Monday, 18 August 2014

శ్రీభాగ్ ఒప్పందం లేదా ఒడంబడిక


శ్రీభాగ్ ఒప్పందం లేదా ఒడంబడిక

మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కో సం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్‌ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది. ఇందుకు ఒక ఉదాహరణ  1927లో జనమంచి శేషేంద్ర శర్మ గారు రాసిన ‘కడప మండల చరిత్రము’ అనే పుస్తకములో కూడా చూడవచ్చు. పాపం శర్మ గారు కడప జిల్లాలో కొన్ని పదాలను సర్కారు జిల్లాల వాళ్ళు హేళన చేస్తున్నారనే విషయాన్ని ప్రస్తుతించి అది కరెక్టు కాదు అని చెప్పేదానికి ఇక్కడ వాడుకలో ఉన్న భాషను లేదా పదాలను వాళ్ళు పలికే పదాలతో పోల్చి చూపినారు.
అనంతపురంలో ఏర్పాటుచేస్తానన్న ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. అంతేకాక రాయలసీమను ఆంధ్రయూనివర్శిటి నుండి వేరు చేశారు. దీంతో సీమ వాసులకు కోస్తాంధ్రాల మీద నమ్మకం పోయింది.
1931 జూన్‌లో జరిగిన ఆంధ్ర మహాసభలో పప్పూరి రామాచార్యులు అనే నాయకుడు చెన్నై రాజధాని నుండి ఆంధ్రరాష్ట్రం విడివడుట లాభకరమైనచో, ఆంధ్ర రాష్ట్రం నుండి రాయలసీమ విడివడుట మరింత లాభకరము కదా అన్నారు. అనడంతో వూరుకోకుండా సీమకు జరుగుతున్న అన్యాయాలను చర్చించేందుకు, సీమ అవసరాలను పరిరక్షించుకునేందుకు 1934 లో రాయలసీమ మహాసభను ఏర్పాటు చేసి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చించారు. ఈ సభలోనే టి.ఎన్‌.రామకృష్ణారెడ్డి అనే మరో నాయకుడు ‘మేమొక వ్యక్తులమన్న గణన కూడ వారికి లేదు, వారికి లెక్కకురాము’ అన్నాడు.
1937లో జరిగిన ప్రాంతీయ శాసన సభ ఎన్నికల్లో గెలిచి ప్రధాన మంత్రి అయిన రాజగోపాలచారి అత్యున్నత పదవుల్లోకి ఒక్కరిని కూడా సీమ నుంచి తీసుకోలేదు. ఇది రెండు ప్రాంతాల మధ్య మరింత అగాధాన్ని పెంచింది.
రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16 -11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటిలో తుది తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్‌ ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.
శ్రీభాగ్ అన్నది మద్రాసులోని మైలాపూరులో లజ్ చర్చి రోడ్డులో (ఇంటి నెంబరు 103) ఉన్న ఒక భవనం పేరు. ఈ ఇల్లు పి.ఆర్. సుందరం అయ్యర్ (1863 – 1913)  అనే ప్రఖ్యాత లాయరుకు చెందినది. ఈయన కొంతకాలం పాటు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా కూడా పని చేశారు. ఈ శ్రీభాగ్ ను అయ్యర్ గారు బాగా కట్టించేరు. అప్పట్లో మైలాపూరు ప్రాంతం ఇదో పెద్ద రెండంతస్తుల బంగ్లా. ఈ బంగ్లాకు పది తలుపులు చాలా కిటికీలు ఉండేవి. పాలరాతి సపట (ఫ్లోరింగ్), పది ద్వారాలలో పది విష్ణు అవతారాలతో కూడిన పెయింటింగ్స్ … ఇలా అనేక విశిష్టతలు ఈ బంగ్లాకు ఉన్నాయి.  సుందరం అయ్యర్ మరణించడంతో వ్యాపారంలో నష్టపోయిన ఆయన కుమారులు ఈ బంగ్లాను అమ్మినారు. దీనిని కాశీనాధుని నాగేశ్వర రావు కొన్నారు.
నాగేశ్వరరావు కొన్న తర్వాత శ్రీభాగ్ ప్రాంగణంలోనే అమృతాంజనం బాం తయారుచేసేవారు. అక్కడే ఆంధ్రమహాసభ వాళ్ళ సమావేశాలు జరుగుతుండేవి. ఈ నాగేశ్వరరావు గారే ‘ఆంధ్రపత్రిక’ అనే దినపత్రికను స్థాపించి ప్రచురించేవారు.  శ్రీభాగ్ బంగ్లాలో ఒప్పందం కుదిరినందున ఇది శ్రీభాగ్ ఒప్పందము లేదా శ్రీభాగ్ ఒడంబడికగా ప్రసిద్ధమైనది.
ఈ ఒప్పందంలో నాలుగు అంశాలున్నాయి. 1) సేద్యపు నీటి సౌకర్యాల విషయంలో సీమ అవసరాలు ముందు తీర్చాలి 2) రాష్ట్ర పరిపాలనలో అన్ని జిల్లాలకు దాదాపు సమాన ప్రాతినిధ్యం వుండాలి. విశ్వవిద్యాలయం, హైకోర్టుకు సంబంధించినవి మిగతా రెండు అంశాలు.
ఆనాటి ఒప్పందంలో రెండు ప్రాంతాల నాయకులు అంగీకరించి సంతకాలు చేసిన తీర్మానము యధాతధముగా క్రింద ఇవ్వబడినది:
శ్రీభాగ్ ఒప్పంద పత్రం
ఈ శ్రీభాగ్ ఒప్పందం అమలు కాలేదు. 1947 రాయలసీమ మహాసభలో నీలం సంజీవరెడ్డి ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వెలిబుచ్చినారు. ఆ తరువాత 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956 లో ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా శ్రీభాగ్‌ ఒప్పందం అమలు కాలేదని, సీమ వెనుక బాటుకు గురైందని, అన్ని రంగాల్లో సీమ వివక్షకు గురౌతున్నదనీ సీమ వాసులు అసంతృప్తితో ఉంటూ వచ్చారు.
ఈ వివక్షకు కరువు కాటకాలు తోడయ్యాయి. రాయలసీమ ప్రజా జీవితంలో చిన్నా భిన్నమైంది. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి 1980 వ దశకంలో రాయలసీమ చైతన్య ఉద్యమాలు మొదలయ్యాయి. పాద యాత్రలు సాగినాయి.
సీమకరువు పెద్ద చర్చనీయాంశమైంది. ‘కదలిక’ వంటి పత్రికలొచ్చాయి. సీమ సాహితి వంటి సంస్థలొచ్చినవి. డా|| ఎం.వి.రమణారెడ్డి,భూమన్‌, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచపాలెం చంథ్రేఖరరెడ్డి, సింగమనేని నారాయణ వంటి అనేక మంది మేధావులు గ్రంధాలు రచించారు. వీరు కోస్తాంధ్రతో పోల్చి చూపి సీమ ఏయే రంగాల్లో వివక్షకు గురైందో తద్వారా ఎంత వెనుక బాటుకు లోనైందో గణాంకాలతో సహా విశ్లేషించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు సీమ కోసం కంటి తుడుపు చర్యలు చేపట్టాయి. కానీ ఆ తరవాతి కాలంలో సీమ వాసి అయిన ఒకరిద్దరు ముఖ్యమంత్రులు మాత్రం కోస్తా వాళ్ళ ప్రయోజనాలే పరమావధిగా ప్రతీసారి ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేసేందుకు తలపడుతుండడం  - దానికి పత్రికలూ, ఇక్కడి స్వార్ధ రాజకీయనాయకులు  వంత పాడడం విషాదకర పరిణామం.
మళ్ళీ ఇప్పుడు తెలంగాణా రాష్రం ఏర్పాటు చేయటంతో అనివార్యముగా ఆంధ్రరాష్ట్రము ఏర్పాటైనది. అంటే ఇది 1953కు తర్వాతా.. 1956కు పూర్వమూ మనుగడలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపము. ఈ స్థితిలో అన్నీ కోస్తా ముంగిలికి చేర్చి సీమ నోట్లో మన్ను కొట్టేందుకు మరోసారి మన సీమకు చెందిన స్వార్ధ  ఏలికలే పూనుకున్నారు. ఇది సీమ వాసుల అసంతృప్తిని ఆగ్రహ జ్వాలగా మార్చేందుకు ఎంతో సమయం పట్టకపోవచ్చు!

No comments:

Post a Comment