Monday 4 August 2014

ఒక్కటే రాజధాని!

ఒక్కటే రాజధాని!

Published at: 04-08-2014 02:59 AM
పలు ఉప రాజధానులు.. ‘హైదరాబాద్‌’ పొరపాటు మళ్లీ జరగొద్దు
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. ప్రాథమిక నివేదికలో శివరామకృష్ణన్‌?
2 జిల్లాలకు ఒక మెడికల్‌ హబ్‌
వ్యవసాయ కేంద్రంగా కోస్తా
విద్యా రాజధానిగా గుంటూరు
ఐటీ హబ్‌గా ఉత్తరాంధ్ర
అనంత, కర్నూలులో రిసెర్చ్‌ జోన్‌
కమిటీ కీలక సూచనలు
హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ఒకటే రాజధాని! పలు ఉప రాజధానులు! అభివృద్ధి, పరిపాలన, పరిశ్రమలు అన్నీ ఒక్కచోటే కాకుండా వికేంద్రీకరించాలి. ఒక్కముక్కలో చెప్పాలంటే... హైదరాబాద్‌ విషయంలో జరిగిన పొరపాటు, నవ్యాంధ్రలో పునరావృతం కాకూడదు’’...  విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక సారాంశం ఇదే! ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని ఎంపికపై కేంద్రం ఏర్పాటు చేసిన ఈ కమిటీ త్వరలోనే తన నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే రాష్ట్రమంతటా పర్యటించి, అన్ని ప్రధాన నగరాలనూ పరిశీలించిన ఈ కమిటీ తన ప్రాథమిక నివేదికను రూపొందించినట్లు సమాచారం. ఈ నివేదికలోని కీలక అంశాలు ‘ఆంధ్రజ్యోతి’కి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిశాయి.
‘రాజధాని మాకే కావాలి’ అని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారూ కోరుకుంటున్నారు. కొందరైతే... జమ్మూ కశ్మీర్‌ తరహాలో రెండు రాజధానులు ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే... శివరామకృష్ణన్‌ కమిటీ మాత్రం రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని ఉండాలని సూచించింది. దీనికి తోడుగా పలు ఉప రాజధానులు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. ‘ఒక్క రాజధానితో అన్ని సమస్యలు పరిష్కారం కావు’ అని శివరామకృష్ణన్‌ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రానికి ఒకటికి మించి రాజధానులు ఉంటాయా? అనే చర్చ మొదలైంది. అయితే...  ‘రాష్ట్రానికి ఒకటే రాజధాని’ అని శివరామకృష్ణన్‌ కమిటీ తమ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘పరిపాలనతోపాటు అభివృద్ధిని వికేంద్రీకరించాలి. ప్రతీ చోట పౌరసమాజం ఎదుగుదలకు పెద్ద పీట వేయాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ పట్టణం, నగరం దేనికదే ఎదిగేలా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలి’’ అని శివరామకృష్ణన్‌ కమిటీ సర్కారుకు సూచించినట్లు తెలిసింది. నిర్దిష్టంగా ఫలానా నగరంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని స్పష్టం చేయకుండా... కొత్త రాజధాని ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్రాంతాలు, ప్రత్యామ్నాయాలను సూచించనున్నట్లు తెలిసింది.
హైదరాబాద్‌ చెబుతున్న పాఠం..
కొత్త రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ‘హైదరాబాద్‌’ నుంచి గుణపాఠం నేర్చుకోవాలని కమిటీ పరోక్షంగా సూచించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందింది. పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడ్డాయి. పౌర సమాజం ఎదిగింది. అందరి దృష్టి హైదరాబాద్‌పైనే కేంద్రీకృతం కావడంతో మిగతా నగరాలు, పట్టణాలు చెప్పుకోదగ్గస్థాయిలో అభివృద్ధి చెందలేదు. గత కొన్నేళ్లలో వికేంద్రీకరణ జరిగినా ఏ నగరంగానీ, పట్టణంగానీ హైదరాబాద్‌ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. దీని  తీవ్రతను కమిటీ తన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదు. దీంతో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా ఫలానా నగరాన్ని రాజధానిగా ఎంపిక చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయంలో ఇకనైనా జాగ్రత్తపడాలి. కొత్త రాజధాని అనేది మిగతా ప్రాంతాల అభివృద్ధికి ఆటంకంగా ఉండకూడదు. ఇతర ప్రాంతాలను ఎదగనీయకుండా ఉండరాదు. ఇందుకు ఒక్కటే మార్గం... పాలనతోపాటు అభివృద్ధిని వికేంద్రీకరించడం. ఒక్కో ప్రభుత్వ వ్యవస్థను ఒక్కో ప్రాంతంలో నెలకొల్పడం.  తద్వారా రాజధానితోపాటు మిగతా ప్రాంతాల మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. ఇతర ప్రాంతాలకు సమాన అవకాశాలు దక్కుతాయి’’ అని కమిటీ పేర్కొన్నట్లు తెలిసింది.  రాజధాని రేసులో ఐదు నగరాలు పోటీపడుతున్నాయని కమిటీ పేర్కొన్నట్లు సమాచారం. వీటిలో ఒక నగరాన్ని రాజధానిగా ఎంపిక చేసి... మిగిలిన వాటిని వాటికున్న ప్రత్యేకతల ఆధారంగా ఉప రాజధానులుగా ప్రకటించి అభివృద్ధి చే యాలని కమిటీ సభ్యుల్లో ఒకరు చెప్పారు. ఇటీవల రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలోనూ రాజధాని ఒక్కటే ఉంటుందని, ఉప రాజధానులు ఉంటే బాగుంటుందని కమిటీ సభ్యులు ప్రస్తావించినట్లు అధికార వర్గాలు కూడా ధ్రువీకరించాయి.  
ఇవీ కమిటీ అభిప్రాయాలు...
పాలనా సౌలభ్యం కోసం రాజధాని ఉన్న చోటే సచివాలయం, ఆయా ప్రభుత్వ శాఖల కమిషనరేట్లు, డైరెక్టరేట్లు, హైకోర్టు, ఇతర న్యాయ సంస్థలు ఉండాలి.  విద్యారంగం విస్తరణ, అభివృద్ధికి ప్రత్యేక హబ్‌ను ఏర్పాటు చేయాలి.  ఐటీ రంగం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఏపీలోని కీలకమైన పట్టణాలు, నగరాల్లో ఐటీ రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యేకించి వెనుకబాటు ఉన్న ప్రాంతాల్లో ఐటీసెక్టార్‌ను ప్రోత్సహించడం ఆ ప్రాంతాల అభివృద్ధికి ఊతమిచ్చినట్లవుతుంది.  వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రత్యేక హబ్‌ను రూపొందించాలి.  పరిశోధనా సంస్థలను ఒక ప్రాంతానికే పరిమితం చేయవద్దు. ఆయా ప్రాంతాలకున్న ప్రత్యేకతల ఆధారంగా ఆ ప్రాంతాల్లో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.  వైద్య రంగాన్ని ఒక్క పట్టణానికో, ప్రాంతానికో పరిమితం చే యకుండా ప్రతీ రెండు జిల్లాలకు కలిపి ఒక మెడికల్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలి.  గుంటూరును ఎడ్యుకేషన్‌ హబ్‌గా, విజయవాడను ఆర్థిక రాజధానిగా, ఉత్తరాంధ్రను ఐటీ క్యాపిటల్‌గా, కర్నూలు, అనంతపురం జిల్లాలను రీసెర్చ్‌ జోన్‌గా, కోస్తా జిల్లాలను వ్యవసాయ పరిశోధన కేంద్రంగా  ప్రకటించాలి. అభివృద్ధి వికేంద్రీకరణవల్ల... రాజధానిగా తమ ప్రాంతాన్ని ఎంపిక చేయలేదన్న ఆందోళన ఉండదు. అభివృద్ధి జోన్ల వల్ల అసమానతలు తగ్గి సమిష్టితత్వం పెరుగుతుంది.

No comments:

Post a Comment