Friday, 1 August 2014

Class, Caste and Communal

దేని సందర్భందానిది.

వర్గం అనేది ఆర్ధిక ప్రత్యయం. కులం, మతం సాంస్కృతిక ప్రత్యయాలు. ఆర్ధిక ప్రత్యయం కావడాన వర్గానికి ఒక విస్తరణ స్వభావం వుంటుంది. సాంస్కృతిక ప్రత్యయం కావడాన కులానికి విస్తరణ స్వభావం వుండదు. కొన్ని మతాలకు విస్తరణ స్వభావం వుండవచ్చుగానీ, నిర్ణిత సమయంలో మతం కూడా దడికట్టుకునే ప్రవర్తిస్తుంది.

ఒక సంఘానికో సమాఖ్యకో వర్గం ప్రధాన ప్రాతిపదిక అయినపుడు అనేక కులాలు, మతాలు, తెగలు, ప్రాంతాలు, లింగాలు, వర్ణాలకు చెందినవాళ్లంతా సమైక్యంగా సభ్యులుగా వుంటారు. అంచేత వాటి విస్తృతి చాలా ఎక్కువ.  ఒక సంఘానికి కులాలు, మతాలు, తెగలు, ప్రాంతాలు, లింగాలు, వర్ణాలు ప్రాతిపదిక అయినపుడు అవన్నీ వికేంద్రీకరణకు గురవుతుంటాయి.  అంటే విడిపోతుంటాయి.

ఇతర సమూహాల నుండీ యస్సీలు విడిపోవడాన్నీ, యస్సీలు మళ్ళీ మాల మాదిగలుగా విడిపోవడాన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో రేపు మాదిగ సమాజంలో కూడా విభజనరావచ్చు. అలాంటి వికేంద్రీకరణను మనం నిమకులాల్లోనూ చూస్తున్నాం. యాదవ, గౌడ, సాలె, పల్లెకారులు నిమ్న కులాల్లో పెత్తందారులుగా మారుతున్నారు. పఠాన్, సయ్యద్ తదితరులు ముస్లిం సమాజంలో పెత్తందారీ కులాలుగా మారుతున్నారు. ఒకటి రెండుగా చీలినపుడు రెండు నాలుగుగా చీలుతుంది. తెలంగాణ వాదం తరువాత నెమ్మదిగా రాయలసీమ వాదం పుంజుకుంటుంది. తీరాంధ్రలోనూ మధ్య తీరాంధ్రతో ఉత్తర తీరాంధ్ర, దక్షణ తీరాంధ్ర లుకలుకలు అప్పుడే కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ మరో ఉద్యమం రగులుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. సామాజిక వైరుధ్యాలన్నీ పరిష్కారం అయ్యేవరకు  ఇదొక నిరంతర ప్రక్రియ.  


వర్గప్రత్యయాలకు స్థూల తీవ్రత వుంటుంది. అది ఎక్కువ శక్తుల్ని ఆకర్షిస్తుంది. సాంస్కృతిక ప్రత్యయాలకు సూక్ష్మ తీవ్రత వుంటుంది. అది కొందరిరినే అయినా  మరింత లోతుగా ఆకర్షిస్తుంది. రెండింటిలో దేన్నీ తీసివేయడం కుదరదు. దేని సందర్భం దానిది.

No comments:

Post a Comment