Monday 11 August 2014

హైదరాబాద్‌పై యూటీ కుట్ర!

హైదరాబాద్‌పై యూటీ కుట్ర!

Published at: 12-08-2014 08:24 AM
.    రెండు రాష్ర్టాలూ రెచ్చగొట్టుడు మానాలి
.    ఘనంగా చండ్ర శతజయంతి ఉత్సవాలు

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రయత్నం జరుగుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. సమస్యలపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ కూర్చొని పరిష్కారం కనుగొనాలని సూచించారు. సోమవారం ఇక్కడి నిజాం కాలేజీ మైదానంలో జరిగిన చండ్ర రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాల పాలన, సార్వభౌమాధికారంలో కేంద్రం వేలు పెట్టడం సరైన వైఖరి కాదని, ఈ పద్ధతి మారకపోతే సమస్యలు మరింత జఠిలమవుతాయన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వాలు అమలు చేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధనవంతులు, విదేశీ పెట్టుబడిదారుల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తున్నదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అధికారికంగా గుర్తించి ఉత్సవం జరపాలని సీఎం కేసీఆర్‌ను కోరగా, ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఆక్షేపించారు. ప్రత్యేక రాషో్ట్రద్యమ కాలంలో  ఐలమ్మ, దొడ్డి కొమరయ్య త్యాగాలను పొగిడినవారే, ప్రభుత్వంలోకి వచ్చాక మాట్లాడట్లేదని విమర్శించారు.  కేసీఆర్‌ వైఖరి ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు.  కేసీఆర్‌, చంద్రబాబు ఒకరినొకరు రెచ్చగొట్టుకుని ప్రజలతో ఆడుకోవద్దని, వారిద్దరూ కుస్తీ పడితే రెఫరీగా తాము ఉంటామని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను దించేందుకు ఏకమైన చంద్రబాబు, కేసీఆర్‌లు.. తెలుగు ప్రజలకోసం ఎందుకు ఏకం కారని సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు. ‘ఇక్కడ పుట్టిన వాళ్లంతా తెలంగాణ వారే’నన్న కేసీఆర్‌, ఇప్పుడు 1956కు ముందు పుట్టినవారినే పరిగణిస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.  తెలంగాణలో భూ ఉద్యమాలకు బ్రేకులు వేసేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని సీపీఐ సీనియర్‌ నేత చాడా వెంకటరెడ్డి అన్నారు. కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment