వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ఎసరు Posted by: Pratap Published: Monday, June 21, 2010, 10:18 [IST] హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య ఓ వైపు కోత పెట్టడానికి ప్రయత్నిస్తుండగా, మరో వైపు సాగునీటి ప్రాజెక్టులకు ఎసరు పెడుతోంది. జలయజ్ఞం పేరుతో వైయస్ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన భారీ ప్రాజెక్టులు ఇప్పుడు అయోమయంలో పడ్డాయి. పోలవరం ప్రాజెక్టు డిజైన్ పై తెలంగాణ నాయకులు వ్యతిరేకత చూపడం, జలయజ్ఞంపై అవినీతి ఆరోపణలు రావడం వంటి కారణాలతో సాగునీటి ప్రాజెక్టుల తీరుతెన్నులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులపై ఆరా తీస్తున్నారు. ఆమె సూచనల మేరకు ఆ ప్రాజెక్టులపై దిద్దుబాటు చర్యలకు దిగారు. దీంతో ఆ ప్రాజెక్టుల భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. పోలవరం ప్రాజెక్టు వివాదంపై ఇప్పటికే చర్యలు చేపట్టింది. అదే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైయస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల గొడవలు ముదురుతుండగానే మరో వివాదానికి ప్రభుత్వం తెర తీసింది. దుమ్ముగూడెం - సాగర్ ప్రాజెక్టు అవసరమా, కాదా అనే విషయాన్ని తిరిగి పరిశీలించడానికి ప్రభుత్వం పునుకుంది. పోలవరంతో పాటు దుమ్ముగూడెం ప్రాజెక్టును కూడా తెలంగాణవాదులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. గోదావరి - కృష్ణా నదులను అనుసంధాన చేయడానికి దుమ్ముగూడెం - నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు వల్ల ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెబుతున్నప్పటికీ తెలంగాణకు అన్యాయం చేయడానికే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందనే విమర్సలు వెల్లువెత్తాయి. గోదావరి జలాలను కోస్తా డెల్టాకు తరలించి, కృష్ణా నదీ జలాలను పూర్తిగా రాయలసీమకు ఉపయోగించడానికి ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని వల్ల తెలంగాణకు గోదావరి జలాలు అందకుండా చేయాలని వైయస్ పూనుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ స్థితిలో ఈ ప్రాజెక్టు అవసరమా, కాదా అనే విషయాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం ఓ కమిటీని వేయడానికి పూనుకుంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే 391 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఏమైనా, తెలంగాణవాదుల తీవ్ర వ్యతిరేకతకు కారణమైన సాగునీటి ప్రాజెక్టులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
Read more at: http://telugu.oneindia.in/news/2010/06/21/irrigation-projects-taken-up-ys-regime-210610.html
Read more at: http://telugu.oneindia.in/news/2010/06/21/irrigation-projects-taken-up-ys-regime-210610.html
No comments:
Post a Comment