Friday 31 October 2014

పెనం నుండి పొయ్యిలో వేసిందెవరు? - కంచ ఐలయ్య

పెనం నుండి పొయ్యిలో వేసిందెవరు?
తెలంగాణ ప్రజల దగ్గర ఇప్పుడేమీ మిగిలిలేదు ఆత్మహత్య మార్గం తప్ప. కనుక వారిని ఎవరు రక్షించాలో, ఎట్లా రక్షించాలో మావోయిస్టు లక్ష్మణ్‌రావు మాత్రమే చెప్పాలి. ఈ ప్రశ్నలు నేను ఎవర్నో ఇరకాటంలో పెట్టడానికి అడగడంలేదు. అయన పార్టీ 1998లో తెలంగాణ రాష్ట్రం ఏర్పర్చాలనే నిర్ణయాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుందో, తరువాత విప్లవశక్తులు, వారితో ప్రభావితమైన మేధావులంతా ఎంత కష్టపడి పనిచేశారో నాకు తెలుసు. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన బాధ్యులు వాళ్లే అని నేను భావిస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందులో ఇప్పటికే 313 మందికి పైగా భవిష్యత్‌పై భయమేసి, అప్పుకూ ఆకలి బాధకూ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వానికి ‘రూల్‌ ఆఫ్‌ లా’ అంటే ఏందో తెలిసి ఉన్నట్టు కనబడడంలేదు. సమైక్య వ్యవస్థలో ఉన్న పార్టీ పాలన ఇప్పుడు ఒక కులపాలనలోకి, కుటుంబ పాలనలోకి జారుకున్నది. మంత్రిమండలి అనేది రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకొని బ్యూరాక్రసీ ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని సూత్రబద్ధంగా నడుపుతున్న దాఖలాలు కనబడడంలేదు. తెలం గాణ రాష్ట్రం ఒక ఫ్యూడల్‌ ఎస్టేట్‌లా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రజాస్వామ్య బద్ధంగా విమర్శలు వినాలనిగానీ, మీడియాను, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఒక సెక్యులర్‌ యంత్రాంగంగా నడపాలనే కనీస విలువలు కనబడటం లేదు. ఒక్కమాటలో తెలంగాణ వ్యవస్థ ఒక పెట్టుబడిదారి-ప్రజాస్వామ్య రూపం-సారం నుండి ఫ్యూడల్‌ నోడల్‌, భాష, భావంలోకి జారుకుంది.
దీనికి బాధ్యులెవరు అనేది అన్నింటికంటె ముఖ్యమైన ప్రశ్న. తెలంగాణ ఆరు నూరైనా సమైక్య రాష్ట్రంలో ఉండడానికి వీలులేదని రెండో దఫా 1998 ప్రాంతంలో ఉద్యమం ప్రారంభించింది మావోయిస్టు పార్టీ. ఆ తరువాత ఇతర విప్లవ గ్రూపులు, ఇతర మేధావులు అందులో కొంతమంది ప్రజాస్వామికవాదులు, మరికొంతమంది పదవీవాదులు-భూస్వామ్యవాదులూ ఉన్నారు. మార్క్సిస్టు మౌలిక లక్షణం ఫ్యూడలిజాన్ని వెనక్కి నెట్టి ప్రతి అడుగు అడుగునా పెట్టుబడిదారీ వ్యవస్థను ముందుకు నెట్టడం ఆ తరువాత దాన్ని సోషలిజంలోకి నెట్టడం. కానీ 1998 నుండి తెలంగాణ ఏర్పడేదాక ఆంధ్రావాళ్ళు అనే పేరుతో కోస్తా జిల్లాల్లో వ్యవసాయక సర్‌ప్లస్‌నంతా కలిపి హైదరాబాద్‌లో క్యాపిటల్‌ రూపం తీసుకున్న ఎకానమీ మీద నిరంతరంగా విమర్శ చేశారు.
