Thursday 21 August 2014

మార్క్సిస్టు ముల్లా!

Published at: 21-08-2014 12:56 PM
 
ఎం.టి. ఖాన్‌ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్‌లో పౌరహక్కుల ఉద్యమం. విప్లవ రచయితల సంఘం. చిన్ననాటి నుంచి ఆయన శిష్యునిగా నాకు గుర్తొచ్చేది ఆయన ఇంటి పక్కన ఉండే పురానాపుల్‌ వంతెన. ఎం.టి. ఖాన్‌ చనిపోయారంటే పురానాపుల్‌ కూలిపోయినట్లుగా అనిపిస్తుంది. చార్మినార్‌ కన్నా తాజ్‌మహల్‌ కన్నా పారిస్‌లో ఐఫిల్‌ టవర్‌ కన్నా పాతది పురానాపుల్‌. దాని ప్రక్కన రెండు దర్గాలు. ఒకటి మియాపైసా దర్గా, మరొకటి అబూహాషిమ్‌ మదానీ దర్గా. వీరిద్దరూ నిజాంల కాలం నాటి సూఫీ సాధువులు. వీరి వారసుడే ఎం.టి. ఖాన్‌. ఈ సూఫీ ఫకీర్ల వలెనే ఖాన్‌ సాబ్‌ కూడా ఫకీర్‌ జీవితమే గడిపారు. దర్గాల ముత్తవలి (ధర్మకర్త) అయిన ఖాన్‌ సాబ్‌ చిన్న నాడే మగ్దూం మొహియుద్దీన్‌తో ప్రభావితుడై కమ్యూనిస్టు అయినారు. దర్గాలకు, మసీదులకు దూరమైనారు. కానీ కమ్యూనిజం సూత్రాలను, ఇస్లామ్‌ నియమాలను రంగరించి ఒంటికి రుద్దుకుని మార్క్సిస్టు ముల్లాగా జీవించారు.
పసి వయసులోనే తల్లి చనిపోతే గొల్ల స్ర్తీ పోషణలో ఖాన్‌ సాబ్‌ పెరిగారు. ఫలితంగా ఇస్లామ్‌, హిందూ మతాల సంస్కృతుల పట్ల గౌరవం పెంచుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావంతో మగ్దూం, రాజబహదూర్‌ గౌర్‌ల శిష్యరికంలో తెలంగాణ కామ్రేడ్స్‌ సంఘంలో చేరారు. మగ్దూం ప్రభావంతో ఉర్దూ, పార్శీ సాహిత్యం అధ్యయనం చేశారు. మగ్దూంతో కలిసి మదీనా హోటల్‌లో ‘శాయరోంకీ కార్నర్‌’లో గంటలకొద్దీ ఇస్‌ఫహానీ చాయ్‌ను, కవిత్వాన్ని కలిపి ఆస్వాదించేవారు. అందర్‌వాలే, బాహర్‌వాలే బేరర్లకు కూడా కవిత్వం నేర్పారు. ఆ కార్నర్‌లో కుర్చీలు, టేబుళ్లు కూడా కవిత్వం చెప్తాయనేవారు. 
