Tuesday, 14 October 2014

తెలంగాణ నుడికారానికి ఆకారం! భాషా శైలీ పత్రం సిద్ధం

తెలంగాణ నుడికారానికి ఆకారం! భాషా శైలీ పత్రం సిద్ధం

పాఠ్యాంశాలపై మార్గదర్శకాలకు తుది రూపు
80శాతం తెలంగాణ, 20ు ఆంధ్రా కవులకు చోటు
కసరత్తు పూర్తి చేసిన కమిటీ.. త్వరలో నివేదిక
2015-16 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుడికారం ఆకారం దిద్దుకుంటున్నది. జానపద పద ధ్వనులు, సాంస్కృతిక జయధ్వానాలు, కళా చారిత్రక జాడలు తెలంగాణ పాఠ్యాంశాల్లో పరిమళించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ భాషపై ఒక శైలీ పత్రం రూపుదిద్దుకుంది. తెలంగాణ సంస్కృతీ, సాహిత్య జీవనానికి గల విశిష్టతని ప్రతిఫలించేవిధంగా పాఠ్యాంశాల ఎంపికకు మార్గదర్శకాలూ సిద్ధమయ్యాయి. ఉపాధ్యాయ విద్య, పరిశోధన, శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ కసరత్తుని పూర్తి చేసింది. తెలంగాణ వైతాళికులు 80 శాతం, ఆంధ్రా సాహితీ వెలుగులు 20 శాతం ఉండేవిధంగా పాఠ్యాంశాల రూపకల్పన ఉండాలని నిర్దేశించింది. దీని ఆధారంగా ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వర కు గల పాఠ్యాంశాలను మార్చనున్నారు. ప్రస్తుతానికి తెలుగు, సాంఘిక శాసా్త్రలకు పరిమితం అయినా.. రానున్న రోజుల్లో మిగతా శాస్ర్తాల్లోనూ సంస్కరణలు తీసుకురానున్నారు. ఈ మేరకు త్వరలో ప్రభుత్వానికి కమిటీ.. నివేదిక ఇవ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తెలంగాణ పదజాలంతో సంస్కరించిన తెలుగు, సాంఘిక శాస్ర్తాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని విద్యాశాఖ భావిప్తోంది.
మాండలికం- నానార్థాలు

పాఠ్య పుస్తకాల మార్పునకు ప్రామాణికం తెలంగాణ మాండలికం. తెలంగాణ భాష, యాసపై ప్రసార మాధ్యమాల్లో దాడి జరుగుతున్నదనేది తెలంగాణ ఉద్యమకాలంలో బలంగా వినిపించిన వాదన. ఈ ఆవేదనకు అర్థం ఉన్నదని తెలంగాణ విద్యాశాఖ గుర్తించింది. ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లోని పదజాలం స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో వాడుకలో ఉన్న పదజాలాన్ని పొందుపరచాలని భావిస్తున్నది. అయితే, ఇందులో ఒక చిక్కు ఉంది. తెలంగాణ అంతటా ఒకే మాండలికం లేదు. జిల్లా జిల్లాకు మాండలికం మారుతుంది. ఇలాంటప్పుడు ఏ ప్రాంత మాండలికాన్ని ప్రమాణంగా తీసుకోవాలనేది ప్రశ్న. అయితే, ఇదేమంత అధిగమించలేని సమస్య కాదని రాష్ట్ర ఉపాధ్యాయ విద్య, పరిశోధన, శిక్షణా సంస్థ నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితి ఉత్పన్నమయితే..ప్రత్యేక పట్టిక ఇస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. అందులోభాగంగా నానార్థాల మాదిరిగా ఒక ‘మాండలిక పదజాల ప్రత్యేక పట్టిక‘ రూపొందించాలనేది వారి భావన. 
నామ వాచకం

తెలంగాణలో సర్వసామాన్య వాడుకలో ఉన్న మాండలిక పదజాలాన్ని ‘నామవాచకం’ విభాగంలో పొందుపరచనున్నారు. ఆంధ్రాలో వాడుకలో ఉన్న పదాలకు సమానమైన తెలంగాణ అర్థాలను సమగ్రంగా అందించనున్నారు. ఉదాహరణకు..కష్టాలు-తిప్పలు; సంపద - సొత్తు; నెట్టివేయు- దొబ్బేయటం; పాఠశాల- బడి; సొరకాయ- ఆనిగెపుకాయ / ఆనపకాయ, గేదెలు - బర్రెలు.
ముత్తెమంత పలుకు
తెలంగాణ పదాలు ఎంత నిండుతనంతో ఉంటాయో, అంతే క్లుప్తత గుణాన్ని కలిగి ఉంటాయి. ఆంధ్రా పదాల్లో కనిపించినట్టు దీర్ఘాలు, సాగదీసినట్టుండే యాస..ఇక్కడ లేదు. ఈ క్రమంలో పాఠ్యాంశాల్లో పూర్తి క్లుప్తతని, స్పష్టతని పాటించాలని కమిటీ భావిస్తోంది. అలాగే భాషా వినియోగంలో విభక్తులు వాడే తరహాలోనూ తేడాలు న్నాయి. ఉదాహరణకు సీతకు డబ్బులు ఇచ్చాం అనే వాక్యాన్ని పరిశీలిస్తే.. ఇందులో ‘కు’ విభక్తి. దీన్ని తెలంగాణలో ‘కి’గా ఉపయోగిస్తాం. తెలంగాణలో పైసలు అంటే, ఆంధ్రాలో డబ్బులు అంటారు. సందర్భాన్నిబట్టి వాడే పదజాలం, వాక్యాల్లో తెలంగాణ సంప్రదాయా లు ఉట్టిపడే విధంగా భాషను రూపొందించనున్నారు. ఉదాహరణకు..తెల్లని బట్ట- తెల్లటి బట్ట; కళ్లు - కండ్లు తదితరాలు. అలాగే, పలుకుబడి-పదబంధంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నా యి. ఉదాహరణకు..ఆంధ్రాలో కొంచెం..తెలంగాణలో ముత్తెమంత అవుతుంది. కుడిఎడమ- ఎలపటదాపట, జంట- ఐలపురం జోడి.
విలువల వరణం..
ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయుల్లో ‘ఇతివృత్తాల’ను పిల్లలకు అందించాలని నిర్ణయించారు. ఏఏ అంశాలను పొందుపరిచేందుకు అవకాశం ఉన్నదో శైలీపత్రంలో సూచించారు. ఈ అంశాల ఆధారంగా పాఠాల ఎంపిక ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో పట్టించుకోవాల్సిన అంశాలుగా దేశభక్తి, విలువలు, మానవ సంబంఽధాలు; పిల్లల స్వభావం, శక్తి సామర్థ్యాలు, ఆసక్తులు; -పర్యావరణం, ప్రకృతి, సమాజం; సంస్కృతి, సంప్రదాయాలు, భాషాభిరుచి; హాస్యం, కాల్పనికత, సృజనాత్మకతలను గుర్తించారు. ఇక మాధ్యమిక, ఉన్నత స్థాయిల్లో.....అదనంగా వర్ణణ; నైతికత; సీ్త్రల పట్ల గౌరవం, సాధికారత; శ్రమపట్ల గౌరవం; స్పూర్తి దాతలు; సామాజిక స్పృహ; మానవ స్వభావాలు; శాసీ్త్రయ విజ్ఞానం; భాషాభిరుచి; సాహిత్యాభిరుచి; వృద్ధుల పట్ల వైఖరి; ప్రత్యేక ప్రతిభావంతులు; అన్ని భాషా సంస్కృతి సమాజాల పట్ల అవగాహణ; కళలు, మిమిక్రీ; వ్యక్తిత్వ వికాసం; సామాజిక సమానత్వ భావన; జంట, సోదరకవులు; దర్శనీయ పర్యాటక స్థలాలు (తెలంగాణ); చెరువులపై(తెలంగాణ)అవగాహన తదితర అంశాలను అందించనున్నారు.
రేలా.. రేలా..
తెలంగాణ సాంస్కృతిక జీవనంలో పాట ఒక భాగం. ఏ పల్లెకు వెళ్లినా జానపద గీతాలు పలకరిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని సాహిత్య, సాంస్కృతిక ప్రక్రియలను అందించనున్నారు. ఈ వరసలో.. గేయం; పద్యం, ద్విపద శతకం; వచన కవిత.. మినీ కవిత, నాని; కథ, కథానిక, గల్పిక; ఆత్మకథ, జీవిత చరిత్ర; అనువాదం; వ్యాసం; లేఖ; కరపత్రం; సంభాషణ; నాటిక; పీఠిక; వార్త, వార్తా వాఖ్య; సంపాదకీయం; విమర్శ ; పుస్తక పరిచయం..సమీక్ష; యక్షగానం ; జానపదం (కథ, గేయం, బాల గేయం); పరిశోధన; గజల్‌, రుబాయి; అచ్చ తెలుగు కావ్యం; అవ ధానం; సూక్తులు, లోకోక్తులు, సామెతలు, జాతీయాలు, న్యాయాలు; పొడుపు కథలు, నవలిక చోటు దక్కించుకోనున్నాయి.
ఉపవాచకం
తెలుగు పాఠ్యాంశానికి అనుబంధంగా ఉండే ఉపవాచకంలో పొందుపరచాల్సిన కొన్ని అంశాలను శైలీపత్రంలో గుర్తించారు. వాటికి సంబంధించి నిర్దేశాలు ఇలా ఉన్నాయి. కుల, మత, లింగ, వర్గ, ప్రాంత, భాష, వివక్షలకు తావులేని రచనలు ఉండాలి. పిల్లల మనసుపై దుష్ప్రభావం పడకూడదు. వివాదాస్పద అంశాలకు తావిచ్చే రచనలకు స్థానం లేదు. బట్టీ విధానాలకు స్వస్తి పలకాలి. ఆలోచనలు పెంచాలి. పాఠ్యపుస్తకం పరిధిని దాటి చదివే అవకాశం కల్పించాలి. భాషా వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలి; పాఠాలలోని విషయ అమరిక ఇప్పుడున్న విధానాన్నే (యథాతథం) కొనసాగించాలి. వ్యాకరణ చందస్సులో ఆయా పద్యాలు రాసే విధంగా(ప్రోత్సహించే విధంగా) సూచనలు ఇవ్వాలి. బొమ్మల్లో తెలంగాణ కట్టు, బొట్టు ప్రతిబింబించాలి. ఇంకా.. ఆరు ఏడు తరగతులలో పది పాఠాలు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతులలో పెన్నెండు పాఠాలు పెట్టాలి. పదో తరగతికి మాత్రమే- ఒక్క అంశం (ప్రక్రియ)తో ఉన్న రచన (ఏ4లో 30 పుటలు) మిగతా తరగతుల్లో వేరు వేరు అంశాలు (6-8 వరకు పుటలు) ఉండవచ్చు. మిగిలిన తరగతులకు....స్ఫూర్తి దాతలు, తెలంగాణ రైతాంగ పోరాటాలు, పండుగలు (తెలంగాణ), కళలు, హాస్యరచన లు, 1969 ఉద్యమం, సంస్కృతి, సంక్షిప్త నవలలు, ఇతిహాస కథ మొదలగునవి బోధించాలి. 
శ్రీశ్రీ, గురజాడలకు చోటు

తెలంగాణ రచయితలు, కవుల రచనలు 80 శాతం, ఆంధ్రా ప్రాంత కవులు, రచయితల రచనలు 20 శాతం.. కొత్త పాఠ్యాంశాల్లో కనిపించనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన పాఠ్యపుస్తకాల్లో 40 శాతం ఆంధ్రా, 40 శాతం తెలంగాణ, 20 శాతం రాయలసీమ ప్రాంత రచయితల రచనలను పొందుపర్చారు. తాజా మార్పుల్లో భాగంగా 80 : 20 నిష్పత్తిని పాటిస్తారు. ఆంధ్రా ప్రాంత కవుల్లో భాగంగా.. శ్రీశ్రీ, గురజాడ, జాషువా, తెనాలి రామకృష్ణుడు తదితరుల రచనలను పిల్లలు చదువుకోనున్నారు. 
మార్గదర్శకాలు 

1.ఇతి వృత్తాలు, ప్రక్రియలను దృష్టిలో పెట్టుకుని పాఠ్యాంశాల ఎంపిక.
2.భాషా సామర్థ్యాల సాధనకు అనువైన పాఠాలు
3. ఐదో తరగతి వరకు పాఠాలు కొత్తగా రూపొందించే అవకాశం ఉంది.
4. ఆరవ తరగతి నుంచి పాఠాలు ప్రసిద్ధ రచయితల, కవుల రచనల నుంచి ఉండాలి.
5. దివంగత రచయితల రచనలకు తొలి ప్రాధాన్యం.
6. ప్రతి తరగతిలో పాట తప్పక ఉండాలి.

No comments:

Post a Comment