Wednesday 25 June 2014

'రుణం' తీర్చుకోండి

'రుణం' తీర్చుకోండి

Published at: 26-06-2014 05:32 AM
రైతు బాకీల రీషెడ్యూల్‌కు అంగీకరించండి
ప్రతపాదనలతో నేడు ఢిల్లీకి చంద్రబాబు
ప్రధాని, పలువురు మంత్రులతో భేటీ
పోలవరంపై ఖర్చు పెట్టిన నిధులివ్వాలని అభ్యర్థన
రెండు రోజులు ఢిల్లీలోనే మకాం
(హైదరాబాద్, న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి) అనేక ప్రతిపాదనలు, కోటి ఆశలు, వేలకోట్లతో మూడి పడిన అభ్యర్థనలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉంటారు. రుణ మాఫీకి కేంద్రం సాయం, ఎఫ్ఆర్‌బీఎం చట్ట సవరణ, కొత్త రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి పదేళ్లపాటు కొనసాగించడం, కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి చేయాల్సిన కేటాయింపులు, రాష్ట్రానికి మంజూరు చేయాల్సిన ఉన్నతస్థాయి విద్యా సంస్థలు తదితర అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను చంద్రబాబు కలవనున్నారు. వివిధ శాఖల పరిధిలో కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై బుధవారం హైదరాబాద్‌లో రోజంతా కసరత్తు చేశారు. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో విడివిడిగా లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో సమావేశమై చర్చించారు. చంద్రబాబుతోపాటు మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, పి. నారాయణ, గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, రావెల కిశోర్ బాబు తదితరులు కూడా ఢిల్లీ వెళతారు.
రుణాల రీషెడ్యూలు లక్ష్యం...: ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీ వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోగా.. ఇప్పుడు రుణాల రీ షెడ్యూలు కూడా సమస్యాత్మకంగా మారింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రుణాలు రీషెడ్యూలు చేయించినట్టయితే ఖరీఫ్‌లో కొత్త రుణాలు లభిస్తాయని... ఈలోపు రుణ మాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో చంద్రబాబు భేటీ అయి ఈ పరిస్థితి వివరించనున్నారు. రుణమాఫీ సంగతి తామే చూసుకుంటామని... తొలుత రుణాల రీషెడ్యూలుపై తగిన ఆదేశాలు ఇప్పించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. రుణమాఫీపై ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడైన కుటుంబ రావు కూడా ఢిల్లీకి వెళ్లి ఇప్పటికే తాము ఆర్బీఐ గవర్నర్‌తో జరిపిన భేటీలో ప్రస్తావించిన అంశాలను ఆర్థిక శాఖ కార్యదర్శికి వివరించనున్నారు. రుణాలు రీషెడ్యూల్ చేసినట్లైతే రైతులకు ఖరీఫ్ సీజన్‌లో ఇబ్బందులు తొలగిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది.
పోలవరానికి నిధులు...: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై తక్షణం ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ చంద్రబాబు వినతిపత్రం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 5వేల కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేసింది. ఇప్పుడు దీనికి జాతీయ హోదా ఇచ్చినందున... తాము లోగడ ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఇవ్వడంతోపాటు, ఈ ఏడాది అదనంగా 2 వేల కోట్లు ఇవ్వాలని కోరనున్నారు. పోలవరంపై రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి ఉన్న ప్రాజెక్టు పనులను చేపట్టడానికి సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద రూ.3 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి ఉమాభారతికి వినతిపత్రం సమర్పించనున్నారు.
ఇదీ పర్యటన...: గురువారం ఉదయం 8.40 చంద్రబాబు, మంత్రులు ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్, జల వనరుల మంత్రి ఉమా భారతి, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయు డు, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే మంత్రి సదానంద గౌడ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులను కలుస్తారు. ఈ వివరాలను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు బుధవారం ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. "రాష్ట్రంలో పునాదుల నుంచి పరిపాలన ప్రారంభమవుతోంది. కేంద్రం నుంచి ఏమేం కోరాలో, ఎలా ముందుకు వెళ్లాలో ప్రతి శాఖ అధికారులతోనూ భేటీ అయ్యి సీఎం తెలుసుకున్నారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పిస్తారు'' అని తెలిపారు.
రీ షెడ్యూలు చేస్తే...
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు 90 రోజుల్లోపు జరిగిన నష్టంపై ఆర్బీఐకి నివేదిక ఇచ్చినట్టయితే నిబంధనల ప్రకారం రుణాలను రీ షెడ్యూలుపై బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తుంది. పైలిన్ తుఫాన నష్టంపై గత ప్రభుత్వం ఆరు నెలల తర్వాత నివేదిక ఇచ్చింది. దీంతో రైతులకు అప్పట్లో రుణాల రీ షెడ్యూలు కాలేదు. ఇప్పుడు రుణాలు రీషెడ్యూలు చేస్తే... నాలుగేళ్లపాటు రుణాలను రీ షెడ్యూలు చేస్తారు. ఏడాదిపాటు రుణాల వసూలుపై మారటోరియం విధించే అవకాశం ఉంది. మారటోరియం ముగిసిన తర్వాత రైతులు తీసుకున్న అసలుతో పాటు వడ్డీని కూడా చెల్లించాలి. దీనిని మూడు వాయిదాలలో చెల్లించేందుకు గడువు ఇవ్వనున్నారు.

No comments:

Post a Comment