Tuesday, 19 August 2014

పాలనలో రాజకీయ ముద్ర!

పాలనలో రాజకీయ ముద్ర!

Published at: 19-08-2014 05:18 AM
ఎమ్మెల్యేలూ.. మీ సిఫారసులకు ప్రాధాన్యం
ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ప్రవర్తించండి
టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు
రూ.5 లక్షల నామినేషన్‌ పనులు కొనసాగింపు
త్వరలో మార్కెట్‌, ఆలయ కమిటీలు: బాబు

హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘ఈసారి నాది పొలిటికల్‌ అడ్మినిసే్ట్రషన్‌. గతంలో జన్మభూమిలో అధికారులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాను. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నా వద్ద పని చేసిన కార్యదర్శి కూడా నావైపు చూడలేదు. నేతలు, కార్యకర్తలే నాతో ఉన్నారు. అందుకే ఈసారి పాలనలో రాజకీయ ముద్ర కూడా ఉండాలని నిర్ణయించుకొన్నాను. అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాన భాగస్వామ్యం కల్పిస్తాను. మీ సిఫారసులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు చెప్పాను’’ అని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఆవరణలో  సోమవారం తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం జరిగింది. మీడియా ప్రతినిధులు లేకుండా జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో చంద్రబాబు కూలంకషంగా మాట్లాడించి అనేక అంశాలపై వారికి సమాఽధానం ఇచ్చారు. ‘‘ప్రజా ప్రతినిధులకు రాజకీయపరంగా ఉండే ఒత్తిళ్లు నాకు తెలుసు. అందుకే వారి సిఫార్సులు, అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించాను. అదే సమయంలో ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించరాదు’’ అని హితవు చెప్పారు. రూ.5 లక్షల వరకూ పనులను నామినేషన్‌పై ఇవ్వడానికి గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొనసాగించడానికి ఆయన అనుమతించారు. అన్ని స్థాయుల్లో ప్రభుత్వ అధికారుల బదిలీలను త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా కింది స్థాయిలో పాత అధికారులు, సిబ్బందే కొనసాగుతుండటంతో ప్రభుత్వం మారిన వాతావరణం తమకేమీ కనిపించడం లేదని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రమణమూర్తి వ్యాఖ్యానించినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు. బదిలీల్లో తమ విజ్ఞప్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని మరో ఎమ్మెల్యే కోరినప్పుడు దానికి కూడా చంద్రబాబు అంగీకరించారు.
గతంలో ఉన్న మార్కెట్‌, ఆలయ కమిటీలను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ వెలువడినందువల్ల త్వరలోనే కొత్త వారిని నియమిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా అందరితో మాట్లాడి వీటికి సిఫార్సులు పంపాలని, ప్రత్యేకించి ఆలయ కమిటీలకు భక్తి భావం కలిగిన వారిని నియమించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు. కింది స్థాయిలో ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు వేస్తామని తెలిపారు. పింఛన్ల పంపిణీని ప్రైవేటు సంస్థలతో నిర్వహించడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించాలని ఎమ్మెల్యేలు చేసిన సూచనకు చంద్రబాబు అంగీకరించారు. ప్రభుత్వ పథకాల్లో అనర్హుల తొలగింపునకు ఆధార్‌ను పూర్తి స్థాయిలో అనుసంధానించనున్నట్లు తెలిపారు. ‘‘పులివెందుల నియోజకవర్గంలో కొత్తగా పక్కా ఇళ్ల నిర్మాణానికి ఆరు వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆధార్‌తో అనుసంధానం చేసి చూస్తే 300 మినహా మిగిలిన అందరి పేర్ల మీదా పక్కా ఇళ్లు ఇంతకు ముందే మంజూరు అయి ఉన్నాయి. మరి అవన్నీ ఎటు పోయినట్లు? వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తున్నాం’’ అని వెల్లడించారు. 94 శాతం ప్రజలు ఆధార్‌ కార్డులు తీసుకొన్నారని, వాటి ఆధారంగా విచారణ జరిపితే బోగస్‌ లబ్దిదారులు చాలా మంది బయటకు వస్తున్నారని చెప్పారు. తన 70 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలకు చంద్రబాబు వివరించారు. ‘‘రైతు రుణమాఫీపై మార్గదర్శక సూత్రాలు విడుదల చేశాం. సెక్యూరటైజేషన్‌ ద్వారా నిధులు సేకరించి బ్యాంకులకు చెల్లించే ప్రయత్నంలో ఉన్నాం. దీనికి సుమారు నెలన్నర పట్టవచ్చు. ఎవరైనా రైతులు రుణాలు చెల్లిస్తే వారికి ప్రభుత్వం తరపున అధికారికంగా బాండ్లు ఇస్తాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన చేస్తోంది. ఎన్టీఆర్‌ సుజల పథకాన్ని అక్టోబర్‌ రెండో తేదీన హిందూపురంలో ప్రారంభిస్తున్నాం. పింఛన్ల పెంపు కూడా అదే రోజు మొదలవుతుంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడానికి మిషన్‌ జీల్‌తో పని చేస్తున్నాం’’ అని వివరించారు. ప్రతిపక్షం కలిసి వస్తే కలుపుకొని వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ, అసత్య ప్రచారానికి ఒడిగడితే దానిని తిప్పికొట్టడానికి సన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రజా సమస్యలకు బదులు రాజకీయ అంశాలకు ప్రతిపక్షం ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment