ప్రీమియం లేదు.. పరిమితి లేదు వైద్యం ఖర్చు ఎంతైనా మేమే భరిస్తాం | |
ఉద్యోగుల వైద్యానికి సీఎం కేసీఆర్ భరోసా పైసా ఖర్చు లేకుండా అపరిమిత వైద్య వరం
నవంబర్ ఒకటి నుంచి నగదురహిత వైద్యం
నేడు లాంఛనంగా ప్రారంభం ఏ అనారోగ్యం వచ్చినా.. ఏ ఆస్పత్రి అయినా..
ఖర్చు ఎంతైనా ప్రభుత్వానిదే భారం ఆరు నెలల తర్వాత ఎయిడెడ్ ఉద్యోగులకూ
మహిళా ఉద్యోగి అత్తమామలకు కూడా పీఆర్సీపై పండుగ తర్వాత ప్రకటన చేస్తా
మీకు నచ్చినట్లే ఉంటుందది: సీఎం కేసీఆర్
: తెలంగాణ ఉద్యోగుల కల నెరవేరింది! వెయ్యి మతాబులు ఒకేసారి విరబూసినట్లు.. లక్ష చిచ్చుబుడ్లు వెలుగులు విరజిమ్మినట్లు ప్రభుత్వం వారికి దీపావళి ధమాకా ప్రకటించింది! దీపావళికి రెండు రోజుల ముందు.. ఏమాత్రం పరిమితి లేని.. నగదు రహిత వైద్య విధానాన్ని వరంగా అందించింది! ఉద్యోగులు కనీసం వారి వాటా ప్రీమియాన్ని కూడా చెల్లించాల్సిన పని లేదని ప్రకటించింది. ఉద్యోగులు ఊహించని హెల్త్ బొనాంజా ఇది! నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన ఉద్యోగ నేతలతో సమావేశమయ్యారు. మొదట తెలంగాణ (మొదటి పేజీ తరువాయి)
ఉద్యోగ సంఘాల అగ్ర నేతలతో, ఆ తర్వాత అన్ని సంఘాల ప్రతినిధులతో గంటసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హెల్త్ కార్డులపై తన నిర్ణయాన్ని ఫటాఫట్ అన్న రీతిలో ప్రకటించారు. టీఎన్జీవోలు, టీజీవోలు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది సహా మరికొన్ని శాఖలకు చెందిన 50 లేదా 60 మంది ఉద్యోగులకు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా హెల్త్‌కార్డులను అందించనున్నారు. అనంతరం నవంబర్ ఒకటో తేదీ నుంచి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. అలాగే, ఎయిడెడ్ ఉద్యోగులకు కూడా ఆరు నెలల తర్వాత ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.
ఉద్యోగులకు నగదు రహిత వైద్యంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లుగా ప్రభుత్వాలు పాతికకు పైగా సమావేశాలు నిర్వహించాయి. ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు చందంగానే పరిస్థితి కొనసాగింది. ఉద్యోగుల విషయంలో తమ ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుందని ఉద్యమ సారథిగా, ఎన్నికల సమయంలో, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే, పీఆర్సీ, హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగులు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. దీంతో, మంగళవారం చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలను సీఎం కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు. దీంతో, తెలంగాణ ఉద్యోగ సంఘాల అగ్రనేతలు గుండవరపు దేవీప్రసాదరావు, వి.శ్రీనివాస్ గౌడ్, సి.విఠల్‌లతో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం కొద్దిసేపు చర్చించారు. ఆ తర్వాత అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ‘‘ఉద్యోగికి ఏ అనారోగ్యం వచ్చినా సరే.. ఏ ఆస్పత్రి అయినా సరే... ఎంత డబ్బైనా సరే... ప్రభుత్వమే భరిస్తుంది’’ అని సీఎం కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించారు. ‘‘ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు. మీకు హెల్త్‌కార్డులను ఇవ్వడంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. మోడల్‌గా రేపు (బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు టీఎన్జీవోలు, టీజీవోలు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది సహా మరికొన్ని శాఖలకు చెందిన ఓ 50-60 మంది ఉద్యోగులకు నేనే ఇక్కడే (సచివాలయంలో) హెల్త్ కార్డులు ఇస్తాను. ఉద్యోగి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని మేం నిర్ణయించాం. అసలు రోగమే రాకూడదని అనుకుంటాం. దవాఖానా చూస్తే దండం పెడతాం. అటువంటిది.. ఉద్యోగికి రోగమొస్తే... రూ.2 లక్షలు అనో, రూ.3 లక్షలు అనో కటాఫ్‌లు పెట్టడం బాగోదు. అందుకే... ఎన్ని కోట్లైనా సరే ప్రభుత్వమే భరిస్తుంది’’ కేసీఆర్ ప్రకటించారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ప్రయోజనం కలిగేలా హెల్త్ కార్డులు ఉంటాయని చెప్పారు. కాగా, తెలంగాణలోని 3,514 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా పథకాన్ని వర్తింపజేయాలని పీఆర్టీయూ నేతలు పేరి వెంకటరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపైనా కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ‘‘ముందు ఉద్యోగులుగా మీరు తీసుకోండి. ఎయిడెడ్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సహా ఇతరత్రా పథకాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆరు నెలల తర్వాత నుంచి వర్తింపజేద్దాం’’ అని హామీ ఇచ్చారు. అంతేనా.. భార్య మాత్రమే ఉద్యోగి అయితే ఆమె తల్లితండ్రులతోపాటు అత్తమామలకు, భార్యాభర్తలిరువురూ ఉద్యోగులు అయితే ఇరువైపులా అత్తమామలకు కూడా పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పదో పీఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికను తాను వెంటనే పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ విషయంపై కూడా సీఎం మాట్లాడారు. ‘‘ఇప్పుడున్న సర్వీస్ రూల్స్‌ను ఆంధ్రా అధికారులు తయారు చేశారు. వాళ్లకు అనుగుణంగానే రూపొందించుకుని ఉంటారు. నిజాం కాలం నాటి రూల్స్ కదా అవి. ఇప్పటి పరిస్థితులను బట్టి మార్పు చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సర్వీస్ రూల్స్‌ను తయారు చేసి ఏ సంఘానికి ఆ సంఘం, ఏ శాఖకు ఆ శాఖకు విడివిడిగా రూపొందించుకుని దేవీప్రసాద్‌కు ఇవ్వండి. అయితే న్యాయపరమైన, సాంకేతికపరమైన చిక్కులు లేకుండా రూపొందించుకోండి. ఈ క్రమంలో అందరూ సహకరించుకోండి’’ అని ఉద్యోగ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇక ఉద్యోగులు, ప్రత్యేకించి పన్నుల శాఖల ఉద్యోగులు ప్రభుత్వాదాయం పెరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని కోరారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు వంకాయలపాటి మమత, ఎం.చంద్రశేఖర్ గౌడ్, కారెం రవీందర్ రెడ్డి, పువ్వెంల రవీందర్ కుమార్, రేఛల్, ఙ్ఞానేశ్వర్, సయ్యద్ సలీముద్దీన్, మధుసూధన్ రెడ్డి, ఎంబీ కృష్ణయాదవ్, శివశంకర్, మణిపాల్‌రెడ్డి తదితరులు సీఎంతో సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఉద్యోగ నేతలతో సమావేశమై.. చర్చించి ఎలా నిర్ణయాలు తీసుకున్నానో, అలాగే త్వరలోనే ఉద్యోగ నేతలతో మరో సమావేశం నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
|
Disclaimer : None of the Posts in this blog are mine. They were collected only for the reference purpose from various websites. Viewers may visit source websites for further study.
Tuesday, 21 October 2014
ప్రీమియం లేదు.. పరిమితి లేదు వైద్యం ఖర్చు ఎంతైనా మేమే భరిస్తాం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment