Sunday 17 August 2014

టాలీవుడ్‌లో ‘దేశభక్తి’ ఉందా? - Harikrishna Mamidi


టాలీవుడ్‌లో ‘దేశభక్తి’ ఉందా?
15/08/2014-మామిడి హరికృష్ణ
83 ఏళ్ల ఘన చరిత్ర!
6500 పైగా సినిమా ట్రాక్ రికార్డ్!
12 కోట్లకుపైగా ప్రేక్షకుల మార్కెట్!
10 దేశాలదాకా విస్తరించిన ఓవర్‌సీస్ బిజినెస్!
నాలుగు మాటల్లో ఇది తెలుగు సినిమా పరిశ్రమ!
దీనికితోడు మన దేశంలో ప్రతి ఏటా బాలీవుడ్ తర్వాత అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న సినీ రంగం, అత్యధిక భారీ చిత్రాలను నిర్మిస్తున్న సినీ పరిశ్రమ కూడా మన టాలీవుడ్డే! ఇదంతా చెప్పుకోడానికి బాగానే వుంది. కానీ ఏం ప్రయోజనం? ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, తెలుగు సినీ పరిశ్రమ 1931 నుండి ఇప్పటివరకు దేశభక్తి కథా వస్తువుగా తీసిన సినిమాల గురించి పరిశోధిస్తే.. ఇనే్నళ్లకాలంలో, ఇన్నివేల సినిమాలలో పట్టుమని పది సినిమాలుకూడా ‘దేశభక్తి చిత్రాలు’ లేకపోవడం, రాకపోవడం తెలుగు ప్రేక్షకుల దౌర్భాగ్యం అని, సిగ్గుచేటనిపిస్తుంది. బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో, మాలీవుడ్‌లలో ఆఖరికి భోజ్‌పురిలో కూడా కనీసం 25 నుండి 250 చిత్రాలు దేశభక్తి కథా సినిమాలుగా వచ్చాయి. ఎనె్నన్నో ‘జెనర్’లలో సినిమాలను సృష్టించిన తెలుగు సినీ రంగం ‘దేశభక్తి జెనర్’లో ఇంత ఘోరంగా చిట్టచివరి స్థానంలో ఉండడం ఏ వెలుగులకు సంకేతం?
ఏ ప్రమాణాలకు ప్రతీక?
ఏ విలువలకు ఉదాహరణ?
ఏ సామాజిక ప్రయోజనానికి సంకేతం?
ఏ సాంస్కృతిక చైతన్యానికి ప్రతిబింబం?
============
దేశభక్తి సినిమాల గురించి మాట్లాడుకునేముందు, అసలు దేశభక్తి అంటే ఏమిటో చూద్దాం! కళలలో నవరసాలు ఉన్నట్లు మన సినిమాలో అందరూ మాట్లాడే ‘ఎమోషన్’లాగే దేశభక్తి కూడా ఒక బలమైన ఎమోషన్. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, రొమాన్స్‌లలాగే దేశభక్తి కూడా ఒక భావోద్వేగమే! అయితే ఇది, ఒక మనిషికి తాను పుట్టి, నివశిస్తున్న నేలమీద ఉండే ఆత్మీయ అనుబంధం. ఆ నేలమీద ఉన్న సంస్కృతి సంప్రదాయాలు, వ్యవహారాలతో మనిషికి ఉండే ఆధ్యాత్మిక బంధమే దేశభక్తి. మరోమాటలో తన అస్తిత్వాన్ని మొత్తంగా తన దేశంతో మమేకం చేయడమే దేశభక్తి. ఈ విధమైన అంశాల ఆధారంగా అల్లుకున్న కథలతో తెరకెక్కిన సినిమాలే దేశభక్తి సినిమాలు. ఈ తరహా సినిమాలపై హాలీవుడ్, ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్ సినీ నిర్వచనాలు వేరుగా ఉన్నాయి. ఆ కోణంలో పరిశీలిస్తే భారతీయ సినిమాల దృక్కోణంలో కూడా దేశభక్తి సినిమాలకు ప్రత్యేక లక్షణాలున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలలో ఆ లక్షణాలను అన్వయిస్తే ఇలా వుంటాయి.
1.స్వాతంత్య్రోద్యమ నేపథ్యం- స్ఫూర్తి-
మనదేశం (1949), సర్దార్ పాపారాయుడు (1980), సుభాష్‌చంద్రబోస్ (2005), రాజన్న (2012). 2.జాతీయ నాయకుల జీవనగాధలు-
అల్లూరి సీతారామరాజు (1974), ఆంధ్రకేసరి (1983), తాండ్ర పాపారాయుడు (1980),
3.జాతీయ నాయకుల ఆశయ సాధన -
బొబ్బిలిపులి (1982), రేపటి పౌరులు (1980), మేజర్ చంద్రకాంత్ (1993), శంకర్‌దాదా జిందాబాద్ (2007), మహాత్మా (2009).
4.జాతి నిర్మాణ విలువలు -
మరోప్రపంచం, రుద్రవీణ (1988), ఠాగూర్, స్టాలిన్ (2006).
పై జాబితాలోని సినిమాలను ఉపరితల పరిశీలనతో మాత్రమే ఆయా కేటగిరిలలో నిర్థారించడం జరిగింది. దేశభక్తి అంశాల సినిమాకు అంతిమ లక్ష్యం అయిన ప్రజాచైతన్యం అనే కొలబద్దతో చూస్తే పైవాటిలోని ఏ ఒక్క సినిమా కూడా పరీక్షకు నిలవదు. ఈ చిత్రాలన్నీ చైతన్యంకన్నా వినోదం అనే అంశానికే అగ్ర ప్రాధాన్యత ఇచ్చాయి. ఆ సినిమాల మేకింగ, కథారచన, నటీనటుల పాత్ర ప్రవర్తనలు అన్నీ ప్రేక్షకులలో స్ఫూర్తిని నింపడానికి బదులు డ్రమెటిక్ వినోదాన్ని మాత్రమే అందించాయని తెలిసిపోతుంది.
వీటిని ‘దేశభక్తి సినిమా’లే అందామా?
స్వాతంత్య్రోద్యమ నేపథ్య సినిమాలుగా చెప్పుకొన్న సర్దార్ పాపారాయుడు, సుభాష్‌చంద్రబోస్, రాజన్న సినిమాలను ఇప్పుడు విశ్లేషిద్దాం :
1. సర్దార్ పాపారాయుడు సినిమాలో స్వాతంత్ర పోరాట కాలంలో బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాడిన ఓ వీరయోధుడు కొంతమంది విద్రోహుల కుట్రవల్ల జైలుపాలై, తర్వాత విడుదలై విద్రోహులమీద ప్రతీకారం తీర్చుకోవడం కథ. ఈ సినిమాలో బ్రిటీష్ సైన్యాధికారి పాపారాయుడు పేరును పప్పారాయుడు అని పలకగానే అది బ్రిటీష్‌వారి తరహా జీవనశైలిని చూపించడం అని భ్రమపడడాన్ని బట్టి ఈ సినిమా ఎంత అసహజ రీతిలో రూపొందిందో తెలుస్తుంది.
2. సుభాష్‌చంద్రబోస్ చిత్రంలో బ్రిటీష్ పాలనలోని ఓ ప్రాంతంలో వారి అధికారాన్ని ధిక్కరించిన మరో పోరాట వీరుడు, ఒక ద్రోహి బ్రిటీష్‌వారికి తొత్తుగా మారి వారికి సహకరించడంతో అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటాడు. కొన్ని దశాబ్దాల తరువాత ఆ వీరుని వారసుడు ఆ ద్రోహిని వెంటాడి హతమార్చడం ఈ సినిమా కథ.
ఈ చిత్రంలో స్వాతంత్య్రోద్యమ కాలపు సన్నివేశాలలో హీరో భారతదేశ త్రివర్ణ పతాకాన్ని పట్టుకునే సీన్ ఒకచోట ఉంది. ఆ పతాకం మధ్యలో అశోకచక్రం బొమ్మ స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ సీన్ ఒక్కటి చాలు, ఈ సినిమా స్వాతంత్రోద్యమ నేపథ్య చిత్రం పేరిట ఎంత నిర్లక్ష్యంగా చిత్రీకరించారో చెప్పడానికి. మన జాతీయ పతాకంలో అశోకచక్రం స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ రచన తర్వాత స్వీకరించారు. అంతకుముందు పతాకంలో గాంధీజీ ప్రతిపాదించిన చరఖా బొమ్మ ఉండేది.
3. రాజన్నలో తెలంగాణలో రజాకార్లు నైజాముల కాలంనుండి స్వాతంత్య్రానంతరపు తొలినాళ్ళవరకు నడిచిన కథ. ఈ చిత్రంలోని బాలిక పాత్ర రేడియో వినడం, సంగీతం నేర్చుకోవడం, ఢిల్లీవరకు కాలినడకన వెళ్లడం అనేవన్నీ పూర్తిగా డ్రమెటిక్ ఫిక్షన్‌కి, రియాలిటీకి దూరమై నేల విడిచి చేసిన సాముకి పరాకాష్టలే.
4. ఈ చిత్రాలలో స్వాతంత్రకాలపు సమయ ధర్మం గానీ, పీరియడ్ లుక్ గానీ, ఫీల్‌కాని ఏ మాత్రం ఉండవు. ఆయా ప్రాంతాలలోని ఆనాటి ప్రజల వేషధారణ, ఇళ్ల నిర్మాణ శైలి, కథానాయకుడు, నాయికల వస్తధ్రారణ అప్పటి కాలానికి తగినట్లుగా వుండవు. పైగా వీరి దుస్తులన్నీ హీరో ఇమేజ్‌కి తగినట్లుగా గ్లామరస్ గా ఉండేలా డిజైన్ చేయడం మరో అసహజ విషయం.
5. ఈ సినిమాలలో ఆ కాలం నాటి ప్రజల భాష, యాస వంటివి కూడా తగినట్లుగా అందంగా ఉండేలా డిజైన్ చేయడం మరో అసహజ విషయం. ఈ సినిమాలలో ఆ కాలం నాటి ప్రజల భాష, యాస వంటివి కూడా అసలు కనిపించవు, వినిపించవు. పాత్రలన్నీ 20వ శతాబ్దపు భాషనే కొంచెం మార్చి మాట్లాడుతూ ఉంటాయి. ‘(లగాన్’ సినిమాలో మాటలన్నీ 18వ శతాబ్దపు భుజ్ భాషా పదాలతోనే రాసారన్న విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి. )
6. ఇటువంటి చిత్రాలలో స్వాతంత్య్రోద్యమ ఘట్టాలకన్నా వినోదాన్ని, కామెడీని పంచే సన్నివేశాలే అధికంగా ఉండి, భారీ డైలాగులతో నిండిపోయి లౌడర్ సినిమాలుగా మాత్రమే అనిపిస్తాయి. ఈ విశే్లషణను అనుసరించి గమనిస్తే, ఈ చిత్రాలన్నీ స్వాతంత్య్రోద్యమ నేపథ్య దేశభక్తి సినిమాలుగా కనిపించినా, అవి వాటి తాలూకు ఏ ధర్మాన్ని కూడా సంతృప్తిపరచలేదని, పైగా క్రియేటివ్ లిబర్టీ పేరిట ఇష్టమొచ్చినట్లుగా చూపించి, సాధ్యమైనంత వక్రీకరణలు చేశారని తెలుస్తుంది.
అయితే ఈ కోవకు చెందిన దేశభక్తి సినిమాలలో ఒక్క మనదేశం (1948) మాత్రమే ఈ లక్షణాలను ఎక్కువ శాతం అనుసరించింది. శరత్‌చంద్ర ఛటర్జీ రాసిన బెంగాలీ నవల ‘విప్రదాస్’ ఆధారంగా వచ్చిన ఈ సినిమా, అలా వచ్చిన తొలి తెలుగు సినిమాగాను, గాంధీజీకి ఇష్టమైన ‘వైష్ణవ జనతో' పాటను తొలిసారిగా తెలుగు తెరపై వినిపించిన సినిమాగాను కీర్తి సాధించింది.
ఈ చిత్రంలో హీరో నారాయణ రావు స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. క్రియాశీలంగా ఉంటూ ఆయా ఉద్యమాలలో హీరో నారాయణరావు చురుకుగా పాల్గొంటూ ఉంటాడు. హీరోయిన్ కృష్ణవేణి హీరో భావాలతో వ్యతిరేకించినప్పటికీ అతన్ని ప్రేమిస్తుంది. ఒక స్వాతంత్య్ర ఉద్యమ ఊరేగింపులో హింస చెలరేగి హీరో హీరోయిన్లు ఇద్దరూ అరెస్టవుతారు. ఆ తరువాత పోలీసు కస్టడీలో హీరో చిత్రహింసలకు గురై మతి పోగొట్టుకుంటాడు. ఆ తరువాత హీరోయిన్ హీరోని మామూలు మనిషిని చేయడమే ఈ చిత్రంలో కథ. ‘
బయోపిక్’ల సంగతి?
దేశభక్తి సినిమాలలో భాగంగా జాతీయ నాయకుల జీవనగాథలుగా బయోపిక్ సినిమాలుగా చెప్పుకున్న ‘అల్లూరి సీతారామరాజు’, ‘తాండ్ర పాపరాయుడు’ గురించి ఇప్పుడు విశ్లేషిద్దాం :
1. తెలుగు సినీ రంగంలో సినిమాస్కోప్ టెక్నాలజీని పరిచయం చేసిన సీతారామరాజు కమర్షియల్‌గా సూపర్‌హిట్ అయినప్పటికీ, బయోపిక్ సినిమాల కోణంనుండి చూస్తే అత్యంత సబ్ స్టాండర్డ్ సినిమా. తెలుగు తెరపై బయోపిక్ తరహాలో వచ్చిన సినిమాల సంఖ్య అత్యల్పంగా ఉండడంతో ‘ఏ చెట్టూ లేనిచోట’ అన్న విధంగా ఇది స్థాయిని మించిన పేరును సాధించింది. కానీ, అన్ని కోణాలలోనూ ఇది అథమస్థాయి సినిమానే!
2. ఈ సినిమాలో ప్రధాన లోపం చారిత్రక పరిశోధన చేయాల్సినంత చేయలేదు. ఆనోట ఆనోట వాడుకలో వున్న అల్లూరి సీతారామరాజు జీవితానికి తమదైన కాల్పనికతని, హీరోయిజాన్ని జతచేసి చరిత్రకు అన్యాయం చేశారు.
3. దేశభక్తి సినిమాలలోని ఈ బయోపిక్ సినిమా పిరియాడికల్ కల్చర్‌ని, మన్యం తాలూకు సంస్కృతి, జీవన విధానాలను, దుస్తులను పెద్దగా అధ్యయనం చేయలేదు. సాధారణంగా సినిమా భాషలో గిరిజనులు అనగానే ఉండే సాధనాలు, వస్తధ్రారణ, పూసలు, కొమ్ములు వంటివే పాత్రలకు వాడారు తప్ప మనె్నం ప్రజలకే ఒక ప్రత్యేకమైన సంస్కృతిగాని, వస్త్ర విశేషాలను గాని రూపొందించలేదు.
4. 1922 ప్రాంతంనాటి బ్రిటీష్ రికార్డులు అప్పటి స్వాతంత్ర రికార్డులకు భిన్నంగా చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి, ఇతర సన్నివేశాలను చిత్రించారు.
5.అల్లూరి మరణం విషయంలో ఉన్న మిస్టరీపై పరిశోధన చేయడానికి బదులు మరణ సన్నివేశానికి అత్యంత డ్రమటిక్ ముగింపు ఇచ్చారు.
6. ఇక తాండ్ర పాపారాయుడు సినిమా--- బొబ్బిలి ప్రాంతపు రాజస్థానంలోని యోధుని కథ. ఫ్రెంచ్ దేశ సేనాని బుస్సీ దొర బొబ్బిలి సంస్థానంపై దాడిచేస్తే, తన మాతృభూమికి రక్షణ కల్పించడం కోసం పోరాటం చేసిన సైన్యాధికారి గాథ ఇది. ఈ సినిమాలో కూడా కావాల్సినంత తెలుగు సినిమా పైత్యాన్ని చొప్పించి, స్వాతంత్య్ర ఉద్యమ కాలపు సినిమా ఇది అని చెప్పుకున్నారు.
7. ఈ సినిమాలోని పాత్రలు, వారి వస్తధ్రారణ ఆ కాలంనాటి బొబ్బిలి ప్రాత యోధులకు ఏ మాత్రం దగ్గరలేకపోవడం కాక వాస్తవికత, చారిత్రకత కన్నా కాల్పనికత అధికమై జానపదానికి, బయోపిక్‌కు మధ్య ఎటూ కాకుండా గల్లంతైంది.
8. సినిమా మేకింగ్‌లో సాధారణంగా వినిపించే మాట ‘క్రియేటివ్ ఫ్రీడమ్’. ఈ మాటని తమ ఇష్టం వచ్చినట్లుగా వాడుకుని అసలు చరిత్రనే తుంగలో తొక్కిన స్వాతంత్రకాలపు పీరియడ్ సినిమాలకు ఈ తెలుగు సినిమాలు తెరఎత్తు నిదర్శనాలు.
9. తెలుగులోవచ్చిన మూడు బయోపిక్ సినిమాలలో కొంతవరకు ప్రమాణాలు పాటించిన సినిమాగా ‘ఆంధ్రకేసరి’ చెప్పుకోవచ్చు. టంగుటూరి ప్రకాశం పంతులు జీవన కథతోవచ్చిన ఈ సినిమా సాధ్యమైనంతవరకూ ఆయా నిజజీవిత పాత్రల ప్రవర్తనను, ఆనాటి పరిస్థితులను తెరపై తిరిగి సృష్టించే ప్రయత్నం చేసింది.
మిగతా సినిమాల విషయం ఏమిటి?
దేశభక్తి సినిమాకున్న లక్షణాలలో ఇతర లక్షణాలైన జాతీయ నాయకుల ఆశయసాధన అనే కోణంలో వచ్చిన సినిమాలలో బొబ్బిలిపులి, మేజర్ చంద్రకాంత్ సినిమాలు కూడా కొంతవరకు నేతాజి సుభాష్‌చంద్రబోస్ ఐడియాలజీతో రూపొంది, దేశానికి ఆవల బహిర్గత శత్రువులకన్నా అంతర్గత శత్రువులనుండి పొంచి ఉన్న ప్రమాదమే ఎక్కువని చెప్పే ప్రయత్నం చేశారు.
‘రేపటి పౌరులు’ సినిమా సమకాలీన సామాజిక రాజకీయ వ్యవస్థలో కీలక వ్యక్తులు నిజాయితీగా పనిచేయాల్సిన అవసరాన్ని పిల్లల పాత్రల ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఇవన్నీ కమర్షియల్ విలువలతో ఓవర్‌డ్రామ్‌తో కూడిన ట్విస్టులు, సన్నివేశాలతో నిండి వుండి జాతీయ నాయకుల ఆశయాల సాధన ముసుగులో రొటీన్ మసాలా సినిమాలుగా అనిపిస్తాయి.