కమ్యూనిస్టులు ఎక్కడ అన్యాయం ఎదురైనా సంఘర్షించాలని నమ్మిన ఖాన్‌ సాబ్‌ పసి బాలుడిగా ఖాసీం రజ్వీ సభల మీద రాళ్లు విసిరారు. బాహాటంగా మజ్లిస్‌ స్థాపకుడు బహదూర్‌ యార్‌ జంగ్‌ మీద విమర్శలు చేసేవారు. చివరిదాకా హిందూ మతఛాందసం మీద, ఇస్లామిక్‌ ఛాందసవాదం మీద రాజీలేని పోరాటం చేశారు. పాతబస్తీలో ఎంఐఎంను ఎదిరించి నిలిచిన పర్జన్యశంఖం ఖాన్‌ సాబ్‌. పౌరహక్కుల గళం, విప్లవ కవితల కలం ఖాన్‌ సాబ్‌. యాకుత్‌పురాలోని ధర్మవంత్‌ కాలేజీలో ఆయన మాకు ఇంగ్లీష్‌ టీచర్‌. ‘ఇంగ్లీషు ఏ గాడిదైనా నేర్పుతుంది. ముందు మీరు మానవత్వం నేర్చుకోండి. నీతి నేర్చుకోండి’ అని మార్క్సిస్టు పాఠాలు నేర్పేవారు. వామపక్ష భావాలు గిట్టకపోయినా ప్రిన్సిపాల్స్‌ దాదీ ప్రసాద్‌, అప్పారావులు గది బయట నుంచొని ఒక చెవితో పాఠాలు విని, ‘వినడానికి బాగానే’ ఉందని వెళ్లిపోయేవారు. ‘మేం గూడా మార్క్సిస్టులం అయిపోతామేమో అని భయపడుతున్నాం’ అని మాతో చెప్పేవారు. నేను ఆ మరుసటి సంవత్సరం సుద్దాల అశోక్‌ తేజ, దేవులపల్లి అమర్‌ వ్యాస రచన పోటీల్లో నెగ్గితే లెనిన్‌ జీవిత చరిత్ర పుస్తకం బహూకరించి మార్క్సిజంలోకి దించారు. నాతో పాటు చదువుకున్న ఇంద్రా రెడ్డి ఖాన్‌ సాబ్‌ ప్రభావంతోనే పీడీఎస్‌యూలో చేరారు. దేవేందర్‌ గౌడ్‌ మాత్రం మార్క్సిజం చదివినా వృత్తి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. 
మార్క్సిజంతో పాటు మాకు ఇస్లాం నియమాలను ఇంగ్లీషుతో పాటు ఉర్దూ భాష కూడా నేర్పారు. ‘పొరుగువాడు ఉపవాసం ఉంటే నువ్వు ఈద్‌ చేసుకుని తినేది బిర్యానీ కాదు పెంట’ అని ఇస్లాం సూత్రాలను ఉదహరించేవారు. ఆదాయంలో ముప్పాతిక పేదలకు పంచే జకాత్‌ సంప్రదాయం ఔన్నత్యాన్ని వివరించేవారు. మా కాలేజీలో ఒక ముస్లిం అధ్యాపకుడు ‘వడ్డీ తింటాడు’ అని అందరూ చెప్పుకునేవారు. ఆయనతో స్నేహం చేసే మరో అధ్యాపకుడు తాను రోజూ మూడు పూటలు నమాజ్‌ చదువుతానని గర్వంగా చెప్పుకునేవాడు. వీరిద్దరూ కలిసి హోటల్‌కు వెళ్ళేవారు. ‘వడ్డీ తినేవాడు చాయ్‌ తాగిస్తే తాగే నువ్వు కూడా వడ్డీ తిన్నట్టే. నువ్వు మూడు సార్లు నమాజ్‌ చేసినా పుణ్యం రాదు. నువ్వు కూడా నేరుగా నరకానికే పోతావ్‌’ అని ఖాన్‌ సాబ్‌ తిట్టేవారు. ‘నేను స్వర్గానికే వెళ్తాను’ అని ఆ పంతులు చెప్పేవాడు. ‘ఖచ్చితంగా స్వర్గ ద్వారంలోకి ప్రవేశిస్తావు. సూది బెజ్జంలో ఒంటె ప్రవేశించినాకే నువ్వు స్వర్గ ద్వారంలో ప్రవేశిస్తావు’ అని ఆయన చమత్కరించేవారు. 
