Friday, 15 August 2014

ఇక మేమిద్దరం మాట్లాడుకుంటాం!


ఇక మేమిద్దరం మాట్లాడుకుంటాం!

Published at: 16-08-2014 04:06 AM
ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల అంగీకారం
ఫలించిన గవర్నర్‌ నరసింహన్‌ మధ్యవర్తిత్వం
‘ఎట్‌ హోం’ తర్వాత ఇరువురితో భేటీ
‘పెద్ద మనిషి’లా హితవు చెప్పిన నరసింహన్‌
సమస్యలకు చర్చలతో పరిష్కారం
ఇరువురు ముఖ్యమంత్రుల అంగీకారం
   మధ్యవర్తిత్వం వహించిన నరసింహన్‌
   ‘ఎట్‌ హోం’ తర్వాత ఇరువురితో భేటీ
    తెలుగువారికి మీరు రెండు కళ్లు
    విభజనలో సమస్యలు సహజం
    కోర్టులు, కేంద్రం వద్దకు వెళ్లడం సరికాదు
    చర్చించుకుని... పరిష్కరించుకోండి
    ఇద్దరు చంద్రులకు గవర్నర్‌ విజ్ఞాపన
    45 నిమిషాలపాటు చర్చలు

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 15: ‘‘విభజన తర్వాత సమస్యలు రావడం సహజం. ప్రతి సమస్యపై కేంద్రాన్నో, కోర్టులనో ఆశ్రయించడం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సరికాదు. కూర్చుని మాట్లాడుకోండి. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోండి. ఒక పెద్ద మనిషిగా... ఉభయ రాషా్ట్రల శ్రేయస్సు కాంక్షించే వ్యక్తిగా ఈ విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లను కోరారు. ఇందుకు వారిద్దరూ అంగీకరించారు. ‘కూర్చుని మాట్లాడుకుంటాం’ అని గవర్నర్‌కు హామీ ఇచ్చారు.  రాష్ట్ర విభజన తర్వాత ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇద్దరు ‘చంద్రు’ల మధ్య గవర్నర్‌ మధ్యవర్తిత్వం వహించారు.  వీరు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్‌ రాక సందర్భంగా ఈనెల 3వ తేదీన ఇద్దరు నేతలు పరస్పరం చేతులు కలుపుకుని, కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నా... ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఈసారిమాత్రం గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో ఇరువురు సీఎంలు సుమారు 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు.
ఎట్‌ హోం వేదికగా...
స్వాతంత్య్ర దినోత్సవం రోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‘ఎట్‌ హోం’ పేరుతో అల్పాహార విందు ఇవ్వడం అనవాయితీ. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపించారు. ఆ తర్వాత ఇద్దరికీ స్వయంగా ఫోన్‌ చేసి... తప్పక రావాలని కోరారు. దీంతో ఇద్దరు సీఎంలు రాజ్‌భవన్‌కు వచ్చారు. వారిద్దరి మధ్య వాతావరణం తేలికపర్చడానికి గవర్నర్‌ తన వంతు పాత్ర పోషించారు. ఎట్‌ హోం కార్యక్రమంలో వారిద్దరినీ తన పక్కన కూర్చోపెట్టుకున్నారు. ముందుగా రాజకీయేతర విషయాలపై ముచ్చట్లు పెట్టారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు శుక్రవారం తొలిసారి గతానికి భిన్నంగా కొత్తచోట్ల  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గోల్కొండ కోటలో పతాకావిష్కరణ చేయగా... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కర్నూలులో చేశారు. ఆ విషయాలపై గవర్నర్‌  వారితో మాట్లాడారు. గోల్కొండ కోటలో పతాకావిష్కరణకు ఉన్న వసతుల గురించి కేసీఆర్‌ను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఎట్‌ హోం కార్యక్రమం ముగింపునకు సంకేతంగా జాతీయ గీతాలాపన జరిగేదాకా వారి మధ్య అనేక అంశాలపై పిచ్చాపాటీ సంభాషణలు జరిగాయి. ఆ తర్వాత చంద్రబాబు, కేసీఆర్‌లను గవర్నర్‌ రాజ్‌భవన్‌లోకి తీసుకెళ్లారు. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ‘‘నిన్నటివరకూ కలిసి ఉన్న రాష్ట్రం రెండుగా విడిపోయింది. విభజనలో అనేక సమస్యలు రావడం సహజం. మీ ఇద్దరికీ అపారమైన రాజకీయ అనుభవం ఉంది. కలిసి పనిచేసిన నేపథ్యం కూడా ఉంది. తెలుగు ప్రజలకు మీరిద్దరూ రెండు కళ్ల వంటివారు. సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకొంటే చాలావరకూ ఇక్కడే పరిష్కారం అవుతాయి. అది జరగకపోవడం అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తోంది.
చిన్న విషయాలు కూడా పెద్దవి అవుతున్నాయి. మీ వల్ల పరిష్కారంకాని వాటిని మాకు వదిలిపెట్టండి. కేంద్రంతో మాట్లాడి ఉభయ తారకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కానీ, ప్రతి విషయాన్ని కేంద్రానికో, కోర్టులకో వదిలిపెట్టడం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సరికాదు. సమస్యలు ఏం ఉన్నా వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కూర్చుని మాట్లాడుకోండి. మీరు ఒకసారి ఆ పనిచేస్తే... మిమ్మల్ని చూసి మిగిలినవారు కూడా దానిని అనుసరిస్తారు. నేను ఒక పెద్ద మనిషిగా... ఉభయ రాషా్ట్రల శ్రేయస్సు కాంక్షించే వ్యక్తిగా ఈ విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని నరసింహన్‌ సూచించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... ‘‘నాకేమీ పట్టింపులు లేవు. కలిసి కూర్చుని మాట్లాడుకోవడం చిన్నతనంగా భావించడం లేదు. కూర్చుని మాట్లాడుకొందామని ఇప్పటికే కేసీఆర్‌కు లేఖ రాశాను. ఈ రోజు కర్నూలులో పతాకావిష్కరణ సందర్భంగా కూడా ఇరు రాషా్ట్రల మధ్య చర్చలతో సమస్యలు పరిష్కారం కావాలని అన్నాను. కూర్చుని మాట్లాడుకోవడానికి నేను సిద్ధం. ఆ పని చేస్తే తెలుగువారి గౌరవం కూడా పెరుగుతుంది’’ అని తెలిపారు. చర్చలకు తాను కూడా వ్యతిరేకం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.
‘‘మీరు ఒక పెద్ద మనిషిగా కూర్చుని మాట్లాడుకోవాలని చెబితే నేను వ్యతిరేకించేవాడిని కాదు. చంద్రబాబు నాకేమీ కొత్త కాదు. సమస్యలు సామరస్యంగా పరిష్కారమైతే నాకూ మంచిదే. విభజన చట్టాన్ని గందరగోళంగా తయారు చేసి, అన్నీ అపరిష్కృతంగా వదిలివేయడం వల్లే ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రం వచ్చిన పేరేకానీ దేనిలోనూ సంతోషం లేదని మావాళ్లు బాధపడుతున్నారు. కేంద్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇంతవరకూ అధికారుల విభజన చేయలేదు. ఇక ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి? మీరు కూడా ఈ సమస్యలను కేంద్రంతో మాట్లాడి పరిష్కరించాలి’’ అని గవర్నర్‌ను కేసీఆర్‌ కోరారు.  ఈ సమయంలో చంద్రబాబు స్పందిస్తూ... విభజన చట్టాన్ని ఎవరితో మాట్లాడకుండా అడ్డగోలుగా తయారు చేశారని తాను మొదటి నుంచి చెబుతున్నానని గుర్తు చేశారు. ఇరు వైపులా ముందే మాట్లాడి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని అభిప్రాయపడ్డారు. ‘‘మంచో చెడో విభజన జరిగిపోయింది. తెలుగువారు అందరూ బాగుండాలని మనం కోరుకుందాం. ఇబ్బందులను పరస్పరం అర్థం చేసుకొని సర్దుకొందాం. మీకు ఇబ్బంది ఉన్నచోట మేం సహకరిస్తాం. మీరూ అదే పనిచేయండి. అన్నీ ఒకేపూటలో అయిపోతాయని నేను అనడం లేదు. ఒక ప్రయత్నం చేద్దాం’’ అని చంద్రబాబు ప్రతిపాదించారు. దానికి కేసీఆర్‌ సమ్మతించారు. ముందు అధికారుల స్థాయిలో సమస్యాత్మక అంశాలను గుర్తించి... ఆ తర్వాత వాటిపై కూర్చుని మాట్లాడుకోవాలన్న అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైంది. త్వరలోనే ఈ భేటీ జరగాలన్నది తన ఆకాంక్ష అని గవర్నర్‌ అన్నప్పుడు...  ఇద్దరు ముఖ్యమంత్రులు నవ్వేశారని సమాచారం.
ఉత్సాహంగా... ఉల్లాసంగా!
నరసింహన్‌కు అటూ ఇటూ చంద్రులు
తేనీటి విందులో ప్రధాన ఆకర్షణగా సీఎంలు

హైదరాబాద్‌, ఆగస్టు 15 : అక్కడ అనేకమంది ప్రముఖులున్నారు. కానీ... వారందరి చూపు మాత్రం ఇద్దరిపైనే కేంద్రీకృతమైంది! ‘ఆ ఇద్దరు ఏం చేస్తున్నారు? చేతులు కలిపారా? సరదాగా ఉన్నారా? నవ్వుతూ మాట్లాడుకుంటున్నారా?’ అని అంతా గమనిస్తున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో కాదు! ఒకరు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, మరొకరు తెలంగాణ సీఎం కేసీఆర్‌. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్‌ హోం’లో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబు సాయంత్రం 5.17 గంటలకు రాజ్‌భవన్‌కు వచ్చారు. మరో మూడు నిమిషాలకు కేసీఆర్‌ చేరుకున్నారు. వీరిద్దరినీ గవర్నర్‌ సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రులతో గవర్నర్‌ వస్తున్న దృశ్యాలను పలువురు సెల్‌ఫోన్లలో బంధించారు. చంద్రబాబు, కేసీఆర్‌లను గవర్నర్‌ చెరోపక్క కూర్చోబెట్టుకున్నారు. ఇద్దరినీ మాటల్లోకి దించారు.
గవర్నర్‌ ఇతర అతిథులను ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు... చంద్రబాబు, కేసీఆర్‌ పరస్పరం నవ్వుతూ మాట్లాడుకున్నారు. అదే సమయంలో జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి  ఇరువురు సీఎంలతో కొద్దిసేపు మాట్లాడారు. ‘ఎట్‌ హోం’కు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ కె. స్వామిగౌడ్‌, కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి. హన్మంతరావు, తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి డి. శ్రీనివాస్‌, తదితరులు హాజటరయ్యారు. అతిథులను గవర్నర్‌ దంపతులు సాదరంగా ఆహ్వానించారు

No comments:

Post a Comment