Wednesday, 20 August 2014

Survey Super Hit - KCR

సూపర్‌ హిట్‌...

Published at: 20-08-2014 05:44 AM
గొప్ప అద్భుతం ఆవిష్కృతమైంది.. ప్రజలు చక్కగా సహకరించారు
ఉద్యోగులు, ఎన్యూమరేటర్ల పనితీరు అమోఘం.. ఇలాగే సహకరిస్తే బంగారు తెలంగాణ చేస్తా
15 రోజుల్లో అందరి ముంగిటకు సర్వే వివరాలు.. వివరాలు ఇవ్వలేనివారికి మరోసారి అవకాశం
సర్వేతో దొంగలు, కోట్లు దొబ్బితిన్నవాళ్లకే బాధ.. అర్హులకే ప్రభుత్వ పథకాల లబ్ధి : సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌, ఆగస్ట్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ అద్భుతంగా, అందరూ ఆశ్చర్యపోయేలా జరిగింది. సర్వే రూపంలో తెలంగాణలో ఈరోజు ఓ గొప్ప అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే ఎక్కడా జరగనట్లు.. భారతదేశ చరిత్రలో సైతం ముందెన్నడూ చోటుచేసుకోనట్లు, కనీవినీ ఎరుగని రీతిలో సర్వే జరిగింది. చిన్న చిన్న లోపాలు ఉన్నా.. సర్వే సూపర్‌ హిట్‌!’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వ్యాఖ్యానించారు. ప్రజల సహకారం ఉంటే ఎటువంటి కార్యక్రమమైనా గొప్పగా జరుగుతుందనడానికి ఈ సర్వేనే ఓ ఉదాహరణ అని చెప్పారు. సర్వే కోసం ఢిల్లీ, ముంబై, సూరత్‌, అహ్మదాబాద్‌ నుంచే కాకుండా సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి ప్రత్యేక విమానాల్లో సైతం తెలంగాణవాసులు వచ్చారని వివరించారు. మొత్తంమీద సర్వే ఘనంగా సఫలమైందన్నారు. తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వం కుటుంబ సమగ్ర సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. ఇప్పటికే జిల్లాల్లో 95 శాతం.. హైదరాబాద్‌లో 85 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసం, ఆదరణ ఈ సర్వేలో నిరూపితమయ్యాయన్నారు. సర్వేను విజయవంతం చేసినందుకు తెలంగాణలోని అన్ని స్థాయుల్లోని ఉద్యోగులకు చేతులెత్తి మొక్కుతున్నానన్నారు. ఉద్యోగులు నిజమైన స్పిరిట్‌ను చూపించారని, సర్వే చేసినందుకు ఎటువంటి ప్రతిఫలం, పారితోషికాలను ఆశించలేదంటూ సర్వేలో పాల్గొన్న బ్యాంకు ఉద్యోగులు, కళాశాలల విద్యార్థులకు కృతఙ్ఞతలు తెలిపారు. ‘‘మనం చీకట్లో ఉన్నాం. తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నా. ప్రజలు, ఉద్యోగులు ఇలాగే సహకరిస్తే మనం కలలు కన్న బంగారు తెలంగాణను ఆవిష్కరిస్తాను. ప్రభుత్వం అంటే ఇలా కూడా పని చేస్తుందా? అని అనుకునేలా చేసి చూపిస్తాను. అప్పుడు అద్భుతమైన తెలంగాణ ఆవిష్కృతమవుతుంది’’ అని కేసీఆర్‌ చెప్పారు. సర్వే చేసేందుకు వచ్చిన సిబ్బందికి ప్రజలు టీలు, భోజన ఏర్పాట్లు కూడా చేశారని టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి కారెం రవీందర్‌ రెడ్డి చెప్పారని, తెలంగాణ సమాజంలో ఉన్న ఇంత గొప్ప సంస్కారానికి సర్వే అద్దం పడుతోందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇదే ఐక్యతతో ముందుకెళదామని, మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సర్వేలో భాగంగా వివరాలను అందించలేకపోయిన వారికి మళ్లీ వెసులుబాటు కల్పిస్తామని కేసీఆర్‌ చెప్పారు.
అక్రమార్కులు, దొంగలకే సర్వేతో ఇబ్బంది
ఈ సర్వేతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. సర్వేలో వచ్చిన వివరాలన్నింటినీ మరో పది, పదిహేను రోజుల్లో కంప్యూటరీకరిస్తామని, ఆ తర్వాత సీఎం నుంచి ఎమ్మార్వో వరకు అందరి టేబుళ్లపైనా ఈ వివరాలుంటాయని వెల్లడించారు. ఐటీ కనెక్టివిటీ ఉన్నందున గ్రామాల్లో సైతం ఈ వివరాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ‘‘ఎవరెవరికి ఇళ్లున్నాయి? పొలాలెన్ని ఉన్నాయి? రేషన్‌ కార్డులు ఎవరెవరికి ఉన్నాయి? న్యాయంగా ఎవరికి ఉండాలి? అన్న వివరాలన్నీ ఇప్పుడు తేలతాయి. ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా పథకాలు అమలయ్యేలా చూస్తాం. ఆకాశరామన్న పథకాల మాదిరి కాకుండా, వేల కోట్లు దొబ్బితిన్నట్లు కాకుండా ఉండేందుకే ఈ సర్వే నిర్వహించాం. దొంగలకు, తప్పులు చేసిన వాళ్లకు, అక్రమార్కులకే ఈ సర్వే వల్ల బాధ’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. సర్వేతో నిజమైన అర్హతలు కలిగిన వారే లబ్ది పొందుతారన్నారు. ఈ సర్వేతో అవినీతిని రూపుమాపగలమని భావిస్తున్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘వుయ్‌ కేర్‌ ఫర్‌ ద పీపుల్‌. నాట్‌ ఫర్‌ షౌటర్స్‌. వుయ్‌ డిస్ర్కిమినేట్‌ చీటర్స్‌ అండ్‌ లూటర్స్‌. అవినీతికి పాల్పడితే నా కొడుకైనా, కూతురైనా జైలుకెళ్లాల్సిందే’’ అని కేసీఆర్‌ తేల్చి చెప్పారు.
ప్రతిపక్షాలను పట్టించుకోవద్దు
సర్వేకు సంబంధించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలను పట్టించుకోవద్దని ప్రజలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ‘ఎన్యూమరేటర్లు మా ప్రాంతానికి రాలేదని ప్రజలు ఫోన్లు చేస్తున్నారు. ఎంత సేపయినా వేచి ఉంటామని చెబుతున్నారు. అయినా, ప్రతిపక్షాలు ఇప్పటికీ అడ్రెస్‌ లేకుండా మాట్లాడుతున్నాయి. ఆ మాటలను పట్టించుకోవద్దు’’ అని చెప్పారు. సర్వేలో బొక్కలు చూపించేందుకు యత్నించిన కొందరు వాళ్ల పరువు వాళ్లే తీసుకున్నారన్నారు. అలాగే, తెలంగాణ జనాభా నాలుగున్నర కోట్ల వరకు వెళుతోందని తెలిపారు. హైదరాబాద్‌లో జనాభా కోటీ 20 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. వాస్తవానికి, హైదరాబాద్‌లో 15.82 లక్షల కుటుంబాలే ఉన్నాయని ఇప్పటి వరకూ భావించామని, అయితే, ఈ సంఖ్య 20 లక్షల వరకూ ఉంటుందని తేలుతోందని చెప్పారు.
పవన్‌ టూరిస్టుగా ఉంటాడేమో!
సర్వేలో భాగంగా హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ తదితరులు తమ వివరాలను నమోదు చేయించుకున్నారని కేసీఆర్‌ చెప్పారు.  సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ సర్వేలో పాల్గొనలేదని ఓ విలేకరి ప్రస్తావించగా ‘‘అత ను ఉండదలచుకోలేదనుకుంటా. టూరిస్ట్‌గానే ఉండదలచుకున్నాడేమో’’నన్నారు.

No comments:

Post a Comment