‘నన్ను గొల్ల స్ర్తీ పెంచింది. నాలుగు వేల ఏండ్ల క్రితం ప్రవక్త ఇబ్రహీం, మూడువేల నాలుగొందల ఏండ్ల క్రితం ప్రవక్త మోజెస్‌, 2500 ఏండ్ల క్రితం ప్రవక్త జీసస్‌, 1500 ఏండ్ల క్రితం ప్రవక్త మహమ్మద్‌ గొర్రెల కాపరులే. నన్ను పెంచిన అమ్మ కూడా గొర్రెల కాపరే. నేను కూడా ప్రవక్తనే’ అని చెప్పేవారు. ఇదంతా ఎందుకంటే ‘మీరు నన్ను అనుసరించాలి’ అని ఆయన ముక్తాయించేవారు. ఎం.టి. ఖాన్‌ పూర్తి పేరు మహమ్మద్‌ తాజుద్దీన్‌ ఖాన్‌. సిటీ కాలేజీలో ఆయన అధ్యాపకుడు రాఘవాచారి ఇంత పెద్ద పేరు పలకలేకపోయేవారట. ఆయనే ఎం.టి. ఖాన్‌గా పేరు మార్చారు. ఆయన సగం జీవితం అధ్యాపకుడు, మిగతా సగం పాత్రికేయుడు. ఈ రచయితను ఆయన జర్నలిజంలోకి పంపితే ఆయనను ఈ రచయిత జర్నలిజంలోకి లాక్కొచ్చారు. మాటిమాటికీ అరెస్టులు, సస్పెన్షన్‌లు, డిస్మిసల్‌లు, నిరుద్యోగాలతో అధ్యాపకుడిగా కష్టపడుతున్నప్పుడు ఖాన్‌ సాబ్‌ను బలవంతంగా జర్నలిజంలోకి దించినాం. ఉర్దూ, పార్శీ, అరబ్బీ, హిందీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అపార ప్రావీణ్యం గల ఖాన్‌ సాబ్‌ న్యూస్‌ టైమ్‌లో సియాసత్‌లో సంపాదకీయాలు అద్భుతంగా రాసేవారు.
ఖాన్‌ సాబ్‌ పూర్వీకులు 400 ఏండ్ల క్రితం గుల్‌బర్గా నుంచి వలస వచ్చినట్లు చెప్తారు. గుల్‌బర్గాలోని బందే నవాజ్‌ (భక్తుల పెన్నిధి) దర్గా ముత్తవలి హుసేన్‌ షా వలీని కుతుబ్‌షా నవాబు ఇబ్రహీం కులి గోల్కొండకు రప్పించి తన కూతురు ఖైరతున్నీసాను ఇచ్చి పెళ్లి చేశారు. అదే బాటలో అదే దర్గాకు చెందిన ఖాన్‌ సాబ్‌ పూర్వీకులు హైదరాబాద్‌ వచ్చారట. పురానాపుల్‌ వద్ద భక్తులకు కనిపించకుండా మరుగున ఇప్పటికీ రెండు దర్గాలు ఉన్నాయి. ఒకటి మియాపైసా దర్గా. దారిన పొయ్యే వారినల్లా పిలిచి ఒక పైసా బహూకరించే మియా పేరు మీద ఈ దర్గా వెలిసింది. ఇంకొకటి అత్యంత ప్రశస్తమైన అబూ హాషిం మదానీ దర్గా. ఈ దర్గాల సూఫీలకు వారసుడు ఖాన్‌ సాబ్‌. అబూ హాషిం మదానీ గురించి చదివి ఈ రచయిత ఖాన్‌ సాబ్‌ దగ్గరికి వెళ్ళి దర్గా గురించి వివరించాడు. ‘నేను నీకు గురువునా? నువ్వు నాకు గురువువా?’ అని ఆయన రచయితను ఎదురు ప్రశ్నించారు. రచయిత వెంట వచ్చిన సుప్రీంకోర్టు లాయర్‌ పి. నిరూప్‌ రెడ్డి మదానీ భక్తుడు. దర్గా చెత్తాచెదారంతో నిండిపోయింది. మీరు శుభ్రపరచవచ్చు కదా అని అమాయకంగా ప్రశ్నించారు. ‘నేను కమ్యూనిస్టును సూఫీల మహిమలు నమ్మను. దర్గాలు పూజించను’ అని కటువుగా సమాధానమిచ్చారు ఖాన్‌ సాబ్‌. కొంత కాలానికి నిరూప్‌ రెడ్డి మళ్లీ వచ్చి ‘ఈ దర్గా బాగు చేస్తాను. మీరు ఇల్లు ఖాళీ చేస్తే రూ. 2 కోట్లు ఇచ్చి కొని దర్గా వైశాల్యం పెంచుతాం’ అని అడిగారు. ‘నేను వారసత్వాన్ని అమ్మను. మా తాతలు సూఫీ ఫకీర్లు. నేనూ ఫకీర్‌నే. ధనంతో మమ్మల్ని కొనలేరు’ అని కర్కశంగా జవాబిచ్చారు. ‘మీరు అడిగినంత ఇస్తాం. మీ అబ్బాయితో మాట్లాడమంటారా?’ అని నిరూప్‌ రెడ్డి అడిగితే ఖాన్‌ సాబ్‌ కన్నెర్ర చేశారు. ‘మా కుటుంబంలో పంచాయితీ పెట్టకు. నేను పొయ్యాక వారిష్టం’ అని లేచి వెళ్లిపోయారు. 
అబూ హాషిం మదానీ ఆరో నిజాం మహబూబ్‌ అలీ ఖాన్‌కు సూఫీ గురువు. కావాలనుకుంటే మదానీకి నిజాం హైదరాబాద్‌నే ఇనాంగా రాసిచ్చేవారు. చివరిదాకా మదానీ దర్గా వద్ద ఆరు బయటే జీవించారు. ఖాన్‌ సాబ్‌ కూడా అంతే. మహబూబ్‌ అలీ ఖాన్‌ కన్నా ప్రఖ్యాతి గాంచిన మదానీ శిష్యుడు ఇనాయత్‌ అలీ ఖాన్‌. ఇనాయత్‌ అలీ ఖాన్‌ బరోడా రాజు దర్బారులో వైణికుడు. మహబూబ్‌ అలీ ఖాన్‌ ఆహ్వానంపై హైదరాబాద్‌ వచ్చిన ఇనాయత్‌ అలీ మనశ్శాంతి కోసం మదానీ వద్దకు వచ్చారట. మదానీ బోధనలతో ప్రభావితుడై ఇనాయత్‌ అలీ యూరోప్‌, అమెరికా ఖండాలు తిరిగి సూఫీ మతం వ్యాప్తి చేశారు. ఇప్పటికీ యూరోప్‌ ఆసుపత్రుల్లో రోగులకు ఇనాయత్‌ అలీ వీణా నాదం మంద్రమంద్రంగా వినిపిస్తారు. రోగులు వైద్యం కన్నా ఈ వీణా నాదానికే త్వరగా కోలుకుంటారని యూరోప్‌ అంతా ప్రతీతి. మదానీ బోధనలను ప్రపంచమంతటా చాటిన ఇనాయత్‌ అలీకి బరోడా కన్నా హైదరాబాద్‌తోనే సంబంధం ఎక్కువ. నవ తెలంగాణ నిర్మాణంలో భాగంగా హైదరాబాద్‌ దర్గాలను, చరిత్రను, సంస్కృతిని పునర్నిర్మంచవలసి ఉంది. హైదరాబాద్‌ సూఫీలు, యోధులు పునరుత్థానం కోరుకుంటున్నారు. ఎం.టి. ఖాన్‌ స్ఫూర్తి ఈ కర్తవ్య నిర్వహణకు మనలను పురికొల్పుతుందని ఆశిద్దాం.
* పాశం యాదగిరి
సీనియర్‌ జర్నలిస్ట్‌, ఖాన్‌ సాబ్‌ విద్యార్థి

No comments:

Post a Comment