Wednesday 20 August 2014

తెలంగాణ సమగ్ర సర్వే ఒక అద్భుతం

తెలంగాణ సమగ్ర సర్వే ఒక అద్భుతం.. నలుమూలలనుంచి అందరూ కదిలివచ్చారు, ఇలాగే ఐకమత్యంతో కదులుదాం: కేసీఆర్

Published at: 19-08-2014 21:23 PM
హైదరాబాద్, ఆగస్టు 19 : తెలంగాణ సమగ్ర సర్వే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వంపై ఎంతో విశ్వాసం, ఆదరణ ఉన్నాయనడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న ఈ సర్వేనే ఉదాహరణ అని ఆయన చెప్పారు. 

తెలంగాణలో మంగళవారం సమగ్ర సర్వే జరిగిన అనంతరం సాయంత్రం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ సర్వే నిర్వహణలో అకుంఠిత దీక్షతో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నానన్నారు. సాధారణంగా అధికారులు ఇటువంటి పనులకు వెళ్లేటప్పుడు మాకేమిటని ఆలోచిస్తారని, కాని ఇప్పుడు బత్తాలుగాని, ఇతర లాభాలగురించి గాని ఆలోచించకుండా ఎంతో చొరవతో పని పూర్తి చేశారని ఆయన అభినందించారు. కొన్ని ఊళ్లలో ప్రజలు తమకోసం వీరు వచ్చారని వారు వండుకున్నదాంట్లోనే సాదరంగా వారికి కూడా పెట్టారని, ఇదే తెలంగాణ సంస్కృతి అని ఆయన సగర్వంగా ప్రకటించారు. 

ఈ సర్వే మన బాగుకోసం వచ్చిందన్న నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడినుంచో స్వస్థలాలకు తరలివచ్చారని ఆయన చెప్పారు. భివాండి, అహ్మదాబాద్, సూరత్, ఇంకా జెడ్డా, గల్ఫ్‌లనుంచి కూడా ప్రత్యేకంగా తరలివచ్చారని ఆయన చెప్పారు. దేశంలో ఎప్పుడూ ఇంతటి అద్భుతమైన సర్వే జరగలేదని, ఇకముందు అన్ని రాష్ట్రాలూ, యావత్ భారతదేశం ఇటువంటి సర్వేను నిర్వహిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణాలో జరిగింది ఇంతకు ముందు ఎన్నడూ చరిత్రలో కనీవినీ ఎరుగనిది అని ఆయన చెప్పారు. 

ఇప్పటివరకూ హైదరాబాద్ జనాభా గురించి మనం అనుకున్నది వేరు ఇప్పుడు బయటపడుతున్నది వేరు అంటూ హైదరాబాద్ జనాభా దాదాపు ఒక కోటి 20 లక్షలు కావచ్చునని ప్రాథమిక సమాచారాన్నిబట్టి తెలుస్తున్నదని, ఇప్పుడు ఇక్కడ స్థిరపడినవారే గాక పనులమీద వచ్చేవారు కూడా ఉంటారు కాబట్టి తరువాత ఇక్కడి మంచినీళ్ల అవసరం ఎంత అనేది అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. 

ఇప్పుడు సర్వే పూర్తి అయిపోయింది గనక అన్ని లెక్కలూ నికరంగా తేలతాయని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం కోసం సర్వే చేస్తామంటే చిలవలు పలవలు చేశారని కేసీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఇన్ని దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నా ఆంధ్ర మిత్రులు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారని ఆయన సంతోషంగా చెప్పారు. 

ఇప్పుడు వచ్చిన సమాచారం ఆధారంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఇళ్లు కట్టాలి, ఏయే సంక్షేమ పథకాలు అమలు చేయాలి మొదలైన అంశాలపై పూర్తి అవగాహన కల్పించే నివేదిక సిద్ధమవుతుందని, ఇది ముఖ్యమంత్రి టేబుల్‌పై ఉంటుంది, సెక్రటరీల టేబుళ్లపై ఉంటుంది, కలెక్టర్ల టేబుల్‌పై ఉంటుంది, ఎంఆర్ఓ టేబుల్‌పై కూడా ఉంటుందని ఆయన చెప్పారు. 

తెలంగాణ ప్రజలు ఇలాగే తనపై నమ్మకం ఉంచితే తెలంగాణను బంగరు తెలంగాణాగా మారుస్తానని ఆయన పునరుద్ఘాటించారు. మీడియా కూడా ఈ సర్వే పట్ల ప్రజలలో అవగాహన కల్పించి బాగా దోహదం చేసిందని ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

No comments:

Post a Comment