Friday 15 August 2014

కేసిఆర్ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం

దళిత, గిరిజన ఆడపిల్లల కోసం 'కల్యాణమస్తు' పథకం, సమగ్ర సర్వే ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదు, గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్

Published at: 15-08-2014 11:03 AM
హైదరాబాద్, ఆగష్టు 15 : రాష్ట్రంలో దళిత, గిరిజన ఆడపిల్లల కోసం కల్యామస్తు పథకం కింద రూ.50 వేల నగదు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. విజయదశమి నుంచి పథకాలు అమలులోకి రానున్నట్లు ఆయన తెలిపారు.నగరంలోని గోల్కొండ కోటలో 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం హోదాలో కేసీఆర్ త్రివర్ణ పథాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన సమయమిదన్నారు. గోల్కొండలో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని సీఎం చెప్పారు. కాకతీయుల కళావైభవానికి ప్రతీక గోల్కొండ కోట అని కొనియాడారు. లండన్‌లో మహాత్ముని విగ్రహం ఏర్పాటు చేయడం భారతజాతికి గర్వకారణమన్నారు. దళితుల మూడెకరాల భూమి పథకాన్ని ఇక్కడే ప్రారంభిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు ఇస్తామన్నారు. ఆటోలకు పన్నులను రద్దు చేస్తున్నామన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు రవాణా పన్ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రూ.482 కోట్ల ఇన్‌పుట్ సబ్సీడీ విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో సమగ్ర క్రీడా విధానం తీసుకువస్తామని, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించినవారికి ప్రోత్సాహకాలు ఉంటాయని వెల్లడించారు. ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచేందుకు రూ.340 కోట్లతో అధునాతన వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్‌ను వైఫై నగరంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో 4జీ, వైఫై సీటిగా హైదరాబాద్ మారనున్నట్లు చెప్పారు. దాశరథి పేరిట ఉత్తమకవికి ప్రతి ఏటా పురస్కారం అందించనున్నట్లు తెలిపారు. త్వరలో పంచాయతీలుగా 500 జనాభా దాటిన తండాలు, గూడాలు మార్చనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చర్చిల నిర్మాణానికి గ్రామస్థాయిలో అనుమతులు ఇస్తామన్నారు.
కరీంనగర్ మేయర్‌గా సిక్కు ఎన్నికవడం గర్వకారణమని కొనియాడారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు 35 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేసీఆర్ తెలిపారు. త్వరలో 10 లక్షల ఎకరాల్లో పారిశ్రామిక జోన్ నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ నలుదిక్కులా ఫార్మా, ఫిల్మ్, హెల్త్, ఎడ్యుకేషన్ సిటీలు నిర్మిస్తామని, బస్ టెర్మినల్ నిర్మాణం జరుగుతుందని కేసీఆర్ వెల్లడించారు.
ఎన్ని ఇబ్బందులెదురైనా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో క్రమబద్దీకరణ పూర్తవుతుందన్నారు. గీత కార్మికుల సంక్షేమం దృష్ట్యా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు అక్రమ మార్గం పట్టకుండా ఈనెల 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నామని, ఈ సర్వే ఎవరిని ఇబ్బంది పెట్టేందుకు కాదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని దుష్టశక్తులు అపోహలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని, ఎవరు అపోహలకు గురికావొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ వినతి చేశారు. త్వరలో తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా 50 వేల పోస్టుల భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్‌కు రూపకల్పన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

No comments:

Post a Comment