Monday 16 June 2014

ప్రత్యేక హోదా హుళక్కేనా?

అవశేష ఆంధ్రకు ప్రత్యేక హోదా హుళక్కేనా? నాటి ప్రధాని మాటలు నీటి మూటలేనా...? ప్రజల ఆశలపై నీళ్లుచల్లిన ప్రణాళికా సంఘం మరి కింకర్తవ్యం? నిబంధనలు సడలిస్తారా?

Published at: 13-06-2014 19:18 PM
న్యూ ఢిల్లీ, జూన్ 13 : అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందా? లేక ఇందులో ఏమైనా సన్నాయినొక్కులు ఉన్నాయా? రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి యుపిఏ ప్రభుత్వం ఇచ్చిన మాట నీటి మూటేనా? ప్రణాళికా సంఘం శుక్రవారంనాడు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రికి సమర్పించిన నివేదికను చూస్తే ఈ అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రస్తుతం అమలులో ఉన్న ప్రమాణాల ప్రకారం అదనపు కేంద్ర నిధులు మంజూరు చేయడానికి వీలు కల్పించే ప్రత్యేక హోదాను ఇవ్వడానికి సీమాంధ్రకు అర్హత లేదని ప్రణాళికా సంఘం ఆ శాఖ మంత్రి ఇందర్‌జిత్ సింగ్ రావుకు సమర్పించిన ప్రెజంటేషన్‌లో పేర్కొన్నది. దేశంలో ఏదైనా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటే ఆ రాష్ట్రానికి కొన్ని ప్రమాణాలు ఉండాలి. జన సాంద్రత తక్కువ ఉండడం, గిరిజనులు ఎక్కువగా ఉండడం, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, ఆర్థికంగా, వ్యవస్థాపక సౌకర్యాలపరంగా బాగా వెనుక బడి ఉండడం, పొరుగుదేశాలతో సరిహద్దులు ఉండడం, రాష్ట్ర ఆర్థిక వనరులు పరిమితంగా ఉండడం మొదలైన అంశాల ప్రాతిపదికన కేంద్రం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తుంది.
అయితే ఆంధ్ర ప్రదేశ్‌కు ఈ ప్రమాణాలు అన్వయించడం సాధ్యం కాదని ప్రణాళికా సంఘం ఆ శాఖ మంత్రికి తెలియజేసింది. ఈ విషయాన్ని పిటిఐ వార్తా సంస్థ శుక్రవారంనాడు వార్తా సంస్థలకు బట్వాడా చేసిన అనంతరం రాజకీయ వర్గాలలో ఇది పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ప్రత్యేక హోదా ఇవ్వవలసిన ప్రమాణాలకు ఆంధ్రప్రదేశ్ అనుగుణంగా లేనప్పుడు అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్ మోహన్ సింగ్ అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఈ సౌకర్యం కల్పించవలసిందిగా ప్రణాళికా సంఘాన్ని ఈ సంవత్సరం మార్చి 2 వ తేదీన ఎలా ఆదేశించారన్నది ప్రశ్న. అంతే కాదు, ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 తేదీనే రాజ్యసభలో ప్రసంగిస్తూ ఆంధ్ర ప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధానే స్వయంగా ప్రకటించారు. దాని మీదే భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టారు.
ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, జమ్మూ-కాశ్మీర్‌లకు ఈ ప్రత్యేక హోదా ఉంది. కాగా, తమకూ ప్రత్యేక హోదా కావాలని బీహార్, రాజస్థాన్, ఒడిషా, ఝార్ఖండ్ రాష్ట్రాలు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. రాజస్థాన్, ఒడిషా, ఝార్ఖండ్ రాష్ట్రాల డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించిన ప్రణాళికా కమిషన్ ఇటీవలే మీ అభీష్టానుసారమే అంటూ ఆయా రాష్ట్రాలకు సమాచారం పంపించింది. కాని బీహార్ విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి అంతిమ నిర్ణయం తీసుకోలేదు.
ఇటువంటి పరిస్థితులలో అవశేష ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్న. రాష్ట్రం మొత్తం మీద చూస్తే వెనుకబాటుదనం కనిపించకపోయినా, రాయలసీమ ఉత్తరాంధ్రలలో పరిస్థితి తీవ్రంగానే ఉంది. రాజధాని ఎక్కడో కూడా తెలియని పరిస్థితులలో, కనీసం ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన చెందుతుండగా, ఆయనతోపాటు అశేష ఆంధ్ర ప్రజానీకం ఈ ప్రత్యేక హోదా క్రింద వచ్చే కేంద్ర నిధులపైనే ఆశలు పెట్టుకున్నారు.
జరిగిన నష్టాన్ని పూరించుకోవడానికి ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారమని అందరూ భావిస్తున్న తరుణంలో మరి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక హోదా కల్పిస్తుందా? వరాల జల్లు కురిపిస్తుందా? ఇందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అత్యున్నత స్థాయి ప్రణాళికా సంస్థ అయిన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) సానుకూలంగా నిర్ణయిస్తే తప్ప సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరే అవకాశం లేదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

No comments:

Post a Comment