మావోయిస్టులపై తిరుగుబాటు | ||
సాయుధులను రాళ్లతో కొట్టి చంపిన గిరిపుత్రులు
ఇన్ఫార్మర్ నెపంతో గ్రామస్థుడిని కాల్చి చంపడంతో ఆగ్రహం
చింతపల్లి, అక్టోబర్ 20: అది విశాఖ ఏజెన్సీ! చింతపల్లి మండలం కోరుకొండ వారపు సంత! మావోయిస్టులు అక్కడికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు! ప్రజా కోర్టు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. గతానికి భిన్నంగా, ఈసారి ప్రజలు తీర్పు చెప్పారు! రాళ్లు, కర్రలతో కొట్టి ఇద్దరిని చంపేశారు! మరో వ్యక్తిని సమీపంలోని వాగులో పడేశారు! ఇక్కడ తీర్పు చెప్పింది మన్యం వీరులు అయితే.. చనిపోయింది మాత్రం మావోయిస్టులు! విచిత్రంగా అనిపించినా ఇది నిజం! ఇప్పటి వరకు మావోయిస్టులు ఎన్నో ప్రజా కోర్టులు నిర్వహించారు! గిరిజనుల కళ్లెదుట ఎంతోమందికి శిక్షలు విధించారు. కానీ, ఇప్పుడు అదే ప్రజా కోర్టులో గిరిజనులే మావోయిస్టులకు మరణ శిక్ష వేశారు! నిన్నమొన్నటి వరకు మావోయిస్టులకు అండదండగా నిలిచిన రక్షణ దుర్గం ఎదురు తిరిగింది! సాయుధ మావోయిస్టులను రాళ్లతో కొట్టి చంపేసింది! ఈ సందర్భంగా కోరుకొండ వారపు సంత ‘వార్’జోన్‌ను తలపించింది! ఈ సంఘటనలో మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ డీసీఎం శరత్, సానుభూతిపరుడు పలాస గణపతి మృతి చెందారు. మరో సానుభూతిపరుడి ఆచూకీ తెలియరాలేదు.
ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరం గ్రామానికి చెందిన గెమ్మెలి సంజీవరావుతోపాటు మరో ఎనిమిదిమంది శివ మాల వేసుకున్నారు. దీక్ష పూర్తి కావడంతో ఆదివారం ఇరుముడులు సమర్పించడానికి సంజీవరావుతో పాటు పలువురు ఐదు ద్విచక్ర వాహనాలపై జి.మాడుగుల సమీపంలోని శివాలయానికి బయలుదేరారు. అయితే, గత కొంత కాలంగా సంజీవరావును సీపీఐ మావోయిస్టులు ఇన్ఫార్మర్ అని అనుమానిస్తున్నారు. అతడిని హతమార్చాలని నిర్ణయించారు. అదే సమయంలో, ఇరుముడి సమర్పించడానికి వస్తున్నాడని పక్కా సమాచారం అందడంతో కోరుకొండ ప్రాంతంలో కాపు కాశారు. అయితే, మావోయిస్టుల కంటపడకుండా సంజీవరావు తదితరులు కోరుకొండ దాటడంతో మావోయిస్టులు ద్విచక్ర వాహనంపై వెంబడించి సాయంత్రం నాలుగు గంటల సమయంలో గున్నమామిడి ప్రాంతానికి వంద అడుగుల దూరంలో పట్టుకున్నారు. సంజీవరావు, సింహాచలంలతో మాట్లాడి పంపిస్తామని, మిగిలిన భక్తులు వెళ్లిపోవాలని హెచ్చరించారు.
దీంతో, మిగిలినవాళ్లు వెళ్లిపోయారు. సంజీవరావు, సింహాచలం చేతులు వెనక్కి కట్టివేశారు. సంజీవరావును తుపాకీతో కాల్చి చంపేశారు. సింహాచలాన్ని కోరుకొండ వారపు సంతకు తీసుకు వచ్చి ప్రజా కోర్టు నిర్వహించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో, సంజీవరావును మావోయిస్టులు చంపేశారనే సమాచారం సంతలో ఉన్న అతని బంధువులు, వీరవరం గ్రామస్తులకు తెలిసింది. దీంతో, వారంతా ఆగ్రహోదగ్రులై మూకుమ్మడిగా మావోయిస్టులపై దాడికి దిగారు. గాలికొండ ఏరియా కమిటీ డీసీఎం శరత్ తలపై వెనక నుంచి గట్టిగా కొట్టడంతో అతడు కింద పడిపోయాడు. ఆ తర్వాత అంతా కలిసి తలపై రాళ్లు, కర్రలతో కొట్టడంతో శరత్ మరణించాడు. అనంతరం మావోయిస్టు సానుభూతిపరులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గిల్లలబంద గ్రామానికి చెందిన కొర్ర నాగేశ్వరరావు, తడ్డపల్లి గ్రామానికి చెందిన పలాస గణపతిలను కూడా తీవ్రంగా కొట్టారు. గణపతి ఘటనా స్థలంలో మరణించగా నాగేశ్వరరావును కొట్టి సమీపంలోని వాగులో పడేశారు. దీంతో అతని ఆచూకీ తెలియరాలేదు.
త్వరలో ఖాళీల భర్తీ.. ఏపీ డీజీపీ జేవీ రాముడు వెల్లడి విజయవాడ, అక్టోబర్ 20 (ఆంధ్రజ్యోతి): దేశ సరిహద్దుల్లో పోరాటంకన్నా ప్రస్తుతం అంతర్గత యుద్ధాలే ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు అన్నారు. మంగళవారం విజయవాడలో ‘పోలీసు అమరవీరుల సంస్మరణ’ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సరిహద్దు పోరాటాలతో పోలిస్తే, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో వందలాది పోలీసులు ఏటా ఈ సంఘటనలలో చనిపోతున్నారన్నారని పేర్కొన్నారు. పదేళ్లుగా దేశంలో 7 వేలమంది పోలీసులు మరణించగా, ఏపీలో 152 మంది ఉన్నారన్నారు. అలాగే ఈ ఏడాది దేశవ్యాప్తంగా 653 మంది చనిపోయారని, వారిలో ముగ్గురు రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. మంగళవారం విజయవాడలో ప్రవేశపెడుతున్న ‘ఇంటి ముంగిటకే ఎఫ్‌ఐఆర్’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. కాగా, ప్రతిపౌరుడూ ఇన్‌ఫార్మర్ కావాలని డీజీపీ సూచించారు. మావోయిస్టులు సాయుధులు కాబట్టే ప్రజలు వారిని భయంతోనే గౌరవిస్తున్నారని చెప్పారు. కానీ, పెత్తనం చేస్తే తిరగబడి తరిమికొట్టేది వారేనని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవని, పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. రాష్ట్రంలో ఆరువేల ఖాళీ పోస్టులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.
|
Disclaimer : None of the Posts in this blog are mine. They were collected only for the reference purpose from various websites. Viewers may visit source websites for further study.
Monday, 20 October 2014
Revolt Against Maoists
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment