Tuesday 19 August 2014

ఎంతమందికి ఉద్యోగాలొచ్చాయ్‌

ఎంతమందికి ఉద్యోగాలొచ్చాయ్‌

Published at: 19-08-2014 05:10 AM
-    ఇంజనీరింగ్‌ కాలేజీలకు  హైకోర్టు ప్రశ్న
-    కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిలుపుదలకు ‘నో’
-  కళాశాలల యాజమాన్యాలకు చుక్కెదురు
-    తదుపరి విచారణ 22కువాయిదా

హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌పై మధ్యంతర స్టే ఆదేశాలు ఇవ్వడానికి సోమవారం జరిగిన విచారణలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి నిరాకరించారు. ‘‘మీ కళాశాలల్లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థుల్లో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయో గమనిస్తున్నారా?’’ అని ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలను ఆయన ప్రశ్నించారు. తమ కాలేజీలకు గుర్తింపును పునరుద్ధరించాలని పిటిషన్‌ వేసిన యాజమాన్యాలు.. ఆ విషయం విద్యార్థుల ప్రతిభపై ఆధారపడి ఉంటుందని సమాధానం ఇచ్చాయి. ఆగస్టు 31లోగా ఇంజనీరింగ్‌ సీట్లు భర్తీచేయాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం తరపు వాదించిన అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి ప్రస్తావించడంతో, కౌన్సెలింగ్‌పై స్టే ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరించారు. ఏఐసీటీఈ నిబంధనల మేరకు సౌకర్యాలు సమకూర్చుకోవడంలో విఫలమైన 174 ఇంజనీరింగ్‌ కళాశాలల గుర్తింపును జేఎన్‌టీయూ రద్దుచేయడం తెలిసిందే. జేఎన్‌టీయూ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు సోమవారం హౌస్‌ మోషన్‌లో హైకోర్టును ఆశ్రయించాయి.
ఈ వ్యాజ్యాలను జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి విచారించారు. పిటిషనర్ల తరపున పలువురు సీనియర్‌ న్యాయవాదులు కోర్టుకు హాజరై వాదనలు విన్పించారు. ఏఐసీటీఈ నిబంధనల మేరకు కళాశాలలో గుర్తించిన లోపాలను సవరించుకోడానికి తగిన సమయం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కౌన్సెలింగ్‌కు ముందురోజు కళాశాలల గుర్తింపును రద్దు చేయడం అన్యాయమని వాదించారు. ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి జరుగుతున్న కౌన్సెలింగ్‌ను నిలిపి వేయాలని లేదా అన్ని కళాశాలలతోపాటే పిటిషనర్ల కళాశాలల్లో సైతం అడ్మిషన్లు కొనసాగించాలని కోరారు. ఏఐసీటీఈ అధికారులు గుర్తించని లోపాలను ప్రభుత్వం ఏం గుర్తించిందని పిటిషనర్లు ప్రశ్నించారు. ఈ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందో ప్రభుత్వం గుర్తించడం లేదని కోర్టుకు తెలిపారు. అయితే.. అడ్మిషన్లు నిలిపి వేసిన కళాశాలల్లో నిర్ణీత ప్రమాణాల మేరకు విద్యాబోధన జరగడం లేదని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ కె.రామక్రిష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ కళాశాలల్లో భవనాలు, బోధన సిబ్బంది కొరత ఉందని, వీటిని సరిచేసుకుంటామని కళాశాలలు ప్రతి ఏటా ప్రమాణ పత్రాలు ఇస్తున్నాయని.. అయినా లోపాలను సరిదిద్దుకోవడంలో విఫలమయ్యాయని తెలిపారు. ఆగస్టు 31లోగా ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిందని గుర్తు చేశారు. ఈ దశలో కౌన్సెలింగ్‌ను నిలిపేస్తే నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం సాధ్యం కాదని, అది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని ఆయన కోర్టుకు వివరించారు. ఆ కారణంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియపై ఎలాంటి స్టే ఆదేశాలు ఇవ్వరాదని కోరారు. అధికారుల తనిఖీల్లో వెలుగు చేసిన లోపాలపై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలకు ఉందని అడ్వకేట్‌ జనరల్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ సమాచారం మేరకు కళాశాలలు లోపాలను సరిదిద్దుకుంటే రెండో విడత కౌన్సెలింగ్‌లో చోటు కల్పిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలు చేస్తామని విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఆదేశాలకు నిరాకరిస్తూ కేసు విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.

No comments:

Post a Comment