Monday 18 August 2014

భాషా సమరంలో సంక్లిష్ట కోణాలు


భాషా సమరంలో సంక్లిష్ట కోణాలు -జి.ఎస్‌. రామ్మోహన్‌

Published at: 16-08-2014 03:49 AM
కేజీ టు పీజీ ఉచిత విద్య అని తెలంగాణ రాష్ట్రసమితి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పింది.అమలు చేస్తామని ఇపుడు భరోసా ఇస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా దీనికి మరీ దూరంగా ఉండే అవకాశం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంతో పాటు ఇంగ్లీష్‌ మీడియం అని కూడా అంది. ఇపుడు దానికి సంబంధించి వెనుకాముందూ ఆడుతున్నది. ఇంగ్లీష్‌ మీడియం అమలు చేయండి, మాట నిలబెట్టుకోండి అని కొందరు దళిత బహుజన మేధావులు డిమాండ్‌ చేస్తున్నారు. ధర్నాలు ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఇంకోవైపు చిన్ననాటి నుంచే ఇంగ్లీష్‌ మీడియం ఎందుకు, తెలుగు మీడియం కొనసాగించాలి అని మరికొందరు మేధావులు మాట్లాడుతున్నారు. వీరిలో వామపక్ష వాదులు, మాతృభాషోద్యమ కారులు ఉన్నారు. రెండువైపులా ప్రజలకు మేలు చేయాలనే వారే ఉన్నారు. అయినప్పటికీ భాషకు చెరో వైపు నిలబడి మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణకే పరిమిత మయ్యే అవకాశం లేదు. రేపు ఆంధ్రలోనూ తప్పదు. ఇది మొత్తం తెలుగువారందరూ ఎదుర్కొంటున్న సమస్య. పల్లెల్లో కూడా ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లు ఉంటే మాసాయిపేట బస్సు ప్రమాదం జరిగి ఉండేది కాదన్నా, ఇంగ్లీష్‌ మీడియం వేలం వెర్రి వల్లే ప్రమాదం జరిగిందన్నా రెండూ అటూ ఇటూ సింబా లిక్‌ వాదనలే.90ల్లో మారిన పరిస్థితులు ఇలాంటి సంక్లిష్ట తలను చాలా తెచ్చిపెట్టాయి. రాజకీయ రంగంలోనూ, ఇతర రంగాల్లోనూ!
‘ఇంగ్లిష్‌ పాత సంబంధాలను దెబ్బతీసి మాకు కొత్త అవకా శాల కిటికీ తెరుస్తున్నది. అది ఇవాళ అధికారపు నిచ్చెనగా ఉన్నది. సంపద, రాజకీయాధికారం కొందరి చేతుల్లో కేంద్రీ కృతమై ఉన్నందున చదువు ఒక్కటే దళిత బహుజనులకు ఆయుధంగా మారింది. అందులోనూ ఇంగ్లీష్‌ చదువు వారిని పైవారి సరసన కూర్చోబెట్టగలుగుతున్నది. పైవారి ఆధిపత్యాన్ని సవాల్‌ చేయడానికి సాధనంగా ఉపయోగపడుతున్నది. కాబట్టి ఇంగ్లీష్‌ చదవండి. ఇంగ్లీష్‌లోనే చదవండి’ అనేది దళిత బహుజన మేధావుల వాదనలో కనిపించే సారాంశం. ‘ఇప్పటికే ఇంగ్లీష్‌ను అవసరానికి మించి నెత్తిన పెట్టుకున్నాం. అది చదవ డం అవసరమే కావచ్చు కానీ ఆ మీడియంలోనే చదవడం అవసరం కాదు. మాతృభాషలో నేర్చుకుంటేనే ఏదైనా త్వరగా ఒంటబడుతుంది. అడ్డూ ఆపూ లేని ఇంగ్లీష్‌ వ్యామోహం సామ్రాజ్యవాదానికి తప్ప మనకేమి మేలు చేయదు’ అనేది మాతృభాషలో విద్యాబోధన గురించి మాట్లాడేవారి వాదనల్లోని సారాంశం.భాష భావప్రసార సాధనం అన్న నిర్వచనం పరిధి లోనే అయితే ఇంగ్లీష్‌ గురించి ఇంత గొడవ అక్కర్లేదు. అది మెరుగైన ఉపాధి సాధనంగా ఉందని ఇవాళ కొత్తగా చెప్పుకో నక్కర్లేదు. ఆధునికతకు, పెట్టుబడీదారీ అభివృద్ధికి, సంకేతంగా మారిపోయింది. మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లో, తెలుగు మీడియంలో చదువుకుని వచ్చినవాళ్లం కాదా అని ప్రజా మేధావులు అనుకునేవారు కూడా మాట్లాడితే ఆశ్చర్య మనిపిస్తుంది. అప్పట్లో ఊరి కామందు పిల్లలు, హెడ్‌మాస్టర్‌ పిల్లలు అక్కడే చదువుకునేవాళ్లు. కాబట్టి ప్రమాణాలు బాగానే ఉండేవి. అప్పటికి మన సాంఘిక ఆర్థిక జీవనంలో ఇంగ్లీష్‌ ఆధిపత్యం ఇంత విస్తరించలేదు. ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహించ డానికి పద్ధతి ప్రకారం సర్కారీ బడులను-ఆస్పత్రులను నాశనం చేశారనొచ్చు. లేదా సర్కారీ బడులు వ్యవస్థకు అవసరమైనంత ప్రమాణాల్లో అవసరమైనంత మందిని ప్రొడ్యూస్‌చేయలేక పోతున్నాయి కాబట్టి మార్కెట్‌ తన అవసరం కోసం ఈ పద్ధతిని ఎంచుకుందనీ అనొచ్చు. కానీ ఇవాళ నోరుగలిగిన వారెవరూ సర్కారీ తెలుగు బడుల వైపు తొంగి చూడడం లేదనేదైతే వాస్తవం. ఆధునిక నాగరికతలో ప్రాధమిక అవస రాలుగా మారిన విద్య, వైద్యం రెంటిలోనూ ఈ దుర్మార్గమైన అసమానతలు పేదలు తమ పరిస్థితిని మెరుగుపర్చుకోనీయ కుండా అడ్డుపడుతున్నాయి. పేదలు ఈ హర్డిల్‌ దాటాలను కునేవారు ఏం చేయాలనేది ఆలోచించడమే ప్రజాస్వామిక ఆలోచన అనిపించుకుంటుంది. తెలుగుమీడియం ఇవాళ ఎక్కడ ఉన్నది? ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ఎవరు? దిక్కూ మొక్కూ లేని పేద జనం. ఎక్కువలో ఎక్కువ దళిత బహుజన పిల్లలు. తెలుగు మీడియం కొనసాగాలి అన్నపుడు మనం తెలుగును రక్షించే బాధ్యతను ఎవరి మీద మోపుతున్నాం? నిరుపేద విద్యార్థుల మీద! ఇక్కడ ఎదురయ్యే సంక్లిష్టతను ఎదుర్కోవడం అంత సులభం కాదు.పెట్టుబడి రాజకీయ రంగంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ దృశ్యాలను డిఫరెంట్‌ షేడ్స్‌లోకి మార్చి సంక్లిష్టం చేసినట్టే ఇక్కడా గందరగోళం చేసింది.నీ మాటలకు చేతలకు మధ్య వైరుధ్యాన్ని తెచ్చిపెట్టి నీ విశ్వసనీయతను దెబ్బకొట్టింది. కొందరికి అవకాశాలు కల్పించి ఎక్కువమందికి ఆశలు కల్పించి పాత పరిభాషలో మాట్లాడే ఉద్యమాలను దెబ్బకొట్టింది. నువ్వు మాతృభాషలో విద్యాబోధన గురించి మాట్లాడతావు. నీ పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతుంటారు. నువ్వు సర్కారీ ఆస్ప త్రికి వెళ్లవు. కానీ ప్రభుత్వ వైద్యాన్ని గురించే మాట్లాడు తుంటావు. నువ్వు అన్ని విద్యుత్‌ పరికరాలన్నింటినీ వాడుతుం టావు. కానీ థర్మల్‌, హైడ్రో, ఆటమిక్‌ విద్యుత్‌ కేంద్రాలనన్నిం టినీ వ్యతిరేకిస్తూ ఉంటావు. తెలుగు ప్రేమ ప్రదర్శించే నాయ కుల పిల్లలంతా ఎక్కడ చదువుతున్నారు అనే ప్రశ్న కేవలం నైతిక పరమైన ప్రశ్నే కాదు. రాజకీయ ప్రశ్న కూడా. మా పిల్లలు మురికి విద్యావిధానంలో చదువుతున్నారు, తెలుగు మీడియమే సరైనది అనుకుంటే ఆ మురికో గంధమో అందరికీ అందుబాటులో ఉండాలా వద్దా అనే ప్రశ్న వస్తుంది. ప్రభుత్వ రంగం బాగాలేదు కాబట్టి ప్రైవేట్‌ పాఠశాలలకు వైద్యశాలలకు వెడుతున్నాం. కానీ పేదలు ఉపయోగించుకునే ఆ రెండు రంగాలు బలపడాల్సిన అవసరముందని కోరుకుంటున్నాం, అందుకనే వాటిగురించి మాట్లాడుతున్నాం అని సమర్ధించు కోవచ్చు గానీ అది ఫలితాన్నివ్వదు. వైద్యం విషయంలో డిమాండ్‌-సప్లయ్‌ మధ్య దారుణమైన వ్యత్యాసం ఉండడం వల్ల స్కూళ్లతో పోలిస్తే ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య కూసింత ఎక్కువ. కాబట్టి వైద్య రంగాన్ని కాసేపు పక్కనబెట్టి విద్యా రంగానికే పరిమితమవుదాం.
వాస్తవానికి ప్రాధమిక విద్య మాతృభాషలో ఉంటేనే ఏ శాస్త్రమైనా ఏ భాషైనా సులభంగా వంటబడతున్నది శాస్ర్తీయ మైన జ్ఞానం. ఇంగ్లీష్‌ కూడా తెలుగు నుంచి నేర్చుకుంటేనే సరిగా వస్తుంది అనే వాదనా శాస్ర్తీయమైనదే. కానీ ఈ వాదన ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియమే కొనసాగాలన్నది మాత్రం న్యాయమైనది కాదు. జ్ఞానవంతమైనది ప్రతి సందర్భంలోనూ న్యాయవంతమైనది కానక్కర్లేదు. టైం అండ్‌ స్పేస్‌ అనేవి వర్తిస్తాయి. పేదోడికి పెద్దోడికి వేర్వేరు విద్య, వేర్వేరు అవకా శాలు అనేది పోవాలా వద్దా అనేది న్యాయమైన ప్రశ్న. అశాస్ర్తీయమైనది అనుకున్నప్పటికీ అదే మెరుగైన ఉపాధినిస్తున్నది. శాస్ర్తీయమైనదనుకున్నప్పటికీ ఇది ఉపాధినివ్వడం లేదు. అమలులో ఆధిపత్యంలోఉన్న ఇంగ్లీష్‌ మార్కెట్‌ అలాంటి విచిత్ర స్థితిని తెచ్చిపెట్టింది. ఆ వ్యవస్థలో మార్పు చేయగలిగితే కానీ ఈ విచిత్రమైన వైరుధ్యం పోదు. అది పోయేదాకా పేదల బిడ్డలు ఉపాధి అవకాశాలను కోల్పోతూనే ఉండాలా! నీ బిడ్డలు ఇంగ్లిష్‌లో చదివి ఐఐటీలోకి జొర బడుతుంటే పేదల బిడ్డలు తెలుగులో చదివి ఐటీఐ దగ్గర తచ్చాడే స్థితి పోవాలా వద్దా! పోవాలనుకుంటే శాస్ర్తీయమైన పద్ధతిలోనే పోవాలనుకుంటే మన మన అంతర్గత గొడవలు పక్కనపెట్టి రకరకాల సమూహాలకు సంబంధించిన ప్రజాస్వామిక వాదులంతా ప్రభుత్వ ప్రైవేట్‌ స్కూళ్లు అన్నింటిలోనూ ఒకే విద్యావిధానమే ఉండేట్టు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి సాధించాలి. ప్రాధమిక స్థాయిలో రెంటిలోనూ తెలుగు మాధ్యమమే ఉండాలి. ఉంటే రెండు చోట్లా తెలుగుండాలి. లేదంటే ఇంగ్లీషుండాలి. ఈ లోగాప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌ మీడియం పెట్టాలి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ పెట్టినంత మాత్రాన వారు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివిన వారితో ఏకమవుతారా అనొచ్చు. కాకపోవచ్చు. వసతులు, పరిసరాలు, ఇంటి వాతావరణం, శ్రద్ధ అన్నింటా తేడా ఉంటుంది. కానీ భాష అనే ప్రధానమైన విషయంలో అయితే హర్డిల్‌ దాటడానికి అవకాశం ఏర్పడుతుంది. మిగిలిన హర్డిల్స్‌ దాటడానికి ప్రయ త్నం చేయగలరు. ఇంకొక పని కూడా చేయవచ్చు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జరిపే ప్రతి రిక్రూట్‌ మెంట్లోనూ తెలుగు భాషా నైపుణ్యానికి సంబంధించిన అంశాలు తప్పనిసరి చేయొచ్చు. 2011లో కామెరూన్‌ ప్రభుత్వం బ్రిటన్‌లో ఇంగ్లిష్‌ సరిగా రాకపోతే ఉద్యోగాలు, పెన్షన్లలో ప్రయోజనాలు కోల్పోతారని స్పష్టం చేసి ఉన్నది. వారికి సాధ్యమైనది మనకెందుకు కాదు.
