స్వాతంత్య్ర పోరాటంలో ఆంధ్రుల త్యాగం ప్రశంసనీయం, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఏపీ అభివృద్ధికి కృషి చేయాలి, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి చేస్తాం, స్వాత్రంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
కర్నూలు, ఆగష్టు 15 : స్వాతంత్య్ర పోరాటంలో ఆంధ్రుల త్యాగం ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. జిల్లాలో జరిగిన 68వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. దేశప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఈ స్వాతంత్య్రం ఎందరో త్యాగాల ఫలితమని ఆయన అన్నారు. త్యాగమూర్తులకు చంద్రబాబు జోహార్లు తెలిపారు.
అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలివ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బాబు పేర్కొన్నారు. తెలుగుజాతి నిర్మాణంలో టీడీపీ పాత్రను గుర్తుచేసుకున్నారు. దేశాభివృద్ధికోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు కర్నూలులోనే ప్రమాణస్వీకారం చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. విభజనలో హేతుబద్దత లేకపోవడం వల్ల ఏపీ ప్రస్థానం లోటుబడ్జెట్‌తో మొదలైందని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించి రుణం తీర్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సమైక్య ఉద్యమకారులపై నమోదైన కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటికే కొన్ని కేసులు ఎత్తివేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేశామన్నారు. వృద్ధులు, వికలాంగుల పింఛన్ల పెంపునకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఉద్యోగుల వయోపరిమితి 60 ఏళ్లకు పెంచామని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు శ్వేతపత్రాలను విడుదల చేసినట్లు బాబు చెప్పారు. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం తనకలవాటన్న చంద్రబాబు సమస్యలను అధిగమించే శక్తి మనకుందన్నారు.
అభివృద్ధి కోసం ఏడు మిషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చే శారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, శాంతిభద్రలపై దృష్టి సారించామని, వృత్తి నైపుణ్యాలను పెంపొందిస్తామని చంద్రబాబు అన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేసామన్నారు. పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. భూసార పరీక్షల కోసం ఇక్రిశాట్‌ను భాగస్వామ్యం చేస్తాన్నారు.
వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రధాని మోదీ సహకారంతో పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపామన్నారు. వచ్చే ఐదేళ్లలో కరువు రహితరాష్ట్రంగా ఏపీ తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కేంద్రాన్ని సంప్రదించి నిరంత విద్యుత్ సరఫరాకు కృషి చేస్తామన్నారు. మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అక్టోబర్ 2 నుంచి ఏపీలో నిరంతరంగా విద్యుత్ సరఫరా అవుతుందని చంద్రబాబు ప్రకటించారు.
14 ఏళ్లలోపు పిల్లలందరినీ స్కూళ్లలో చేర్పిస్తామని, ఎక్కడా టీచర్ల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యకు ప్రాధన్యమిస్తే పేదరిక నిర్మూలన సా«ధ్యమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీని సిలికాన్ కారిడార్‌గా మార్చుతామన్నారు. అన్ని జిల్లాల్లో హైదరాబాద్ తరహా నగరాలు తీర్చిదిద్దుతామన్నారు. ఇంటికో ఐటీ లిటరేట్ ఉండాలని, తొలి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ తయారు కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలే లక్ష్యమని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద రూ.2.50 లక్షల వరకు సాయం అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవకు మరో 100 రోగాలు అనుసంధానం చేయనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ ప్రజా పంపిణీ స్కీమ్ ద్వారా ధరలను నియంత్రిస్తామన్నారు. రైతులు నేరుగా కూరగాయలు అమ్మేందుకు పట్టణాల్లో మళ్లీ రైతు బజార్లు ఏర్పాటు చేయన్నుట్లు బాబు పేర్కొన్నారు. అన్న క్యాంటిన్ల ద్వారా రూ. 5 కే భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. తాగునీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగనివ్వమని, బలిజలు, కాపులను బీసీల్లో చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. అగ్రవర్ణాల పేదల అభివృద్ధికి సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, మహిళా హక్కులను కాపాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.
No comments:
Post a Comment