Sunday, 9 November 2014

నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని ఇదే!

నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని ఇదే!
ప్రకాశం బ్యారేజీ నుంచి అనంతవరం..
బోరుపాలెం నుంచి ఆటోనగర్‌ వరకు గుంటూరు జిల్లాలోనే కేంద్రీకృతం
  

రాజధాని పరిధిలోకి కొత్తగా పది గ్రామాల చేరిక
మొత్తం గ్రామాల మధ్య దూరం 53 కిలోమీటర్లు
చుట్టూ 3 రింగురోడ్లు
సరిహద్దులు ఖరారు
హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపించా.. ఇక్కడా చేస్తాను
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన
హద్దులు ఖరారు చేసిన చంద్రబాబు.. అధికారికంగా ప్రకటన
భూమి ఇచ్చిన రైతుకే తొలి ప్రయోజనం.. 
ఏసీ గదుల్లో కూర్చునేలా చేస్తా.. హైదరాబాద్‌లాగే అభివృద్ధి చేస్తా.. నాకు రైతులపై, వారికి నాపై విశ్వాసం ఉంది
అందరితో మాట్లాడతా.. అవసరమైన మార్పులు చేస్తా.. ఇళ్లు లేని వారికి శాశ్వతంగా ఇళ్లు కట్టించి ఇస్తా.. నది ఒడ్డునే కమర్షియల్‌ స్థలాలిచ్చే యోచన
ఏడాదిలోపు ప్రత్యామ్నాయ భూమి సర్టిఫికెట్లు.. చిన్న రైతులకు ఒకే చోట షాపులు కట్టించే యత్నం.. భూములు అమ్ముకోకుండా ఉంటేనే లాభం

భూ సమీకరణ విధానంపై చంద్రబాబు.. వన్‌ టైం సెటిల్మెంట్‌గా రుణ మాఫీ.. పండ్ల తోటల రుణాలూ మాఫీ.. రాజధాని రైతులకు మాత్రమే వర్తింపు
విజయవాడ వెళ్లారా!? కనక దుర్గమ్మను దర్శించుకుని ప్రకాశం బ్యారేజీ చూశారా!? ఇప్పుడు ఆ కనక దుర్గమ్మ పాదాల చెంత.. కృష్ణా నది ఒడ్డు నుంచి నవ్యాంధ్ర రాజధాని ప్రారంభమవుతుంది! ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత ఉండవల్లి నుంచి మంగళగిరి ఆటోనగర్‌ వై జంక్షన్‌ (ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి) వరకూ తూర్పు సరిహద్దు! అక్కడి నుంచి పెదపరిమి వరకూ దక్షిణం సరిహద్దు! పెదపరిమి నుంచి వడ్డమాను వరకూ కొన్ని గ్రామాల పరిధిలో పశ్చిమ సరిహద్దు! తుళ్లూరు మండలం బోరుపాలెం నుంచి కరకట్ట మీదుగా ప్రకాశం బ్యారేజీ వరకూ ఉత్తరం సరిహద్దు! ఇదే.. నవ్యాంధ్ర రాజధాని! ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. రాజధాని మొత్తం గుంటూరు జిల్లాలోనే కేంద్రీకృతమైంది! రాజధాని చుట్టూ మూడు రింగురోడ్లు నిర్మించనున్నారు. మరోవైపు అపోహలు తొలగి రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తామంటూ రైతులు ముందుకు వస్తున్నారు! గ్రామాలకు గ్రామాలే హామీ పత్రాలు రాసి ఇస్తున్నాయి! కాబోయే రాజధాని తుళ్లూరులో కాంగ్రెస్‌ నేతల పర్యటనను నిరసిస్తూ.. రైతులు ‘గో బ్యాక్‌’ అంటూ ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్‌, నవంబర్‌ 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అధికారికంగా తేలిపోయింది! హద్దులు ఖరారయ్యాయి! గుంటూరు జిల్లాలోనే రాజధాని కేంద్రీకృతం కానుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ‘‘ఉత్తరదిశలో కృష్ణా నది ఒక హద్దుగా ఉంటుంది. బోరుపా లెంనుంచి ప్రకాశం బ్యారేజీవరకు 18 కిలోమీటర్ల హద్దుగాఖరారుచేశాం. బ్యారేజీ నుంచి ఆటోనగర్‌ వై జంక్షన్‌ వరకు 10 కిలోమీటర్లు తూర్పు సరిహద్దు. వై జంక్షన్‌ వద్ద బ్యారేజీ నుంచి వచ్చే రోడ్డు, కనక దుర్గమ్మ వారధి నుంచి వచ్చే రోడ్డు కలుస్తాయి. ఇది జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. బోరుపాలెం నుంచి అనంతవరం మీదుగా 8 కిలోమీటర్లు పశ్చిమ సరిహద్దు. ఇన్నర్‌ రింగు రోడ్డులో ఎనిమిదో కిలోమీటరు రాయివద్ద ఈ హద్దు ముగుస్తుంది. వై జంక్షన్‌ నుంచి 16 కిలోమీటర్ల పొడవునా దక్షిణ సరిహద్దు ఉంటుంది. ఈ హద్దుల పరిధిలో 30వేల ఎకరాలున్నాయి’’ అని సీఎం వివరించారు. శనివారం తన నివాసంలో రాజధాని నిర్మాణ కమిటీ సమావేశం సందర్భంగా రాజధాని సరిహద్దులను తేల్చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
రైతుకు నాదీ పూచీ!
‘‘రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు తొలి ప్రయోజనం. వారి తర్వాతే ఎవరైనా! ఇదే నా లక్ష్యం. దానికి నాది పూచీ’’ అని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో సైబరాబాద్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంవల్ల అన్ని ప్రాంతాల్లో భూముల రేట్లు పెరిగి అనేకమంది లాభపడ్డారు. ఎక్కడ ఏది చేసినా అందరికీ సమానంగా వర్తించే విధానాన్నే పెట్టుకొంటానని వివరించారు. ఇక్కడ కూడా వ్యవసాయంపై వచ్చేదానితో పోలిస్తే అదనంగా అధిక ఆదాయం వచ్చే అవకాశం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ‘‘మట్టి పిసుక్కొనే రైతులు ఏసీ గదుల్లో కూర్చునే రోజులు వస్తాయి. ఎవరూ, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. నాకు వారిపై నమ్మకం ఉంది. వారికి నాపై నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. అది చాలు’’ అన్నారు.
ప్రపంచస్థాయి నగరం కోసమే...
రాజధాని నిర్మాణానికి ఇంత భూమి ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారని, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉండాలో లేదో తేల్చుకోవాలన్నారు. ‘‘న్యూఢిల్లీ విశాలమైన రోడ్లతో చాలా అందంగా ఉంటుంది. దాన్నిమించిన రాజధాని నిర్మిస్తామని ప్రధాని మోదీ గతంలో ప్రకటించారు. స్మార్ట్‌ సిటీల నిర్మాణానికీ కేంద్రం యత్నిస్తోంది. తదనుగుణమైన ప్రణాళికతో మనం వెళ్లాలి. ప్రపంచ స్థాయి మౌలిక వసతులుంటే అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు తీస్తుంది. భూముల విలువ బాగా పెరుగుతుంది. దీనివల్ల లాభం పొందేది రైతులే’’ అని వివరించారు. తమ వాళ్లను పంపించి రైతులతో మాట్లాడి ఇంకా ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపారు. ‘భూ సమీకరణ ప్రాంతంలో ఇళ్లు లేనివారికి శాశ్వత ఇళ్లు నిర్మించి ఇస్తాం. రుణమాఫీలో భాగంగా, రాజధాని గ్రామాల్లో రైతులకు రూ.లక్షన్నర వరకూ వన్‌టైం సెటిల్మెంట్‌ కింద పరిష్కరిస్తాం. వీలైనంత త్వరగా మౌలిక వసతుల కల్పన మొదలు పెడతాం. దానివల్ల స్థలాల ధరలు త్వరగా పెరుగుతాయి. పంటలవారీ పరిహారం గురించి ఆలోచిస్తాం. న ది ఒడ్డున విలువైన భూములు న్నవారికి అక్కడే కమర్షియల్‌ స్థలాలివ్వడంపై పరిశీలిస్తాం. ఆదాయపు పన్నుపై కేంద్రంతో మాట్లాడాలి. ఏడాదిలోపు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు సర్టిఫికెట్లు ఇస్తాం. ఈలోపు రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, విద్యుత్‌ లైన్లు వంటివి వేసేస్తాం. మౌలిక వసతులతో కంపెనీలు వస్తాయి. అర ఎకరం, పావు ఎకరం భూమి ఉన్న కొందరు చిన్న రైతులకు ఒకేచోట భూమి ఇచ్చి షాపులు కట్టించడంపైనా ఆలోచిస్తున్నాం. వారికి కొంత డబ్బు కూడా ఇస్తాం’’ అని వివరించారు. ఖరారైన హద్దుల పరిధిలో 29 గ్రామాల భూములున్నాయన్నారు. కొన్ని గ్రామాల్లో 50-100 ఎకరాలు మాత్రమే రాజధాని పరిధిలోకి వస్తాయని తెలిపారు.
గ్రామాల్లోని ఇళ్ల జోలికి, చెరువుల జోలికి వెళ్లడంలేదన్నారు. ‘‘రాజధాని పరిధిలో భూమి లేనివారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి మంచి ఉపాధి దొరికేలా చేస్తాం. రైతులూ పనులు మొదలయ్యేవరకూ వ్యవసాయం చేసుకోవచ్చు. రాజధాని అథారిటీకి నేనే అధ్యక్షుడిని. రైతులకు ఏం కావాలో తెలుసు. నన్ను నమ్మండి. ప్రతివారికీ న్యాయం జరుగుతుంది’’ అని చంద్రబాబు వివరించారు. రాజధాని పరిధిలో ఎవరైనా భూములు అమ్ముకొంటామంటే అభ్యంతరపెట్టబోమని, కానీ, ఉంచుకొంటేనే లాభమన్నది తన సలహా అని ఆయన చెప్పారు. గుంటూరు - విజయవాడ మధ్య అసలు రాజధానినే పెట్టవద్దని వాదించి అడ్డుపడాలని చూసినవారు.. ఇప్పుడు రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, వారి ఆలోచనలను గుర్తించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
‘‘రాషా్ట్రనికి మధ్యలో ఉందని విజయవాడ-గుంటూరును రాజధాని కేంద్రంగా ఎంపిక చేశాను. రాజధాని రాకూడదని ప్రయత్నం చేసినవారు ఇప్పుడు భూములు పోతాయని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అడవుల్లో పెట్టాలని కొందరు.. వారి ఇళ్లవద్ద పెట్టాలని మరికొందరు నాకు చెప్పారు. దొనకొండ వద్ద పెట్టాలంటూ రాయబారాలూ నడిపారు. కానీ, 13జిల్లాల అభివృద్ధికి ప్రణాళికతో పనిచేస్తున్నాను’’ అని వివరించారు. ఇక రాజధాని ప్రాంతంలో పండ్ల తోటల రుణాలనూ మాఫీ చేయాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. కాగా, అధికారంలోకి వచ్చాక పండ్ల తోటలను రుణమాఫీ జాబితానుంచి తొలగిస్తూ ప్రత్యేక జీవో జారీచేశారు. దీంతో తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని పండ్లతోటల రైతులు సీఎంను ఎలా నమ్మాలని ప్రశ్నించసాగారు. దీనిపై నిఘావర్గాల సమాచారంతో 25 వేలమంది రైతులకు రూ.10కోట్లవరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
చుట్టూ 3 రింగ్‌ రోడ్లు
నవ్యాంధ్ర రాజధాని నగరం చుట్టూ మూడు రింగ్‌ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని చుట్టూ 75 కి.మీ. విస్తీర్ణంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, 120 కి.మీ. వ్యాసంతో మధ్య రింగ్‌ రోడ్డు, 200 కి.మీ. వ్యాసంతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తారు. రాజధానికి చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు విస్తరించి అభివృద్ధి విస్తరించే నిమిత్తం ఈ మూడు రింగ్‌ రోడ్లను నిర్మించాలని తలపెట్టారు.
తాడేపల్లిలోని గ్రామాల చేర్పు .. మొత్తం గ్రామాల మధ్య దూరం 53 కిలోమీటర్లు
(గుంటూరు - ఆంధ్రజ్యోతి)
నవ్యాంధ్ర రాజధాని మొత్తం గుంటూరు పరిధిలోనే ఉండడం ఖరారైంది! ఇప్పటికే రెండు మండలాల్లోని 19 గ్రామాలను ప్రకటించిన ప్రభుత్వం.. మరో పది గ్రామాలను కలిపి రాజధాని పరిధిని మరింత విస్తరించింది. దీంతో, గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలంలోని పలు గ్రామాలు రాజధాని పరిధిలోకి వచ్చి చేరాయి. 
హద్దులు ఇవే!

తూర్పు హద్దుగా ప్రకాశం బ్యారేజీ నుంచి వై జంక్షన్‌ (ఎన్‌ఆర్‌ఐ హాస్పటల్‌) వరకు 10.5 కిలోమీటర్లు. అక్కడి నుంచి దక్షిణం హద్దుగా పెదపరిమి వరకు సుమారు 16.5 కిలోమీటర్లు. అక్కడి నుంచి పడమరగా బోరుపాలెం వరకు సుమారు 8 కిలోమీటర్లు. బోరుపాలెం నుంచి తిరిగి ప్రకాశం బ్యారేజ్‌ వరకు సుమారు 18 కిలోమీటర్ల మేర ఉత్తర హద్దుగా నిర్థారించారు. ఈ హద్దుల్లోని మొత్తం గ్రామాల మధ్య దూరం 53కిలోమీటర్లు.
తూర్పు హద్దు గ్రామాలు..
రాజధాని తూర్పు హద్దుగా నిర్ణయించిన ప్రాంతం 10.5 కిలోమీటర్ల పరిధిలో ప్రకాశం బ్యారేజ్‌ నుంచి వై జంక్షన్‌ ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి వరకు ఉండనుంది. దీని పరిధిలో ఉండవల్లి, పెనుమాక, పాత కృష్ణనగర్‌ పంచాయతీ, నవులూరు, యర్రబాలెం గ్రామాలున్నాయి. ఇవి మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఉన్నాయి.
దక్షిణం హద్దు గ్రామాలు..
దక్షిణం హద్దు వై జంక్షన్‌ నుంచి పెదపరిమి వరకు 16.5 కిలోమీటర్ల మేర నిర్ణయించారు. ఈ పరిధిలో నిడమర్రు, శాఖమూరు, కురగల్లు, నీరుకొండ, ఐనవోలు, నేలపాడు, తుళ్లూరు గ్రామాలున్నాయి. ఇవన్నీ మంగళగిరి, తుళ్లూరు మండలాల పరిధిలోనివే.
పడమర హద్దు గ్రామాలు..
రాజధానికి పడమర హద్దుగా పెదపరిమి నుంచి బోరుపాలెం వరకు దాదాపు 8 కిలోమీటర్లు హద్దు నిర్ణయించారు. బోరుపాలెం- పెదపరిమి గ్రామాల మధ్యలో అనంతవరం, నెక్కలు, వడ్డమాను, దొండపాడు గ్రామాలున్నాయి. ఇవి తుళ్లూరు మండల పరిధిలోవి.
ఉత్తరం హద్దు
రాజధానికి ఉత్తరం హద్దుగా బోరుపాలెం నుంచి ప్రకాశం బ్యారేజ్‌ వరకు కరకట్ట వెంబడి 18 కిలోమీటర్ల మేర పరిధిని నిర్ణయించారు. ఈ హద్దులో అబ్బరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, మందడం, మోదలింగాయపాలెం, కృష్ణాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, వెంకటపాలెం, ఉండవల్లి గ్రామాలున్నాయి. ఇవన్నీ తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని గ్రామాలు.
ఆ పది గ్రామాలు ఇవే !
తుళ్లూరు మండలంలో...
తుళ్లూరు మండలంలో కొత్తగా మూడు గ్రామాలు చేరాయి. అనంతవరం, పెదపరిమి, వడ్డమాను గ్రామాలు కొత్తగా చేరిన వాటిలో ఉన్నాయి. గతంలో ఈ మండలంలోని 16 రెవెన్యూ గ్రామాలు రాజధాని పరిధిలో ఉన్నాయి. కొత్తగా కలిపిన వాటితో కలిపి ఈ సంఖ్య 19 రెవెన్యూ గ్రామాలకు చేరింది.
మంగళగిరి మండలం పరిధిలో!
మంగళగిరి మండల పరిధిలోని నాలుగు గ్రామాలు కొత్తగా రాజధాని పరిధిలోకి చేరాయి. యర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, బేతపూడి ఇందులో ఉన్నాయి.
తాడేపల్లి మండలం పరిధిలో...
తాడేపల్లి మండల పరిధిలోని మూడు గ్రామాలు ఉండవల్లి, పెనుమాక, పాత కృష్ణనగర్‌ పంచాయతీ (నులకపేట, డోలాస్‌ నగర్‌) కొత్తగా రాజధాని పరిధిలోకి చేరాయి. గతంలో ఈ మండలంలో ఒక్క గ్రామం కూడా లేదు.

No comments:

Post a Comment