శంకర్‌దాదా జిందాబాద్ సినిమా మహాత్మాగాంధీ మళ్లీ వస్తే అన్న కాల్పనికత ఆలోచనకి, సమకాలీన సమస్యల నేపధ్యంగా అల్లుకుని కొత్త ప్రయోగంగా కనిపిస్తుంది. అయితే, ఈ క్రెడిట్ రాజాహీరాణిదే. విభూవినోద్ చోప్రాదే. కానీ, తెలుగు సినిమాది కానీ, తెలుగు దర్శక నిర్మాతలు, నటులది కాదని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే, ఈ సినిమా లగే రహే మున్నాభాయ్‌కి రీమేక్ కదా!
దేశభక్తి సినిమాల మరో లక్షణమైన జాతి నిర్మాణ విలువలు అనే కోణం నుండి ఆలోచిస్తే ‘రుద్రవీణ’ మాత్రమే ఆ ప్రమాణాలు అందుకోగల సినిమాగా నిలుస్తుంది. గాంధీజీ చెప్పిన స్వయంపోషిత గ్రామీణ సమాజం అనే జాతి నిర్మాణ విలువ చుట్టూ అల్లుకున్న ఈ సినిమా సహజంగా తెలుగు సినిమాలో ఉండే అన్ని అవాస్తవికతలకు దూరంగా ఉండి సందేశాత్మకంగా చిత్రంగా నిలిచింది.
వందేమాతరం ఉదంతం
ఇప్పటివరకువచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తయతే, 1939లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమా ఒక ఎత్తు. పేరుచూడగానే ఇదేదో దేశభక్తి పొంగి పొరలే సినిమా అనుకుంటాం. ఇక్కడే తప్పులో కాలేస్తాం.
ముందుగా కథచూస్తే రఘు (చిత్తూరు నాగయ్య) చదువుకున్న నిరుద్యోగి. వరకట్నం ఆశపడే తన తల్లి ఇష్టానికి భిన్నంగా చదువుకోని పేదమ్మాయి జానకిని (కాంచనమాల) పెళ్లిచేసుకుంటాడు. పాప జన్మించాక ఉద్యోగవేటలో పట్నం వెళతాడు. ఎన్నో కష్టాల తరువాత లాటరీలో ఐదు లక్షల బహుమతి వస్తుంది. ఆందంగా ఇంటికివచ్చేసరికి తల్లి పోరు పడలేక తన భార్యాబిడ్డలు ఇల్లు వదిలి ఎటో వెళ్లిపోయారని తెలుస్తుంది. దాంతో ఆ డబ్బు తీసుకుని రఘు తిరిగి పట్నానికివచ్చి ఫ్యాక్టరీలను స్థాపించి ఎంతోమందికి ఉద్యోగాలిస్తాడు. పూలమ్ముకొని బతుకుతున్న జానకికి రఘు మరో అమ్మాయితో కనిపిస్తాడు. రఘు పునర్‌వివాహం చేసుకున్నాడని అపోహ పడుతుంది. చివరికి అన్ని సందేహాలు విడిపోయి రఘు భార్యాబిడ్డలను కలుస్తాడు.
ఇప్పుడు చెప్పండి.. ఈ సినిమాలో ఎక్కడైనా దేశం, దేశభక్తి, స్వాతంత్య్ర ఉద్యమంలాంటి అంశాలు వచ్చాయా? కేవలం ఆ కాలంలో వందేమాతరం అనే పదానికి ఉండే పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి ఇలా చేశారా? లేక అప్పటి బ్రిటీష్ ప్రభుత్వపు శిక్షకు గురి కావలసి వస్తుందని జాగ్రత్తపడ్డారా అనేది సందేహం.
తెలంగాణ సినిమాలేమైనా ఉన్నాయా?
కేవలం 40 ఏళ్ళ చరిత్ర, వందలోపు సినిమా ట్రాక్ రికార్డు వున్న ‘తెలంగాణ సినిమా’ దేశభక్తి సినిమాల విషయంలో తన వంతు భక్తిని ప్రదర్శించింది. తొలి తెలంగాణ సినిమా ‘చిల్లరదేవుళ్లు’ (1975), మాభూమి (1979), కొమరంభీమ్ సినిమాలే నిదర్శనం. నైజాం కాలపు దొరల అధికారాన్ని ధిక్కరించి తాము పుట్టిన నేలపై మమకారాన్ని చూపించుకొన్న సామాన్యుల కథగా వచ్చిన ‘చిల్లరదేవుళ్లు’, తెలంగాణ దొరల దగ్గర పనిచేసే బానిసల కష్టాలను, నష్టాలను, బాధలను నేపథ్యంగా పూర్తి పిరియడ్ తరహాలో, అత్యంత సహజంగా వాస్తవికతా ప్రమాణాలతో వచ్చిన ‘మాభూమి’, జల్-జంగల్- జమీన్‌పై హక్కుకోసం పోరాడిన గుండు వీరుడు ‘కొమరం భీమ్’ బయోపిక్ సినిమా దేశభక్తి సినిమాల ప్రమాణాలను అందుకున్న చిత్రాలు. కథ, కాస్ట్యూమ్స్, ప్రాంతాలు, పాత్రల ప్రవర్తన, మాట్లాడే భాష, యాస ఇలా అన్నింటిలో ఈ సినిమాలు నిజాయితీ ప్రదర్శించాయి.
దేశభక్తి సినిమాలకు భవిష్యత్తు ఉందా?
మొదటినుండి తెలుగు సినీరంగం దృష్టి, లక్ష్యం కమర్షియల్ సక్సెస్సే. అందుకే సగటు ప్రేక్షకుల మనోదౌర్బల్యాలతో ఆడుకునే సినిమాలపై చూపించాల్సిన ఆసక్తిని, తెలుగు సినీ పరిశ్రమ, సామాజిక ప్రయోజనాత్మకమైన దేశభక్తి సినిమాలపై చూపలేదు. అప్పుడప్పుడు దేశభక్తి ఇతివృత్తంతో సినిమాలు తీసినా, వాటిలో కూడా వినోదానికి అగ్రస్థానం ఇచ్చారు.
మరోవైపు నానాతప్పుల తడకలతో తీసిన కొన్ని దేశభక్తి సినిమాలు ఫ్లాప్ కావడంతో, ఇక మరే నిర్మాత, దర్శకుడు ఆ వైపుగా చూడలేకపోతున్నారు.
వీటికితోడు స్వాతంత్య్ర ఉద్యమం గురించిన అవగాహన ye మాత్రం లేని నవతరం యువత ఇప్పుడు సినిమాలకు ప్రధాన ప్రేక్షక వర్గం. సందేశాలతో ఊదరగొట్టే దేశభక్తి సినిమాలు వీరికి అంతగా రుచించకపోవచ్చు అనే అభిప్రాయం టాలీవుడ్ లో ఉంది. అయితే అదే యువత బాలీవుడ్‌లో ‘రంగ్‌దె బసంతి’ వంటి దేశక్తి సినిమాలను ఎందుకు విరగబడి చూశారు?అని ప్రశ్నించుకుంటే లోపం, సమస్య దేశభక్తి సబ్జెక్ట్‌లో లేదు. టాలీవుడ్‌లోని దర్శక నిర్మాతలు, నటులలో మాత్రమే ఉందని తెలుస్తోంది.
ప్రేక్షకులకు కావలసిన అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండే దేశభక్తి సినిమాలను కొంచెం మనసుపెట్టి తీస్తే ఆ సినిమాలు హిట్ చేయడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని గతంలో రుజువైంది. తెలుగు సినీ రంగంలో అత్యంత విస్మరించిన కథగా ఉన్న దేశభక్తి సినిమాలను శ్రద్ధగా పరిశోధన చేసి, సమకాలీన స్పృహతోతీస్తే అటు సామాజిక బాధ్యత, ఇటు కమర్షియల్ విజయం రెండూ సాధ్యమే! అని, ఆ దిశగా కార్యాచరణ చేయాల్సిన సమయం ఇదే అని గుర్తించడం తక్షణావసరం *

No comments:

Post a Comment