Sunday 24 August 2014

సింగపూర్ పర్యటన సఫలం

విదేశీ పర్యటన సఫలం


హైదరాబాద్‌ చేరుకున్న సీఎం
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పర్యటన
క్షేత్ర స్థాయిలో పరిస్థితుల అంచనా

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్ర జ్యోతి): సింగపూర్‌, మలేసియా దేశాల పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌..... ఆదివారం రాత్రి హైదరాబాద్‌ చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితంలో తొలిసారి చేసిన ఈ విదేశీ పర్యటన..... తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార, పారిశ్రామిక అవకాశాలను విదేశీ పారిశ్రామికవేత్తలకు తెలియజేసి వారి నుంచి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సాగింది. దీంతో పాటు బంగారు తెలంగాణ స్థాపన కోసం విదేశాల్లోని పరిస్థితులను అధ్యయనం చేయటం మరో లక్ష్యంగా కేసీఆర్‌ ఎంచుకున్నారు. సింగపూర్‌లోని ఐఐఎం పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు ఈనెల 19న బయలుదేరి వెళ్లారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనం పూర్తిగా ప్రైవేట్‌ కార్యక్రమం అయినప్పటికీ, ఆయన తనతోపాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, సీఎంఓ ఉన్నతాధికారుల బృందాన్ని తీసుకెళ్లి దానిని అధికారిక పర్యటనగా మలుచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలివెళ్తాయని, కొత్తగా పెట్టుబడులు రావనే ప్రచారం జరిగింది. ఈక్రమంలో తన మొదటి విదేశీ పర్యటనను సీఎం కేసీఆర్‌........రాషా్ట్రనికి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించటానికి వినియోగించుకున్నారు. అలాగే తెలంగాణ రాషా్ట్రన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఇప్పటికే ప్రకటించిన ఆయన పనిలో పనిగా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన సింగపూర్‌, మలేషియా దేశాల్లోని క్షేత్ర స్థాయి స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇందులో భాగంగా ఆయన తన పర్యటన మొదటి రోజైన ఈనెల 20న సింగపూర్‌లో అక్కడి జేటీసీ కార్యాలయాన్ని సందర్శించారు. 21న పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. 22న ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. 23న సింగపూర్‌ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు కారులో ప్రయాణించి మార్గమధ్యన ఉన్న శాటిలైట్‌ టౌన్‌షిప్స్‌ను పరిశీలించారు. పర్యటనలో చివరి రోజు ఆదివారం (24న) మలేషియా మోనో రైల్‌ ప్రాజెక్టు, పుత్రజయ ప్రాంతాన్ని పరిశీలించారు. క్షేత్ర స్థాయి పరిస్థితుల అధ్యయనాన్ని పక్కన పెడితే, సీఎం కేసీఆర్‌ పర్యటనలో పెట్టుబడిదారులతో సమావేశం, ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న కార్యక్రమాలే కీలకమైనవి. ఈ సందర్భంగా తెలంగాణ రాషా్ట్రనికి పెట్టుబడులు ఆకర్షించటానికి తాము అమలు చేయబోయే కొత్త పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్‌ సింగపూర్‌, మలేసియా దేశాల్లోని పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఏమాత్రం అవినీతి, జాప్యం లేకుండా ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతామన్నారు. శాంతిభద్రతలకు కూడా అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, తమ పారిశ్రామిక విధానం దే శంలోనే అత్యుత్తమంగా ఉంటుందని చెప్పారు. స్వతహాగా మాటకారి అయిన సీఎం కేసీఆర్‌..తన వాగ్ధాటితో పెట్టుబడిదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తద్వారా తెలంగాణ మార్కెటింగ్‌..షోకేసింగ్‌లో సక్సెస్‌ అయ్యారని ఈ పర్యటనలో ఆయనతోపాటు పాల్గొన్న ఉన్నతాధికారుల బృందం భావిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, ప్రత్యేకించి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని తలపోస్తున్న సీఎం కేసీఆర్‌కు..........సింగపూర్‌, మలేసియా దేశాల పర్యటన బాగా ఉపయోగపడుతుందని విశ్లేషిస్తున్నారు.

No comments:

Post a Comment