- కేసులో ఎన్నెన్నో కొత్త మలుపులు - ఏడేళ్ల క్రితం ఇస్లాంలోకి మారిన భర్త - మతం మారాలని హింసించినట్లు తార ఫిర్యాదు
- ఉగ్రవాదులతో లింకుపైనా అనుమానాలు
రాంచీ, ఆగస్టు 28: జాతీయస్థాయి షూటింగ్ క్రీడాకారణి తారా షాదేవ్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ‘లవ్ జిహాద్’ ఆరోపణ బలంగా వినిపిస్తోంది. ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఆ తర్వాత మతం మారాలంటూ భర్త బలవంతపెట్టాడని, ఇంట్లో బంధించి హింసించాడని తారా షాదేవ్ ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ‘లవ్ జిహాద్’ అంశం మరోసారి బలంగా తెరపైకి వచ్చింది. రఖీబుల్ హసన్ (37) గతనెలలో తారను పెళ్లాడారు. తార ఈనెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత రఖీబుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అతని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు తీగలాగారు. మంగళవారం ఢిల్లీలో అరెస్టు చేసి... రాంచీకి తీసుకొచ్చారు. దర్యాప్తులో ఆయన కీలకమైన వివరాలు చెప్పినట్లు తెలిసింది. దీని ప్రకారం... రఖీబుల్ ఒక సిక్కు మతస్తుడు. ఆయన అసలు పేరు రంజిత్ కోహ్లీ. ఆరిఫ్ బాబా అనే మత పెద్ద సూచనతో ఏడేళ్ల క్రితం అతను ఇస్లాంలో చేరారు. తాను మతం మారిన విషయాన్ని తారా షాదేవ్‌కు ముందే తెలుసని రఖీబుల్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. సర్టిఫికెట్లు, ఇతర అన్ని అధికార పత్రాల్లో ఆయన పేరు ‘రంజిత్ కోహ్లీ’ అనే ఉంది. రఖీబుల్‌కు పది బ్యాంకు ఖాతాలు, రాంచీలోని విలాసవంతమైన ప్రాంతాల్లో మూడు అద్దె బంగళాలు, ఒక ఫ్లాట్, 8 లగ్జరీ కార్లు ఉన్నాయని గుర్తించారు. అతి తక్కువ సమయంలోనే భారీస్థాయిలో ఆస్తులు ఎలా సంపాదించాడనేది ప్రశ్నార్థకంగా మారింది. రఖీబుల్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ‘అఖండ భారత్’ అనే సంస్థ ఆరోపించింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలంటూ జార్ఖండ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. మరోవైపు తాను స్వచ్ఛమైన హిందువునని, ముస్లింలతోకానీ, ఉగ్రవాద సంస్థలతోగానీ తనకు ఎలాంటి సంబంధాలు లేవని రఖీబుల్ అలియాస్ రంజిత్ కోహ్లీ కొన్ని పత్రికలకు ఫ్యాక్స్ ద్వారా వివరణ పంపించారు. రంజిత్ ముస్లిం అనేందుకు ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ‘ఇప్పటిదాకా అతడిని ఎవరూ రఖీబుల్‌గా గుర్తించలేదు’ అని చెప్పారు. ‘‘అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నాం. ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేం’’ అని జార్ఖండ్ డీజీపీ రాజీవ్ కుమార్ తెలిపారు. |
No comments:
Post a Comment