Wednesday 20 August 2014

AP BUDGET - JAGAN

అన్ని వర్గాలకు తీవ్ర నిరుత్సాహం

Published at: 21-08-2014 03:40 AM
-    బడ్జెట్‌లో రుణమాఫీ ఊసేదీ?..
    రాజధానికి కేటాయింపులేవీ!
-    వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి
హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): కోట్లాది రైతన్నలు, మహిళా స్వయం సహాయక బృందాలు, మరెంతోమంది చేనేత కార్మికులను టీడీపీ సర్కారు ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్‌ తీవ్ర నిరాశకు, నిరుత్సాహానికి గురిచేసిందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు వార్షిక బడ్జెట్‌పై తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌ కోట్లాది మందిని నిరుత్సాహానికి గురిచేసిందని పెదవి విరిచారు. రైతు రుణమాఫీకే 1,02,000 కోట్ల రూపాయలు అవుతుందని, దీనికితోడు డ్వాక్రా, చేనేత రుణ మాఫీకి మరింత మొత్తం అవసరం అవుతుందని జగన్‌ చెప్పారు. ఎన్నికల హామీలో పేర్కొన్నవిధంగా ఈ మొత్తాన్ని గురించి బడ్జెట్‌ పత్రంలో పొందుపరచాల్సి ఉన్నా రుణమాఫీ అంశం ఎక్కడా బడ్జెట్‌లో కన్పించలేదన్నారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ చంద్రబాబు సంతకం చేసినా బడ్జెట్‌లో వాటి కోసం ఎలాంటి కేటాయింపులు లేకపోవడాన్ని తప్పు పట్టారు. గడచిన పదేళ్లలో గృహ నిర్మాణ రంగానికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకూ కేటాయింపులు ఉంటే ఇప్పుడు వాటిలో కేవలం పదోవంతు అంటే.. 800 కోట్ల రూపాయలే కేటాయించారని చెప్పారు. అంటే.. ఉద్యోగుల జీత భత్యాలు పోనూ.. కొత్తగా ఒక్క ఇల్లు కూడా నిర్మించబోరని అర్థం అవుతోందని జగన్‌ పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రణాళిక పద్దు కింద 36 శాతం కేటాయింపులు ఉంటే.. ఇప్పుడు అది 24 శాతానికి పడిపోయిందన్నారు. క్యాపిటల్‌ వ్యయం కూడా కుంచించుకుపోయిందన్నారు. జీడీపీపై ప్రభావం చూపే పద్దులపై ఏమాత్రం దృష్టి సారించలేదని అర్థం అవుతోందని జగన్‌ విమర్శించారు. రాష్ట్ర రాజధానిపై బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. రాజధాని నగర నిర్మాణం కోసం నిధుల కేటాయింపు ఊసే లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు 15000 కోట్ల రూపాయలు ఉంటే, విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్‌కు ఏకంగా 29,000 కోట్ల రూపాయలుగా చూపారని అన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో ఈ కేటాయింపుల ప్రస్తావన ఎక్కడా లేదని జగన్‌ చెప్పారు.
ఫలానాచోటే రాజధాని కావాలన లేదు
రాజధాని ఎంపికపై జగన్‌ మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ ఫలానాచోట రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పలేదు. రాజధాని నిర్మాణం అంటే.. అసెంబ్లీ, సెక్రటేరియేట్‌ భవనాలే కాదు. అందులో పనిచేసే ఉద్యోగులు, రాజధాని చుట్టుపక్కల నివసించే ప్రజల యోగక్షేమాలు చూడటం చాలా ముఖ్యం. విజయవాడను రాజధాని చేస్తానంటే నేను వ్యతిరేకించడం లేదు. రాజధాని నగరం.. అసెంబ్లీకి ఆరు కిలోమీటర్ల పరిధి, సెక్రటేరియేట్‌కు ఆరు కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన గురించే ప్రస్తావిస్తున్నాను. ఇక్కడ నివసించే సిబ్బందికి అందుబాటు ధరల్లో భూములు, ఇళ్లు ఉండాలి. దానిని దృష్టిలో ఉంచుకోవాలని మాత్రమే సూచిస్తున్నాను’ అన్నారు. ‘హైదరాబాద్‌ నగరం 960 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఆ స్థాయిలో ఉండాలన్నది నా అభిప్రాయం కాదు. కానీ, రాజధాని నగరంలో నివసించే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నా’ అన్నారు.
అత్యంత మోసపూరిత బడ్జెట్‌
‘రైతు రుణాల మాఫీకి రూ.1.02 లక్షల కోట్లు కావాలి. డ్వాక్రా రుణాలు రూ.7.500 కోట్లు మాఫీ చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కేటాయింపుల్లేవు. పేదలను నిరుత్సాహపరిచారు’ అని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. పేదలను, సగటు పౌరుడ్ని బడ్జెట్‌ నిరాశకు గురిచేసిందనిపలువురు వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.

No comments:

Post a Comment