ఉపాధి రంగంలో ఇంగ్లీష్‌కు ఉన్న అనవసరపు ఆధిక్యాన్ని తీసేసి అక్కడ మాతృభాషలో చదివిన వారికి కూడా సమాన మైన ఉపాధి, గౌరవం లభించేలా మార్పులు తీసుకురావడమనే లక్ష్యం వైపు చిత్తశుద్ధితో పనిచేసే సంస్థలు దీర్ఘకాలిక అవసరం. మన సాంఘిక ఆర్థిక జీవనంలో ఇంగ్లీష్‌ ఆధిపత్యాన్ని నిజంగా తీసివేయగలిగితే పేదలకు అంతకు మించినదేముంటుంది? అది సాధ్యం కాదనుకున్నా సాధ్యం కావడానికి చాలా వ్యవధి పడుతుందనుకున్నా అంతవరకు పేదల స్కూళ్లు పెద్దోళ్ల స్కూళ్ల మధ్య మీడియంలో ఉన్న అసమానతను తక్షణం తీసివేయ డమే పరిష్కారం. ఇల్లూ వాకిలీ తాకట్టు పెట్టి దిక్కుమాలిన కాన్వెంట్‌కు ఫీజులు పోసే శ్రమ పేదలకు తప్పుతుంది. భాషా ప్రేమ కోణంలో కాకుండా ఒక అసమానతను తొలగించడంగా అర్థం చేసుకోవడం అవసరం, ప్రజాస్వామికం. ఇంగ్లీష్‌, తెలుగు రెండూ అందుబాటులో ఉంచొచ్చు. తప్పో ఒప్పో మనకున్న ఛాయిస్‌ పేదలకు కూడా ఉండాలి. ఛాయిస్‌ లేకుండా చేయడం మాతృభాషను కాపాడే బరువును వారిమీద మోపడం న్యాయం కాదు. డబ్బులేని కారణంగా ఛాయిస్‌ లేకపోవడం అన్యాయం. అసలైతే విద్యను పూర్తిగా జాతీయం చేయడం ఇంకా మెరుగైన పరిష్కారం. ప్రభుత్వ రంగమంటేనే పనిచేయాల్సిన అవసరం లేని రంగం అనే నిర్వచనం ఇవ్వడంలో అందరి పాత్ర ఎంతో కొంత ఉన్నది కాబట్టి దాని గురించి ఇవ్వాళ మాట్లాడే పరిస్థి తుల్లో లేము. మనం కోరుకుంటున్న లక్ష్యానికి మనం ప్రయా ణించిన దానికి మధ్య విపరీతమైన వ్యత్యాసం ఉండడం వల్ల ఇలాంటిసమస్యలు చాలా ఎదురవుతుంటాయి. రాజకీయ నైతిక ప్రశ్నలను మన ముందుంచుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో మనం కోరుకుంటున్న వ్యవస్థ కోసం ప్రయత్నిస్తూనే ఉన్న వ్యవ స్థలో అసమానతలు తొలగించడానికి ఏ అవకాశం ఉన్నా ఆచరణాత్మకంగా ఆలోచించి దానివైపుగా నిలబడడమే సరైనది. రాజకీయంగా సరైనది. నైతికంగా సరైనది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టమంటున్నామంటే అది శాశ్వత పరిష్కారమని కాదు. పెద్దోళ్ళకు ఉన్న చాయిస్‌ పేదోళ్ళకు కూడా ఇవ్వడానికి, ఏదో కోల్పోతున్నామన్న భావన వారిలో తొలగించడానికి మాత్రమే ఉపకరించే తాత్కాలిక చర్య. అంతిమంగా ఐదో తరగతి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మాతృభాషలో విద్యాబోధన ఉండడమే సరైనది. భౌతిక ప్రయోజనాలే అంతిమమై సమాజానికి అవసరమైన బౌద్ధిక, సాంస్కృతిక అంశాలను పూర్తిగా విస్మరిస్తే ఏం జరుగుతుందో ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో చూస్తున్నాం. స్థానిక భాషల్లోని నానుడులను, సామెతలను ఏమాత్రం అర్థం చేసుకోలేని ఆంగ్ల వ్యామోహపు యువతరానికి అక్కడి ప్రజాస్వామికవాదులు టెంకాయలు అనే పేరు పెట్టారు. అంటే ఆకారం మాత్రమే స్థానిక రంగులో ఉండి లోపల ఆత్మ అంతా తెల్లోడిదే అని అర్థం. తాత్కాలికంగా ఒక అసమానతను తొలగించడానికి ఏ చర్య తీసుకున్నా దీర్ఘకాలింగా మన సమాజంలో ఇటువంటి టెంకాయలతో నిండిపోకుండా చూసుకోవడం అవసరం.
-జి.ఎస్‌. రామ్మోహన్‌

No comments:

Post a Comment