Monday, 20 October 2014

పక్కవారిపై నెపమేల? - చంద్రబాబు

పక్కవారిపై నెపమేల?

టీఆర్‌ఎస్‌కు చంద్రబాబు ప్రశ్న
ఏపీకి కూడా ఇబ్బందులు
నేను ఎవరిపైనా నెట్టడం లేదు
తెలంగాణను అభివృద్ధి చేసిన నేను ద్రోహినా?
ఒకరు పోతే వందమందిని తయారు చేసుకుంటాం
టీడీపీని గెలిపించే ఇక్కడ నుంచి వెళ్తా
తెలుగువారి ఉమ్మడి బంధం టీడీపీ
మహేశ్వరం నియోజకవర్గ సమావేశంలో ఏపీ సీఎం
 
 
 
’ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించారు. మీ చేతిలో అధికారం ఉంది. సమస్యలు వస్తే వాటిని పరిష్కరించే మార్గాలు అన్వేషించండి. అది వదిలిపెట్టి పక్కవారిపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూడటం ఏమిటి’ అని తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు చంద్రబాబు నాయుడే కారణమని టిఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆయన ఈ ప్రశ్న వేశారు. ’ఆంధ్రప్రదేశ్‌కూ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. నేను కేంద్రంపైనో.. పక్క రాషా్ట్రలపైనో నెపం నె ట్టి తప్పించుకోవాలని చూడటం లేదు. వాటిని అధిగమించాలని ప్రయత్నిస్తున్నాం. రాషా్ట్రలు విడిపోయిన తర్వాత ఏపీకి ఆర్థికంగా భారీ లోటు ఉంటుందని.. తెలంగాణకు కరెంటు కొరత ఉంటుందని నేను అనేకసార్లు చెప్పాను. వచ్చిన ప్రభుత్వాలు దానికి తగినట్లుగా ముందు చూపుతో వెళ్ళాలి. పోయినసారి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణలో తీవ్రమైన కరెంటు కొరత ఉండేది. నేను ఒక సవాల్‌గా తీసుకొని 2004 నాటికి మిగులు కరెంటు తెచ్చాను. తెలంగాణలో కరెంటు సరఫరాను బాగు చేశాను. ఎవరికైనా దమ్ముంటే చర్చకు రండి. మొన్న తుఫాన్‌లో ఉత్తరాంధ్రలో 30 వేల విద్యుత్‌ స్తంభాలు, ఐదు వేల ట్రాన్స్‌ఫార్మర్లు, వేల చెట్లు పడిపోయాయి. రెండు మూడు నెలల వరకూ కరెంటు రాదని అందరూ అనుకొన్నారు. వారం రోజుల్లో కరెంటు తెచ్చి చూపించాను. అది మా తడాఖా...మా పని తీరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి సోమవారం సాయంత్ర ం ఆయన ఇక్కడ ఎన్టీఆర్‌ భవన్‌లో ప్రసంగించారు. మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇటీవల టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. నలుగురు నాయకులను తీసుకెళ్ళి టీడీపీని బలహీనపర్చగలమని కొందరు కలలు కంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీని బలహీనపర్చే శక్తి ఈ ప్రపంచంలోనే లేదని ఆయన అన్నారు. ‘ఇందిరాగాంధీ, వైఎస్‌, సోనియా గాంధీ వంటివారంతా టీడీపీని ఏదో చేయగలమని భ్రమపడ్డారు. ఏమీ కాలేదు. ఒకరు పోతే వంద మందిని తయారు చేసుకొనే శక్తి టీడీపీకి ఉంది. పాలన చేయడం చేతగాక మన నాయకుల వెంటబడి తీసుకువెళ్ళి మన పార్టీని బలహీనపర్చాలని చూస్తున్నారు. ఒకరిద్దరిని తీసుకువెళ్ళి నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రెచ్చగొడితే రెచ్చిపోతా. బుల్లెట్‌లా దూసుకువెళ్తా. అంకిత భావంతో ఉన్న పార్టీ కార్యకర్తలే నా బలం. వాళ్ళకు నేను.. నాకు వాళ్ళు చాలు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీని గెలిపించే నేను బయటకు వెళ్తా. కాంగ్రెస్‌ పార్టీ ఇక అడ్రస్‌ ఉండదు. ఉండేది టీడీపీనే. తెలంగాణలో హైదరాబాద్‌ చుట్టుపక్కల మనదే బలం. వచ్చేది మనం. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళండి’ అని ఆయన వారికి సూచించారు. తెలంగాణను అభివృద్ధి చేసిన తాను తెలంగాణ ద్రోహి అవుతానా అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో హైస్కూళ్ళు సరిగ్గా లేవు. అలాంటి జిల్లాలో 220 ఇంజనీరింగ్‌ కళాశాలలు వచ్చేలా చేశాను. నేను హైదరాబాద్‌ అభివృద్ధి కోసం చేసిన కృషితో రంగారెడ్డి జిల్లా ఊహించనంత అభివృద్ధి అయింది. తెలంగాణలో విద్యా వైద్య సౌకర్యాలు, ప్రాజెక్టులు, రోడ్లు, విద్యుత్‌ సౌకర్యాలు అభివృద్ధి చేసింది ముందు ఎన్టీఆర్‌...తర్వాత నేను. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు రావాలని నేను అనేకసార్లు పిలుపు ఇచ్చినా ముందుకు వచ్చిన వాడు లేడు. నన్ను ఎన్నుకొన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సమస్యలు పరిష్కరించి అక్కడి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ పని చేస్తూనే తెలంగాణ ప్రజల అవసరాలు కేంద్రం దృష్టికి నేను తీసుకు వెళ్తున్నాను. 30 ఏళ్ళుగా నన్ను, పార్టీని ఆదరించిన తెలంగాణను.. ఇక్కడి పార్టీ కార్యకర్తలను నేను వదులుకోను. వారిని నా ప్రాణంలా కాపాడుకొంటాను. రాష్ట్రం భౌగోళికంగా విడిపోయినా ప్రజలు కలిసి ఉండాలి. ప్రభుత్వాలు వేరైనా ఇచ్చి పుచ్చుకోవాలి. తెలుగువారి ఉమ్మడి బంధం తెలుగుదేశం పార్టీ. ప్రపంచంలో ఎక్కడ తెలుగువారున్నా వారి కోసం టీడీపీ ఉంటుంది. తెలంగాణలో పార్టీ కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొనే సంక్షేమ నిధి పెట్టాం. కేంద్రంలో పదవులు వస్తే వాటిలో ఎక్కువ తెలంగాణ నేతలకే ఇప్పిస్తాను. ఏపీలో కొన్ని ట్రస్టు బోర్డుల్లో తెలంగాణ వారికి చోటు కల్పిస్తాను. కొంతకాలంలో ఏపీలో పాలన గాడిలో పడుతుంది. అప్పుడు తెలంగాణలో పార్టీకి మరింత సమయం ఇస్తా. అవసరమైతే రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తా’ అని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, మోత్కుపల్లి నర్సింహులు, తదితరులు మాట్లాడారు. 

No comments:

Post a Comment