Sunday, 24 August 2014

ఘెట్టో - యంటీ ఖాన్

ఘెట్టో - ఎం.టి. ఖాన్‌
రాజకీయ ఆర్థిక సాంఘిక రంగాలలో నిరాదరణకు గురి అవుతున్నది ఒక్క ముస్లింలు మాత్రమే కాదని ఇక్కడ చెప్పడం అవసరం. అణగారిన ముస్లింలు తమ స్థితికి వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేయలేరు. దళితులతోనూ ఆదివాసీలతోనూ ఐక్యమై తమ జీవితాల మెరుగుదల కోసం ముస్లింలు పోరాడాలి.

‘జల్‌జలా’ అంటే ఉర్దూలో భూకంపమనీ, భూకంపం కలుగజేసే విధ్వంసమనీ అర్థం.
ముస్లింవాద కవిత్వం అన్న ఉపశీర్షికతో ప్రచురించిన ఈ సంకలనం ఈ దేశంలోని లక్షలాది సామాన్య ముస్లింల దయనీయ జీవన స్థితిగతులకు ప్రతిస్పందన. వారి ఆవేదన నుండి పుట్టిన ఆక్రందన.
అయిదు దశాబ్దాల క్రితం ఈ దేశాన్ని కృత్రిమంగా విభజించిన బ్రిటిష్‌వారి ద్రోహం వదిలివెళ్ళిన గాయం భారత పాకిస్తాన్‌ దేశాల ప్రజల ఉమ్మడి జ్ఞాపకాలలో సజీవంగా ఉంది. అది చాలదన్నట్టు, దేశ విభజనకు భారతదేశంలోని సామాన్యముస్లింలు-ఆ తరం వాళ్ళే కాకుండా ఈ తరం వాళ్ళు కూడా- బాధ్యత వహించవలసి ఉంటుందంటూ హైందవ మతోన్మాదులు ముస్లింల మనస్సులలోని గాయంపైన కారం చల్లుతున్నారు.
భారతదేశంలోని హిందూ ప్రజానీకంలో ఒక సామాన్య అభిప్రాయం ఉంది. భారతదేశంలోని ముస్లింలంతా పాకిస్తాన్‌ అనుయాయులనీ, భారతదేశం పట్ల వాళ్ళ విధేయత ప్రశ్నార్థకమనీ హిందువులు నమ్ముతారు. ‘పుట్టుమచ్చ’ అన్న సుదీర్ఘకవితలో ఖాదర్‌ మొహియుద్దీన్‌ ఈ కల్పనను బలంగా ప్రశ్నించాడు. ‘కాషాయపు కాంతుల’ప్రభావం వల్ల, కేవలం ముస్లిం కుటుంబంలో పుట్టిన నేరానికి హిందువుల కళ్ళకు దోషిగా కనిపించే దుస్థితి నెలకొన్నది. ఈ వైఖరి ఫలితంగా అన్ని జీవిత రంగాలలోనూ ముస్లింలు అన్యాయానికి గురి అవుతున్నారు.
ఈ రోజు మనదేశంలోని ముస్లింలలో అధిక సంఖ్యాకుల జీవన స్థితిగతులు దళితులు, ఆదివాసీల జీవన స్థితిగతుల కంటే మెరుగ్గా లేవు. గౌరవప్రదమైన జీవితానికి అవకాశం లేని దయనీయ స్థితిలో బ్రతుకుతున్నారు. నిజమే, బ్రిటిష్‌ హయాంలో ముస్లిం మతస్తులు ఏలిన సంస్థానాలలో ఒకవర్గం ముస్లింలు భోగాలు అనుభవించారు. అయితే, ఆనాడు కూడా మెజారిటీ ముస్లింల స్థితిగతులు ఈరోజుకంటే మెరుగ్గా లేవు. అయితే విలాసాలు అనుభవించిన పాలకవర్గం సామాన్య ముస్లింల మనస్సులలో కూడా తామంతా పాలకులమనే భావాన్ని-తప్పుడు చైతన్యాన్ని-రేకెత్తించింది.
ఈ తప్పుడు చైతన్యం ఫలితంగా, స్వాతంత్ర్యానంతరం తాము ఏదో ఉన్నత దశను కోల్పోయామని సామాన్య ముస్లిం లు భావించసాగారు. తమకు అన్యాయం జరిగిందన్న నిరసన భావం దీనివల్ల సామాన్య ముస్లింలలో మరింత పెరిగింది. ముస్లింలు మాత్రమే దేశంలో నిరాదరణకూ నిర్లక్ష్యానికీ గురి అయ్యారని ముస్లిం నాయకులు చేసిన ప్రచారం సామాన్య ముస్లింల చైతన్యానికి మరొక కోణాన్ని అందించింది. ఈ దేశం లో ఇతర ప్రజలు కూడా వేల సంవత్సరాలుగా కడుహీనంగా బతుకుతున్నారన్న స్పృహలేని ముస్లిం నాయకుల మంద దీనికి కారణం.