చాలా విచిత్రమేమంటే 2009 తరువాత తెలంగాణలోని ఫ్యూడల్‌శక్తులతో ఐక్యసంఘటన కట్టి జేఏసీలను ఫామ్‌ చేశారు. ఉత్తర తెలంగాణ భూస్వాముల్లో కొంతమంది నిరహారదీక్ష పేరుతో రకరకాల ఎత్తుగడలు వేస్తే విప్లవం చుట్టూ ఉండే మేధావులే ‘నిమ్మరసమిచ్చి ఫోటోలు దిగారు. జయశంకర్‌కి ఎంత మార్క్సిస్టు ఎకనామిక్స్‌ తెలుసో, ఏమి రాసాడో నాకైతే తెలియదు. ఆయన రాసిన మార్క్సిస్టు ఎకనామిక్స్‌ పుస్తకాలెవరైనా నాకిస్తే చదవడానికి నేను సిద్ధమే కానీ నాకైతే ఎక్కడ దొరకడం లేదు. కాళోజీ కవిత్వంలో మార్క్సిజం ఏ భూతద్దం పెట్టి వెతుకుతే దొరుకుతుందో నాకైతే తెలియదు. వాళ్ళు వరంగల్‌ భూస్వామ్య వర్గానికీ ఆ తరువాత తెలంగాణ భూస్వామ్య వర్గానికి ఎంత ఆత్మీయులో నాకు తెలుసు. అందువల్ల ఈ మొత్తం ప్రక్రియలో విప్లవం ఎంత ఉన్నదీ మార్క్సిజం ఎంత ఉన్నదీ, మావోయిజం ఎంత ఉన్నదీ దానిచుట్టూ ఉన్న మేధావులు, లేదా మావోయిస్టు నాయకత్వం రాస్తే చదవి నేర్చుకోడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఇప్పుడు మనముందున్న అసలు సమస్య ఆంధ్రప్రదేశ్‌ విడగొట్టబడ్డ తరువాత క్యాపిటల్‌ (క్యాపిటలిస్టు విలువలతోపాటు) ఎటువైపు పోయింది. ఫ్యూడలిజం ఎటువైపు ఉన్నదో, ఏ రాష్ట్రం ఎలా అభివృద్ధి కాగలదో చూడాలి గదా? తెలంగాణ కోసం పోరాటం చేశామనే వాళ్ళంతా (ఒక్క పాలించే పార్టీ, లేదా ప్రతి పక్ష పార్టీలు మాత్రమే కాదు) విడిపోయిన తెలంగాణ ప్రజల బతుకు, చదువు, సమానత్వం ఆ 13 జిల్లాల్లో ఉండబోయే దానికంటే మనముందు బాగుంటాయని ఆర్థిక రంగ అధ్యయనంతో చూపెట్టాలి గదా! ఫ్యూడల్‌ శక్తులకు, కొన్నికులాలకు తెలంగాణ 10 జిల్లాల రాష్ట్రమైతే మేం రాజకీయ అధికారంలోకి వస్తామని ఆకాంక్ష, అంచనా ఉండడంలో ఆశ్చర్యమేమీలేదు. కానీ మావోయిస్టు, మార్క్సిస్టు-లెనినిస్ట్‌, సీపీఐ లాంటి కమ్యూనిస్టుశక్తులన్నీ రాష్ట్రం విడిపోయేదాకా, ఫ్యూడలిజంతో, హిందూ మతోన్మాద పార్టీలతో ఐక్య సంఘటన కట్టి, సెంటిమెంట్ల భాషకు, భావానికి దాస్యంచేసి (నిజానికి వాటిని వాళ్ళే పెంచిపోషించి) మార్క్సిజానికీ, విప్లవానికి ఎలా మేలు చేద్దామనుకున్నారో చెప్పాలి గదా?
వారెంత చెడ్డవారైనా పెట్టుబడిదారులు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే లక్షణాలు కలిగి ఉంటారు. వారు ఎంత మంచి ఫ్యూడల్స్‌ అయినా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ద్వేషించుకుంటారు. ఈ మౌలిక మార్క్సిస్టు ఎకనామిక్స్‌ తెలిసినవాళ్ళెవరూ తెలంగాణ క్యాపిటల్‌ అభివృద్ధి కావడానికి కావలసిన హంగులున్నాయని అంచనా వెయ్యలేరు. హైదరాబాద్‌లో అక్యుమ్‌లేట్‌ అయిన క్యాపిటల్‌ ప్రధానంగా కోస్తాలోని ఐదారు జిల్లాల్లో వ్యవసాయ రంగంలో ఏర్పడిన సర్‌ప్లస్‌ ద్వారా, సినిమా ఇండసీ్ట్రలో రూపొందిన కల్చరల్‌ క్యాపిటల్‌ ద్వారా పెట్టుబడిదారి వర్గమొకటి ఏర్పడింది. క్రమంగా అది ఐ.టి. ఇండసీ్ట్ర, మెడికల్‌ ఇండసీ్ట్ర, ఎన్‌.ఆర్‌.ఐ. క్యాపిటల్‌లో ముడివడి ఎదిగింది. ఈ క్రమంలో గోల్డ్‌, బట్టల మార్కెట్‌ హైదరాబాద్‌లో పెరిగింది. హోటల్‌ ఇండస్ర్టీ, ఫుడ్‌ సెక్టార్‌ బాగా ఎదిగాయి. తెలంగాణ ఉద్యమం పేరుతో ఈ క్యాపిటల్‌ని, దాని చుట్టూ వచ్చిన ఎంప్లాయిమెంట్‌ను వ్యతిరేకించి ఫ్యూడల్‌ శక్తుల నినాదాన్నందుకొని కమ్యూనిస్టు లెలా పోయారు? చాలా కాలంగా విప్లవ-వామపక్ష శక్తులకు కులతత్వం మాత్రమే ఉన్నదని అనుకునేవాణ్ని కానీ తెలంగాణ పరిణామాలు గమనించాక వాళ్ళు ఇంకా ఫ్యూడల్‌ పునాదిలోనే ఉన్నారని తేలిపోయింది. ఒక ప్రాంతంలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చకొట్టేప్పుడు దాని అభివృద్ధిని క్యాపిటలిజం, ఫ్యూడలిజంతో బేరీజు వెయ్యకుండా కమ్యూనిస్టు- విప్లవశక్తులు ఎలా ఉంటాయి?