Sunday 12 October 2014

సాయమందే వరకు.. విశాఖ నుంచే పాలన

సాయమందే వరకు.. విశాఖ నుంచే పాలన

బాధితులకు భరోసా ఇవ్వడం కోసం
క్షేత్రస్థాయికి అధికార యంత్రాంగం
 నేటినుంచే సహాయ చర్యలు
 శరవేగంగా పునరుద్ధరణ పనులు
 విపత్తు నిర్వహణకు సాంకేతికతను జోడించాం
 దేశానికి ఇదే మోడల్‌గా నిలుస్తుంది
 సోషల్‌ మీడియాను సమర్థంగా వాడుకున్నాం
 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
 ముందస్తు జాగ్రత్తలు భేష్‌
 అదే ఉత్సాహాన్ని సహాయ చర్యల్లోనూ చూపాలి
 అధికారులకు బాబు పిలుపు
 రెండు రోజులు జన్మభూమి నిలిపివేత

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): ‘విశాఖకు అపారనష్టం వాటిల్లింది. చిట్ట చివరి బాధితుడికి సాయం అందే వరకు.. తుఫాను సృష్టించిన విలయం నుంచి విశాఖ సాధారణస్థితికి చేరుకునే వరకు విశాఖలోనే ఉంటా. ఇక్కడి నుంచే పాలన చేస్తా.’ అని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పరిస్థితి కుదుటపడే వరకు ప్రభుత్వయంత్రాంగమంతా వైజాగ్‌లోనే ఉండి ఇక్కడి నుంచే పాలన సాగిస్తుందని ప్రకటించారు. తనతోపాటు మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు సైతం తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి సహాయ కార్యక్రమాలన వేగవంతం చేస్తారని వెల్లడించారు. ఆదివారం సచివాలయంలోని తన కార్యాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులతో హుద్‌హుద్‌ తుఫాను పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. విపత్తులు చెప్పి రావని.. వాటిని ఎదుర్కొనడం మానవమాత్రులకు సాధ్యం కాదన్న బాబు ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించగలమన్నారు. హుద్‌హుద్‌పై అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధత బాగానే ఉందని కితాబునిచ్చిన బాబు, సహాయ, పునరావాస చర్యల్లోనూ అంతే ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తనతోపాటు అధికారయంత్రాంగం అంతా క్షేత్రస్థాయికి వెళ్లి ‘మేం మీ వెంట ఉన్నాం’ అని బాధితులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ముందస్తు జాగ్రత్తలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని బాబు పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారి విపత్తుల నిర్వహణ సమయంలో ఏపీ ప్రభుత్వం ఆధునిక సాంకేతికను వినియోగించుకుని పనిచేస్తుందన్నారు. తద్వారా నష్ట తీవ్రతను తగ్గించగలిగామన్నారు. దేశం మొత్తం రేపు దీన్నే మోడల్‌గా తీసుకుని పనిచేస్తుందన్నారు. ఇస్రో, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీతోపాటు సోషల్‌ మీడియా ద్వారా తుఫాన్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం.. ప్రజలకు చేరవేయడం చేశామన్నారు. ముఖ్యంగా విశాఖ యువత ఎప్పటికప్పుడు తుఫాను తీవ్రత ఫొటోలను తీసి అప్‌లోడ్‌ చేసి అధికారులకు అందించిన తీరు అభినందనీయమన్నారు. పంటనష్టం, కూలిపోయిన విద్యుత్‌ స్తంభాలు, తెగిన చెరువు కట్టలు, ధ్వంసమైన రోడ్లు తదితర ఫొటోలను సోమవారంలోగా అందజేస్తామని ఇస్రో తెలిపిందన్నారు. ఈ వ్యవస్థను పక్కాగా రూపొందించుకోగలిగితే భవిష్యత్తులో విపత్తుల సమయంలో సహాయ పునరావాస చర్యలు మరింత సులభమవుతాయన్నారు. విపత్తు నష్టం గురించి వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని ప్రభుత్వ పోర్టల్‌లో ఆప్‌డేట్‌ చేయాలని, అలాగే ఆధార్‌తో అనుసంధానం చేసి అసలైన బాధితులకే పరిహారం వేగంగా అందేలా చూడాలని కోరారు. బాధితులకు నష్ట పరిహారం పంపిణీలో ఉదారంగా వ్యవహరించాలని బాబు అధికారులకు సూచించారు.
సోమవారం నుంచి సహాయ పునరావాస చర్యలను ప్రారంభించి, మూడు నాలుగు రోజుల్లోనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణం, మరమ్మతులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. నేలకొరిగిన విద్యుత్తుస్తంభాల స్థానంలో కొత్తవాటిని నెలకొల్పేందుకు 40 వేల విద్యుత్తుస్తంభాలను సిద్ధంగా ఉంచినట్లు ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. తొలుత బాధితులకు ఆహారం అందించే విషయంపై దృష్టి సారించాం. రాజమండ్రి, విజయవాడ నుంచి ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని బాబు చెప్పారు. సెల్‌ఫోన్‌ టవర్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలంటే డీజిల్‌ ట్యాంకర్లను తీసుకెళ్లేందుకు పోలీసుల సహకారం అవసరమని, దీనికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని సీఎం డీజీపీని ఆదేశించారు. మండలానికో ఐఏఎస్‌, రెవెన్యూ డివిజన్‌కో మంత్రి పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అంతకు ముందు సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. తుఫానును ఎదుర్కొనేందుకు ప్రజలను, అధికారులను అప్రమత్తం చేయడంతోపాటు పూర్తిస్థాయిలో సాంకేతిక సహకారాన్ని వినియోగించుకున్నామన్నారు.
కొన్నిచోట్ల కమ్యూనికేషన్‌ రాడార్‌ పతనమవడంతో నేవీ రాడార్‌ ద్వారా సమాచారం తీసుకున్నామన్నారు. తుఫాను కారణంగా ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ముగ్గురు మరణించారని తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారం పొందేందుకు సెల్‌ టవర్లన్నీ పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని సెల్‌ఫోన్‌ సంస్థలతో మాట్లాడామన్నారు. ప్రమాదాలు నివారించేందుకు వైజాగ్‌లో విద్యుత్తు సరఫరా నిలిపివేశామని, ట్రాఫిక్‌ను కూడా తగ్గించామన్నారు. ఎంత నష్టం జరిగిందనే సమాచారం రావాల్సి ఉందన్నారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో పూర్తిగా సమాచారం అందడం లేదన్నారు. సోమ, మంగళవారాల్లో జన్మభూమి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడాలని ప్రయత్నించామని, అయితే, ముగ్గురు మరణించారని తెలిపారు.
తమ్ముళ్లూ.. తరలిరండి
కార్యకర్తలకు బాబు పిలుపు