దళితుల పట్ల, ముస్లింల పట్ల ద్వేషభావం ఉన్న హిందూ మతోన్మాద శక్తులు సమాజంలో ఎదగడం ఈ ప్రజల దయనీయ స్థితిని మరింత దిగజార్చింది. ‘ఆపరేషన్‌ బ్లూస్టార్‌’ను, బాబ్రీమసీదు కూల్చివేతను, ఒక పరంపరగా జరుగుతున్న అంబేద్కర్‌ విగ్రహాలను అవమానపరచే ఘటనలను కాకతాళీయమైనవిగా చూడలేము. సిక్కు, ముస్లిం, దళిత ప్రజల మనోభావాలను గాయపరిచి హైందవ పెత్తందారీ శక్తుల ఎదుట వారిని నిస్సహాయులుగా నిలబెట్టాలని జరుగుతున్న ప్రయత్నపూర్వకమైన కుట్రగా వీటిని అర్థం చేసుకోవాలి.
ప్రస్తుత సంకలనంలోని కవితలను నిరసన ధ్వనులను ఈ పరిస్థితులకొక సహజమైన ప్రతిస్పందనగా అర్థం చేసుకోవచ్చు ను. వీటిలోని నిరసనను-కొన్ని కవితలలో ఆ నిరసన తిరుగుబాటు రూపం తీసుకుంది కూడా-అతిశయోక్తిగా భావించనవసరం లేదు. తమకు జరిగిన అన్యాయాన్ని అతిగా ఊహించుకుంటున్నారని కొట్టిపారేయనవసరం లేదు. ముస్లింలు ఒక ‘ఘెట్టో’లోకి నెట్టబడుతున్నారన్న నగ్నసత్యాన్ని ఈ కవితలు వ్యక్తం చేసాయి.
అయితే, రాజకీయ ఆర్థిక సాంఘిక రంగాలలో నిరాదరణకు గురి అవుతున్నది ఒక్క ముస్లింలు మాత్రమే కాదని ఇక్కడ చెప్పడం అవసరం. అణగారిన ముస్లింలు తమ స్థితికి వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేయలేరు. దళితులతోనూ ఆదివాసీలతోనూ ఐక్యమై తమ జీవితాల మెరుగుదల కోసం ముస్లింలు పోరాడాలి.
మరొక హెచ్చరిక. ముస్లిం బాధలను తమ ప్రయోజనాలకోసం వాడుకునే ప్రయత్నం ముస్లిం మతోన్మాదులు చేస్తున్నారు. ఏరకమైన మతోన్మాదానికయినా ఫాసిస్టు స్వభావం ఉంటుంది. మతోన్మాదం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం. భారతదేశ ముస్లింలను ఇతర ప్రజలనుండి వేరుచేసి ఒక భిన్నమైన ‘ఐడెంటిటీ’ ఉందనే ఆలోచన సరయినది కాదు. ఇస్లాం లోని ‘ఉమ్మా’ అనే భావనను తప్పుడు పద్ధతిలో అన్వయించడం ద్వారా దేశంలోని ముస్లింలను ముస్లిమేతరులనుండి వేరు చేస్తున్నారు. ‘ఉమ్మా’ అంటే అర్థం ప్రపంచంలో ముస్లింలు ఎక్కడున్నా ఇస్లాం వారి మతం అని మాత్రమే.
భారతదేశంలో ‘ముస్లిం ఐడెంటిటీ’ అనే విషయాన్ని గురించి వేడిగా చర్చ జరుగుతూ ఉంది. భారతదేశంలో ముస్లింలు తమను ఒక మైనారిటీ మతంగా గుర్తించాలని కోరడం సబబే. కాని సిక్కుల లాగ కాక ముస్లింలు బెంగాల్‌లో ఉన్నా తమిళనాడులో ఉన్నా కేరళలో ఉన్నా స్థానిక సమాజంలో భాగమే. అస్సామీల లాగ, కాశ్మీరీల లాగ, నాగా తదితర ఆదివాసీ జాతులలాగ వారికొక భిన్నమైన అస్తిత్వంలేదు. క్రైస్తవుల లాగే ముస్లింలు కూడా దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ స్థానిక సంస్కృతిలో భాగమే.
ఈ సంకలనంలోని కొన్ని కవితల ధ్వనితోనూ భావంతోనూ అందరమూ ఏకీభవించలేకపోవచ్చును. కానీ వాటిలోని నిజాయితీని శంకించలేము.
- ఎం.టి. ఖాన్‌
21, నవంబరు 1997
హైదరాబాద్‌
(‘జల్‌జలా’ ముస్లింవాద కవితా సంకలనం ముందుమాట ఇది. కె. బాలగోపాల్‌ దీనిని ఇంగ్లీషు నుంచి తెలుగు చేశారు. బాలగోపాల్‌ కూడా ‘జల్‌జలా’కు ముందుమాట రాస్తూ ముస్లిం ఐడెంటిటీ విషయంలో ఎం.టి.ఖాన్‌ అభిప్రాయంతో విభేదించారు)

No comments:

Post a Comment