Friday, 8 August 2014

ఒక్క రోజులోనే లెక్క పక్కా!


ఒక్క రోజులోనే లెక్క పక్కా!

Published at: 09-08-2014 07:06 AM
-    ఆస్పత్రిలో చేరితే ఆధారం చూపాల్సిందే
-    వసతి గృహాల్లోని విద్యార్థులకు కూడా...
-    ఇంటికి తాళం వేస్తే..
    పక్కవారి నుంచి సమాచారం
-    గైర్హాజరయ్యేవారికీ మార్గాంతరం
-    తహసీల్దారుకు ఆధారాలు చూపి
    నమోదు చేయించుకునే అవకాశం
-    సమగ్ర సర్వేకు తెలంగాణ సర్కారు
    పక్కా ఏర్పాట్లు
-    30 కుటుంబాలకు ఒక పుస్తకం చొప్పున సర్వే

(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి)
ఆగస్టు 19వ తేదీ! ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు అన్నిటికీ సెలవు! తెలంగాణలోని ప్రతి వ్యక్తి ఇంట్లోనే ఉండాలి! వసతి గృహాల్లోని విద్యార్థులంతా ఇళ్లకు చేరుకోవాలి! ఆరోజు పెళ్లిళ్లు ఉంటే వాయిదా వేసుకోవాలి! అంతేనా.. ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరితే.. విద్యార్థులు ఎవరైనా వసతి గృహంలో ఉంటే.. అందుకు ఆధారాలను కూడా చూపాలి! ఒక్క మాటలో చెప్పాలంటే.. సమగ్ర సర్వే చేస్తున్న దాదాపు నాలుగు లక్షల మందిని మినహాయిస్తే.. తెలంగాణలోని మిగిలిన వారందరికీ ఆరోజు సెలవే!! వారంతా ఆరోజు ఇంట్లోనే ఉండాలి!! ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది! ఇందుకు కారణం.. సమగ్ర సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడమే! ఒకే ఒక్క రోజులో మొత్తం 84 లక్షల కుటుంబాల వివరాల లెక్క తేలాల్సిందేనని కంకణం కట్టుకోవడమే! మారుమూల పల్లెలో ఉన్నా.. హైదరాబాద్‌ మహా నగరంలో ఉన్నా.. అందరి వివరాలూ ఒక్క రోజులోనే సేకరిస్తారు. ఈ వివరాలన్నీ కేవలం నెల రోజుల్లోనే కంప్యూటర్లో నిక్షిప్తం అవుతాయి. ఒకే ఒక్క క్లిక్‌ కొడితే చాలు.. 84 లక్షల కుటుంబాల వివరాలూ ప్రత్యక్షమవుతాయి. గతంలో ప్రభుత్వాలు చేపట్టిన సర్వేలన్నీ తప్పుల తడకలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు చేపట్టే సర్వే లోపభూయిష్టంగా ఉండకూడదని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఒకేరోజు సర్వే చేపడుతున్నారు. ఒక వ్యక్తి లేదా కుటుంబం ఎక్కువచోట్ల నమోదు కాకుండా అడ్డుకోవడమే దీని లక్ష్యం. గతంలో జరిగిన గణాంకాల సేకరణలన్నీ పలు రోజులపాటు జరగడంతో పలువురు వ్యక్తులు లేదా పలు కుటుంబాలు తమ వివరాలను అధికారులకు అందించాయి. సర్వే సమయంలో కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఎన్యూమరేటర్‌ ఎదుట హాజరు కావాల్సిందే. దీనివల్ల డూప్లికేషన్‌ సాధ్యం కాదన్నది ప్రభుత్వ భావన. సర్వే సమయంలో ఏదేని ఇంటికి తాళం వేసి ఉంటే.. ఇరుగుపొరుగు కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించవచ్చని ఎన్యూమరేటర్లకు ఆదేశాలు ఇచ్చారు. అప్పటికీ సమాచారం లభించకపోతే ‘ఇంటికి తాళం వేసి ఉంది’ అని రికార్డు చేస్తారు. సంచార కుటుంబాల నుంచి కూడా సమాచారం సేకరించి, వారి స్వస్థలం ఏదో నమోదు చేస్తారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకుని, ఇక తమ సొంత రాష్ర్టానికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వారి వివరాలు కూడా నమోదు చేయాలని సూచించారు. ఏదేని కారణాలతో సమగ్ర సర్వేలో తమ వివరాలను నమోదు చేయించుకోలేకపోయినవారు ఆ తర్వాత తహసిల్దారు వద్దకు వెళ్లి తగిన ఆధారాలను చూపించి తమ వివరాలను నమోదు చేయించుకునే అవకాశం ఇచ్చారు. తహసీల్దారు సంతృప్తి చెందితేనే నమోదుకు అవకాశం ఇచ్చే వీలుంది.
సర్వేకు సన్నాహమిలా...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేసిన తర్వాత రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం సర్వేకు ఫార్మాట్లను తయారు చేసింది. సర్వే వివరాలను పుస్తక రూపంలో తీసుకు రానున్నారు. ప్రతి పుస్తకంలోనూ 30 కుటుంబాల వివరాలు నమోదు చేయనున్నారు. ప్రస్తుతమున్న గణాంకాల ప్రకారం ఒక గ్రామానికి/ పట్టణానికి ఎన్ని పుస్తకాలు కావాలనే అంచనాలతో వీటిని ముద్రిస్తున్నారు. ఈ సర్వే 19వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. సదరు ఎన్యూమరేటర్లకు కేటాయించిన ఇళ్ల సర్వే పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. సర్వే పూర్తయిన వెంటనే ఆ ఇంటికి స్టిక్కర్‌ అంటిస్తారు. సర్వే పూర్తయిన తరువాత పుస్తకాలను అదే రోజు సంబంధిత తహసీల్దారుకు అందజేస్తారు. సెప్టెంబర్‌ ఆరో తేదీనాటికి ఈ వివరాలన్నీ ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు.

No comments:

Post a Comment