ప్రభుత్వం నుంచి తుఫాను సహాయక చర్యలు చేపడుతూనే సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులనూ సహాయక చర్యల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ప్రతి కార్యకర్తా తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 
తొలిసారిగా ఫేస్‌బుక్‌లో పేజీ

మొట్టమొదటసారిగా విపత్తు నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం ఫేస్‌బుక్‌లో ఒక పేజీని క్రియేట్‌ చేసింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దాన్ని గూగుల్‌, ఫేస్‌బుక్‌ సంస్థలు గుర్తించి ప్రమోట్‌ చేశాయన్నారు. దీంట్లో ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలను బాధితులు, పౌరులు ఎవరైనా పోస్టు చేయడం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చన్నారు. అలాగే తుఫానుకు సంబంధించిన సహాయక చర్యలనూ తెలుసుకోవచ్చన్నారు.
మానవతాదృక్పథంతో స్పందించండి
స్వచ్ఛందంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి
ప్రజలు, స్వచ్ఛంద సంస్థలకు బాబు పిలుపు

తుఫాను బాధితులను ఆదుకునేందుకు మానవతాదృక్పథంతో ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లావాసులకు జరిగిన నష్టం తీరనిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు,స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా చేయూతనిచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి విశాఖప్రజలను తుఫాను కష్టాల నుంచి విముక్తి చేయాలని కోరారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న అధికారులను, సంస్థలను ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. వారిని సరైన సమయంలో సత్కరిస్తుందన్నారు. 
నష్టాల వీడియోలు.. ఫొటోలు పంపండి
బాధ్యతగల పౌరులుగా వ్యవహరించండి: సీఎం 

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టాలతోపాటు ఇతర నష్టాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇలా ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేసి పంపించడం వల్ల ప్రభుత్వాధికారులు సంబంధిత ప్రాంతాలకు సహాయ బృందాలను పంపించి సత్వరం సహాయచర్యలను తీసుకునేందుకు వీలవుతుందన్నారు. బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి సహాయ పునరావాస చర్యలకు సహకరించి ప్రభుత్వానికి చేదోడువాదోడుగా నిలవాలని సీఎం కోరారు. ఫొటోలు, వీడియోలు పంపించిన వారి సేవలను గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా గౌరవిస్తుందని చెప్పారు. http:// bhuvan-ftp.nrsc.gov.in (user name: hudhud123, password:hudhud123) అనే వెబ్‌లింకుకు ఫొటోలు, వీడియోలు పంపించాలని కోరారు. అప్‌లోడ్‌ చేసే ఫొటో లేదా వీడియో ఫిల్మ్‌నేమ్‌లో ఆ ఏరియా పేరు, సమయం ఉండేలా చూడాలన్నారు.

No comments:

Post a Comment