హైదరాబాద్‌ చుట్టూ ఉన్న భూముల ధరలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పెరిగితే తెలంగాణ ఫ్యూడల్స్‌ ఆ భూములూ తామే అమ్ముకోవచ్చు అనిచూస్తే, ఆ కోరికకు కమ్యూనిస్టు-విప్లవకారులెందుకు తోడయ్యారు. క్యాపిటలిస్టులు, ఆంధ్రా మిడిల్‌క్లాస్‌ భూముల కొనుగోళ్ళనుంచి విత్‌డ్రా అయితే ఎవరికమ్ముదామనుకున్నారు? తెలంగాణ ఉద్యోగులకా రైతు కూలీలకా? తాపీ మేసీ్త్రలకా! ఇప్పుడు హైదరాబాద్‌లో భూములు అమ్మకానికి లేవు. ఆక్రమణకు మాత్రమే ఉన్నాయి.
ఒక దేశంలోగాని, రాష్ట్రంలోగాని, ప్రాంతంలోగాని ఆర్థిక వ్యవస్థ క్యాపిటలిజం నుండి సోషలిజంలోకి పోవడం సాధ్యంగాని, దాన్ని తిరిగి ఫ్యూడలిజంలోకి నెట్టి సోషలిజంలోకి ఎలా తీసుకుపోతారు? ఇక్కడే మావోయిస్టు పార్టీ నాయకుడు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంటుందనుకున్నాడో చెప్పాలి గదా? ఈ పది జిల్లాలను ఆంధ్రప్రదేశ్‌ నుండి విడగొట్టగానే ఏర్పడే ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వాల కంటే ప్రోగ్రెస్సివ్‌ లక్షణాలు కలిగి ఉంటుందనుకున్నాడా? ఇప్పుడు తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే ఎట్ల మంచిదో చెప్పాలి గదా? వాటి కుల-కుటుంబ స్వభావాలు, దీని కుల కుటుంబ స్వభావాల గురించి వాళ్ళ అంచనా చెప్పాలి గదా?
ఉత్తర తెలంగాణ నుండి దేశానికి కనిపించే ముగ్గురు నాయకులు.. 1. ముప్పాళ్ళ లక్ష్మణరావు, 2. కె. చంద్రశేఖర్‌ రావు, 3. సి.హెచ్‌. విద్యాసాగర్‌ రావు. ఈ ముగ్గురు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ శక్తియుక్తులన్నిటినీ ధారపోసారు. ఇప్పుడు ఎవరి చేతిలో ఏముందో దేశానికంతా తెలుసు. అయితే ఇప్పుడు లక్ష్మణ్‌ రావు నొక్కర్నే ప్రశ్నలడిగే అవకాశం, అవసరం మనకు ఉంది. మిగతా ఇద్దర్ని ఎవ్వరు అడగలేరు, అడుగుతే ఎంతలోతు బొంద పెట్టబడుతారో మనకు తెలుసు. వాళ్ళను అడగగలిగేది ఒక్క లక్ష్మణ్‌రావు మాత్రమే? ఎందుకంటే తెలంగాణ ప్రజల దగ్గర ఇప్పుడేమీ మిగిలిలేదు. ఆత్మహత్య మార్గం తప్ప. కనుక వారిని ఎవరు రక్షించాలో, ఎట్లా రక్షించాలో లక్ష్మణ్‌రావు మాత్రమే చెప్పాలి. ఈ ప్రశ్నలు నేను ఎవర్నో ఇరకాటంలో పెట్టడానికి అడగడం లేదు. అయన పార్టీ 1998లో తెలంగాణ రాష్ట్రం ఏర్పర్చాలనే నిర్ణయాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుందో, తరువాత విప్లవశక్తులు, వారితో ప్రభావితమైన మేధావులంతా ఎంత కష్టపడి పనిచేశారో నాకు తెలుసు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన బాఽధ్యులు వాళ్లే అని నేను భావిస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాళ్ళ బాధ్యత పెరిగింది. లేదు మాకేమీ బాధ్యత లేదు అని వాళ్ళు చెబితే అది వేరే విషయం. తన విప్లవ పోరాటాన్ని సీరియస్‌గా తీసుకున్న నాయకుడెవరు అలా అంటాడని నేను అనుకోవడంలేదు. కనుకనే వాళ్ళ వైట్‌ పేపర్‌ని ప్రజల ముందు పెట్టమంటున్నాను. తెలంగాణ భవిష్యత్‌ కోసం మీ ప్రోగ్రామ్‌ ఏంటో చెప్పమంటున్నాను.
ప్రపంచంలో ప్రజల ముందుకొచ్చిన అన్ని సిద్ధాంతాల్లో మార్క్సిజం ఒక్కటే అన్ని దేశాల్లో తన బ్లూప్రింట్‌ను రాసుకునే సత్తా కలిగింది. దాన్ని నమ్మే విప్లవకారులు అందరికంటే ముందు, అందరు ఆ అంశాన్ని వదిలేసిన రోజుల్లో - 1998లో - తిరిగి రాష్ట్ర విభజనను ఒక ప్రధాన పోరాటంగా మళ్ళీ ముందుకు తెచ్చారు. ఆ పోరాటం ప్రతిపాదించినప్పుడే ఆ ప్రాంత భవిష్యత్‌ మీద ఒక బ్లూ ప్రింట్‌ ఉండాలి. ఆనాటి వాళ్ళ బ్లూప్రింట్‌ ఏంది? ఇప్పుడేమైనా మారిందా? ఆ మారిన బ్లూ ప్రింట్‌ ఏంది? దాన్ని ఎలా సాధిద్దామనుకుంటున్నారు? లేదా వాళ్ళు అనుకున్నది సాధించాం అనుకుంటున్నారా? తాము కోరుకున్న తెలంగాణ శక్తులే అధికారంలోకి వచ్చాయనుకుంటున్నారా? కాదు తమ అంచనా తప్పిందనుకుంటున్నారా? ఎవరు అధికారంలో ఉండాల్సింది అనుకుంటున్నారు? ఏ ఆర్థిక ప్రోగ్రామ్‌ని అమలు చెయ్యాల్సింది అనుకుంటున్నారు? దయచేసి చెప్పండి.
విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం హైదరాబాద్‌లో కొంత నష్టపోయినా, అక్కడ క్యాపిటల్‌ అక్యుములేషన్‌ ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రైవేట్‌ సెక్టార్‌ జాబులు అక్కడ పెరుగుతాయి, తెలంగాణలో బాగా తరుగుతాయి. ఇప్పటికే ఇక్కడ తరిగాయి. ఇక్కడి ఫ్యూడల్‌ వర్గం ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ కోసం జరిగిన ప్రతి ఉద్యమాన్ని విప్లవంగా భావించే మేధావులు లేకపోలేదు. 10 జిల్లాలను పెట్టుబడిదారి లింక్‌ నుంచి తెగ్గొట్టి, అందుకు విద్యారంగాన్నంతా బలిపెట్టి ఈ పరిణామం అనివార్యమనుకునే మేధావులు ఉన్నారు. వారు కూడా ఇక్కడ అభివృద్ధి ఎలా జరగాలో చెప్పడం లేదు.
నా దృష్టిలో తెలంగాణ కాలే పెనం నుంచి పొయ్యిలో పడ్డది. అందుకు విప్లవ నిర్మాణాలు, వారి అవగాహన, కవిత్వం, కళల చుట్టూ పనిచేసినవారు ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన ఫ్యూడల్‌ శక్తుల నుండి, ఆర్థిక ఊబి నుండి దాన్ని బయటపడెయ్యాలి. తెలంగాణ సాధించడం కంటే ఇది కష్టమైన సమస్య. ఈ సమస్యను మళ్ళీ ముందుకు తెచ్చిన విప్లవశక్తులే తమ బ్లూ ప్రింట్‌ ఏందో చెప్పాలి. ఈ చర్చకు మీడియా సహకరిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. భవిష్యత్‌ ఆశతోనైనా ప్రజలు బతుకుతారు.
కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

No comments:

Post a Comment