన మూలధనం. మన పాలకులకి ఈ ఇంగిత జ్ఞానం లేదు.
దక్షిణ దేశంలో నదులు పూర్తిగా మురుగు కాలువలుగా ఇంకా మారలేదు. గోదావరి ఆ దుస్థితికి ఇంకా రాకపోవడానికి ఒక కారణం పెద్ద పారిశ్రామికవాడలు, ఎక్కువ ఆనకట్టలు లేకపోవడం. మహానగరాలు వ్యర్థజలాల్ని నదిలోకే విడుస్తాయి. గోదావరి తీరంలో మహానగరాలు లేకపోవడం వల్ల కాలుష్యం నియంత్రణ స్థితిలోనే ఉంది. కానీ పెద్ద పరిశ్రమలు లేకపోయినా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నగరాల వ్యర్థ జలాలు గోదావరిని కలుషితం చేస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అంచనాప్రకారం గోదావరి నీళ్ళు శుభ్రంగానే వున్నాయి. మన దేశంలో అమలులో ఉన్న కాలుష్య నియంత్రణ చట్టాల పరిమితుల్ని పునస్సమీక్ష చెయ్యడం అవసరం. రాజమండ్రి వంటి నగరాలలో ప్రతి నెలా నదీ కాలుష్య వివరాలను పత్రికల ద్వారా ప్రజలకి తెలియచెయ్యాలి. నగర మురుగునీటిని శుద్ధి చేసే వ్యవస్థ ఇంత వరకూ ఏర్పడలేదు. ఇళ్ళలో శుభ్రత కోసం వాడే అనేక రకాల డిటర్జంటులు, ఏసిడ్లు, అన్నీ నదిలోకి చేరతాయి. ప్రస్తుతం ఉపయోగించే నీటిని శుద్ధి చేసే వ్యవస్థ ఇంత కాలుష్యాన్ని భరించలేదు. దేశంలోనే అగ్రగణ్యమైన పేపరుమిల్లు రాజమండ్రి గోదావరి లంకల్లోకి వ్యర్థ జలాల్ని విడుదల చేస్తున్నది. వ్యర్థ జలాల్ని శుద్ధిచేసిన తరువాతనే లంకలోకి విడుదల చేస్తున్నామని మిల్లు యాజమాన్యం వాదన. అంతులేని ఈ వివాదానికి తెరదించి, శుద్ధి చేసిన నీటిని ఎగువ ప్రాంత రైతులకు, ఇతర అవసరాలకు ఉపయోగించమని నేను పదిహేను సంవత్సరాల క్రితం సూచించాను. ఇప్పటికీ అదే మంచిదని నా నమ్మకం. వ్యయ ప్రయాసలతో కూడుకున్న పరిష్కారం అయినప్పటికీ ఈ ప్రత్యామ్నాయం గురించి అలోచించాలి.
రాజమండ్రి గోదావరిలో పున్న పిచ్చుకలంక పెద్దది. చాలా ఎకరాలు ఎవరో వ్యవసాయానికి అనువుగా చేసుకున్నారు. మిగిలిన కొద్ది ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. అదేమీ జరగలేదు. ఒక ముఖ్య విషయం గమనించాలి. పిచ్చుకలంక అయినా, కాకినాడ హోప్‌ ఐలాండ్‌ అయినా, కృష్ణలో భవానీలంక అయినా కేవలం పర్యాటక కేంద్రాలుగా చెయ్యడం కంటే నిపుణుల సూచనలు తీసుకుని వాటిని గొప్ప జీవ వైవిధ్య ప్రాంతాలుగా తయారు చెయ్యడం అవసరం. దీని వల్ల నీటికీ. చేపలకీ, రైతులకీ అనూ హ్యమైన ఉపయోగం ఉంటుంది. అనేక జాతుల పక్షులు క్రమం గా ఆవాసం ఏర్పరచుకుంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడ్డం అట్లా ఉంచి వాటి వల్ల వందలాది టన్నుల విలువైన ఎరువు రైతులకీ దక్కుతుంది. చేపలు అభివృద్ధి అవుతాయి. దీనికి అయ్యే ఖర్చు స్వల్పం.
పుష్కరాలకి లక్షలాది యాత్రికులు గోదావరి స్నానానికీ, పితృకర్మలు చెయ్యడానికీ వస్తారు. కర్మకాండ జరిగిన తరువాత ఆ ద్రవ్యాలన్నీ ప్లాస్టిక్‌ సంచీలో పెట్టి నదిలో విడుస్తారు. దీనికి బదులుగా కాగితంతో మహిళా మండళ్ల చేత పుష్కరాలలోపు సంచీలు చేయించి ఒక పద్ధతి ప్రకారం పురోహితులకి అంద చేయడం మంచిది. అపరకర్మలకు గోదావరి లంకల్లో కూడా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. మామూలు సమయాల్లో కూడా రాజమండ్రి గోదావరిలో అపరకర్మలకు సంబంధించిన ద్రవ్యాలన్నీ ప్లాస్టిక్‌ సంచీలలో ఒడ్డునే తేలుతూంటాయి.
కాలుష్యంతో ప్రత్యేకంగా సంబంధం లేకపోయినా ప్రభుత్వం గోదావరి లంకలను మరో రకంగా ఉపయోగించుకోవచ్చు. చైనా లో చిన్న, పెద్ద నదులలో సౌర ఫలకాలను ఏర్పాటు చేసి చాలా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. అటువంటి అవకాశం గోదావరి లంకలలో సాధ్యపడుతుందేమో పరిశీలించాలి. ఇంత సాంకేతిక ప్రగతి సాధించిన తరువాత ఇటువంటిది అసాధ్యం కాదనుకుంటాను.
ప్రతి నదీ జలాలకు సహజసిద్ధమైన లక్షణం నీటిని శుద్ధి చేసుకోవడం. నదిలోకి విడుదల చేసే విష పదార్థాలు ఎక్కువ కావడంతో ఈ సహజ వ్యవస్థ కుంటుపడుతోంది. నిజానికి తీవ్రంగా కలుషితమైన నదిని పునరుద్ధరించడం అయ్యేపని కాదు. గోదావరి పరిస్థితి చెయ్యి దాటిపోలేదు కనుక గంగ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు కొన్ని తీసుకోవడం అవసరం. అందులో ముఖ్యమైంది నది ఎగువ జలాల్లో వందలాది తాబేళ్ళని వదలడం. ఇది వెంటనే జరగాలి. అటవీ వన్యప్రాణి విభాగం వారికి ఈ బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది. తాబేళ్ళు నీటిని శుభ్రపరుస్తాయి. గొరకులనే చేప జాతి కూడా నదిని శుభ్రం చేస్తుంది. దురదృష్టవశాత్తూ పుష్కరాలకు గోదావరిలో నీరు ఎక్కువగా ఉండదు. లక్షలాది భక్తులు పాప ప్రక్షాళన కోసం పుణ్య స్నానాలు చేస్తుండగా నది పరిస్థితి ఊహించడం కష్టం కాదు. ఎట్టి పరిస్థితిలోను స్నానానికి గోదావరిలో సబ్బు వాడకాన్ని నిషేధించడం మంచిది. విడిదిలో స్నానాలు కానిచ్చి గోదావరి నీటితో అభ్యంగ స్నానం వంటిది చేస్తే మంచిది.
- తల్లావఝ్ఝల పతంజలి శాస్రి 
(ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, బుద్ధవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో నేడు రాజమండ్రిలో ‘గోదావరి హారతి’)

No comments:

Post a Comment