Tuesday 19 August 2014

టీ- కాంగ్రెస్‌ సదస్సుపై రగడ

టీ- కాంగ్రెస్‌ సదస్సుపై రగడ

Published at: 19-08-2014 05:16 AM
-    మెదక్‌ ఎన్నిక దృష్ట్యా వాయిదా వేయాలి: ఎమ్మెల్సీలు
-    ఇంతదాక వచ్చాక వాయిదా కుదరదు: పొన్నాల
-    అధిష్ఠానం నిర్ణయానికే వదిలేయాలి: డీఎస్‌

హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న సదస్సుపై పార్టీ నేతల్లో విభేదాలు పొడసూపాయి. పార్టీ ఎమ్మెల్సీలు అసలు సదస్సునే వాయిదా వేయాలని కోరగా.. మరికొంత మంది పునరాలోచించాలంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇంతదాక వచ్చాక వాయిదా వేయడం కుదరదంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా తేల్చి చెప్పారు. సదస్సు నిర్వహణపై సోమవారం గాంధీ భవన్‌లో పొన్నాల అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. మెదక్‌ ఉప ఎన్నికను ప్రకటించిన దరిమిలా 24, 25 తేదీల్లో సదస్సును నిర్వహించడం సాధ్యం కాదని నేతలు అభిప్రాయపడుతున్నారు. సదస్సు పూర్తయ్యాక నామినేషన్‌కు కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంటుందని అన్నారు. అంతకు ముందు సీఎల్పీ కార్యాలయంలో శాసన మండలి పక్షనేత డి.శ్రీనివాస్‌ అధ్యక్షతన సమావేశమైన ఎమ్మెల్సీలు కూడా సదస్సును వాయిదా వేయాలంటూ తీర్మానించారు. సదస్సు రెండు రోజులని చెప్పినా.. వచ్చే నేతలకు రాత్రి బస ఏర్పాట్లు చేయలేదని, మొదటి రోజు తమ ఊళ్లకు వెళ్లి రెండో రోజు సదస్సుకు తిరిగి రావాలంటే సాధ్యం కాదని ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ అన్నారు. ఒక్క రోజుకు కుదించాలని అన్నారు. మెదక్‌ ఉప ఎన్నిక తేదీ రావడంతో.. సదస్సు నిర్వహణకు కొంత ఇబ్బంది తలెత్తిన మాట వాస్తవమేనని, అయితే.. ఈ విషయాన్ని అధిష్ఠాన నిర్ణయానికి వదిలేయడమే మేలని డీఎస్‌ అన్నారు. ఈ సదస్సును ఇబ్రహీంపట్నంలో నిర్వహించే కంటే... మెదక్‌లోనే నిర్వహిస్తే బాగుంటుందని గీతారెడ్డి సూచించారు.
అక్కడైతే.. నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపినట్లవుతుందనిఅభిప్రాయపడ్డారు. కానీ పొన్నాల మాత్రం ఇంతదాక వచ్చాక సదస్సును వాయిదా వేస్తే బాగుండదన్నారు. మెదక్‌ ఎన్నిక తేదీ ఇటీవల వెలువడిందని, కానీ సదస్సు తేదీలను అంతకంటే ముందుగానే ప్రకటించి ఏర్పాట్లు కూడా చేశామన్నారు. దీంతో సదస్సు 24, 25 తేదీల్లోనే నిర్వహించడానికి దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెప్పాయి. ఒక్కో నాయకుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుందని, అంతమాత్రాన పెద్ద, చిన్న అనే భేదభావనలు ఉండకూడదని జానారెడ్డి అన్నారు. పార్టీ జెండాను భుజాన మోసిన కార్యకర్తల కోసం కూడా ఒక రోజు సదస్సును నిర్వహించాలని వీహెచ్‌ చెప్పారు. కాగా, సదస్సు వాయిదా వేయాలంటూ ఎమ్మెల్సీలు తీర్మానం చేశారనడం అవాస్తవమని పొన్నాల లక్ష్మయ్య కొట్టిపారేశారు. సమావేశం అనంతరం ఆయన గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సదస్సును యథావిధిగా నిర్వహించాలని శాసన మండలి పక్షనేత డి.శ్రీనివాసే కార్యవర్గ సమావేశంలో చెప్పారని తెలిపారు. సదస్సును వాయిదా వేయాలంటూ కొంత మంది చెప్పిన మాట వాస్తవమేనని ఆర్సీ కుంతియా అన్నారు. పార్టీ వేదికలపై అభిప్రాయాలను వెల్లడించే హక్కు నేతలకుందన్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతాయుత పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్‌ శాసన మండలి పక్ష నేత డి.శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి ఏర్పాటు చేసుకున్న సీఎల్పీ కార్యవర్గంతో శాసన మండలి కార్యవర్గానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహను ఏఐసీసీ కార్యదర్శి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోమవారం రాత్రి పరామర్శించారు. ఇటీవల దామోదర్‌ రాజనర్సింహ సోదరుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో వారు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాగా, కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో దిగ్విజయ్‌ సింగ్‌ నేడు భేటీ అవుతారని తెలుస్తోంది.

No comments:

Post a Comment