మోడీకి జయ ప్రేమలేఖలా?!
Sakshi | Updated: August 02, 2014 01:18 (IST)
పార్లమెంటులో దుమారం
చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు జాలర్లపై శ్రీలంక దాడులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలను ప్రేమలేఖలని విమర్శిస్తూ శ్రీలంక రక్షణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో వచ్చిన వ్యాసంపై శుక్రవారం దేశంలో పెను దుమారం రేగింది. ‘మోడీకి జయలలిత ప్రేమలేఖలు ఎంతవరకు సమంజసం?’ అనే అనుచిత శీర్షిక, జయ, మోడీల ఫొటో ఉన్న ఈ వ్యాసంపై జయతోపాటు బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే తదితర తమిళ పార్టీలు మండిపడ్డాయి. తమిళ పార్టీలు, సంస్థలు జయకు అండగా ఏకతాటిపైకొచ్చి తమిళనాడులో ధర్నాలు నిర్వహించి, లంక అధ్యక్షుడు మహీంద రాజపక్స దిష్టిబొమ్మలను తగలబెట్టాయి. ఈ ఉదంతం మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, లంకతో దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని పీఎంకే, ఎండీఎంకేలు డిమాండ్ చేశాయి. అన్నాడీఎంకే, డీఎంకే, సీపీఎం ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని, లంకను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.
జయ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోడీకి లేఖ రాశారు. తన పరువు తీసేలా ఉన్న దీన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. ‘భారత సమాఖ్య నిర్మాణంలో చీలికలు తెచ్చేందుకు లంక ప్రయత్నిస్తోంది. లంక హైకమిషనర్‌ను పిలిపించి మాట్లాడాలని విదేశాంగ శాఖను ఆదేశించించండి. ఆ దేశంతో క్షమాపణ చెప్పించండి’ అని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొలంబోలోని భారత హైకమిషన్ ఈ ఉదంతాన్ని లంక ప్రభుత్వం ముందు లేవనెత్తింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం జయ, మోడీలకు బేషరతుగా క్షమాపణ చెప్పి, ఆ వ్యాసాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఓ వ్యక్తి రాసిన దీన్ని అధికారిక అనుమతిలేకుండా తమ వెబ్‌సైట్‌లో ఉంచారని, అందులోని భావా లు తమవి కావని రక్షణ శాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
No comments:
Post a Comment