Tuesday, 14 October 2014

అల్లూరి, అడ్డతీగల - పడాల వీరభద్రరావు

అల్లూరి, అడ్డతీగల - పడాల వీరభద్రరావు
విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 92 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌పై చరిత్రాత్మక దాడిచేశారు. ఆయన పోరాటాలకు అడ్డ తీగల ప్రాంతమే ప్రధాన కేంద్రం. ఆ విప్లవవీరుడు ప్రతిరోజూ సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో స్నానమాచరించిన పెద్దేరు, కాళికా దేవి పూజలు చేసిన తపస్సు కొండ, గిరిజనుల సమస్యలపై రచ్చబండ పంచాయతీలు జరిపిన రావివృక్షం, ఆయన దాడిచేసిన అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌ మొదలైనవన్నీ అడ్డతీగల మండలంలో ఉన్నాయి. సీతారామరాజును విప్లవపంథా నుంచి దారి మళ్ళించేందుకు ఆనాటి పాలకులు యాభై ఎకరాల భూమి పట్టా ఎరగాఇచ్చిన పైడిపుట్ట గ్రామం ఈ మండలంలోనిదే.
1922 అక్టోబర్‌ 15న అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌పై అల్లూరి సేనలు దాడిచేశాయి. అంతకుముందు మూడు పోలీస్‌స్టేషన్లపై జరిగిన దాడికి అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌పై దాడికి చాలా వ్యత్యాసం ఉంది. మూడు పోలీస్‌ స్టేషన్లపై రహస్యంగా దాడిచేస్తే, అడ్డతీగలపై, ముందుగా బ్రిటిష్‌ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపి మరీ దాడి చేశారు. 1922 ఆగస్టులో చింతపల్లి, కృష్ణదేవి పేట, రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్లపై దాడి దరిమిలా బ్రిటిష్‌ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా మలబారు పోలీస్‌ దళం, అస్సాం రైఫిల్‌ దళంను ఏజెన్సీ ప్రాంతమంతటా మొహరించింది. ఈ కారణంగానే సీతారామరాజు రెండునెలల పాటు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయుధాలను సమీకరించుకునేందుకై పోలీస్‌ స్టేషన్లపై దాడులను అక్టోబర్‌లో మళ్ళీ ప్రారంభించారు. ఈ క్రమంలో అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌పై దాడిచేశారు. అయితే పోలీస్‌ స్టేషన్‌లో భూగర్భ ఆయుధ శాల ఉంది. అల్లూరి సేనలు దానిని గుర్తించలేకపోయాయి. బయట ఉన్న తుపాకులు, కొన్ని తూటాలు మాత్రం స్వాధీనం చేసుకున్నారు. తాను కొన్ని ఆయు ధాలను తీసుకు వెళుతున్నట్టు సీతారామరాజు ఠాణా రికార్డులో సంతకం చేసి వెళ్ళిపోయారు.
స్వతంత్ర భారతదేశ పాలకుల నిర్లక్ష్యపునీడలో ఆనాటి అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌ కుప్పకూలిపోయింది. పైడిపుట్టలో అల్లూరి స్మారక మ్యూజియం ఏర్పాటుచేయాలని, ఆనాడు బ్రిటిష్‌ప్రభుత్వం ఆయనకు ఎరగా ఇచ్చిన యాభైఎకరాల్లో గిరిజనుల ఉపాధి కోసం భారీ పర్రిశమను నెలకొల్పాలని ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్నారు. అవి ఇప్పటికీ తీరనే లేదు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆయన పోరాటం సాగించిన గిరిజన ప్రాంతాలన్నిటిని కలిపి అల్లూరి జిల్లాగా ఏర్పాటుచేయాలని గత నలభై ఏళ్లుగా సాగిస్తున్నపోరాటాలు నిష్ప్రయోజనమయ్యాయి. అల్లూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీ యం. ఆయన జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా జరపాలనేది ప్రజల చిరకాల కోరిక. ఇదీ ఇంతవరకు నెరవేరలేదు. విప్లవవీరుడు సర్దార్‌ భగత్‌సింగ్‌ వర్ధంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కోట్లుఖర్చుచేసి నిర్వహిస్తోంది. మరి అల్లూరి జయంతి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం లక్ష రూపాయలు మాత్రమే కేటాయించడం ఎంతవరకు సమంజసం? పార్లమెంటులో ఎన్‌.టి.రామారావు, అల్లూరి విగ్రహాలు నెలకొల్పడానికి అనుమతి ఉంది. అయితే ఎన్‌టీఆర్‌ విగ్రహం ఏర్పాటయినా అల్లూరి విగ్రహం ఇంకా ఏర్పాటుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ తీసుకుని అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయించాలి. ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిఫారసుచేసింది. అల్లూరి స్మృతిని కూడా ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించాలి.
- పడాల వీరభద్రరావు
అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు

No comments:

Post a Comment