Wednesday, 1 October 2014

జగన్నాథపురం కొండల్లో రాతిగుహలు

జగన్నాథపురం కొండల్లో రాతిగుహలు


 బయల్పడిన క్రీస్తు పూర్వం ..3-5 శతాబ్దాల చారిత్రక ఆనవాళ్లు


ప్రత్తిపాడు, సెప్టెంబర్‌ 30: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ఏలూరు పంచాయతీ శివారు గ్రామం పి. జగన్నాథపురం కొండలపై      క్రీస్తుపూర్వం 3-5 శతబ్ధాల కాలం నాటి చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు అన్నవరానికి చెందిన డాక్టర్‌ మెరతల నారాయణరావు బృందం మంగళవారం ఈ కొండలపై పరిశోధనలు జరిపి చారిత్రక ఆనవాళ్లను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ బృందంలో బౌద్ద అధ్యయన కేంద్రం పిఠాపురం సర్కిల్‌ కార్యదర్శి పోతుల శ్రీనివాస్‌, విశ్రాంత ఉపాధ్యాయుడు రవీంద్రబాబు ఇంజనీర్‌ నారాయణరావు ఉన్నారు. ఐదు రాతి  చూరులు, ఐదు రాతి పడకలు, ధ్యానం చేసుకోవడానికి, కూర్చోవడానికి ఉన్న రాతి ఆసనాలను, దక్షిణ దిశగా రాతి బావిని కనుగొన్నారు. ఆరుగురు కూర్చుని ధ్యానం చేసుకునేందుకు కుర్చీల మాదిరిగా ఉన్న ధ్యాన గృహలను కూడా వీరు కనుగొన్నారు. 64 గదులతో వైకుంఠపాలి తరహాలో ఆనాటి చిహ్నాలు, గుర్తులు ఉన్న రాతిపై చెక్కిన ఆనవాళ్లు కూడా వీరి పరిశోధనలో బయటపడ్డాయి. జగన్నాథపురం పరిధిలోని బాగుందాని కొండ, సన్యాసిమఠం, గుర్రాలశాలగా, సింగరయ్యకొండలుగా పిలువబడే రెండు కొండలపై ఈ చారిత్రక పురాతన అవశేషాలు, ఆనవాళ్లను ఈబృందం కనుగొంది. సింగరయ్యకొండపై రాతిపడకలు, లక్ష్మీనరసింహస్వామి శిథిల దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయని నారాయణ బృందం తెలిపింది. క్రీస్తు పూర్వం 3-5 శతాబ్ధాల జైనులు సల్లేఖన వ్రతం ఆచరించేలా ఈ గుహలు ఉండడం వీటికి అనుసంధానంగా భూతాల గృహం ఉండడం వంటివి జైనులు సంచరించారనే దానికి ఆనవాళ్లుగా కనిపిస్తోందన్నారు. ఈ కొండల్లో పురావస్తు శాఖాధికారులు పరిశోధించాలని ఈ బృందం అభిప్రాయపడింది.

No comments:

Post a Comment